చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ టీమిండియాను తమ దేశానికి రప్పించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వద్ద తమ వాదనను వినిపించిన పాక్ బోర్డు.. భారత జట్టు కోసం వేదికను తరలించవద్దని విజ్ఞప్తి చేసింది.
వేదిక మార్చబోమన్న ఐసీసీ
ఇందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే(పీసీబీ) ఈ మెగా టోర్నీని నిర్వహిస్తుందని.. వేదికను మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఇందుకు సుముఖంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
కేంద్రం అనుమతినిస్తేనే
ఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్తాన్ పర్యటనకు పంపకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా అనేది భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు. కేంద్రం అనుమతినిస్తేనే తమ జట్టు ఏ టూర్‌కైనా వెళ్లుందని.. పాకిస్తాన్ కూడా ఇందుకు మినహాయింపుకాదని పేర్కొన్నాడు.
జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?
ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో నక్వీ భేటీ కానున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ పాకిస్తాన్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే.
ఇస్లామాబాద్‌లో అక్టోబరు 15-16 తేదీల్లో ఈ సమ్మిట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో నక్వీ జైశంకర్‌ను కలిసి.. టీమిండియా పాక్ పర్యటన గురించి మాట్లాడాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఈ ఐసీసీ టోర్నీ వీక్షించేందుకు ఆయనను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందే
ఇందుకు సంబంధించిన ప్రొటోకాల్స్, భద్రతా అంశాల గురించి మొహ్సిన్ నక్వీ.. జైశంకర్‌కు వివరించనున్నట్లు క్రికెట్ పాకిస్తాన్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో నక్వీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ఇక్కడకు వస్తుందనే అనుకుంటున్నాం. పర్యటనను రద్దు చేసుకోవడానికి గానీ.. వాయిదా వేయడానికి గానీ కారణాలు లేవు. అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందే’’ అని పేర్కొన్నాడు.
కాగా 2008 ఆసియా కప్ తర్వాత ఇంత వరకు భారత జట్టు ఒక్కసారి కూడా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ కూడా పాక్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పాల్గొనడం లేదు. అయితే, గతేడాది ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. టీమిండియా అక్కడకు వెళ్లలేదు.
ఎవరి మాట నెగ్గుతుందో?
దీంతో రోహిత్ సేన ఆడిన మ్యాచ్‌లకు తటస్థ వేదికగా శ్రీలంకను ఉపయోగించుకున్నారు. ఇక చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇదే తరహా హైబ్రిడ్ విధానాన్ని అనుసరించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం.
కానీ పీసీబీ మాత్రం తమ దేశంలో ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్టు పర్యటించాయని.. ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.
మరి ఈ విషయంలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి! కాగా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి.
చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment