IND vs ENG: టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌? | Rohit Sharma Likely to Remain Captain For Tests vs ENG After CT Glory: Reports | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో టెస్టులు.. టీమిండియా కెప్టెన్‌గా అతడే! బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌?

Published Sat, Mar 15 2025 11:09 AM | Last Updated on Sat, Mar 15 2025 11:22 AM

Rohit Sharma Likely to Remain Captain For Tests vs ENG After CT Glory: Reports

శుబ్‌మన్‌ గిల్‌తో రోహిత్‌ శర్మ

టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ (Rohit Sharma) కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌ పర్యటనలో అతడే భారత జట్టును ముందుకు నడిపించనున్నట్లు సమాచారం. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) నాయకత్వ బృందం రోహిత్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోసారి సూపర్‌ ‘హిట్‌’
కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో రోహిత్‌ శర్మ టీమిండియాను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నీలో భారత్‌ ఐదింటికి ఐదూ గెలిచి అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో ఫైనల్లో రోహిత్‌ శర్మ అద్భుత అర్ధ శతకం(76)తో బ్యాటర్‌గానూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తద్వారా చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచి.. ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్‌ సాధించాడు.‌ అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌లోనూ హిట్‌మ్యాన్‌ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అయితే, ఈ అద్బుత ప్రదర్శన కంటే ముందు రోహిత్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు.

అత్యంత ఘోర ఓటమి కారణంగా
ముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని భారత్‌.. 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ఓటమి. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లోనూ టీమిండియా పరాజయం పాలైంది. 

ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి దశాబ్ద కాలం తర్వాత కంగారూలకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని చేజార్చుకుంది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది.

ఇక ఈ రెండు సిరీస్‌లలో కెప్టెన్‌గా.. బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రంజీ బరిలో ముంబై తరఫున ఓపెనర్‌గా వచ్చి అక్కడా వైఫల్యాన్ని కొనసాగించాడు. 

సీన్‌ రివర్స్‌
ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్‌ శర్మ టెస్టులకు గుడ్‌బై చెప్పాలనే డిమాండ్లు పెరిగాయి. జస్ప్రీ‌త్‌ బుమ్రాకు పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, చాంపియన్స్‌ ట్రోఫీ విజయం తర్వాత పరిస్థితి మారిపోయింది.

రోహిత్‌ శర్మకు మద్దతుగా భారత మాజీ క్రికెటర్లు గళం వినిపిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2025 కారణంగా దాదాపు రెండు నెలలపాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండనున్న టీమిండియా.. జూన్‌ ఆఖర్లో ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇంగ్లిష్‌ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.

ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లో రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని సూచించాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించాలంటే రోహిత్‌ వంటి అనుభవజ్ఞుడి సేవలు అవసరమని పేర్కొన్నాడు. ఇక బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాయి.

బీసీసీఐ గ్రీన్‌ సిగ్నల్‌
‘‘రోహిత్‌ ఏం చేయగలడో మరోసారి నిరూపితమైంది. బీసీసీఐలో భాగమైన ప్రతి ఒక్కరు ఇంగ్లండ్‌ పర్యటనలోనూ అతడినే కొనసాగించాలని.. అతడే సరైన సారథి అని నమ్ముతున్నారు. 

అటు రోహిత్‌ కూడా రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో కొనసాగేందుకు ఆసక్తిగానే ఉన్నట్లు బోర్డుకు తెలిపాడు’’ అని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ మరికొంతకాలం టెస్టులు ఆడటం ఖాయమైపోయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024, చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలవడంతో మహేంద్ర సింగ్‌ ధోని తర్వాత భారత్‌కు అధిక ఐసీసీ టైటిళ్లు అందించిన కెప్టెన్‌గా రోహిత్‌ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. 

గతేడాది పొట్టి వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ.. ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. 

ఇక చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. ఇప్పట్లో తనకు రిటైర్‌ అయ్యే ఉద్దేశం లేదని తెలిపాడు. ఇక రోహిత్‌ ప్రస్తుతం ఐపీఎల్‌-2025 సన్నాహకాలతో బిజీగా ఉన్నాడు.

చదవండి: IPL 2025: హార్దిక్‌పై నిషేధం​.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా సూర్యకుమార్‌..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement