IPL 2025: పీసీబీ ధమ్కీలకు బెదరని ముంబై ఇండియ‍న్స్‌ బౌలర్‌ | Corbin Bosch Breaks Silence After PCB Threatens With Legal Notice | Sakshi
Sakshi News home page

IPL 2025: పీసీబీ ధమ్కీలకు బెదరని ముంబై ఇండియ‍న్స్‌ బౌలర్‌

Mar 19 2025 2:31 PM | Updated on Mar 19 2025 3:37 PM

Corbin Bosch Breaks Silence After PCB Threatens With Legal Notice

సౌతాఫ్రికా పేసర్‌ కార్బిన్‌ బాష్‌.. ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌ నుంచి ఆఫర్‌ రావడంతో పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ క్రికెట్‌ బోర్డు బాష్‌కు లీగల్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై బాష్‌ తాజాగా స్పందించాడు. పీసీబీ అధికారుల ధమ్కీలకు వివరణ ఇస్తూ ఇలా అన్నాడు. తన నిర్ణయం పీఎస్‌ఎల్‌ను అగౌరవపరచాలని కాదు. 

ముంబై ఇండియన్స్ బలమైన ఐపీఎల్‌ జట్టు మాత్రమే కాకుండా అనేక ఇతర లీగ్‌లలో ఫ్రాంచైజీలు కలిగి ఉంది. ఇలాంటి జట్టు ఆఫర్‌ను వదులుకుంటే నా భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది. అందుకే ఐపీఎల్‌ ఆఫర్‌కు ప్రాధాన్యత ఇచ్చాను. ఈ ఆఫర్‌ నా కెరీర్‌కు గణనీయమైన ప్రయోజనం చేకూరుస్తుందంటూ వివరణలో పేర్కొన్నాడు. బాష్‌ వివరణ తర్వాత కూడా పీసీబీ అతనిపై ఐపీఎల్‌ తరహాలో రెండేళ్లు నిషేధం విధించాలని భావించింది. అయితే ఇలా చేస్తే వచ్చే ఒకరిద్దరు విదేశీ స్టార్లు కూడా పీఎస్‌ఎల్‌కు రారని వెనక్కు తగ్గింది.

కాగా, ముంబై ఇండియన్స్‌ నుంచి ఆఫర్‌ రాకముందు బాష్‌ను పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీ పెషావర్‌ జల్మీ వేలంలో కొనుగోలు చేసింది. వాస్తవానికి బాష్‌ మొదటి నుంచి ఐపీఎల్‌కే ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే తొలుత వేలంలో బాష్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. సహచరుడు లిజాడ్‌ విలియమ్స్‌ గాయపడటంతో బాష్‌కు ముంబై ఇండియన్స్‌ నుంచి పిలుపు వచ్చింది. దీంతో అతను తప్పనిసరి పరిస్థితుల్లో పీఎస్‌ఎల్‌ ఆఫర్‌కు నో చెప్పాడు.

వాస్తవంగా ఈ రాద్దాంతం జరగడానికి పాక్‌ క్రికెట్‌ బోర్డే కారణం. ఎప్పుడూ ఐపీఎల్‌తో క్లాష్‌ కాకుండా షెడ్యూల్‌ తయారు చేసుకునే పీఎస్‌ఎల్‌.. ఈసారి ఐపీఎల్‌తో పోటీ పడి ఐపీఎల్‌ డేట్స్‌లోనే షెడ్యూల్‌ను ఫిక్స్‌ చేసుకుంది. దీంతో పీఎస్‌ఎల్‌కు ఎంపికైన వారు (విదేశీ ఆటగాళ్లు) ఐపీఎల్‌లో ఆడటానికి వీలుండదు. ఐపీఎల్‌లో ఆడితే పీఎస్‌ఎల్‌కు పోలేరు. 

ఈ యేడు పీఎస్‌ఎల్‌ విషయంలో పీసీబీ తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌వైపే మొగ్గు చూపారు. ఐపీఎల్‌లో అయితే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయని వారి భావన. ఐపీఎల్‌తో క్లాష్‌ కావడంతో ఈ సారి పీఎస్‌ఎల్‌లో విదేశీ మెరుపులు కనిపించవు. లోకల్‌ ఆటగాళ్లతోనే పాక్‌ లీగ్‌ తూతూ మంత్రంగా జరుగనుంది. పీఎస్‌ఎల్‌-2025 సీజన్‌ ఏప్రిల్ 11 నుండి మే 25 వరకు జరగనుండగా.. ఐపీఎల్‌ 2025 మార్చి 22 నుండి మే 25 వరకు జరుగుతుంది.

సౌతాఫ్రికా ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన కార్బిన్‌ బాష్‌ ఫైవ్‌ టైమ్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జతకట్టక ముందు ఆ ఫ్రాంచైజీ యాజమాన్యానికి చెందిన ఎంఐ కేప్‌టౌన్‌కు (సౌతాఫ్రికా టీ20 లీగ్‌) ఆడాడు. ఈ సీజన్‌లో (2025) ఎంఐ కేప్‌టౌన్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్‌లో బాష్‌ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్‌ తొలి టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే, మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్‌కేను ఢీకొంటుంది.

ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌..
రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార​ యాదవ్‌, నమన్‌ ధిర్‌, బెవాన్‌ జాకబ్స్‌, రాజ్‌ బవా, విల్‌ జాక్స్‌, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), విజ్ఞేశ్‌ పుథుర్‌, సత్యనారాయణ రాజు, కార్బిన్‌ బాష్‌, మిచెల్‌ సాంట్నర్‌, అర్జున్‌ టెండూల్కర్‌, ర్యాన్‌ రికెల్టన్‌, కృష్ణణ్‌ శ్రీజిత్‌, రాబిన్‌ మింజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అశ్వనీ కుమార్‌, కర్ణ్‌ శర్మ, ట్రెంట్‌ బౌల్ట్‌, దీపక్‌ చాహర్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement