
ఘటన జరిగినప్పుడే అధికారుల హడావుడి
ఆ తర్వాత అంతా షరామామూలే
నిబంధనలు పాటించాలంటున్న నిపుణులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడే సంబంధిత అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆ తర్వాత అందరూ ఆ విషయాన్ని మరిచిపోతున్నారు. భవనాలు కూలినప్పుడే అక్రమ నిర్మాణాలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే సేఫ్టీ నిబంధనలు గుర్తుకొస్తాయి. అలాగే లిఫ్టుల్లో ప్రమాదాలు జరిగినప్పుడే వాటి నిర్వహణ గుర్తుకొస్తుంది. శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లో ఆరేళ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుపోవడంతో లిఫ్టులు.. వాటి నిర్వహణ.. తీసుకోవాల్సిన భద్రతచర్యలు వంటివి చర్చనీయాంశంగా మారాయి.
ఎవరికీ పట్టదు..
లిఫ్టులు, వాటి నిర్వహణకు సంబంధించి ఏ ప్రభుత్వ విభాగం కూడా పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీలో భవనాల నిర్మాణాలకు నిబంధనలున్నప్పటికీ, లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి నిబంధనల్లేవని సంబంధిత అధికారులు తెలిపారు. లిఫ్టుల స్టెబిలిటీ, నిర్వహణలపై కూడా నిబంధనల్లేవు. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ సరి్టఫికెట్ ఇచ్చినట్లుగానే లిఫ్టుల ఏర్పాటుకు సంబంధించి లిఫ్ట్ ఇన్‌స్పెక్టర్ సరి్టఫికెట్ ఉండాలనేది ప్రతిపాదనలకే పరిమితమైంది. భవనం ఎత్తును బట్టి లిఫ్టులు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ, లిఫ్టుల స్టెబిలిటీ, నిర్వహణలకు సంబంధించి ఎలాంటి నిబంధనల్లేవు. ఏటా వేల సంఖ్యలో భవనాల నిర్మాణం జరుగుతున్న జీహెచ్‌ఎంసీలో లిఫ్ట్ ఇన్‌స్పెక్టర్ లేకపోవడం దారుణమనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
నిర్వహణలో నిర్లక్ష్యం..
⇒ స్టెబిలిటీ లేకపోవడం.. నాసిరకం లిఫ్టులు వాడటం ప్రమాదాలకు ఒక కారణం కాగా, కనీస నిర్వహణ లేకపోవడం ప్రమాదాలకు తావిస్తోంది.
⇒ సాధారణంగా లిఫ్టు ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రైవేటు సంస్థలు సంబంధిత లిఫ్టు కంపెనీలతో ఏఎంసీ(యాన్యువల్ మెయింటనెన్స్ కాంట్రాక్ట్) కుదుర్చుకుంటాయి. నిర్ణీత వ్యవధుల్లో పరీక్షించడం, అవసరాన్నిబట్టి పరికరాలు సరఫరా చేయడం, తగిన మరమ్మతులు చేయడం వంటివి చేయాలి.
⇒ విద్యాసంస్థలు, ఆస్పత్రుల్లో ఇవి మరింత పకడ్బందీగా ఉండాలి.
⇒లిఫ్టులో లిఫ్ట్ ఆపరేటర్ తప్పనిసరిగా ఉండాలి. ఆపరేటర్ లేకుండా లిఫ్ట్ వినియోగించరాదు.
⇒పనిచేసే ‘అలార్మ్’ బెల్ ఉండాలి.లేని పక్షంలో కనీసం ఫోన్ చేసేందుకు వీలుగా ల్యాండ్‌లైన్ ఉండాలి.
⇒అత్యవసర సమయాల్లో ఫోన్ చేసేందుకు వీలుగా సంబంధిత ఎమర్జెన్సీ నెంబర్లులిఫ్టులోకనబడేలా ఉండాలి.
⇒ గ్రిల్‌తో కూడిన లిఫ్టుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్రిల్ వాటికంటే పూర్తిగా మూసుకునే డోర్‌వి, అందరికీ కనిపించేలా అద్దాలవి అయితే మేలు.
గతంలోనూ ప్రమాదాలు..
⇒గతంలో కుందన్‌బాగ్‌లోని ఐఏఎస్‌ల క్వార్టర్లలోని లిఫ్టు కేబుల్ తెగి ప్రమాదం జరిగిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హిమాయత్‌నగర్‌లో లిఫ్టులో ఇరుక్కొని ఒకరు మృతి చెందారు.
⇒వ్యాపార సంస్థలతోపాటు నివాస అపార్ట్‌మెంట్లలోనూ లిఫ్టులతో అప్రమత్తంగా ఉండాలి. నిరీ్ణత వ్యవధుల్లో సరీ్వసు చేయించడం, లిఫ్టు ఆపరేటర్ విధుల్లో ఉండేలా చూడటం అవసరం.