కివీస్‌ కిర్రాక్‌ షో | New Zealand Beat South Africa By 9 Wickets And Reach T20 World Cup 2026 Final, Check Out Score Details And Match Highlights | Sakshi
Sakshi News home page

NZ Vs SA Semis Highlights: కిర్రాక్‌ షో

Mar 5 2026 1:38 AM | Updated on Mar 5 2026 2:44 PM

New Zealand in the T20 World Cup 2026 final

టి20 ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ 

12.5 ఓవర్లలోనే 170 పరుగుల లక్ష్య ఛేదన 

సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా బోల్తా

అలెన్‌ 33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 నాటౌట్‌ 

చోకర్స్‌... క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టును ఉద్దేశించి తరచూ అనే మాట ఇది. అంటే... అన్నీ నెగ్గినా, ఎన్ని గెలిచినా, అసలైనా పోరులో తుస్సుమంటుందనే అర్థంలో వాడతారు. ఇదేలా ఉన్నా... గతం సంగతి పక్కన బెట్టినా... ఈ టి20 ప్రపంచకప్‌ వరకే చూసినా కూడా సఫారీ జట్టును ముమ్మూటికీ చోకర్స్‌ అనక తప్పదేమో! ఎందుకంటే ఈ టోర్నీలో లీగ్‌ మొదలు, సూపర్‌–8 ముగిసేదాకా అపజయమన్నదే ఎరుగని జట్టు కీలకమైన సెమీఫైనల్‌ కొచ్చేసరికి చేతులెత్తేసింది.  

కోల్‌కతా: ఇప్పటిదాకా ఈ టి20 ప్రపంచకప్‌లో ఎదురేలేని ఏకైక జట్టు దక్షిణాఫ్రికాను... రన్‌రేట్‌తో సెమీఫైనల్‌ చేరిన న్యూజిలాండ్‌ చిత్తు చేసింది. టోర్నీలోనే కఠినమైన ప్రత్యర్థిపై సులువుగా విజయం సాధించింది. బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో కివీస్‌ 7.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టుపై ఘనవిజయం నమోదు చేసింది. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫిన్‌ అలెన్‌ (33 బంతుల్లో 100 నాటౌట్‌; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికా లక్ష్యం చిన్నబోయింది. 

సఫారీ జట్టు మూగబోయింది. టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మార్కో యాన్సెన్‌ (30 బంతుల్లో 55 నాటౌట్‌; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించాడు. కివీస్‌ బౌలర్లు మెక్‌కోన్‌కీ (2/9), రచిన్‌ రవీంద్ర (2/29), హెన్రీ (2/34) తలా రెండు వికెట్లు తీశారు. 

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ అలెన్‌ శతక సునామీతో 12.5 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచింది. టిమ్‌ సీఫెర్ట్‌ (33 బంతుల్లో 58; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా దంచేశాడు. ఈ మెగా టోర్నీలో రెండోసారి ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్‌ (2021లో తొలిసారి రన్నరప్‌)... నేడు భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో ఆదివారం అహ్మదాబాద్‌లో టైటిల్‌ కోసం తలపడుతుంది.  

టాపార్డర్‌ తడబాటు 
కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (18), డికాక్‌ (10), రికెల్టన్‌ (0) ఇలా టాప్‌–3 బ్యాటర్లు చేతులెత్తేశారు. 55 స్కోరు వద్ద టాపార్డర్‌ వికెట్లు కూలాయి. దీన్నుంచి తేరుకోకముందే మిల్లర్‌ (6), అప్పటిదాకా టాప్‌స్కోరర్‌ అయిన బ్రెవిస్‌ (34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరు 77 పరుగుల స్కోరు వద్దే వెనుదిరిగారు. నిజానికి ఇక్కడే సఫారీ పనైపోయింది. అయితే స్టబ్స్‌ (24 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), యాన్సెన్‌ ఆరో వికెట్‌కు 73 పరుగులు జోడించిన భాగస్వామ్యం, 27 బంతుల్లో యాన్సెన్‌ చేసిన ఫిఫ్టీ దక్షిణాఫ్రికాను ఆదుకున్నాయి. 

అలెన్‌ ధన్‌ ధనాధన్‌ 
తొలి ఓవర్లో సీఫెర్ట్‌ రెండు బౌండరీలు, రెండో ఓవర్లో అలెన్‌ ఫోర్‌ కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి మొత్తం 19 పరుగులు వచ్చాయి. మరుసటి మూడో ఓవర్లో ఇద్దరు కలిపి కొట్టడంతో 18 పరుగులతో కివీస్‌ పరుగుల జోరందుకుంది. 4.1 ఓవర్లో జట్టు స్కోరు 50 దాటింది. ఇక బాష్‌ వేసిన పవర్‌ ప్లే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతి ఒక్కటే బతికి పోయింది. అంతకుముందు పడిన ఐదు బంతుల్ని అలెన్‌ 6, 4, 4, 4, 4, 0లుగా బాదేయడంతో వరుసబెట్టి మరీ బౌండరీలైన్‌ను దాటేశాయి. 

6 ఓవర్లలో 84/0. అచ్చు హైలైట్స్‌లాగే లక్ష్యంలో సగం స్కోరు కరిగింది. పవర్‌ప్లే ముగిసింది కానీ ఓపెనర్ల పవర్‌ స్ట్రోక్స్‌ మాత్రం అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. దీంతో 7.5 ఓవర్లోనే న్యూజిలాండ్‌ స్కోరు 100కు చేరింది. 28 బంతుల్లో సీఫెర్ట్, 19 బంతుల్లో అలెన్‌ ఫిఫ్టీలు సాధించారు. ఎట్టకేలకు రబడ పదో ఓవర్లో సీఫెర్ట్‌ను అవుట్‌ చేశాడు. కానీ కివీస్‌ స్కోరు 117/1. అప్పటికే సఫారీ వికెట్‌ సాఫల్యానికి ఆలస్యమైంది. 

అలెన్‌ దూకుడుతో న్యూజిలాండ్‌ లక్ష్యానికి చేరువైంది. యాన్సెన్‌ వేసిన 13వ ఓవర్లో అలెన్‌ వరుసగా 4, 4, 6, 6, 4 బాదేయడంతో 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న అలెన్‌ ఒక్క ఉదుటున 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో బంతి బౌండరీతోనే కివీస్‌ లక్ష్యాన్ని కూడా చేరుకుంది.  

33 టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ప్లేయర్‌గా అలెన్‌ రికార్డు నెలకొల్పాడు. క్రిస్‌ గేల్‌ (2016లో ఇంగ్లండ్‌పై 47 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును అలెన్‌ సవరించాడు.

6 ప్రస్తుత టి20 ప్రపంచకప్‌లో నమోదైన సెంచరీలు. 2010, 2014, 2016, 2022 టోర్నీల్లో అత్యధికంగా రెండేసి సెంచరీలు వచ్చాయి.  

స్కోరు వివరాలు 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) మిచెల్‌ (బి) రచిన్‌ 18; డికాక్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) మెక్‌కోన్‌కీ 10; రికెల్టన్‌ (సి) అలెన్‌ (బి) మెక్‌కోన్‌కీ 0; బ్రెవిస్‌ (సి) సాంట్నర్‌ (బి) నీషమ్‌ 34; మిల్లర్‌ (సి) మిచెల్‌ (బి) రచిన్‌ 6; స్టబ్స్‌ (బి) ఫెర్గూసన్‌ 29; యాన్సెన్‌ (నాటౌట్‌) 55; బాష్‌ (బి) హెన్రీ 2; రబడ (సి) నీషమ్‌ (బి) హెన్రీ 0; కేశవ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–55, 4–77, 5–77, 6–150, 7–166, 8–166. బౌలింగ్‌: హెన్రీ 4–0–34–2, మెక్‌కోన్‌కీ 1–0–9–2, ఫెర్గూసన్‌ 4–0–29–1, నీషమ్‌ 3–0–42–1, సాంట్నర్‌ 4–0–25–0, రచిన్‌ రవీంద్ర 4–0–29–2.  

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (బి) రబడ 58; అలెన్‌ (నాటౌట్‌) 100; రచిన్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (12.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 173. వికెట్‌ పతనం: 1–117. 
బౌలింగ్‌: యాన్సెన్‌ 2.5–0–53–0, రబడ 3–0–28–1, ఎన్‌గిడి 2–0–22–0, బాష్‌ 2–0–35–0, కేశవ్‌ 3–0–33–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement