టీమిండియా స్టార్ క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో అంతా తానై ముందుండి నడిపించిన ఈ పేస్ దళ నాయకుడు ఆఖర్లో గాయపడిన విషయం తెలిసిందే. కంగారూ దేశ పర్యటనలో చివరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో విలవిల్లాడాడు.
మూడు వారాలుగా విశ్రాంతి
మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. స్కానింగ్ అనంతరం జట్టుతో చేరినా మళ్లీ బంతితో బరిలోకి దిగలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా ఆటకు దూరమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయింది. అయితే, అతడి ఫిట్‌నెస్ గురించి ఇంత వరకు స్పష్టత రాలేదు.
ఇప్పటికే స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్(India vs England)కు దూరమైన బుమ్రా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికైనా జట్టుతో చేరాలని టీమిండియా యాజమాన్యం ఆశిస్తోంది. ఈ మెగా టోర్నీ నాటికి అతడు ఫిట్‌గా మారతాడనే ఆశాభావంతోనే జట్టుకు ఎంపిక చేసింది.
ఒకవేళ బుమ్రా గనుక ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమైతే.. జట్టుపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే.. అతడి విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు.
న్యూజిలాండ్ స్పెషలిస్టుతో సంప్రదింపులు
ఇందులో భాగంగా.. ఇప్పటికే బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు బుమ్రా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అంతేకాదు.. వెన్నునొప్పి తీవ్రత, దాని తాలుకు ప్రభావాన్ని అంచనా వేసేందుకు న్యూజిలాండ్ స్పెషలిస్టు డాక్టర్ రొవాన్ షోటన్‌తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
అదొక అద్భుతమని తెలుసు
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ వైద్య బృందం షోటన్‌తో కాంటాక్టులో ఉంది. బుమ్రాను స్వయంగా అక్కడికి పంపాలని బోర్డు భావించింది. అయితే, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. తనకు విధించిన గడువులోగా బుమ్రా గనుక వందశాతం ఫిట్‌నెస్ సాధిస్తే అదొక అద్భుతమని సెలక్టర్లకు కూడా తెలుసు.
అదే జరగాలని యాజమాన్యం కోరుకుంటోంది కూడా! అందుకే బుమ్రా స్కానింగ్ రిపోర్టులను షోటన్‌కు పంపించి.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఏదేమైనా.. బుమ్రా వీలైనంత త్వరగా జట్టుతో చేరితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. అతడు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.
ఫిబ్రవరి 12 వరకు అవకాశం
ఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బుమ్రాకు కూడా చోటు దక్కింది. అయితే, ఫిట్‌నెస్ ఆధారంగానే అతడి విషయంలో తుది నిర్ణయం ఉంటుందని.. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment