ప్ర‘జల’పై నిర్లక్ష్యం | negligence on the peoples | Sakshi
Sakshi News home page

ప్ర‘జల’పై నిర్లక్ష్యం

Published Tue, May 20 2014 11:02 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

ప్ర‘జల’పై నిర్లక్ష్యం - Sakshi

ప్ర‘జల’పై నిర్లక్ష్యం

సాక్షి, హైదరాబాద్: నీటి బొట్టును ఒడిసిపట్టాలన్న ‘గ్రేటర్’ లక్ష్యం నిర్లక్ష్యం మాటున నీరుగారిపోతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతా ల్లో ఇప్పటికే 1500 అడుగుల లోతుకు తవ్వినా నీటిచుక్క కానరావడం లేదు. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతున్నా వర్షపు నీటి ని కాపాడాలన్న శ్రద్ధ ఇటు జలమండలి, అటు జీహెచ్‌ఎంసీలో కానరావడం లేదు. రుతుపవనాలు పక్షం రోజుల్లో గ్రేటర్‌ను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వర్షపు నీటిని కాపాడుకొని, భూగర్భ జలసిరిని పెంచేందుకు చర్యలు తీసుకోవడంలో జలమండలి, జీహెచ్‌ఎంసీలు దారుణంగా విఫలమౌతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ నిలువెల్లా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఇంకుడు గుంతలు (రీచార్జింగ్ పిట్స్)ను మహోద్యమంగా చేపట్టకపోతే గ్రేటర్‌కు జలగండం తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఈ రెండు విభాగాలకు పట్టడం లేదు. గతేడాది రూ.6 కోట్ల అంచనా వ్యయంతో గ్రేటర్ పరిధిలో సుమారు 10 వేలు ఇంకుడు గుంతలు తవ్వాలన్న బల్దియా లక్ష్యం కాగితాలకే పరిమితమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 నీరు ఇంకే దారులేవీ..?

 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాల సంఖ్య 12 లక్షలు. కానీ వర్షపునీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అందుబాటులో ఉన్న రీచార్జింగ్ పిట్స్ (ఇంకుడు గుంతలు) ఎనిమిది వేలు మాత్రమే. ఇది భూగర్భ జలశాఖ ప్రకటించిన చేదు వాస్తవం. కాంక్రీట్ మహారణ్యంలా మారిన గ్రేటర్ సిటీలో విలువైన వర్షపు నీటిని ఒడిసిపట్టే దారి లేకపోవడంతో పాతాళగంగ కనుమరుగవుతోంది. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలిలు వినియోగదారుల నుంచి ఇప్పటివరకు సుమారు రూ.64 కోట్లు వసూలు చేశాయి. ఆ నిధులతోఇంకుడు గుంతలు ఏర్పాటు చేయకపోవడంతో భూగర్భ జలాలు అథఃపాతాళానికి వెళ్తున్నాయి. మహానగరంలో ప్రతి ఇల్లు, కార్యాలయానికీ రీచార్జింగ్ పిట్స్ అత్యవసరం.
 
 ఈ పరిస్థితి లేకనే మారేడ్‌పల్లి, బోయిన్‌పల్లి, బోడుప్పల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో 1500 అడుగుల లోతు వరకు బోరుబావులు తవ్వినా నీటిచుక్క జాడ కనిపించడం లేదు. విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వడాన్ని నిషేధిస్తూ తొమ్మిదేళ్ల క్రితం చేసిన వాల్టా చట్టానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఇంటి అవసరాల కోసం వ్యయప్రయాసల కోర్చి బోరుబావులు తవ్వుతున్న వినియోగదారులు నీటిబొట్టు కానరాక బావురుమంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రీచార్జింగ్ పిట్స్ తవ్వే ప్రక్రియను మహోద్యమంగా చేపట్టాల్సిన సంబంధిత విభాగాలు నిద్రమత్తు వీడకపోవడంతో ప్రస్తుతం వర్షపునీరు వృథా అయ్యే పరిస్థితి తలెత్తింది.
 
 వినియోగదారుల నుంచి..
 భూగర్భ జల మట్టాలను పెంపొందించేందుకు రీచార్జింగ్ పిట్స్ తవ్వాల్సిన అంశంపై వినియోగదారులకు అవగాహన కల్పించడంలో జల మండలి, జీహెచ్‌ఎంసీలు దారుణంగా విఫల మౌతున్నాయి. భవన నిర్మాణ అనుమతుల సమయంలో రీచార్జింగ్ పిట్స్ తవ్వేందుకు జీహెచ్‌ఎంసీ నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి రూ.8 నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తుంది. ఈ విషయంలో జలమండలి కూడా తక్కువేం తినలేదు. నల్లా కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినపుడు వినియోగదారుల నుంచి విస్తీర్ణాన్ని బట్టి రూ.8 నుంచి రూ.25 వేల వరకు ముక్కుపిండి రాబడుతున్నారు. ఒక వేళ వినియోగదారుడు సొంతంగా పిట్ ఏర్పాటు చేసుకున్నారని  క్షేత్రపరిశీలన సమయంలో తేలితే ఈ మొత్తాన్ని మినహాయిస్తున్నారు.
 
 అందుబాటులో ఎనిమిది వేలే...
 గ్రేటర్ పరిధిలో వర్షపు నీటి నిల్వకు కేవలం ఎనిమిది వేల ఇంకుడు గుంతలు మాత్రమే అం దుబాటులో ఉన్నట్లు భూగర్భజలశాఖ గతంలో ప్రకటించింది. వీటిలోనూ పలు పిట్స్‌పై మట్టి, పెద్ద బండరాళ్లు, సిమెంట్, చెత్తాచెదారం పడడంతో వర్షపునీటిని భూగర్భంలోకి చేర్చే పరి స్థితి లేదని తేలింది. వీటిని పునరుద్ధరించే విషయంలో వినియోగదారులను చైతన్యం చేసే విషయంలోనూ జీహెచ్‌ఎంసీ, జలమండలిలు విఫలమౌతున్నాయని స్పష్టమైంది. గతేడాది రూ.6కోట్ల వ్యయంతో పదివేల ఇంకుడు గుంత లు తవ్వాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కానీ వీటిలో పూర్తయినవి వెయ్యి దాటకపోవడం గమనార్హం. ఇక జలమండలి మరో ఆరువేల రీచార్జింగ్ పిట్స్ ఏర్పాటుచేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నప్పటికీ ఇప్పటివరకు రెండు వేలకు మించి ఇంకుడు గుంతలు తవ్వకపోవడం ఆయా విభాగాల నిర్లక్ష్యానికి పరాకాష్ట.
 
 రీచార్జింగ్ పిట్ ఇలా ఉండాలి
 మధ్యతరగతి వినియోగదారులు 200 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీస్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పక్షంలో.. బోరుబావికి మీట రు లేదా రెండు మీటర్ల దూరంలో పిట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీని పొడవు, వెడల్పులు 2 మీటర్ల మేర ఉండాలి. 1.5 మీటర్ల లోతున (డెప్త్) గుంతతీసి అందులో 50 శాతం మేర 40ఎంఎం పరిమాణంలో ఉండే పలుగురాళ్లు, 25శాతం మేర 20ఎంఎం సైజు లో ఉండే రాళ్లను నింపాలి. మరో 15 శాతం దొడ్డు ఇసుక నింపి పదిశాతం ఖాళీగా ఉంచా లి. భవనం పైకప్పు నుంచి పడిన వర్షపునీరు ఈ పిట్‌పై కొద్దిసేపు నిలిచేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో భూగర్భజలాల రీచార్జింగ్ సులువవుతుంది. దీనివల్ల బోరుబావి పది కాలాలపాటు ఎండిపోకుండా ఉంటుంది. ప్రతి ఇల్లు, కార్యాలయంలో విస్తీర్ణాన్ని బట్టి పిట్ సైజు పెరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement