BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్‌ పేరు.. డ్రెస్‌ కోడ్‌ ఫాలో అవుతాం | India Jersey To have Official Champions Trophy logo with Pak imprint: BCCI | Sakshi
Sakshi News home page

BCCI: టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్‌ పేరు.. డ్రెస్‌ కోడ్‌ ఫాలో అవుతాం: బీసీసీఐ

Published Wed, Jan 22 2025 7:31 PM | Last Updated on Wed, Jan 22 2025 7:45 PM

India Jersey To have Official Champions Trophy logo with Pak imprint: BCCI

చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ధరించే జెర్సీ గురించి వస్తున్న వార్తలపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్‌ సైకియా(Devajit Saikia) స్పందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిబంధనలకు అనుగుణంగానే తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు. తమ ఆటగాళ్లు ధరించే జెర్సీ లోగోలో పాకిస్తాన్‌ పేరు ఉండటాన్ని బీసీసీఐ వ్యతిరేకించిందన్న వార్తలను కూడా ఈ సందర్భంగా ఖండించాడు.

దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు
కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్‌ వేదికగా చాంపియన్స్‌ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు నిరాకరించిన బీసీసీఐ(BCCI).. ఐసీసీ అనుమతితో తటస్థ వేదికపై మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో పాక్‌తో పాటు దుబాయ్‌ కూడా ఈ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక ఈ మెగా ఈవెంట్లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. 

ఇదిలా ఉంటే.. నిబంధనల ప్రకారం ఐసీసీ టోర్నీ ఆతిథ్య దేశం పేరు..  అన్ని జట్ల ఆటగాళ్ల జెర్సీలపై ఉంటుంది. అయితే, బీసీసీఐ మాత్రం దాయాది పేరును తమ జెర్సీలపై ముద్రించకుండా ఉండాలని ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి.

మా డ్రెస్‌ కోడ్‌ కూడా అలాగే ఉంటుంది
ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ‘‘ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 కోసం ఐసీసీ రూపొందించిన అన్ని నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది. జెర్సీ లోగో అంశం సహా అన్నింటినీ మేము ఫాలో అవుతాము. ఏ దశలోనూ ఉద్దేశపూర్వకంగా మేము నిబంధనలను ఉల్లంఘించబోము. 

కానీ మీడియాలో ఇలాంటి వార్తలు ఎందుకు పుట్టుకు వస్తున్నాయో.. వారికి వీటి గురించి ఎవరు సమాచారం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఐసీసీ రూల్స్‌ను అతిక్రమించేందుకు మాకు ఎలాంటి కారణాలు లేవు. చాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఐసీసీ పెట్టిన డ్రెస్‌ కోడ్‌ను మేము ఫాలో అవుతాం. లోగో కూడా యథాతథంగా ఉంటుంది’’ అని స్పష్టం చేశాడు. కాగా దాయాదులు భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరుగుతుంది.

ఫిబ్రవరి 5లోగా మైదానాలు రెడీ: పీసీబీ
ఇదిలా ఉంటే.. చాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభానికి రెండు వారాల ముందే స్టేడియంలను సిద్ధం చేసేలా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) పనులు వేగవంతం చేసింది. కరాచీ, లాహోర్‌ స్టేడియాలలో పునరి్నర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 

అధునాతన కుర్చీలు, అదనపు సౌకర్యాలతో కూడిన భవనాలు, ఎల్‌ఈడీ ఫ్లడ్‌లైట్లు, డిజిటల్‌ స్కోరు బోర్డులు ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతన్న మైదానాలను వచ్చే నెల 5 వరకు సిద్ధం చేయనున్నారు. చాంపియన్స్‌ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ ఆడనున్న ముక్కోణపు సిరీస్‌ను ఈ మైదానాల్లో నిర్వహించనున్నారు. 

ఈ రెండు మైదానాల పునర్నిర్మాణం కోసం పీసీబీ 12 బిలియన్‌ పాకిస్తానీ రూపాయలను ఖర్చు చేస్తోంది. కరాచీ స్టేడియం మేనేజర్‌ అర్షద్‌ఖాన్‌ మాట్లాడుతూ... ‘నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయి. మిగిలి ఉన్న కొన్ని చిన్న చిన్న పనులు ఈ నెలాఖరులోగా ముగుస్తాయి. ఫిబ్రవరి 5లోగా అధునాతన మైదానాన్ని పీసీబీకి అందిస్తాం. లాహోర్‌ స్టేడియంలో కూడా పనులు దాదాపు ముగిశాయి. తాజా మార్పుల్లో అధునాతన సదుపాయాలు కల్పించాం’ అని పేర్కొన్నాడు.

చదవండి: రీ ఎంట్రీ ఇస్తా.. కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement