చాంపియన్స్ ట్రోఫీ-2025 గురించి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ మెగా ఈవెంట్ వేదికను మార్చే ఆలోచన తమకు లేదన్న అతడు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే(పీసీబీ) ఈ టోర్నీని నిర్వహిస్తుందని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్న విషయం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.
ఆతిథ్య హక్కులు పాకిస్తాన్‌వే
కాగా వన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడకు వెళ్లదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆసియా వన్డే కప్-2023లో భారత జట్టు మ్యాచ్‌లను పాక్‌లో కాకుండా శ్రీలంకలో నిర్వహించినట్లు.. ఈసారి కూడా హైబ్రిడ్ విధానంలో టోర్నీని నిర్వహిస్తారని వార్తలు వచ్చాయ.
టీమిండియా అక్కడకు వెళ్లే పరిస్థితి లేదు!
అయితే, పీసీబీ వర్గాలు మాత్రం తమ దేశం నుంచి ఐసీసీ వేదికను తరలించబోదని.. టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో నిర్వహించాలనే నిశ్చయానికి వచ్చినట్లు తెలిపాయి. ఇందుకు స్పందనగా.. బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాత్రం టీమిండియా పాక్‌కు వెళ్లబోదనే సంకేతాలు ఇచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీ కొత్త చైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా నియమితుడు కావడంతో.. పీసీబీకి వ్యతిరేక పవనాలు వీస్తాయనే అంచనాలు ఏర్పడ్డాయి.
వేదికను మార్చే ఆలోచన లేదు
కానీ.. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైన అలార్డిస్.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్‌లో నిర్వహించేందుకు షెడ్యూల్ చేశాం. ఇప్పటివరకైతే వేదికను మార్చే అంశం మా ప్రణాళికల్లో లేదు. ఈ క్రమంలో ఎదురుకాబోయే కొన్ని సవాళ్లకు సరైన పరిష్కారాలు కనుగొనాలనే యోచనలో ఉన్నాం.
అయితే, ముందుగా అనుకున్నట్లుగానే పాక్‌లో ఈ టోర్నీ నిర్వహించాలన్న అంశానికి కట్టుబడి ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వంటి జట్లు పాక్‌లో సిరీస్ ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు.
కాదంటే వాళ్లకే నష్టం
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఐసీసీ గనుక ఈ నిర్ణయం మార్చుకోకపోతే.. టీమిండియా పాక్‌కు వెళ్లాలి లేదంటే టోర్నీ నుంచి వైదొలగడం తప్ప వేరే ఆప్షన్లు లేవంటున్నారు విశ్లేషకులు.
ఒకవేళ రోహిత్ సేన ఈ ఈవెంట్ ఆడకపోతే ఐసీసీతో పాటు పీసీబీ ఆర్థికంగా భారీగానే నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఈ టోర్నీలో టీమిండియానే హాట్ ఫేవరెట్ మరి!! అయితే, భారత ప్రభుత్వ నిర్ణయం ఆధారంగానే టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? అన్నది తేలుతుంది.
చదవండి: 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్ చేశాడంటే!
Comments
Please login to add a commentAdd a comment