రూపాయికే లీటరు నీళ్లు!
గ్రేటర్‌లో ఏటీఎంల తరహాలో నీటియంత్రాలు: జనార్దన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీలో ఏటీఎంల తరహాలో ఎనీటైమ్ వాటర్ (ఏటీడబ్ల్యూ) యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. మహానగర పరిధిలో రోడ్లపై వెళ్లే పాదచారుల దాహార్తిని తీర్చేందుకు ఏటీఎంల వలె పనిచేసే నీటి యంత్రాలు (వాటర్ కియోస్క్‌లు) త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ యంత్రాల్లో రూ.1 బిళ్లవేయగానే లీటరు నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, జలమండలి ఎండీ బి.జనార్దన్‌రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జనార్దన్ రెడ్డి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
గ్రేటర్‌లో నెలకు వంద కోట్ల నీటిబిల్లుల వసూళ్లు లక్ష్యంగా పనిచేయాలని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న తాగునీటిలో సరఫరా నష్టాలు 70% ఉంటున్నాయని, వీటిని 35 శాతానికి పరిమితం చేయాలని ఆదేశిం చారు. వందరోజుల ప్రణాళిక అమలులో రోజువారీగా చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలన్నారు. దారితప్పుతున్న ట్యాంకర్లకు అడ్వాన్స్‌డ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. తక్షణం వాణిజ్య సంస్థలకున్న కనెక్షన్లను వాణిజ్య కేటగిరీ కింద కు మార్చాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు విభాగం డెరైక్టర్ కొండారెడ్డి, ఆపరేషన్స్, రెవెన్యూ, ఫైనాన్స్ విభాగాల డెరైక్టర్లు జి.రామేశ్వర్‌రావు, సూర్యనారాయణ, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.