తారలు దిగి వస్తున్న వేళ రంజీకి మళ్ళీ తళుక్కులు
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. భారత్ క్రికెట్ జట్టులోని హేమాహేమీలైన స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల పరిస్థితి చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. గత కొంత కాలం వరకు భారత్ క్రికెట్‌ను శాసించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనతో పాటు.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చెప్పటింది. ఆటగాళ్లందరికీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇందులో భాగంగా భారత్ జట్టులోని క్రికెటర్లు అందరూ దేశవాళీ పోటీల్లో తప్పనిసరిగా ఆడాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులు కారణంగా దేశవాళీ పోటీల్లో ఆడలేనప్పుడు బీసీసీఐ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.
రోహిత్ దశాబ్దం తర్వాత
గురువారం రంజీ ట్రోఫీ టోర్నమెంట్ రెండో దశ ప్రారంభమైనప్పుడు ఒక అరుదైన సంఘటన జరగనుంది. అంతర్జాతీయ పోటీల్లో ఎప్పుడూ బిజీగా ఉండే స్టార్ క్రికెటలందరు తమ రాష్ట్ర జట్ల తరఫున రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడనున్నారు. ఇందులో రోహిత్ శర్మ, వైస్-కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్, అజయ్ జడేజా, హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు ఉండటం విశేషం.
కెప్టెన్ రోహిత్ శర్మ అయితే దాదాపు ఒక దశాబ్దం తర్వాత రంజీ ట్రోఫీ పోటీల్లో ఛాంపియన్స్ ముంబై తరఫున ఆడనున్నాడు. రోహిత్ మాజీ భారత్ ఆటగాడు అజింక్య రహానే నాయకత్వంలో ముంబై తరపున బరిలో దిగనున్నాడు. జమ్మూ కాశ్మీర్ తో జరగనున్న మ్యాచ్ లో రోహిత్ భారత్ జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ముంబై బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.
ఎలైట్ గ్రూ-‘ఎ’ లో ముంబై 22 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ 23 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. అయితే ఫిట్ నెస్ లేని కారణంగా విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీ పోటీల్లో ఆడకుండా బీసీసీఐ నుంచి మినహాయింపు పొందాడు. మెడ నొప్పి తో బాధపడుతున్న కోహ్లీ కోలుకోవడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు.
రహానే కితాబు
రోహిత్ మళ్ళీ జట్టులోకి రావడం ఆనందం కలిగిస్తోందని రహానే కితాబిచ్చాడు. "రోహిత్ తన ఫామ్ ని తిరిగి సాధించాలని ధృడ నిశ్చయంతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నిన్న నెట్ ప్రాక్టీస్ లో రోహిత్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఫామ్ అనేది ఆటగాడి కెరీర్‌లో భాగం.
రోహిత్ పై నాకు అపార నమ్మకముంది. రోహిత్ ఎప్పుడూ రిలాక్స్‌గా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నప్పుడు కూడా అతని వైఖరి అలాగే ఉంటుంది. అతనికి తన ఆట గురించి బాగా తెలుసు కాబట్టి, అతను ఏమి చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు," అని రహానే కితాబిచ్చాడు.
కాగా రాజ్‌కోట్‌లో జరగనున్న మరో మ్యాచ్ లో ఢిల్లీ రెండుసార్లు విజేతలైన సౌరాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తన భారత సహచరులు రవీంద్ర జడేజా, మరియు చతేశ్వర్ పుజారాతో తలపడతాడు.
ఆస్ట్రేలియా కూడా పాఠాలు నేర్చుకోవాలి
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ ఇయాన్ హీలీ బీసీసీఐ కొత్త విధానాన్ని సమర్థించాడు. పది పాయింట్ల మార్గదర్శకాలను అమలు చేయడంపై మాట్లాడుతూ.. జట్టులో పెరుగుతున్నసూపర్‌స్టార్ సంస్కృతిని అరికట్టడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించాడు. భారత క్రికెటర్లలో క్రమశిక్షణ లేకుండా పోయింది.
‘‘నిజానికి ఈ సమస్య చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. బీసీసీఐ అధికారులు తీసుకున్న చర్యలు జట్టు క్రమశిక్షణను కాపాడుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నాను. అయితే దీని నుంచి ఆస్ట్రేలియా, ఇతర ప్రధాన జట్లు కూడా పాఠం నేర్చుకోవాలి" అని హీలి అన్నాడు.
చదవండి: జైస్వాల్‌కు చోటు.. తర్వాతి తరం ‘ఫ్యాబ్ ఫోర్’ వీరే: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు
Comments
Please login to add a commentAdd a comment