రీ ఎంట్రీ ఇస్తా.. క్రికెట్‌ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్‌ | AB de Villiers Hints At Comeback Wants to enjoy cricket again But | Sakshi
Sakshi News home page

రీ ఎంట్రీ ఇస్తా.. కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్‌

Published Wed, Jan 22 2025 6:31 PM | Last Updated on Wed, Jan 22 2025 6:52 PM

AB de Villiers Hints At Comeback Wants to enjoy cricket again But

సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌(AB De Villiers) అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను తిరిగి కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే, మరోసారి ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) లేదంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం ఆడలేనని స్పష్టం చేశాడు.

లెజెండరీ బ్యాటర్‌గా
కాగా 2004లో సౌతాఫ్రికా(South Africa) తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన డివిలియర్స్‌ లెజెండరీ బ్యాటర్‌గా ఎదిగాడు. ప్రొటిస్‌ జట్టు కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఇక వికెట్‌ కీపర్‌గానూ సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8765, 9577, 1672 పరుగులు చేశాడు.

ఇ‍క డివిలియర్స్‌ ఖాతాలో ఖాతాలో 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(RCB)కు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. ఓవరాల్‌గా 184 మ్యాచ్‌లు ఆడి 5162 రన్స్‌ సాధించాడు. ఇందులో మూడు శతకాలు కూడా ఉండటం విశేషం.

‘రియల్‌ క్రికెట్‌’ ఆడాలని ఉంది
కాగా 2021 నవంబరులో డివిలియర్స్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం తన సమయంలో ఎక్కువ భాగం కుటుంబానికి కేటాయించిన ఏబీడీ.. చారిటి, బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు ‘రియల్‌ క్రికెట్‌’ ఆడాలని ఉందంటూ అతడు వ్యాఖ్యానించడం విశేషం.

ఈ విషయం గురించి మెలిండా ఫారెల్‌కు చెందిన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుకీ నేను క్రికెట్‌ ఆడగలననే నమ్మకంతో ఉన్నాను. అయితే, ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పిల్లలు మాత్రం నాపై ఒత్తిడి పెంచుతున్నారు. వాళ్లతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు నాలో మళ్లీ క్రికెట్‌ ఆడాలనే కోరిక కలిగింది.

ఏదో ఓ చోట కాంపిటేటివ్‌ క్రికెట్‌ ఆడాలని భావిస్తున్నా. అయితే, నేను ఆర్సీబీ గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఐపీఎల్‌ లేదంటే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం పాల్గొనను. కేవలం నా పిల్లల కోసం, క్రికెట్‌ మీదున్న ప్రేమ కారణంగా మళ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నా.

ఏదేమైనా మరోసారి ఒత్తిడిలోకి కూరుకుపోవాలని మాత్రం అనుకోవడం లేదు. కాస్త సరదాగా.. సంతృప్తికరంగా నా ఇన్నింగ్స్‌ ఉండాలని కోరుకుంటున్నా’’ అని 40 ఏళ్ల ఏబీ డివిలియర్స్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: Ajinkya Rahane: రోహిత్‌ శర్మకు అంతా తెలుసు.. రిలాక్స్‌డ్‌గా ఉంటాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement