Greater city
-
హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్!
హైదరాబాద్: గ్రేటర్ నగరంలో పార్కింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రైవేటు వ్యక్తుల ఖాళీ స్థలాల్లో పార్కింగ్ సదుపాయానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరంలో ప్రజలెదుర్కొంటున్న ప్రధాన సమస్య పార్కింగ్ అని, షాపింగ్ ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్‌కు అవకాశాలు పరిశీలించాలని పౌరుడొకరు మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా కోరారు. అందుకు స్పందిస్తూ మంత్రి దేశంలోని అన్ని నగరాల్లోనూ పార్కింగ్ సమస్య పరిష్కారం ప్రభుత్వాలకు సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. నగరంలో రెండు మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మిస్తున్నప్పటికీ, అవి ఏమాత్రం సరిపోవని ఇంకా చాలా అవసరమని పేర్కొన్నారు. అందుకోసం కొత్తగా రానున్న మెట్రో మార్గాల్లో విశాలమైన పార్కింగ్ ప్రదేశాలతో ‘పార్క్ అండ్ రైడ్’ పద్ధతికి ప్రయత్నిస్తామని తెలిపారు. అంతే కాకుండా ఖాళీ స్థలాలు, ఖాళీ ప్లాట్ల యజమానులు స్థానిక మున్సిపల్ అధికారులతో కలిసి తమ స్థలాలను పార్కింగ్ లాట్లుగా మార్చుకుంటే వారికి ఆదాయం కూడా లభిస్తుందని, ఈ దిశగానూ ఆలోచిస్తున్నామని తెలిపారు. I agree that providing parking solutions has been a challenge in all cities of India We are building a couple of MLPs in Hyderabad but need many many more In the newly proposed Metro routes, we will try and provision for “Park & Ride” mode with large parking areas Also had… https://t.co/YOd9dTRSSd — KTR (@KTRBRS) August 1, 2023 అప్పట్లో కొరవడిన స్పందన.. ► గతంలోనూ దాదాపు అయిదేళ్ల క్రితం నగరంలోని ఖాళీ ప్లాట్లు, స్థలాల యజమానులు వాటిని పబ్లిక్ పార్కింగ్ ప్రదేశాలుగా మార్చుకుంటే వారికి ఆదాయంతో పాటు ప్రజలకు పార్కింగ్ సమస్యలు తగ్గుతాయని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ అందుకు పిలుపునిచ్చినా ప్రైవేటు యజమానుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దాదాపు 15 మంది మాత్రం స్పందించి, అధికారులను సంప్రదించినప్పటికీ, ఇద్దరు మాత్రం ముందుకొచ్చారు. వారిలో ఒకరికి స్థలంపై యాజమాన్య హక్కులు లేవని అధికారులు గుర్తించారు. స్థలాలపై తగిన హక్కులు లేకపోవడం.. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అదే తమ స్థలంగా చెబుతూ కొందరు ముందుకు రావడం తదితర కారణాలతో ప్రైవేట్ పార్కింగ్ సదుపాయాలపై జీహెచ్ఎంసీ శ్రద్ధ చూపలేదు. ► తాజాగా మంత్రి కేటీఆర్ మళ్లీ ఈ ఆలోచన చేయడంతో, జీహెచ్ఎంసీ తిరిగి ప్రయత్నాలు చేస్తే ఈసారైనా ఆశించిన ఫలితం కనిపిస్తుందేమో వేచి చూడాల్సిందే. తగినన్ని ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు వినియోగంలోకి వస్తే వాటిని జియోట్యాగింగ్ చేయడంతో పాటు మొబైల్ యాప్ ద్వారా ఎన్ని వాహనాల పార్కింగ్‌కు సదుపాయం ఉందో తెలుసుకోవడంతోపాటు అడ్వాన్సుగా కూడా పార్కింగ్ స్థలాన్ని రిజర్వు చేసుకునే సదుపాయం కూడా కల్పించవచ్చునని అప్పట్లో భావించారు. వాహనాల పార్కింగ్ ఫీజులను సైతం జీహెచ్ఎంసీయే ఖరారు చేసింది. కార్లు తదితర నాలుగుచక్రాల వాహనాలకు మొదటి రెండు గంటల వరకు రూ. 20, తర్వాత ప్రతీ గంటకు రూ.5గా నిర్ణయించారు. ద్విచక్రవాహనాలకు మొదటి రెండు గంటలకు రూ.10, తర్వాత ప్రతి రెండు గంటలకు రూ.5గా నిర్ణయించారు. -
ఆఫ్టర్ టెన్ ఇయర్స్..మనమూ రిచెస్ట్
మరో దశాబ్ద కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అత్యంత సంపన్న నగరంగా అవతరించనుంది. అంతేకాదు విశ్వవ్యాప్తంగా సంపన్న నగరాల జాబితాలో ర్యాంక్ సాధించి గ్రేటర్ సిటీ బాద్షా కానుందని నైట్‌ఫ్రాంక్ సంస్థ తాజాగా విడుదల చేసిన న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశంలో ఫార్మా రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్‌లో ఐటీ, బీపీఓ, రియల్టీ రంగాలు శరవేగంగా పురోగమిస్తుండటంతో పలు దిగ్గజ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడించింది. కాగా, ప్రపంచ సంపన్న నగరాల జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ 3 ట్రిలియన్ డాలర్ల సంపదతో అగ్రభాగాన నిలవగా.. మన దేశ వాణిజ్య రాజధాని ముంబై 0.96 ట్రిలియన్ డాలర్ల సంపదతో 12వ ర్యాంక్ సాధించడం విశేషం. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన ఢిల్లీ, బెంగళూరు సైతం రాబోయే పదేళ్లలో సంపన్న నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమని ఈ నివేదిక తెలిపింది. సుమారు 90 దేశాల్లోని 100 నగరాల్లో వ్యాపార, వాణిజ్య, పెట్టుబడులు తదితర అంశాలను అధ్యయనం చేసి టాప్–20 సంపన్న నగరాల జాబితాను ఈ నివేదిక ప్రకటించింది. – సాక్షి, హైదరాబాద్ హైదరా‘బాద్షా’ఇలా... హైదరాబాద్ రాబోయే పదేళ్లలో సంపన్న నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమని ఈ నివేదిక అంచనా వేసింది. బల్క్ డ్రగ్, ఫార్మా, ఐటీ, బీపీఓ ఎగుమతులు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు హైదరాబాద్ నగరానికి ఆర్థిక రంగంలో చోదక శక్తులుగా నిలవనున్నాయని ఈ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 2.07 బి. డాలర్ల మేర ఫార్మా ఎగుమతు ఉండటం విశేషమని పేర్కొంది. ఐటీ ప్రగతి ఇలా... ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐసీటీ, హార్డ్‌వేర్ పాలసీలతోపాటు ఇమేజ్, ఇన్నోవేషన్, డ్రోన్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీలు ఐటీ రంగ వృద్ధికి దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు గతేడాది రూ.1.09 లక్షల కోట్ల మేర ఉన్నాయని తెలిపాయి. కాగా గ్రేటర్ కేంద్రంగా పలు దిగ్గజ సంస్థలకు చెందిన 647 ఐటీ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. టాప్–5 సంపన్ననగరాలివే.. 1.న్యూయార్క్(3 ట్రి.డా.) 2.టోక్యో(2.50 ట్రి.డా.) 3.శాన్ఫ్రాన్సిస్కో(2.40 ట్రి.డా.) 4.లండన్(2.40 ట్రి.డా.) 5.బీజింగ్(2.10 ట్రి.డా.)(సంపద ట్రిలియన్ డాలర్లలో) -
‘రెడ్’ అలర్ట్!
గ్రేటర్‌లోని చెరువులు, కుంటలు, నాలాలను కాలుష్యమయంచేస్తున్న బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమల ఆగడాలను కట్టడి చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి నడుం బిగించింది. ఆయా పరిశ్రమలు విడుదల చేస్తున్న విష రసాయనాలతోజలవనరులు విషతుల్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ చుట్టూ ఉన్న పారిశ్రామిక వాడల్లోని సుమారు 500 ‘రెడ్ కేటగిరీ’ (అధిక కాలుష్యం వెలువడేవి) పరిశ్రమలపై దృష్టి సారించింది.ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలపై నిరంతరం ప్రత్యేక బృందాలు, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని పీసీబీనిర్ణయించింది. సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ చుట్టూ ఉన్న పలు పారిశ్రామికవాడల నుంచి వెలువడుతోన్న వ్యర్థజలాలు నగర ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ జలాల్లో భారలోహాలతో పాటు పలు విష రసాయనాలున్నాయి. ప్రధానంగా జీడిమెట్ల, దుండిగల్, పటాన్చెరు, పాశమైలారం, బొంతపల్లి, ఖాజీపల్లి, బొల్లారం, కాటేదాన్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లోని బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమలు ప్రమాదకర రసాయనాలను నాలాల్లోకి వదిలిపెడుతున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి నేరుగా భూగర్భ పైపులైను వేసి మరీ రసాయనాలను వదిలిపెడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమల రసాయనాలు కాగా నాలాల్లో కలిసేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పీసీబీ ప్రధాన కార్యాలయం, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖకు అనుసంధానించాలని పీసీబీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. గ్రేటర్ పరిధిలో కాలుష్యాన్ని కట్టడిచేసేందుకు ఇలాంటి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గతంలో మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో పీసీబీ ఈమేరకు కార్యాచరణ సిద్ధం చేసింది. కాగా క్షేత్రస్థాయిలో నిరంతరం ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతోన్న ఘన, ద్రవ వ్యర్థాల మోతాదును పరిశీలించేందుకు పీసీబీ, టీఎస్ఐఐసీ, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలకు చెందిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలని పీసీబీ నిర్ణయించింది. తొలుత జీడిమెట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. జీడిమెట్లలో పరిశ్రమల ఆగడాలు అక్రమంగా పరిశ్రమల నుంచి భూగర్భ పైపులైను ఏర్పాటు చేసి నాలాలోకి పారిశ్రామిక వ్యర్థజలాలను మళ్లిస్తున్న పరిశ్రమల గుట్టును పీసీబీ ప్రత్యేక బృందాలు ఇటీవల రట్టు చేసిన నేపథ్యంలో మహానగరం పరిధిలోని పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల ఆగడాలు వెలుగుచూస్తున్నాయి. జీడిమెట్లలోని ఎస్వీఈవీ శ్రీ వెంకటేశ్వర కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఠాగూర్ కెమికల్స్, వెంకటేశ్వర కెమికల్స్ నుంచి అక్రమంగా రసాయన వ్యర్థాలను సమీపంలోని నాలాలోకి భూగర్భ పైపులైను ద్వారా చేరవేస్తున్నాయి. దీనిపై విశ్వసనీయ సమాచారం అందడంతో పీసీబీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. జేసీబీ ద్వారా ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు జరపడంతో భూగర్భ పైపులైన్ బయటపడింది. ఈ పైపులైన్లు ఏయే కంపెనీల నుంచి నాలా వరకు వేశారన్న అంశాన్ని నిగ్గు తేల్చేందుకు తవ్వకాలు చేపట్టినట్టు పీసీబీ అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా పైపులైను వేసి నాలాలోకి వ్యర్థాలను మళ్లించిన వెంకటేశ్వర ఇండస్ట్రీస్, ఠాగూర్ కెమికల్స్‌ను మూసివేయాలని పీసీబీ ఉత్తర్వులిచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ రెండు పరిశ్రమల నుంచి పారిశ్రామిక రసాయన వ్యర్థజలాలను ఎలాంటి శుద్ధి ప్రక్రియ నిర్వహించకుండా భూగర్భ పైపులైను ద్వారా సమీప నాలాల్లోకి మళ్లించిన ఉదంతాన్ని పీసీబీ టాస్క్‌ఫోర్స్ బృందాలు బట్టబయలు చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పైపులైన్లు ఆయా కంపెనీల యాజమాన్యం ఏర్పాటు చేసినవేనని నిర్థారించిన తరవాతనే మూసివేతకు ఆదేశాలిచ్చినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. పరిశ్రమల ఆగడాల కారణంగా సుమారు 1500 కి.మీ. విస్తీర్ణంలో విస్తరించిన నాలాలు కాలుష్యంతో కంపు కొడుతుండడం పట్ల పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కుల ఆటకట్టించే మార్గమిదీ.. ♦ పారిశ్రామిక వాడల్లో పరిశ్రమను బట్టి రోజు, వారం, నెలవారీగా ఎంత మొత్తంలో ఉత్పత్తి జరుగుతోంది. ఆయా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థజలాలు ఎంత మొత్తంలో ఉన్నాయో పీసీబీ బృందాలు లెక్కగట్టాలి. ♦ ఆయా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల్లో ఎంత మొత్తం జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని వ్యర్థాల శుద్ధికేంద్రాలకు తరలిస్తున్నారో లెక్క తీయాలి. ♦ ఆయా పరిశ్రమలకు ఎంత ఉత్పత్తిని సాధించేందుకు అనుమతులు పొందాయి. ప్రస్తుతం ఎంత మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నాయనే అంశంపై పూర్తి వివరాలు సేకరించాలి. ♦ సమీప నాలాలు, చెరువులు, బహిరంగ ప్రదేశాలు, మూసీలోకి వ్యర్థాలను పారబోస్తున్న పరిశ్రమలపై పీసీబీ బృందాలతో పాటు, వంద మంది పోలీసుల సహకారంతో నిరంతరం నిఘా పెట్టాలి. ♦ జీడిమెట్ల, పాశమైలారం, చర్లపల్లి సహా నాలాల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిరంతం నిఘా ఏర్పాటు చేయాలి. ♦ వ్యర్థాలను విచక్షణారహితంగా పారబోస్తున్న పరిశ్రమల లైసెన్సును రద్దు చేసి, మూసివేతకు పీసీబీ ఉత్తర్వులివ్వాలి. ♦ ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతున్న ఘన వ్యర్థాలను ఎలా శుద్ధి చేస్తున్నారన్న అంశంపైనా నిపుణుల కమిటీతో తనిఖీలు చేసి సమీక్షించాలి. -
హెల్త్ సిటీ..
ప్రపంచంలో జీవించేందుకు అనువైన అత్యున్నత నగరాల సరసన మన గ్రేటర్ సిటీ స్థానం సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా 142వ ర్యాంకుతో దేశంలోని ఇతర నగరాల కంటే కూడాభాగ్యనగరం మెరుగైన పరిస్థితిలో ఉంది. ఇక్కడ పురుషులు 69.4 ఏళ్లు, మహిళలు 73.2 ఏళ్ల సగటు జీవన కాలాన్ని కలిగి ఉండడం గర్వకారణం. మెరుగైన వసతులు, సమతుల్య వాతావరణం, అత్యాధునిక వైద్య సేవల కారణంగా సిటీజనుల ఆయుప్రమాణం క్రమంగా పెరుగుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒక పార్శ్వమే. మరో వైపు చూస్తే.. మానవ సంబంధ కార్యకలాపాలు,పట్టణీకరణ, వాహన విస్ఫోటనం, పారిశ్రామిక, జల వనరుల కాలుష్యం వెరసి నగర పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలో హరితవాతావరణం, గాలి, నీరు, నేల కాలుష్యం...మనం సాధించిన మెరుగైన ర్యాంకుపై కథనం.. సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచంలో జీవించేందుకు అనువైన అత్యున్నత నగరాల సరసన మన గ్రేటర్ సిటీ దేశంలోని పలు మెట్రో సిటీల కంటే మెరుగైన స్థానంలో ఉంది. మెర్సర్ సంస్థ 2018లో చేపట్టిన సర్వేలో గత నాలుగేళ్లుగా మన సిటీ 142వ స్థానం సాధించి దేశంలోని పలు మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ పురుషులు 69.4 ఏళ్లు, మహిళలు 73.2 ఏళ్ల సగటు జీవన కాలాన్ని కలిగి ఉండడం గర్వకారణం. హెల్త్‌సిటీగా పేరొందిన మహానగరంలో అత్యున్నత వైద్యప్రమాణాలు, రోబోటిక్ సర్జరీలు, కేన్సర్ వంటి మొండి జబ్బులకు సైతం అత్యుత్తమ చికిత్సలు లభ్యమౌతుండడంతో సిటీజన్ల ఆయుప్రమాణం క్రమంగా పెరుగుతోంది. అయితే ఇదంతా నాణేనికి ఒక పార్శ్వమే. మరో వైపు చూస్తే.. పట్టణీక రణ, వాహన విస్ఫోటనం, పారిశ్రామిక, జలవనరుల కాలుష్యం వెరసి నగర పర్యావరణం హననమవుతుండడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హరితం హననం.. శతాబ్దాలుగా తోటల నగరం(భాగ్)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇపుడు హరితం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడం, కాలుష్యం పెరగడం వల్ల పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. గ్రేటర్ నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. అంటే 1.54 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. సిటీలో హరితం శాతం 8 మాత్రమే. అంటే మహానగరంలో సుమారు 12,320 ఎకరాల్లో హరితవాతావరణం(గ్రీన్‌బెల్ట్)అందుబాటులో ఉంది. దీన్ని 24,710 ఎకరాలకు పెంచాల్సి ఉంది. అంటే మొత్తం నగర విస్తీర్ణంలో హరితం శాతం కనీసం 16 శాతానికైనా పెంచాల్సిన ఆవశ్యకత ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఒకప్పుడు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకూ నగర వాతావరణం ఉపశమనం కలిగిస్తుందన్న ప్రతీతి ఉండేది. కానీ ఈ పరిస్థితిని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. శరవేగంగా రహదారుల విస్తరణ, బహుళఅంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా..గ్రీన్‌టాప్ అంతకంతకూ పెరగకపోవడంతో మోటారు వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న గ్రీన్‌హౌజ్ వాయువులైన కార్బన్డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువుల ఉద్గారాలు పెరిగి వేసవి తాపం ఉక్కిరిబిక్కిరిచేస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇలా చేస్తే హరితం పదిలం.. ♦ నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. తద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. ♦ సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంతవిస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని,ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ♦ నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. నూతన లే అవుట్లకు అనుమతులిచ్చేసమయంలో ఈవిషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. హరితంతో కాలుష్యం దూరం..దూరం.. చెట్ల ఆకులు వాతావరణంలోని కార్భన్‌డయాక్సైడ్, సూక్ష్మధూళి కణాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుండడంతో పీల్చేగాలిలో ఆక్సిజన్ మోతాదు పెరుగుతుంది. చెట్లు ఎయిర్ ఫిల్టర్లుగా పనిచేస్తాయని అందరూ గ్రహించాలి. చెట్లు చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా విద్యుత్ వంటి ఇంధనాన్ని ఆదాచేస్తాయి. కాలుష్య ఉద్గారాలను బాగా తగ్గిస్తాయి. పట్టణీకరణతో జలవనరులకు శాపం.. మహానగరంలో చెరువులు, కుంటలకు పట్టణీకరణ శాపంగా పరిణమిస్తోంది. ఔటర్‌రింగ్ రోడ్డుకు లోపలున్న సుమారు 3000 చెరువులు, కుంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఇవి 2005లో సుమారు 30,978 ఎకరాల్లో ఉండేవి. ఆ తర్వాత రియల్‌రంగం పురోగమించడం, పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి ఉద్యోగాలు, వ్యాపారాల కోసం సిటీకి వలసలు అధికమవడంతో శివార్లలో భూములకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఒకప్పుడు పచ్చటి పంటపొలాలు, నిండుకుండలను తలపించే చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాలు ఇప్పుడు కాంక్రీట్ మహారణ్యంగా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆయా జలవనరుల విస్తీర్ణం ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టి 5,641 ఎకరాలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. అంటే గత 13 ఏళ్ల కాలంలో సుమారు 80 శాతం మేర వీటి విసీ ్తర్ణం తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఇదే సమయంలో 2005–18 మధ్యకాలంలో ఆయా శివారు ప్రాంతాల్లో కాంక్రీట్ మహారణ్యం 1,72,970 ఎకరాల నుంచి 1,97,954 ఎకరాలకు పెరగడం గమనార్హం. నేల కాలుష్యం:బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్ కంపెనీల నుంచి వెలువడుతోన్న ఘన, ద్రవ కాలుష్య ఉద్గారాలను బహిరంగప్రదేశాల్లో పడవేస్తుండడంతో ఆయా ఉద్గారాల్లోని భారలోహాలు, మూలకాలు వర్షంపడినపుడు నేలలోపలికి ఇంకుతున్నాయి. ప్రధానంగా మెర్క్యురీ, లెడ్, క్రోమియం, ఆర్సినిక్, నికెల్, మాంగనీస్, కాపర్, కోబాల్ట్ వంటి మూలకాలుండడం విశేషం. మెర్సర్ ర్యాంకింగ్లోగ్రేటర్ బెటర్ మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్– 2018 ప్రకారం..హైదరాబాద్ నగరం వరుసగా నాలుగో సంవత్సరం మెరుగైన స్థానంలో నిలవడం విశేషం. విశ్వవ్యాప్తంగా జీవన ప్రమాణాలు అత్యున్నతంగా ఉన్న 450 నగరాలపై మెర్సర్ సంస్థ నిర్వహించిన సర్వేలో మన దేశంలోని హైదరాబాద్, పుణే నగరాలు 142 వస్థానం దక్కించుకున్నాయి. ఢిల్లీ, ముంబయిల కంటే మన నగరం స్థానమే మెరుగ్గా ఉండడం విశేషం. తక్కువ క్రైం రేటు, విశిష్ట భౌగోళిక పరిస్థితులు, సమశీతోష్ణ వాతావరణం, అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు జీవించేందుకు అనువుగా ఉండడంతో నగరం మెరుగైన ర్యాంక్ సాధించడం విశేషం. -
రూపాయికే లీటరు నీళ్లు!
గ్రేటర్లో ఏటీఎంల తరహాలో నీటియంత్రాలు: జనార్దన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీలో ఏటీఎంల తరహాలో ఎనీటైమ్ వాటర్ (ఏటీడబ్ల్యూ) యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. మహానగర పరిధిలో రోడ్లపై వెళ్లే పాదచారుల దాహార్తిని తీర్చేందుకు ఏటీఎంల వలె పనిచేసే నీటి యంత్రాలు (వాటర్ కియోస్క్‌లు) త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ యంత్రాల్లో రూ.1 బిళ్లవేయగానే లీటరు నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ బి.జనార్దన్‌రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జనార్దన్ రెడ్డి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రేటర్లో నెలకు వంద కోట్ల నీటిబిల్లుల వసూళ్లు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న తాగునీటిలో సరఫరా నష్టాలు 70% ఉంటున్నాయని, వీటిని 35 శాతానికి పరిమితం చేయాలని ఆదేశిం చారు. వందరోజుల ప్రణాళిక అమలులో రోజువారీగా చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలన్నారు. దారితప్పుతున్న ట్యాంకర్లకు అడ్వాన్స్డ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. తక్షణం వాణిజ్య సంస్థలకున్న కనెక్షన్లను వాణిజ్య కేటగిరీ కింద కు మార్చాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి, ఆపరేషన్స్, రెవెన్యూ, ఫైనాన్స్ విభాగాల డెరైక్టర్లు జి.రామేశ్వర్రావు, సూర్యనారాయణ, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సిటీ నెం.1
♦ ‘దుమ్ము’ దులిపిన నివేదిక ♦ ధూళిలో గ్రేటర్‌దే అగ్రస్థానం ♦ కాలుష్య నియంత్రణ మండలి ♦ అధ్యయనంలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: అభివృద్ధి మాట ఏమోగానీ... దుమ్ము, ధూళి కాలుష్యంలో గ్రేటర్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. నగర వాసుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. అనేకమంది ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతినడం... ఎడతెరిపి లేని దగ్గు... గుండె జబ్బులకు ధూళి కాలుష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మహా నగరంలో రోజుకు 11.9 టన్నుల ధూళి కాలుష్యం వెలువడుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా ఆరు మహా నగరాలు... హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, పాట్నా, షోలాపూర్‌లలో కాలుష్యంపై సీపీసీబీ ఇటీవల అధ్యయనం చేసింది. దీనిలో గ్రేటర్ సిటీఅగ్రస్థానంలో ఉంది. ఘనపు మీటరు గాలిలో ధూళి కాలుష్యం 60 మైక్రోగ్రాములకు మించకూడదు. కానీనగరంలోని చాలా ప్రాంతాల్లో 100 మైక్రోగ్రాములకు మించుతోందని కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు చెబుతున్నాయి. కారణాలివే... ♦గ్రేటర్లో మొత్తం 43 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో పదిహేనేళ్లకు పైబడినవి సిటీ నెం.1 ఆరు లక్షలు. వీటిలో ఆటోలు, బస్సులు, కార్లు, జీపులు, ఇతర రవాణా వాహనాల పొగతో ధూళి కాలుష్యం(ఆర్‌ఎస్‌పీఎం) అనూహ్యంగా పెరుగుతోంది. ♦ మెట్రో పనుల నేపథ్యంలో కాంక్రీటు, సిమెంటు మిశ్రమం నుంచి వెలువడే ధూళికణాలు, పిల్లర్ల కోసం తవ్వినపుడు వెలువడే దుమ్ము రేణువులు గాలిలో కలుస్తున్నాయి. ♦నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం, తరచూ రహదారుల మరమ్మతులు, విద్యుత్, టెలిఫోన్, మంచినీరు, మురుగునీటి పైపులైన్ల కోసం తవ్వకాలతో కాలుష్యం పెరుగుతోంది. ♦జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో ఒకరు పనులు పూర్తి చేసిన తరవాత మరో శాఖ పనులు చేపట్టి రహదారులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీంతో తరచూ ధూళి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ♦పనులు ముగిసిన తరువాత కూడా రోడ్లపై ఇసుక, ఇతర వ్యర్థాలు వదిలేయడంతో ఆర్‌ఎస్‌పీఎం శాతం పెరుగుతోందని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ♦వాహనాల వేగానికి రహదారులపై లేచే దుమ్ము, ధూళి, ట్రాఫిక్ జాంలో చిక్కుకున్న డీజిల్ వాహనాల నుంచి వెలువడే పొగతోనూ ధూళి కాలుష్యం పెరుగుతోందని పీసీబీ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లోనే కాలుష్యం అధికం ♦పంజగుట్ట, జేఎన్టీయూ, జీడిమెట్ల, జూపార్కు, ప్యారడైజ్, చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో అధికంగా ధూళి కాలుష్యం (ఆర్‌ఎస్‌పీఎం-రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులార్ మ్యాటర్) ప్రమాణాలు నమోదయ్యాయి. ♦కొన్నిచోట్ల నెలకు సగటున క్యూబిక్ మీటర్‌కు 150 మైక్రోగ్రాముల ఆర్‌ఎస్‌పీఎం చేరుతోంది. ♦కొన్ని సందర్భాల్లో ఘనపు మీటరు గాలిలో 250- 300 మైక్రోగ్రాములకు ఆర్‌ఎస్‌పీఎం చేరుకుంటోంది. అనర్థాలివీ... ♦ధూళి కాలుష్యం భారీగా పెరుగుతుండడంతో నగరంలో శ్వాస కోస సంబంధ వ్యాధులు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ♦ఆస్తమా, బ్రాంకైటీస్, హై బీపీ, ఊపిరితిత్తుల వృద్ధి రేటు తగ్గిపోవడం వంటివ్యాధులతో జనం సతమతమవుతున్నారు. ♦నగరంలోని వివిధ ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో 90 శాతానికి పైగా ధూళి కాలుష్యం బారిన పడుతున్న వారేనని వైద్యులు చెబుతున్నారు. -
రాజధానిలో హైఅలర్ట్
గ్రేటర్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందనే సమాచారం అందరినీ కలవర పెడుతోంది. నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో అణువణువూ జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతులు చోటు చేసుకోవచ్చనే అనుమానంతో ప్రతి అంగుళమూ తనిఖీ చేస్తున్నారు. ⇒ఉగ్రవాద దాడుల సంకేతాలు ⇒పోలీసు యంత్రాంగం అప్రమత్తం ⇒రంగంలోకి బాంబు స్క్వాడ్ ⇒లాడ్జీలు, బస్టాండ్లను జల్లెడ పడుతున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: బెంగుళూరులో బాంబు పేలుడు... కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల టార్గెట్‌లో గ్రేటర్ సిటీ ఉండడంతో నగరంలో పోలీసులు అణువణువునా జల్లెడ పడుతున్నారు. వాహన తనిఖీలు, కార్డన్‌సెర్చ్‌లు, లాడ్జీలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. దేవాలయాలు, పార్కింగ్ స్థలాల వద్ద 30 బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. జంట కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల మొదలు డీసీపీల వరకు నాలుగు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ సిబ్బందిని ఆదేశించారు. అధికారులతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. గతంలో జైలు నుంచి విడుదలై న అనుమానిత ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టారు. వెస్ట్‌జోన్ పరిధిలో డీసీపీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కార్డన్‌సెర్చ్ చేపట్టారు. హైఅలర్ట్ నేపథ్యంలో స్టార్ హోటళ్లు, రిసార్టులు, ఫాంహౌస్‌లలో కొత్త సంవత్సర వేడుకల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. నిర్వాహకులు విధిగా పార్టీ వేడుకలు జరిగే ప్రదేశాల్లో మెటల్ డిటెక్టర్లు అమర్చుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసు అనుమతులు తీసుకోవడంతో పాటు రాత్రి ఒంటిగంట వరకే కార్యక్రమాలను పరిమితం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. మందుబాబులు అదుపు తప్పితే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. టెన్షన్..టెన్షన్ ఆస్ట్రేలియాలో సిడ్నీ కేఫ్‌పై ఉగ్రవాదుల దాడి.. పాకిస్తాన్ పెషావర్‌లోని ఆర్మీ పాఠశాలలో తాలిబన్ ఉగ్రవాదులు సాగించిన నరమేథం.. భారత్‌పై దాడులు చేస్తామని లష్కర్-ఎ-తోయిబా నేత మసూద్ ప్రకటన.. జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ వస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదుల ముప్పు ఉందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించిన విషయం తెలిసిందే. వీటిని కూడా పరిగణనలోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలోని లాడ్జీలు, రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. కొత్త వ్యక్తులు వస్తే... నిఘా పెట్టాల్సిందిగా అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వివిధ ప్రదేశాలలో భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారి వేలి ముద్రలను సైతం సేకరిస్తున్నారు. ఈ రూపంలో కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ దిశగా పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి -కమిషనర్ మహేందర్‌రెడ్డి సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరు బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అన్ని ప్రాంతాలపై నిఘా పెంచాం. అనుమానిత వ్యక్తులు, వస్తువులు, వాహనాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఉగ్రవాద కార్యకలాపాలలో హైదరాబాద్ వాసులు ఎక్కడా పాల్గొనలేదు. బయటి వ్యక్తులే వచ్చి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించారు. ప్రతిసారి హైదరాబాద్ ప్రజలను ఉగ్రవాదుల పేరుతో అవమానించడం సరికాదు. అయినా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సున్నితమైన నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొంటామనే నమ్మకం ఉంది. దీనిలో భాగంగానే ప్రజలను సైతం భాగస్వాములను చేస్తున్నాం. -
జల గండం
భారీగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలు వేసవికి ముందే పరిస్థితి ఆందోళనకరం నగరంలో సగటున 3.58 మీటర్ల లోతునకు పడిపోయిన వైనం అన్ని మండలాల్లోనూ తగ్గిన నీటి నిల్వలు ‘మహా’నగరానికి మంచినీటి కష్టాలు తప్పవా? సమీప భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సిందేనా? నిపుణులను తొలిచేస్తున్న ప్రశ్నలివి. వానలు కురుస్తున్నాయి... జలాశయాలు నిండుగా కనిపిస్తున్నాయి కదా అనుకుంటున్నారా? ఇదంతా పైపైనే. భూగర్భ జలమట్టాలు భారీగా పడిపోతున్నాయి. ఏడాది కాలంలోనే ఈ తేడా స్పష్టంగా వెల్లడైంది. నీటి చుక్కను ఒడిసి పట్టే మార్గం లేక...ఉన్నా...ఆచరించే ఓపిక లేని యంత్రాంగం నిర్లక్ష్యం సాక్షిగా ఇప్పుడు గ్రేటర్ జలగండం ముంగిట నిలిచింది. సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. మేలుకోకుంటే రాబోయే ముప్పు ఎలా ఉంటుందో ముందే హెచ్చరిస్తున్నాయి.మహా నగరంపై వరుణుడు కరుణిస్తున్నా... వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేవు. నీటి మట్టం తగ్గడానికి ఇదో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నవంబరు నెలలో నగరంలో ఏకంగా 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం (80 మిల్లీమీటర్లు) కంటే 40 మిల్లీమీటర్లు అధికం. కానీ విలువైన వర్షపునీటిని భద్రపరిచే ఇంకుడు గుంతలు తగినన్ని లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగడం లేదు. దీనిపై భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నగరంలో సగటున 5.79 మీటర్ల లోతున జలమట్టాలు ఉండగా... ఈసారి 9.37 మీటర్ల లోతునకు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 3.58 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోవడం గమనార్హం. శీతాకాలంలోనే ఈ పరిస్థితి ఉంటే... రాబోయే వేసవిలో ఎలా ఉండబోతోందో ఈ సంకేతాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్లో 60 శాతంవర్షపునీరు వృథాగా పోతుండడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం వృథా కావడం సర్వసాధారణం. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం వృథాగాపోతోంది. ఈ నీటిని భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో మూడు మీటర్లు పెరిగే అవకాశం ఉంది. కానీ జీహెచ్ఎంసీ, జలమండలి విభాగాలు దీనిపై దృష్టి పెట్టిన పాపాన పోవడం లేదు. ఎంత తవ్వినా అంతే... గ్రేటర్ పరిధిలోని అనేక మండలాల్లో గతఏడాది నవంబరునెలాఖరుతో పోలిస్తే ఈ ఏడాది నవంబరుచివరి నాటికి భూగర్భ జలమట్టాలు మరింత లోతుకు పడిపోయాయి. చార్మినార్మండలంలో గత ఏడాది 5.60 మీటర్ల లోతున భూగర్భ జలాల ఆనవాళ్లు కనిపించగా... ఈసారి 11.27 మీటర్ల లోతునకు తవ్వితే గానీ నీటిచుక్క కనిపించని దుస్థితి నెలకొంది. అమీర్‌పేట్, మారేడ్‌పల్లి,నాంపల్లి, ఉప్పల్, హయత్‌నగర్,కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి మండలాల్లోనూ భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడం గమనార్హం. గ్రేటర్ పరిధిలో దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే దుస్థితి తాండవిస్తోంది. కారణాలివే... మహా నగర పరిధిలో అపార్ట్మెంట్లు, భవనాల సంఖ్య సుమారు 22 లక్షలు. కానీ ఇంకుడు గుంతలు 35 వేలకు మించి లేవు. ఈ కారణంగా వర్షపు నీటిని సంరక్షించలేకపోతున్నాం. దీంతో 60 శాతం నీరు వృథా అవుతోంది. { Vేటర్ పరిధిలో భూగర్భ జలమట్టాలు పెంచేందుకు గత ఏడాది జీహెచ్ఎంసీ 10 వేలు, జలమండలి 22 వేల ఇంకుడు గుంతల ఏర్పాటుకు వినియోగదారుల నుంచి రూ.64 కోట్ల మేర రాబట్టాయి. కానీ తవ్వింది ఐదు వేల ఇంకుడు గుంతలే. దీన్నిబట్టి వారి శ్రద్ధ ఏపాటిదో తెలుస్తోంది.మహానగరంలో ఇళ్లు, కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు లేవు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలతో సమస్యకు పరిష్కారం.. మధ్య తరగతి ప్రజలు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీటరు లేదా రెండు మీటర్ల దూరంలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున గుంత తీసి ఇందులో 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగు రాళ్లు, 25 శాతం 20 ఎంఎం సైజులో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం బఠానీగింజ పరిమాణంలో ఉండే ఇసుకను నింపాలి. మరో పదిశాతం ఖాళీగా ఉంచాలి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ గుంతపై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జి సులువవుతుంది. బోరుబావి పది కాలాల పాటు ఎండిపోకుండా ఉంటుందని భూగర్భ జలశాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్లు, కార్యాలయాల విస్తీర్ణాన్ని బట్టి వీటి సైజు పెరుగుతుందని చెబుతున్నారు. -
గ్రేటర్‌కు లండన్ లుక్
‘థేమ్స్’ తరహాలో గ్రేటర్ వాటర్‌గ్రిడ్ రూ. 13 వేల కోట్ల వ్యయంతో ప్రాథమిక అంచనాలు తీరనున్న పానీ పరేషాన్ నేడు గ్రేటర్ వాటర్‌గ్రిడ్‌పై సీఎస్ సమక్షంలో కీలక సమావేశం సిటీబ్యూరో: గ్రేటర్ నగరానికి లండన్ లుక్ రానుంది. విశ్వనగరంగా భాసిల్లుతోన్న లండన్ మహానగరంలోని థేమ్స్ నది చుట్టూ ఉన్న వాటర్ గ్రిడ్ తరహాలో ఇక్కడ కూడా గ్రిడ్ ఏర్పాటుకు జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రూ. 13 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాలు వేస్తోంది. లండన్‌లో 80 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే ఉండగా.. గ్రేటర్లో ఔటర్ రింగు రోడ్డు చుట్టూ సుమారు 160 కిలోమీటర్ల పరిధిలో గ్రిడ్ ఏర్పాటు కానుంది. ఇది ఏర్పాటైతే నగరంలో నీటి సమస్య కూడా పరిష్కారమవుతుంది. గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాల నీటిని సమగ్ర నీటి సరఫరా వ్యవస్థ ద్వారా నగరం నలుమూలలకు సరఫరా చేసే(గ్రిడ్) ఏర్పాటుపై జలమండలి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇపానెట్ సాఫ్ట్‌వేర్‌లో గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటు, సుమారు 60 చోట్ల నోడ్స్ను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలకు అధిక సంఖ్యలో బల్క్ నీటి సరఫరా నల్లాల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ విషయంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన, సాంకేతిక సర్వే కోసం ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లు కోరేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు సమాచారం. నేడు సీఎస్ సమక్షంలో కీలక భేటీ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రిడ్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమక్షంలో సోమవారం కీలక సమావేశం జరగనుంది. ఇందులో గ్రిడ్ లక్ష్యం, ప్రాధాన్యతలు, అంచనా వ్యయాలు, ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యాంశాలివీ... సుమారు వెయ్యి చదరపు కి.మీ పరిధిలో 160 కి.మీల మేర ఏర్పాటు కానున్న గ్రిడ్‌కు అంచనా వ్యయం రూ. 13 వేల కోట్లు. ఈ నిధులతో నగర శివార్లు, ఔటర్ పరిసరాలు, గ్రామ, నగర పంచాయతీలు, ఐటీ, హార్డ్‌వేర్ పార్క్‌లకు నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు, హెడ్‌వర్క్స్ పనులు, నీటి పంపిణీ చేసే భారీ పైప్‌లైన్స్ (రింగ్మెయిన్స్), నగరంలో అంతర్గత నీటి సరఫరా కోసం (రేడియల్ మెయిన్స్) పైప్లైన్లు ఏర్పాటు. గ్రేటర్ దాహార్తిని తీరుస్తోన్న కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి సేకరిస్తున్న నీటిని రింగ్మెయిన్స్ ద్వారా నగరం నలుమూలలకు సరఫరా చేయవచ్చు. ఎక్కడ కొరత ఉంటే అక్కడికి నీటి మళ్లించడం ఈ గ్రిడ్‌తో సాధ్యం.నగరం నలుమూలలకు డిమాండ్‌ను బట్టి నీటి సరఫరా సాధ్యపడుతుంది. సమగ్ర నీటి సరఫరా నెట్వర్క్(ఇంటిగ్రేటెడ్ సోర్స్ ట్రాన్స్మిషన్ సిస్టం)ను ఏర్పాటు చేయవచ్చు. నిత్యం సుమారు 730 మిలియన్ గ్యాలన్ల నీటిని మహానగరానికి సరఫరా చేయవచ్చు. ప్రస్తుతం నిత్యం 340 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది.నగరం నలుమూలలకు నీటి కనెక్షన్ల మంజూరుకు వీలుంటుంది.నగరంలో త్వరలో సుమారు 205 చదరపు కి.మీ పరిధిలో ఏర్పాటు కానున్న ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)కు నిరంతరాయంగా నీటిని సరఫరా చేయవచ్చు. ఉప్పల్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పోచారం, ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్ ప్రాంతానికి తాగునీటి కొరత తీర్చవచ్చు. ఆయా ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు కానున్న ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమలకు నీటికొరత ఉండదు. ఔటర్ చుట్టూ ఏర్పాటు కానున్న ఈ గ్రిడ్‌లో సరఫరా అవుతున్న నీటిని స్కాడా విధానంతో ప్రతి నీటిబొట్టును శాస్త్రీయంగా లెక్కించవచ్చు. అక్రమ కుళాయిల ఊసే ఉండదు. మురుగు నీటిపారుదల వ్యవస్థ అత్యవసరం గ్రేటర్ వాటర్‌గ్రిడ్‌తోపాటు ఆయా ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ(డ్రైనేజీ)ను ఏర్పాటు చేయాలి. లేనిపక్షంలో నగరాన్ని మురుగు ముంచెత్తుతుంది. గ్రిడ్ ద్వారా సరఫరా చేసిన నీటిలో తిరిగి 80 శాతం వరకు నీరు డ్రైనేజీలో కలుస్తుందన్నది అక్షర సత్యం. అందుకే డ్రైనేజీ వసతులు అత్యవసరం. లేనిపక్షంలో మురుగునీరంతా సెప్టిక్ ట్యాంకులు, నాలాలు, చెరువుల్లో చేరి అక్కడి నుంచి మూసీలోకి చేరి నగరం మురికికూపంగా మారే అవకాశం ఉంది. వాటర్‌గ్రిడ్‌తోపాటు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు గ్రిడ్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం. - టి.హనుమంతరావు, నీటిపారుదల రంగ నిపుణుడు -
విశ్వమంత ఆశ
*బడ్జెట్ కేటాయింపులకు ఎదురుతెన్నులు * మౌలిక వసతులకు ప్రాధాన్యం * నిధులు కావాలని నివేదన * రూ.5066 కోట్లతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి ప్రతిపాదనలు సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరంగా గ్రేటర్ సిటీ... రాజధాని హైదరాబాద్ నగరం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే మాట ఇది. మహా నగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలంటే ప్రధానంగా కావాల్సినవి మౌలిక వసతులు. తీరైన రహదారులు... అందరికీ తాగునీరు... మెరుగైన పట్టణ ప్రణాళిక... స్మార్ట్‌సిటీ నిర్మాణం దిశగా పయనం... ఇటీవల మెట్రోపొలిస్ సదస్సులోనూ అందరిదీ ఇదే మాట. ఆ దిశగా గ్రేటర్ నగరాన్ని తీర్చిదిద్దాలంటే కావాల్సినది బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సాయం. మహానగర అభివృద్ధి... మౌలిక సదుపాయాల కల్పనలో కీలక భూమిక పోషించే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి తాజాబడ్జెట్పై కొండంత ఆశలు పెట్టుకున్నాయి. జీహెచ్ఎంసీ రూ.1093 కోట్లు.. హెచ్ఎండీఏ సుమారు రూ.2200 కోట్లు... జలమండలి రూ.1773 కోట్లు... మొత్తంగా రూ.5066 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. తాజా బడ్జెట్లో కేటాయించే నిధుల పైనే మహానగరంలో వసతుల కల్పన, స్మార్ట్‌సిటీ నిర్మాణం వైపు అడుగులు పడతాయన్నది సుస్పష్టం. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సిటీజనుల ఆశలను, సర్కారు విభాగాల అంచనాలను ఎంతమేరకు చేరుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలనుంది. -
జగతి మెచ్చేలా.. జనం నచ్చేలా!
- మెట్రోపొలిస్ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి - నగరం ముస్తాబు - ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు - అతిథులకు పూర్తి స్థాయి భద్రత సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికవుతోంది. దీని కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సోమవారం నుంచి జరిగే మెట్రోపొలిస్ సదస్సు కోసం రహదారులు కొత్తరూపు సంతరించుకున్నాయి. వేదికకు వెళ్లే దారి పొడవునా వెలసిన స్వాగత తోరణాలు అతిథులను రా..రామ్మని ఆహ్వానం పలికేందుకు సిద్ధమవుతున్నాయి. అతిథులను ఆకర్షించేందుకు అవసరమైన ఏ ర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం తల మునకలవుతోంది. ఇలాంటి సదస్సులు కొత్త కాకపోయినా... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొట్ట తొలిగా నిర్వహిస్తున్న అతి పెద్ద కార్యక్రమం కావడంతో ప్రభుత్వ, అధికార వర్గాలు దీన్ని సవాలుగా తీసుకున్నాయి. ప్రజలు కూడా ఈ సదస్సు నిర్వహణ తీరుపై ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే లక్ష్యంతో తలపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల అధికారులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన 125 కి.మీ.ల పరిధిలో రహదారుల అభివృద్ధి, పచ్చదనం పెంపు తదితర కార్యక్రమాలు పూర్తి చేశారు. రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా... నగరం గొప్పదనాన్ని గుర్తించేలా అతిథులకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి అతిథులు తమకు కేటాయించిన హోటళ్లకు వెళ్లేంతవరకు వారిని సురక్షితంగా చేర్చేందుకు దాదాపు 130 మంది పోలీసులను ప్రత్యేకంగా నియమించారు. అతిథులతో మెలగాల్సిన తీరుపై వారికి శిక్షణ నిచ్చారు. ఏర్పాట్ల వివరాలను శనివారం హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. అతిథులు పర్యటించే మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండాజంక్షన్ల అభివృద్ధి పనులు చేసినట్టు వారు చెప్పారు. మెట్రో రైలు మార్గాల్లోనూ ట్రాఫిక్ చిక్కులు ఎదురవకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులు విమానాశ్రయంలో.. హోటళ్ల వద్ద క్యూలలో వేచి ఉండకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరిం చారు. ఈ నెల 6నుంచి 10వ తేదీ వరకు స దస్సు జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రధాన సదస్సును 7న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వారు చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయు డు, తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. -
ఇల్లు.. నిల్లు..
అర్ధంతరంగా మాయమైన ‘వాంబే’ పదేళ్లుగా పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో దాదాపు పది లక్షల మంది సొంత ఇళ్లు లేక అల్లాడుతున్నారు. వీరిలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన పేదలే ఎక్కువ. ఇలాంటి పేదల కోసం ప్రభుత్వాలు పలు గృహనిర్మాణ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. వేటినీ సవ్యంగా పూర్తి చేయకపోవడంతో పేదల సొంతగూడు కల నెరవేరడం లేదు. ఆరంభ శూరత్వంగా ప్రారంభమై, అవాంతరాలతో మధ్యస్తంగా నిలిచిపోయిన పలు గృహనిర్మాణ పథకాల్లో వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన (వాంబే) ఒకటి. దాదాపు దశాబ్దం క్రితమే ఈ పథకం ప్రారంభించినప్పటికీ, నేటికీ లబ్ధిదారుల ఎంపికే పూర్తికాని దుస్థితి. త్వరలో ఏర్పాటు కానున్న కొత్త సర్కారు హయాంలోనైనా పేదల సొంతగూటి కల నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే. దశాబ్దం కిందట ప్రారంభమైనా.. దాదాపు దశాబ్దం క్రితం పేదలకు గృహ సదుపాయం కల్పించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 6,036 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో 19 కాలనీల్లో వీటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకుగాను దాదాపు రూ.92.30 కోట్లు ఖర్చు కాగలదని అప్పట్లో అంచనా వేశారు. ఇందులో రూ. 80.86 కోట్లు గృహనిర్మాణాలకు కాగా మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.44 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. అనంతరం ఆ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ నుంచి జీహెచ్ఎంసీకి బదలాయించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాకపోవడం.. ఎంపికైన లబ్ధిదారులు తాము చెల్లించాల్సిన వాటా ధనం చెల్లించకపోవడం.. లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకు రాకపోవడం.. తదితర కారణాలతో ఈ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయింది. పథకం అమలుపై శ్రద్ధ చూపేవారు కరవై పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారింది. కొన్ని కాలనీల్లో పూర్తయిన ఇళ్లు ఆక్రమణల పాలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారుల స్థానే థర్డ్‌పార్టీలు చేరాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో పట్టిం చుకునే అతీగతీ లేకుండా అసంపూర్ణంగా మిగిలాయి. మరికొన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులే చేరినప్పటికీ.. చెల్లించాల్సిన వాటా ధనం చెల్లించలేదు. మొత్తానికి పథకం నిష్ర్పయోజనమైంది. -
ప్ర‘జల’పై నిర్లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: నీటి బొట్టును ఒడిసిపట్టాలన్న ‘గ్రేటర్’ లక్ష్యం నిర్లక్ష్యం మాటున నీరుగారిపోతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతా ల్లో ఇప్పటికే 1500 అడుగుల లోతుకు తవ్వినా నీటిచుక్క కానరావడం లేదు. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతున్నా వర్షపు నీటి ని కాపాడాలన్న శ్రద్ధ ఇటు జలమండలి, అటు జీహెచ్ఎంసీలో కానరావడం లేదు. రుతుపవనాలు పక్షం రోజుల్లో గ్రేటర్‌ను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షపు నీటిని కాపాడుకొని, భూగర్భ జలసిరిని పెంచేందుకు చర్యలు తీసుకోవడంలో జలమండలి, జీహెచ్ఎంసీలు దారుణంగా విఫలమౌతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ నిలువెల్లా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఇంకుడు గుంతలు (రీచార్జింగ్ పిట్స్)ను మహోద్యమంగా చేపట్టకపోతే గ్రేటర్‌కు జలగండం తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఈ రెండు విభాగాలకు పట్టడం లేదు. గతేడాది రూ.6 కోట్ల అంచనా వ్యయంతో గ్రేటర్ పరిధిలో సుమారు 10 వేలు ఇంకుడు గుంతలు తవ్వాలన్న బల్దియా లక్ష్యం కాగితాలకే పరిమితమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నీరు ఇంకే దారులేవీ..? జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాల సంఖ్య 12 లక్షలు. కానీ వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అందుబాటులో ఉన్న రీచార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంతలు) ఎనిమిది వేలు మాత్రమే. ఇది భూగర్భ జలశాఖ ప్రకటించిన చేదు వాస్తవం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్ సిటీలో విలువైన వర్షపు నీటిని ఒడిసిపట్టే దారి లేకపోవడంతో పాతాళగంగ కనుమరుగవుతోంది. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ, జలమండలిలు వినియోగదారుల నుంచి ఇప్పటివరకు సుమారు రూ.64 కోట్లు వసూలు చేశాయి. ఆ నిధులతోఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోవడంతో భూగర్భ జలాలు అథఃపాతాళానికి వెళ్తున్నాయి. మహానగరంలో ప్రతి ఇల్లు, కార్యాలయానికీ రీచార్జింగ్ పిట్స్ అత్యవసరం. ఈ పరిస్థితి లేకనే మారేడ్‌పల్లి, బోయిన్పల్లి, బోడుప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో 1500 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా నీటిచుక్క జాడ కనిపించడం లేదు. విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వడాన్ని నిషేధిస్తూ తొమ్మిదేళ్ల క్రితం చేసిన వాల్టా చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఇంటి అవసరాల కోసం వ్యయప్రయాసల కోర్చి బోరుబావులు తవ్వుతున్న వినియోగదారులు నీటిబొట్టు కానరాక బావురుమంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రీచార్జింగ్ పిట్స్ తవ్వే ప్రక్రియను మహోద్యమంగా చేపట్టాల్సిన సంబంధిత విభాగాలు నిద్రమత్తు వీడకపోవడంతో ప్రస్తుతం వర్షపునీరు వృథా అయ్యే పరిస్థితి తలెత్తింది. వినియోగదారుల నుంచి.. భూగర్భ జల మట్టాలను పెంపొందించేందుకు రీచార్జింగ్ పిట్స్ తవ్వాల్సిన అంశంపై వినియోగదారులకు అవగాహన కల్పించడంలో జల మండలి, జీహెచ్ఎంసీలు దారుణంగా విఫల మౌతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల సమయంలో రీచార్జింగ్ పిట్స్ తవ్వేందుకు జీహెచ్ఎంసీ నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి రూ.8 నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తుంది. ఈ విషయంలో జలమండలి కూడా తక్కువేం తినలేదు. నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినపుడు వినియోగదారుల నుంచి విస్తీర్ణాన్ని బట్టి రూ.8 నుంచి రూ.25 వేల వరకు ముక్కుపిండి రాబడుతున్నారు. ఒక వేళ వినియోగదారుడు సొంతంగా పిట్ ఏర్పాటు చేసుకున్నారని క్షేత్రపరిశీలన సమయంలో తేలితే ఈ మొత్తాన్ని మినహాయిస్తున్నారు. అందుబాటులో ఎనిమిది వేలే... గ్రేటర్ పరిధిలో వర్షపు నీటి నిల్వకు కేవలం ఎనిమిది వేల ఇంకుడు గుంతలు మాత్రమే అం దుబాటులో ఉన్నట్లు భూగర్భజలశాఖ గతంలో ప్రకటించింది. వీటిలోనూ పలు పిట్స్‌పై మట్టి, పెద్ద బండరాళ్లు, సిమెంట్, చెత్తాచెదారం పడడంతో వర్షపునీటిని భూగర్భంలోకి చేర్చే పరి స్థితి లేదని తేలింది. వీటిని పునరుద్ధరించే విషయంలో వినియోగదారులను చైతన్యం చేసే విషయంలోనూ జీహెచ్ఎంసీ, జలమండలిలు విఫలమౌతున్నాయని స్పష్టమైంది. గతేడాది రూ.6కోట్ల వ్యయంతో పదివేల ఇంకుడు గుంత లు తవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కానీ వీటిలో పూర్తయినవి వెయ్యి దాటకపోవడం గమనార్హం. ఇక జలమండలి మరో ఆరువేల రీచార్జింగ్ పిట్స్ ఏర్పాటుచేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు రెండు వేలకు మించి ఇంకుడు గుంతలు తవ్వకపోవడం ఆయా విభాగాల నిర్లక్ష్యానికి పరాకాష్ట. రీచార్జింగ్ పిట్ ఇలా ఉండాలి మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీస్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీట రు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంతతీసి అందులో 50 శాతం మేర 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగురాళ్లు, 25శాతం మేర 20ఎంఎం సైజు లో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం దొడ్డు ఇసుక నింపి పదిశాతం ఖాళీగా ఉంచా లి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జింగ్ సులువవుతుంది. దీనివల్ల బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుంది. ప్రతి ఇల్లు, కార్యాలయంలో విస్తీర్ణాన్ని బట్టి పిట్ సైజు పెరుగుతుంది. -
‘చెత్త’సిటీ!
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని వీధుల్లో చెత్తాచెదారం కుప్పలు పడుతోంది. ‘గ్రేటర్’ నగరాన్ని చెత్త ముంచెత్తుతోంది.. చర్చలు ఫలించలేదు. పారిశుద్ధ్య కార్మికులు విధులకు రాలేదు. చెత్త తరలింపు వాహనాలు కదల లేదు. డంపర్బిన్ల నుంచి.. ట్రాన్స్ఫర్ స్టేషన్ల నుంచీ చెత్త తరలింపుపనులు జరుగలేదు. దీంతో రె ండో రోజైన మంగళవారం సైతం గ్రేటర్లో ఎక్కడి చెత్త అక్కడే పోగు పడి పరిస్థితులు పరమ అధ్వానంగా మారాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా.. ప్రజారోగ్యం దృష్ట్యా జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు కార్మిక సంఘాల నేతలతో మంగళవారం సైతం చర్చలు జరిపారు. తమ డిమాండ్లు పరిష్కారం కాలేదంటూ సంఘాల నేతలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో.. చెత్త తరలింపు సమస్య జటిలంగా మారనుంది. ఇప్పటికే పెరిగిపోయిన చెత్తకుప్పలతో కాలనీలు, బస్తీలలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ, మలేరి యా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పారిశుద్ధ్యం ఎక్కడికక్కడే కుంటుపడటంతో పరిస్థితి ఏమిటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంటువ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో ప్రజారోగ్యం కోసం సమ్మె విరమించాలని కోరగా.. కార్మికసంఘాల నేతలు ససేమిరా అనడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చింది. రాష్ట్రస్థాయిలోని కార్మిక సంఘాలు మునిసిపల్ అధికారులతో జరిపిన చర్చల్లో సమ్మెకు తాత్కాలికంగా విరమణ ఇచ్చేందుకు అంగీకరించినప్పటికీ.. జీహెచ్ఎంసీలోని ప్రధాన యూనియన్ అయిన బీఎంఎస్ మాత్రం గ్రేటర్లో సమ్మె కొనసాగింపునకే నిర్ణయించింది. మరోవైపు, జీహెచ్ఎంసీలోని గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ సైతం మంగళవారం నుంచి సమ్మెలోకి దిగింది. తాము గతంలో ప్రభుత్వానికిచ్చిన తమ డిమాండ్ల పత్రంలో ఈ నెల 22 నుంచి సమ్మెకు దిగుతామని తెలిపామని, డిమాండ్లు పరిష్కారం కానందున సమ్మెకు దిగినట్లు యూనియన్ అధ్యక్షుడు యు.గోపాల్ తెలిపారు. అన్ని సంఘాలను కూడా తమతో ఉద్యమానికి కలిసి రావాల్సిందిగా లేఖలు పంపినప్పటికీ, వాటినుంచి సానుకూలత వ్యక్తం కానందున తాము ఒంటరిగానే దీక్షలు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో 108 రోజులపాటు నిరాహార దీక్షలు చేసిన తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చే దాకా ప్రస్తుత దీక్షలు కొనసాగిస్తామన్నారు. కమిషనర్ బదిలీతో పరిస్థితి గందరగోళం.. కార్మిక సంఘాల నేతలతో సమావేశానంతరం చేపట్టాల్సిన చర్యల గురించి మేయర్, డిప్యూటీ మేయర్, పార్టీల ఫ్లోర్‌లీడర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులతో కృష్ణబాబు చర్చలు జరుపుతుండగానే ఆయన బదిలీ విషయం తెలిసింది. మంగళవారం సాయంత్రం నుంచి తక్షణ ప్రత్యామ్నాయ చర్యలకు కమిషనర్ ఆదేశించినప్పటికీ, ఆయన బదిలీతో గందరగోళం ఏర్పడింది. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కార్మిక సంఘాలకు నచ్చజెప్పేందుకు అధికారులు చేసిన యత్నాలు ఫలించలేదు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అన్ని రకాలుగా సహకరిస్తామని అన్ని పార్టీల నాయకులు మేయర్, కమిషనర్లతో జరిగిన సమావేశంలో తె లిపారు. సమస్య జటిలం.. చెత్త తరలింపు కోసం తాత్కాలికంగా ఇతరులను పనుల్లోకి తీసుకున్నప్పటికీ, సమస్య పరిష్కారం కాకపోవడమే కాక కార్మికుల నుంచి మరి న్ని అదనపు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేకపోయారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు దోమల నివారణ, తదితర విభాగాల్లోని కార్మికులు కూడా సమ్మెలో ఉండటంతో పరిస్థితి జటిలంగా మారుతోంది. సోమ, మంగళవారాల్లో వెరసి దాదా పు 72 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఎక్కడికక్కడే కుప్పలుగా పేరుకుపోవడంతో, దుర్వాసన భరించలేక ప్రజలు సతమతమవుతున్నారు. ఉద్యోగులను కూడా యూనియన్ల నేతలు జీహెచ్ఎంసీ నుంచి బయట కు రప్పించారు. జీహెచ్ఎంఈయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
తప్పుల తడక కాకిలెక్క
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాల అమలే కాదు.. ఆఖరికి జనాభా లెక్కలు.. ఓటర్ల జాబితా వంటి వివరాలు సైతం అస్తవ్యస్తంగా మారాయి. అంకెల గారడీతో కాకిలెక్కలు చూపుతున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. జనగణన.. ఓటర్ల నమోదు కార్యక్రమాల కోసం ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేయాల్సిన సిబ్బంది ఇష్టానుసారంగా తమకిచ్చిన పనులు పూర్తిచేసి మమ అనిపించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్‌లోని జనాభా.. ఓటర్ల వివరాలను పోల్చిచూస్తే ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఎన్నికల కమిషన్ అంచనా మేరకు జనాభాలో ఓటర్లు దాదాపు 70 శాతం వరకు ఉండవచ్చు. నగరీకరణ, వలసల వంటి కారణాలతో గ్రేటర్ నగరంలో అది మరికొంత శాతం ఎక్కువుంటే ఉండవచ్చు. కానీ గ్రేటర్‌లోని శివారుల్లోని పలు నియోజకవర్గాల్లో ఓటర్లు దాదాపు వంద శాతానికి చేరువలో ఉన్నారు. కోర్ సిటీ (పాత ఎంసీహెచ్)లోని కొన్ని నియోజకవర్గాల్లోనూ దాదాపుగా 90 శాతం ఉన్నారు. అంటే.. జనగణనలోనైనా తప్పులు దొర్లి ఉండాలి. లేదా ఓటర్ల గుర్తింపులోనైనా పొరపాట్లు జరిగి ఉండాలి. లేకుంటే ఓటర్లు 90 శాతం మేర ఉండటమన్నది అసాధారణమని సర్వేలపై అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. కోర్‌సిటీలో ఆయా నియోజకవర్గాల్లో మొత్తం 20,232 మంది ఓటర్లను డూప్లికేట్లుగా గుర్తించిన జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం ఇటీవల వారి పేర్లను తొలగించింది. ఇంకా, వారు గుర్తించని డూప్లికేట్లు ఎందరున్నారో తెలియ దు. జనాభాను బట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తారు. వీటిల్లోనే తేడాలుండటంతో ఇక ఆయా పథకాల అమలు తీరు ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. పైన పేర్కొ న్న జనాభా వివరాలు 2011 నాటి జనగణన నాటివి కాగా.. ఓటర్ల వివరాలు ప్రస్తుత సంవత్సరానివి. గత రెండేళ్లలో జనాభా దాదాపు రెండు శాతం మేర పెరగిందనుకున్నా.. ఓటర్లు 90 శాతానికి పైగా ఉండటం విశేషం. కారణాలనేకం.. గ్రేటర్లో ఓటర్ల శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. పెరిగిన ఆరోగ్యస్పృహ తదితరమైన వాటితో ప్రజల జీవితకాలం పెరగడం వంటి వాటి వల్ల కొద్దిశాతం పెరుగుదల ఉంటుంది. నగరానికి వలస వచ్చేవారు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు కారణం. నగరంలో ఇళ్లు మారడం ఎక్కువైనందున ఓటరు జాబితాలో పాత ఇంటి చిరునామాతో రద్దు చేసుకోకుండానే కొత్త చిరునామాతో నమోదు చేయించుకోవడం తదితరమైనవి కూడా కారణం కావచ్చు. - నవీన్‌మిట్టల్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి