
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలున్న బడా బాబులకు, స్టార్ హోటళ్లకు బల్దియా అధికారులు షాకిస్తున్నారు. పన్నులు కట్టకపోవడంతో భవనాలను సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మార్చి నెలాఖరు నాటికి మరో రూ.600కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ (GHMC) కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా బల్దియా రెవెన్యూ విభాగం ఇప్పటికే ఆరు లక్షల మంది యజమానులకు నోటీసులు జారీ చేస్తోంది. ట్రేడ్ లైసెన్సులు తీసుకోని వారికి, గతంలోని లైసెన్సులు పునరుద్ధరించుకోని వారికి మరో లక్షన్నర నోటీసులు జారీ చేసింది. అంతటితో అధికారులు ఆగలేదు. మొండి బకాయిలున్న ప్రైవేటు ఆస్పత్రులు, విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సముదాయాలకు తాళం వేయాలని నిర్ణయించారు. గడిచిన వారంలో 100 భవనాలకు తాళం వేశారు.
ఇదే సమయంలో అధికారులు తమ పంథా మార్చారు. ప్రస్తుతం బస్తీలు, కాలనీల్లో వినూత్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31లోగా ఆస్తి పన్నుతో పాటు మొండి బకాయిలను వెంటనే చెల్లించాలంటూ క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల సిబ్బంది చేతికి మైక్‌సెట్లు ఇచ్చి చాటింపు వేయిస్తున్నారు. ఈ సందర్బంగా ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు నోటీసులు ఇవ్వడంతో పాటు స్పందించని వారి ఆస్తులను సైతం జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
చాలా వరకు ప్రభుత్వ భవనాలే..
ఆస్తిపన్ను బకాయి రూ.5లక్షలకు మించి ఉన్న భవనాలు 4వేలకుపైగా ఉన్నాయి. అత్యధికంగా జూబ్లిహిల్స్ సర్కిల్‌లో 700 నిర్మాణాలు, ఖైరతాబాద్‌లో 650, గోషామహల్‌లో 550, బేగంపేటలో 280, సరూర్‌నగర్‌లో 180, అంబర్‌పేట్‌లో 140, మెహిదీపట్నంలో 150 ఉన్నాయి. వాటి నుంచి రూ.4వేల కోట్ల పన్ను వసూలు కావాల్సి ఉందని అంచనా. అందులో చాలా వరకు ప్రభుత్వ భవనాలున్నాయి. పంజాగుట్టలోని ప్రముఖ సర్కారు ఆస్పత్రి రూ.55కోట్లు, బంజారాహిల్స్‌లో రోడ్డు నెం.12లోని ప్రభుత్వ కార్యాలయం రూ.కోట్లలో ఆస్తిపన్ను బకాయి పడ్డాయి.
కొన్ని సంస్థల బకాయిలు ఇలా..
జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి రూ.52కోట్లు.
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ బకాయిలు రూ.32కోట్లు.
హైదరాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ బకాయిలు రూ.30కోట్లు.
సోమాజీగూడ కత్రియా హోటల్ బకాయి రూ.8.62 కోట్లు.
ఇండో అరబ్ లీగ్ బకాయి రూ.7.33 కోట్లు.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బకాయిలు రూ.5.5 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment