
29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ నిర్వహణ
దేశంలో చాంపియన్స్ ట్రోఫీ కళ
ఉత్సాహంగా అభిమానులు
భద్రతపై పీసీబీ ప్రధాన దృష్టి
1996 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 16న పాకిస్తాన్‌లో తొలి లీగ్ మ్యాచ్ జరిగింది. దాదాపు నెల రోజుల తర్వాత మార్చి 17న లాహోర్‌లో ఫైనల్‌తో టోర్నీ ముగిసింది. అనంతరం మరో నెల రోజులు ఆ దేశం క్రికెట్ సంబరాల్లో మునిగింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీస్‌కు కూడా చేరకపోయినా... ఆతిథ్య దేశంగా అభిమానులకు ఆనందం పంచింది.
సరిగ్గా 29 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 19న తొలి మ్యాచ్‌తో ఆ దేశం మరో ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల వ్యవధిలో పాకిస్తాన్ ఎన్నో సంక్షోభాలను దాటి ఒక మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమైంది. ఈసారీ డిఫెండింగ్ చాంపియన్‌గా పాక్ బరిలోకి దిగుతోంది. అయితే ఇప్పుడు అక్కడిఅభిమానుల దృష్టిలో టైటిల్ గెలవడంకంటే కూడా టోర్నీ జరగడమే పెద్ద విశేషం.
–సాక్షి క్రీడా విభాగం
దాదాపు మూడు దశాబ్దాల ఈ సమయాన్ని పాకిస్తాన్ క్రికెట్‌లో 2009కి ముందు... దానికి తర్వాతగా విభజించవచ్చు. లాహోర్‌లో టెస్టు సిరీస్ సమయంలో శ్రీలంక జట్టు క్రికెటర్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఆ దేశ క్రికెట్‌ను మసకబార్చింది. ఆరేళ్ల పాటు ఏ జట్టు కూడా ఆ దేశం వైపు కన్నెత్తి చూడలేదు. అంత సాహసం ఏ దేశం కూడా చేయలేకపోయింది. ఐసీసీ కూడా టోర్నీ నిర్వహణల విషయంలో పూర్తిగా వెనక్కి తగ్గింది.
ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత 2015లో జింబాబ్వేను పిలిచి పరిస్థితులు చక్కబడ్డాయనే సందేశంతో పాక్ బోర్డు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలు పెట్టింది. అయితే 2021లో ఒక ప్రధాన జట్టు ఆ్రస్టేలియా వచ్చిన తర్వాత గానీ అక్కడ అసలు క్రికెట్ రాలేదు. ఈ నాలుగేళ్లలో భారత్ మినహా మిగతా అన్ని జట్లూ అక్కడ పర్యటించడం ఊరటనిచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు ఐసీసీ టోర్నీ అవకాశం రాగా... దీన్ని సమర్థంగా నిర్వహించడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీపీ)కు పెద్ద సవాల్. దీనిపైనే ఆ జట్టు, బోర్డు భవి ష్యత్తు ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.
కళ వచ్చింది...
సుదీర్ఘ కాలం అంతర్జాతీయ క్రికెట్ లేక సహజంగానే అక్కడి మైదానాలు వెలవెలబోయాయి. నిర్వహణ సరిగా లేక పాడుబడినట్లు తయారయ్యాయి. ఆర్థికంగా బలమైన బోర్డు కాకపోవడం, రాజకీయ కారణాలతో కేవలం దేశవాళీ టోరీ్నల కోసం స్టేడియాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దే ధైర్యం చేయలేకపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) జరుగుతున్నా... ఆ మ్యాచ్‌లను కూడా ఏదో మమ అన్నట్లుగా ముగించేస్తూ వచ్చారు. ఇలాంటి స్థితిలో చాంపియన్స్ ట్రోఫీ అవకాశం వచ్చింది. స్టేడియాల ఆధునీకరణ కోసం ఐసీసీ ఇచ్చిన సొమ్మును వాడుకుంది.
మూడు వేదికలు లాహోర్, కరాచీ, రావల్పిండిలపైనే పూర్తిగా దృష్టి పెట్టి సౌకర్యాలను మెరుగుపర్చింది. ఇందులో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో చాలా భాగాన్ని పడగొట్టి దాదాపు కొత్తదే అన్నట్లు తీర్చిదిద్దగా, మిగతా రెండింటిని ఆధునీకరించారు. సరిగ్గా చెప్పాలంటే పాక్‌లోని మైదానాలు ఎప్పుడో పాతకాలం కట్టడాల తరహాల్లో ఉన్నాయి. ఈతరం అవసరాలు, మారిన క్రికెట్‌కు అనుగుణంగా ఏవీ లేవు. ఇప్పుడు ఐసీసీ టోర్నీ పుణ్యమాని స్టేడియాలకు కొత్త కళ వచ్చింది.
అభిమానులు కూడా అంతే ఉత్సాహంతో ఒక పెద్ద ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని నగరాల్లో టోర్నీ పోస్టర్లు, బ్యానర్లు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. సహజంగానే స్థానిక మార్కెట్‌లలో టీమ్ జెర్సీలు, ఇతర జ్ఞాపికలు వంటి ‘క్రికెట్ వ్యాపారం’ జోరుగా సాగుతోంది కూడా. ‘క్రికెట్‌ను తాము ఎంతగా అభిమానిస్తామో చూపించేందుకు పాకిస్తానీయులకు ఇది చక్కటి అవకాశం. వచ్చే కొన్ని రోజులు అంతా పండగ వాతావరణమే’ అని మాజీ కెపె్టన్ మియాందాద్ చెప్పిన మాటలో అతిశయోక్తి లేదు.
భారత జట్టు లేకపోయినా...
పాక్ బోర్డు 2026 టి20 వరల్డ్ కప్, 2031 వన్డే వరల్డ్ కప్ కోసం కూడా బిడ్‌లు వేసి భంగపడింది. ఈ నేపథ్యంలో గతంలోనే ఖరారైన చాంపియన్స్ ట్రోఫీ మాత్రమే వారికి మిగిలింది. దాంతో తమ నిర్వహణా సామర్థ్యం, ఆతిథ్యం గురించి ప్రపంచ క్రికెట్‌కు చూపించాలని ఆశించింది. ఇందులో భాగంగానే రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండి, సాధ్యం కాదని తెలిసి కూడా ఎలాగైనా భారత్‌ను చాంపియన్స్ ట్రోఫీలో ఆడించేలా పీసీబీ చివరి వరకు అన్ని ప్రయత్నాలు, డిమాండ్లు చేసింది. కానీ చివరకు వెనక్కి తగ్గక తప్పలేదు.
2009 ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్‌లో ద్వైపాక్షిక సిరీస్ కాకుండా ఒకేఒక్క చెప్పుకోదగ్గ టోర్నీ 2023లో (ఆసియా కప్) జరిగింది. భారత్ మాత్రం తమ మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడింది. భారత్ ఫైనల్ చేరితే పేరుకే ఆతిథ్య జట్టు తప్ప ఫైనల్ నిర్వహించే అవకాశం కూడా లేదు. అయితే భారత్ లేకపోయినా ఇతర అన్ని పెద్ద జట్లు ఆడుతుండటం సానుకూలాంశం. అందుకే పీసీబీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారమే లాహోర్ ఫోర్ట్‌లో ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నింటికి మించి కట్టుదిట్టమైన భద్రత కీలకాంశంగా మారింది. ఒక్క చిన్న పొరపాటు జరిగినా పాక్‌లో క్రికెట్ ముగిసిపోయే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో పరుగులు, ఫలితాలతోపాటు టోర్నీ ఎలా సాగుతుందనేది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment