సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) టీమిండియా పునరాగమనం కోసం మరికొన్నాళ్లు వేచిచూడక తప్పదని సమాచారం. పూర్తి ఫిట్‌గా ఉన్నా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో(India vs England 3rd T20I)నూ అతడిని ఆడించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాలను షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
కాగా దశాబ్ద కాలంగా టీమిండియా తరఫున నిలకడగా రాణిస్తున్న ఫాస్ట్ బౌలర్‌గా షమీకి పేరుంది. అయితే, వన్డే ప్రపంచకప్-2023 సందర్భంగా గాయపడ్డ ఈ బెంగాల్ పేసర్ కోలుకోవడానికి ఈసారి చాలా సమయమే పట్టింది. చీలమండ గాయం వేధిస్తున్నా.. వరల్డ్‌కప్ టోర్నీని పూర్తయ్యేదాకా పంటిబిగువన నొప్పిని భరించిన షమీ.. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా ఈవెంట్లో ఇరవై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
శస్త్ర చికిత్స తర్వాత
తద్వారా ఈ ఐసీసీ టోర్నీలో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచిన షమీ.. అనంతరం చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో దాదాపు ఏడాదికాలంగా టీమిండియాకు దూరమైన ఈ రైటార్మ్ పేసర్.. దేశవాళీ క్రికెట్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు.
బెంగాల్ తరఫున దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగాడు. నిలకడగా బౌలింగ్ చేయడంతో వికెట్లు తీసిన షమీ... ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు.
ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20, వన్డే సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ సెలక్టర్లు షమీకి చోటిచ్చారు. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20తో అతడు రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
కానీ.. తుదిజట్టులో మాత్రం షమీకి చోటు దక్కలేదు. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా స్పిన్నర్లకు పెద్దపీట వేసిన క్రమంలో అతడికి మొండిచేయి ఎదురైంది.
పూర్తి ఫిట్‌గా ఉన్నాడు
అదే విధంగా.. చెన్నైలో జరిగిన రెండో టీ20లోనూ షమీని ఆడించలేదు. తాజా సమాచారం ప్రకారం.. రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లోనూ అతడిని మేనేజ్‌మెంట్ పక్కనపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ స్పందించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘కోల్‌కతాలో జరిగిన తొలి టీ20కి ముందే షమీ నన్ను తన దగ్గరకు పిలిపించాడు.
అంతా బాగానే ఉందని.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు చెప్పాడు. అయితే, జట్టు యాజమాన్యం ఆలోచన మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది కాలంగా అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాబట్టి షమీ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.
గంభీర్‌తో సమస్యా?
అయితే, ఇంగ్లండ్‌తో ఆఖరి రెండు టీ20లలో మాత్రం అతడిని ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా.. వన్డే సిరీస్‌లోనూ షమీకి అవకాశం ఇస్తారు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ మేరకు మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అంతిమంగా యాజమాన్యం నిర్ణయాలే చెల్లుబాటు అవుతాయి. కోచ్ గౌతం గంభీర్, షమీ మధ్య సమన్వయ, సమాచార లోపం లేదనే అనుకుంటున్నా’’ అని బద్రుద్దీన్ పేర్కొన్నాడు.
కాగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన సూర్యకుమార్ సేన.. రెండో టీ20లో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కింది. తద్వారా 2-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రాజ్‌కోట్‌లో మంగళవారం ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తలపడనుంది.
చదవండి: IND vs ENG: తిలక్ వర్మ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment