క్రికెట్ ప్రపంచంలో ‘ఫ్యాబ్ ఫోర్’గా విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లకు పేరుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ నలుగురు బ్యాటర్లు తమదైన ముద్ర వేశారు. టీమిండియా ముఖ చిత్రమైన కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించడంతో పాటు.. శతకాల విషయంలో సమకాలీన క్రికెటర్లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
సెంచరీల మెషీన్
వన్డేల్లో అత్యధికంగా 50 సెంచరీలు సాధించిన రన్‌మెషీన్.. ఇప్పటికే సచిన్ టెండుల్కర్(49) రికార్డు బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధికసార్లు వంద పరుగులు అందుకున్న క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక టీమిండియా తరఫున టెస్టుల్లో 30, టీ20లలో ఒక శతకం సాధించాడు కోహ్లి. కెప్టెన్‌గా భారత్‌కు టెస్టు ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.
అద్భుతమైన గణాంకాలు
మరోవైపు.. ఆస్ట్రేలియా సారథిగా పనిచేసిన స్టీవ్ స్మిత్.. బ్యాటర్‌గా అద్భుతమైన గణాంకాలు కలిగి ఉన్నాడు. 114 టెస్టుల్లో 34 సెంచరీల సాయంతో 9999, 165 వన్డేల్లో పన్నెండుసార్లు శతక్కొట్టి 5662, 67 టీ20లలో 1094 పరుగులు సాధించాడు.
టెస్టుల్లో తనకు తానే సాటి
ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో తనకు తానే సాటి అని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 152 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రూట్.. 36 సెంచరీల సాయంతో 12972 పరుగులు సాధించాడు. అదే విధంగా 171 వన్డేల్లో 16 శతకాలు నమోదు చేసి 6522 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. 32 అంతర్జాతీయ టీ20లలో 893 రన్స్ చేశాడు.
తొలిసారి ఆ ఐసీసీ ట్రోఫీ అందుకున్న నాయకుడు
ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌కు తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందించిన ఘనత కేన్ విలియమ్సన్‌కే దక్కుతుంది. అతడి కెప్టెన్సీలో 2019-21 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ టైటిల్‌ను కివీస్ జట్టు సొంతం చేసుకుంది.
ఇక కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటిదాకా 105 టెస్టుల్లో 33 శతకాలు బాది 9276 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 165 వన్డేల్లో 13 సెంచరీలు చేసి 6811 పరుగులు సాధించాడు. 93 టీ20లు ఆడి 2575 రన్స్ చేశాడు.
నవతరం ఫ్యాబ్ ఫోర్ వీరే
ఇలా ఈ నలుగురు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని 2013లోనే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రోవే ఊహించాడు. అందుకే పుష్కరకాలం క్రితమే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లకు ‘ఫ్యాబ్ ఫోర్’(ఫ్యాబ్యులస్ ఫోర్)గా నామకరణం చేశాడు. క్రోవే ఉపయోగించిన ఈ పదం తర్వాతి కాలంలో బాగా పాపులర్ అయింది.
తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైకేల్ ఆర్థర్‌టన్ నవతరం ‘ఫ్యాబ్ ఫోర్’గా ఓ నలుగురు యువ క్రికెటర్ల పేర్లను చెప్పారు. అయితే, ఇందులో ఇద్దరి విషయంలో మాత్రమే నాసిర్ హుసేన్, ఆర్థర్‌టన్ ఏకాభిప్రాయానికి వచ్చారు. టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్‌తో పాటు ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్‌లకు ఈ ఇద్దరూ ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చారు.
నా దృష్టిలో ఆ నలుగురే..
యశస్వి జైస్వాల్‌తో పాటు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ ట్రవిస్ హెడ్, పాకిస్తాన్ యువ తరంగం సయీమ్ ఆయుబ్ ఉంటాడని నాసిర్ హుసేన్ పేర్కొన్నాడు. అయితే, ఆర్థర్‌టన్ మాత్రం యశస్వి, హ్యారీ బ్రూక్‌లతో పాటు శ్రీలంక సంచలన క్రికెటర్ కమిందు మెండిస్, న్యూజిలాండ్ యంగ్ స్టార్ రచిన్ రవీంద్రలకు తన ‘ఫ్యాబ్ ఫోర్’లో స్థానం ఇచ్చాడు.
సూపర్ ఫామ్‌లో ఆ ఆరుగురు
కాగా ఈ గతేడాది యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 1771 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక హ్యారీ బ్రూక్ 2024లో ఐదు సెంచరీలు, ఆరు ఫిఫ్టీల సాయంతో 1575 పరుగలు చేశాడు.
ఇక కమిందు మెండిస్ 1458 రన్స్ చేశాడు. ఇందులో ఐదు శతకాలు, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు.. ట్రవిస్ హెడ్ 1399, సయీమ్ ఆయుబ్ 1254 పరుగులు సాధించారు. ఇక రచిన్ రవీంద్ర రెండు శతకాలు, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 1079 పరుగులు చేశాడు. టీమిండియాను న్యూజిలాండ్ టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీస్ చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment