
విరాట్ కోహ్లి అంటే విరాట్ కోహ్లి(Virat Kohli)నే.. తనకు ఎవరూ సాటిలేరు.. సాటిరారు అని మరోసారి నిరూపించాడు ఈ రన్‌మెషీన్. తన పనైపోయిందన్న వారికి అద్బుత శతకంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో పోరులో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.
ఈ సందర్భంగా కోహ్లి ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా నిలవడంతో పాటు.. ఈ మైలురాయి చేరుకున్న మూడో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. ఓ ఐసీసీ టోర్నమెంట్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా వరల్డ్ రికార్డు సాధించాడు.
అదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో తనకు ఒక్క శతకం కూడా లేదన్న లోటును కూడా కోహ్లి ఈ మ్యాచ్ సందర్భంగా తీర్చేసుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 51 సెంచరీలు పూర్తి చేసుకుని ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 82 సెంచరీల మైలురాయిని అందుకుని.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డుకు మరింత చేరువయ్యాడు.
ఈ నేపథ్యంలో తన మ్యాచ్ విన్నింగ్స్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘సెమీస్ చేరే అవకాశం ఉన్న కీలక మ్యాచ్‌లో ఈ తరహాలో ఆడటం సంతృప్తిగా ఉంది. రోహిత్ అవుటైన తర్వాత మధ్య ఓవర్లలో ఎలాంటి సాహసోపేత షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడే బాధ్యత నాపై పడింది.
చాలా అలసిపోయాను
ఇది సరైన వ్యూహం. నేను వన్డేల్లో ఎప్పుడూ ఇలాగే ఆడతాను. నా ఆట గురించి నాకు చాలా బాగా తెలుసు. బయటి విషయాలను పట్టించుకోకుండా నా సామర్థ్యాన్ని నమ్ముకోవడం ముఖ్యం.
ఎన్నో అంచనాలు ఉండే ఇలాంటి మ్యాచ్‌లలో వాటిని అందుకోవడం నాకు కష్టం కాదు. స్పిన్‌లో జాగ్రత్తగా ఆడుతూ పేస్ బౌలింగ్‌లో పరుగులు రాబట్టాలనే స్పష్టత నాకు ఉంది. గిల్, అయ్యర్ కూడా బాగా ఆడారు.
ఈ ఇన్నింగ్స్‌తో నేను చాలా అలసిపోయాను. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల విరామం ఉంది. 36 ఏళ్ల వయసు ఉన్న నాకు ఇది సంతోషాన్ని కలిగించే విషయం’’ అని పేర్కొన్నాడు.
నాకు ఇదొక క్యాచ్-22 లాంటిది
ఇక బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా తన బలహీనత, బలం అయిన షాట్ గురించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘కవర్ డ్రైవ్ షాట్.. నాకు ఇదొక క్యాచ్-22 లాంటిది(ముందే వద్దని అనుకున్నా ఓ పని చేయకుండా ఉండలేకపోవడం అనే అర్థంలో). అంటే.. చాలా ఏళ్లుగా నాకు ఇది బలహీనతగా మారింది. అయితే, ఈ షాట్ కారణంగా నేను ఎన్నో పరుగులు రాబట్టాను.
ఈరోజు మాత్రం ఆచితూచే ఆడాను. తొలి రెండు బౌండరీలు కవర్ డ్రైవ్ షాట్ల ద్వారానే వచ్చినట్టు గుర్తు. అయితే, కొన్నిసార్లు రిస్క్ అని తెలిసినా సాహసం చేయకతప్పలేదు. ఏదేమైనా అలాంటి షాట్లు ఆడటం ద్వారా మ్యాచ్ నా ఆధీనంలో ఉందనే భావన కలుగుతుంది.
వ్యక్తిగతంగా నాకిది ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్. ఇక జట్టుకు కూడా ఇది గొప్ప విజయం’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ.. టెస్టుల్లో కోహ్లి అవుటైన తీరుపై మాత్రం విమర్శలు ఎక్కువగానే వచ్చాయి.
ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సమయంలో ఆఫ్ సైడ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో అతడు ఎక్కువసార్లు అవుటయ్యాడు. అయితే, తాజాగా ఆ షాట్ల గురించి కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం విశేషం.
చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్
Comments
Please login to add a commentAdd a comment