
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. బాబర్ ఆజం (Babar Azam) నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పర్యటనల్లో అద్వితీయ విజయాలు అందుకున్న రిజ్వాన్.. సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు.
న్యూజిలాండ్- సౌతాఫ్రికాలతో వన్డే త్రైపాక్షిక సిరీస్‌తో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలవుతున్నాడు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అతడికి గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. టీ20 జట్టు కెప్టెన్‌గా రిజ్వాన్‌ను తొలగించి.. సల్మాన్ ఆఘాకు ఆ బాధ్యతలు అప్పగించింది.
ఇదిలా ఉంటే.. రిజ్వాన్ తాజాగా పీసీబీ ఆదేశాలను బేఖాతరు చేసినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లో ఆడకుండా అతడు.. పెషావర్‌లో ఓ స్థానిక క్లబ్‌కు ఆడినట్లు తెలుస్తోంది. ఇలా నేషనల్ టీ20 కప్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ బక్త్ తప్పుబట్టాడు.
పీసీబీని అవమానించాడు..
ఈ విషయంలో రిజ్వాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీకి సూచించాడు. ‘‘నెలకు రూ. 60 లక్షలు తీసుకుంటున్నాడు. మరి జాతీయ జట్టు ఆటగాళ్లు పీసీబీ నిర్వహించే దేశీ మ్యాచ్‌లలో ఎందుకు ఆడరు? దేశవాళీ క్రికెట్ ఆడకుండా.. క్లబ్ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిజ్వాన్ పీసీబీని దారుణంగా అవమానించాడు.
సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయండి
మొహ్సిన్ నక్వీ మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని తెలుసు. అయితే, ఈసారి మాత్రం ఆయన తన వైఖరి మార్చుకోవాలి. ఇలాంటి వాళ్లపై కొరడా ఝులిపించాల్సిందే. పీసీబీని పట్టించుకోని ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు రద్దు చేసే దిశగా ఆలోచన చేయాలి’’ అని సికందర్ బక్త్ పేర్కొన్నాడు.
బ్యాటర్‌గానూ విఫలం
కాగా కెప్టెన్‌గా ఆస్ట్రేలియా గడ్డ మీద వన్డే సిరీస్ గెలవడంతో పాటు.. సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా రిజ్వాన్ ప్రశంసలు అందుకున్నాడు. కానీ.. ఆ తర్వాత వరుస పరాజయాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అతడి సారథ్యంలో పాకిస్తాన్.. గ్రూప్ దశలో న్యూ జిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడిపోయింది.
ఇక ఆఖరిదైన మూడో మ్యాచ్ వర్షం వల్ల టాస్ పడకుండానే రద్దు కావడంతో గెలుపున్నదే లేకుండా ఈ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మెగా ఈవెంట్లో రిజ్వాన్ కివీస్‌తో మ్యాచ్‌లో 3, భారత్‌తో మ్యాచ్‌లో 46 పరుగులు చేశాడు.
రోహిత్ సేనతో పోరులో రిజ్వాన్ స్లో ఇన్నింగ్స్ వల్ల పాకిస్తాన్‌కు చేదు అనుభవం ఎదురైందని ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శించడం గమనార్హం. కాగా పాక్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కివీస్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది.
చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
Comments
Please login to add a commentAdd a comment