Safety standards
-
గూడుకట్టుకున్న నిర్లక్ష్యం
విశాఖ సిటీ: పరిశ్రమల్లో నిర్వహణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు కార్మిక లోకానికి గుబులు పుట్టిస్తున్నాయి. యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తప్పా.. అధికార యంత్రాంగం పరిశ్రమలపై దృష్టిపెట్టిన సందర్భాలు ఉండడంలేదు. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన భద్రతా ప్రమాణాలు ఇప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు పరిశ్రమల భద్రతపై ఒక్కసారి కూడా సమీక్షించిన సందర్భాల్లేవు.20 పాయింట్ ఫార్ములా ఏమైంది?2020, మేలో ఎల్జీ పాలీమర్స్ ఘటన తరువాత అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమల భద్రతపై ప్రత్యేక దృష్టిసారించింది. పరిశ్రమల్లో రక్షణ చర్యలపై ప్రత్యేక నియమ, నిబంధనలు రూపొందించింది. ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేసి అన్ని రకాల పరిశ్రమల్లో తనిఖీలు చేయించింది. ఇందులో ఉమ్మడి విశాఖలోని 121 పరిశ్రమల్లో లోపాలున్నట్లు గుర్తించింది. భద్రతా ప్రమాణాలు పాటించని ఆయా సంస్థలకు నోటీసులు జారీచేయడంతో పాటు 29 పరిశ్రమలపై కేసులు నమోదు చేసింది. ఈ పరిస్థితులు మరోసారి తలెత్తకుండా పరిశ్రమల్లో ప్రమాదాలను తగ్గించడానికి అప్పటి ప్రభుత్వం ‘20 పాయింట్ ఫార్ములా’ను అమలులోకి తీసుకొచ్చింది. అందులో ఉన్న అంశాలకు పాయింట్లు కేటాయించారు. 20 పాయింట్లకు గాను 16 కన్నా తక్కువ పాయింట్లు వస్తే ఆ సంస్థ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిగణించాల్సి ఉంటుంది. కనీసం పది పాయింట్లు కూడా రాకపోతే సంస్థ కార్యకలాపాలను నిలిపివేయాలి. ఈ నేపథ్యంలో.. ఎన్నికల ముందు వరకు ప్రతి ఏడాది ఈ ఫార్ములా ప్రకారం అధికారులు తనిఖీలు నిర్వహించి పాయింట్లు కేటాయించారు. అయితే, ఎన్నికల హడావుడి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ 20 పాయింట్ ఫార్ములాను పట్టించుకోలేదు. -
అకృత్యాలకు అడ్డుకట్ట కార్నర్ మీటింగ్స్
ముంబైలోని మురికివాడల్లో ఉదయం పూట మహిళాపోలీసులు ‘కార్నర్ మీటింగ్స్’ నిర్వహిస్తున్నారు. ప్రతి వీధిలోని ఒక మూల మీద అక్కడ పోగైన స్త్రీలకు, పిల్లలకు ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’తో మొదలు డ్రగ్స్, ట్రాఫికింగ్, సైబర్ క్రైమ్‌ల గురించి వివరిస్తున్నారు. పెద్దగా చదువులేని మహిళలకు ఈ వీధిమలుపు మీటింగ్‌లు మేలుచేస్తున్నాయి. నిజానికి ప్రతి రాష్ట్రంలో, ప్రతి బస్తీల్లో ఇలాంటి కార్నర్ మీటింగ్‌ల అవసరం ఉంది. నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న స్త్రీల భద్రత గురించి కొంతైనా నిశ్చింత ఉంది. కాని ఇవే నగరాల్లో, పెద్ద పట్టణాల్లోని మురికివాడల్లోని, బస్తీల్లోని స్త్రీల, పసిపిల్లల భద్రత చాలా కష్టతరమైనది. చట్టపరంగా ఎంత కట్టుదిట్టాలు ఉన్నా స్వీయ అవగాహన లేకపోతే ప్రమాదం తప్పదు. మన దేశంలో నిత్యం పసి పిల్లల మీద అకృత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పిపోతున్న పిల్లల సంఖ్య తీవ్రంగా ఉంది. మరోవైపు అసంఘటిత రంగాల్లో స్త్రీలపై లైంగిక దాష్టికాలు కొనసాగుతూనే ఉన్నాయి. చదువు లేని స్త్రీలు ఈ విషయమై ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధ పడతారు, ఆందోళన చెందుతారు. అందుకే ముంబైలో మహిళా పోలీసులు ‘కార్నర్ మీటింగ్’ లు నిర్వహిస్తున్నారు. సంవత్సరం క్రితం సంవత్సరం క్రితం పోలీసు అధికారుల సూచన మేరకు మహిళా పోలీసులతో మొదలైన ఈ పని సత్ఫలితాలను ఇస్తోంది. ముంబైలోని అతి పెద్ద మురికివాడలకు రోజూ ఉదయం పూట మహిళా పోలీసు బృందాలు చేరుకుని వీధి మూలల్లో ఆడవాళ్లను కూడేసి జాగ్రత్తలు చెప్పడమే ఈ కార్నర్ మీటింగ్‌ల ఉద్దేశం. ఆడపిల్లలకు అర్థమయ్యేలా ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ల గురించి చెప్పడం మరో ముఖ్య ఉద్దేశం. అపరిచితులకు పిల్లల్ని అప్పగించి పనుల్లోకి వెళ్లకుండా చూడటం, మొబైల్ ఫోన్లలో వచ్చే కేటుగాళ్ల కాల్స్ వల్ల ఆర్థికంగా నష్టపోకుండా చూడటం కూడా కార్నర్ మీటింగ్‌ల ముఖ్యవిధిగా ఉంది. ‘రోజూ పది నుంచి పదకొండు గంటల మధ్య బస్తీ స్త్రీలు ఖాళీగా దొరుకుతారు. వారికి అన్ని విధాలా కౌన్సెలింగ్ ఇచ్చి అలెర్ట్ చేస్తాం. చిన్నచిన్న ఫ్యాక్టరీల్లో పని చేసే స్త్రీలు లైంగికపరంగా వేధింపులను ఎదుర్కొంటే ఫిర్యాదు చేయమని చెబుతాం. దీని వల్ల దౌర్జన్యకారుల్లో భయం ఏర్పడుతోంది’ అంటున్నారు మహిళా పోలీసులు. అలాగే వ్యభిచార వృత్తిలోకి ఈడ్చబడే స్త్రీల, బాలికలను కాపాడే బాధ్యత వారి గురించి సమాచారం ఇచ్చే చైతన్యం కూడా బస్తీ మహిళలకు కలిగిస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల జరిగే హాని చెబుతున్నారు. నిజానికి ఈ పని ముంబైలోనే కాదు దేశంలోని ప్రతి నగరంలో చదువులేని బీదసాదలు ఉండే అన్నీ ఊళ్ల వాడల్లో జరగాలి. సత్ఫలితాలు ఇస్తున్న ఈ పనిని మిగిలిన రాష్ట్రాల్లోని పోలీసులు కూడా అనుసరిస్తే బాగుంటుంది. -
వ్యాగన్ఆర్ అంత ఘోరమా : టాటా మోటార్స్ సెటైర్లు
సాక్షి, ముంబై: భద్రతా ప్రమాణాల విషయంలో మెరుగైన రేటింగ్ సాధించిన ప్రముఖ కార్ల సంస్థ టాటా మోటార్స్ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోంది. తాజాగా మారుతి సుజుకిని లక్ష్యంగా చేసుకుంది. మారుతి సుజుకి వాహనం వ్యాగన్ఆర్పై సెటైర్లు వేసింది. ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న టాటా మెటార్స్ భద్రతా క్రాష్ పరీక్షలలో విఫలమైన పోటీ సంస్థల కార్లపై వరుసగా వ్యంగ్యంగా ట్వీట్ చేస్తోంది. ఇప్పటికే హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, మారుతి ఎస్-ప్రెస్సోపై విమర్శలు చేసింది. (ఎస్బీఐతో బెంజ్ జట్టు: ప్రత్యేక ఆఫర్లు) చక్రం ఊడిపోయిన ఇమేజ్ను ట్వీట్ చేస్తూ, భద్రత ముఖ్యం స్మార్ట్‌గా ఉండాలంటూ సూచించింది. అంతేకాదు కారు స్పెల్లింగ్‌లో కావాలనే ‘R’చేర్చడం గమనార్హం. మారుతి వాగన్ఆర్ గ్లోబల్ ఎన్సీఏపీ భద్రతా క్రాష్ పరీక్షలలో పేలవమైన రేటింగ్‌ను పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ 2014-2019 మధ్య వచ్చిన కార్లలో సురక్షితమైన భారతీయ కార్ల జాబితాను ప్రకటించింది. ఇందులో మారుతి ఎస్-ప్రెస్సో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, కియా మోటార్స్ సెల్టోస్ ఎస్యూవీ రేటింగ్ దారుణంగా ఉండగా, టాటా మోటార్స్ కార్లు నెక్సాన్, ఆల్ట్రోజ్ ఫైవ్ స్టార్ క్రాష్ రేటింగ్‌ను పొందాయి. ఇంకా టిగోర్, టియాగో కూడా సురక్షితమైన కార్లుగా పేర్కొంటూ ఫోర్-స్టార్ రేటింగ్ ఇచ్చింది. Safety is 'two' important to be ignored. Be smart before someone overturns your caRt. Choose Tiago, the safest car in the segment, rated 4 stars by GNCAP. Click on https://t.co/x9nKgE745s to book now.#Tiago #NewForever #SaferCarsForIndia pic.twitter.com/3k8Ughat0C — Tata Motors Cars (@TataMotors_Cars) November 22, 2020 -
ఆస్పత్రుల్లో భద్రత కరువు!
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కనీస భద్రత ప్రమాణాలు పాటించుకుండా ఆస్పత్రి భవనాలు నిర్మిస్తున్నారు. జిల్లాలో చాలా మేరకు ప్రయివేటు ఆస్పత్రుల్లో అగ్నిమాపక పరికరాలు లేకపోవడంతో రోగుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. ఇటీవల హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. 2011లో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో వంద మందికి పైగా రోగులు మృత్యువాత పడ్డారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోం, డయాగ్నోస్టిక్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఆస్పత్రి ముందు భాగంలోని వెలివేషన్‌కు నిప్పు అంటుకుంది. సరైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం, రోగులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రోగుల ప్రాణాలు కాపాడే కేంద్రాలే నిబంధనలు పాటించక ప్రాణాల్ని హరించుకుపోతున్నాయి. ఆస్పత్రి యాజమాన్యం అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టకపోవడంతో షార్ట్ సర్క్యూట్‌తో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అంతే.. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు ఎంత వరకు భద్రత ఉందనేదానికి సమాధానం లేదు. ఎందుకంటే జిల్లాలోని ఏ ఆస్పత్రిలోనూ అగ్నిప్రమాదాలను నిలువరించేందుకు కనీస పరికరాలు లేవు. ఆస్పత్రులకు అనుమతులు కూడా లేకపోవడం గమనార్హం. ఆస్పత్రుల్లో రక్షణ చర్యలు కూడా ఏమాత్రం కానరా>వడం లేదు. జిల్లాలో దాదాపు 50కి పైగా ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. ఏ ఒక్క ఆస్పత్రిలో కూడా అగ్నిమాపకశాఖ అనుమతులు లేకపోవడం గమనార్హం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వేలాది మంది రోగులు చికిత్స పొందుతుంటారు. వారినుంచి చికిత్స పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తూ.. ఆస్పత్రుల యాజమాన్యాలు బహుళ అంతస్తులు నిర్మిస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టకపోవడం శోఛనీయం. 50 పడకలు అంత కంటే తక్కువ సామర్థ్యం ఉన్న చిన్న ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇరుకు సందుల్లో సైతం వాటిని నిర్వహిస్తూ రోగుల నుంచి బలవంతంగా డబ్బులను వసూలు చేస్తున్నారు కానీ వారికి ఎలాంటి ప్రాణ రక్షణ కల్పించడం లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల భవనాలు నిర్మించేటప్పుడు అగ్నిమాపక శాఖ నుంచి తప్పనిసరిగా నో ఆబక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలి. కానీ ఈ సర్టి ఫికెట్ కోసం ఇప్పటివరకు ఎవరూ దరఖాస్తులు చేసుకోలేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగితే.. నిబంధనలు పాటించకుండా ఉన్న ఆస్పత్రుల్లో, బహుళ అంతస్తుల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటన్నది ఆందోళనకరం. చాలా ఆస్పత్రుల్లో కేవలం ఒకే ఒక మెట్ల మార్గం మాత్రమే ఉంటుంది. కొన్నింట్లో ఒకే లిఫ్ట్ ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగితే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో లిఫ్ట్ పని చేయకపోతే ఒకే ఒక మెట్టు మార్గంద్వారా రోగులను, సహాయకులను బయటకు ఎలా తరలిస్తారన్నది ఆలోచించాల్సిన విషయమే. చుట్టూ అగ్నిమాపక శకటం తిరిగేంత స్థలం కూడా చాలా ఆస్పత్రుల పరిసరాల్లో ఉండడం లేదు. ఈ మంటలు పక్క భవనాలను వ్యాపించేలా ఆస్పత్రుల నిర్మాణం ఉంది. బయటి వెంటిలేషన్ లోపలికి వెళ్లకపోగా ప్రమాదం జరిగితే తీవ్రత ఎక్కువ ఉండే అవకాశాలూ లేకపోలేదు. పట్టించుకోని వైద్య, ఆరోగ్య, అగ్నిమాపక శాఖలు.. జిల్లాలో ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా అగ్నిప్రమాదాలకు సంబంధించిన రక్షణ ఏర్పాట్లు చేయలేదు. అయినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖలు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిబంధలనకు విరుద్ధంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అగ్నిమాపక శాఖ అనుమతులు లేకుండా చాలా ఆస్పత్రులు నడుపుతున్నారు. అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడంతో పాటు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్షణ ఏర్పాట్లు ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 15 మీటర్లు దాటితే మా పరిధిలోకి వస్తాయి.. 15 మీటర్లు దాటి భవనాలు నిర్మిస్తే మా పరిధిలోకి వస్తాయి. జిల్లాలోని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తే వారు కోర్టుకు వెళ్లారు. ఉమ్మడి జిల్లాలో 12 మీటర్ల లోపు ఉన్న ఆస్పత్రులే ఉన్నాయి. ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఉంటే ప్రమాదాలు జరిగితే నివారించవచ్చు. ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రం ఎన్ని మీటర్లతో సంబంధం లేకుండా కోర్టులో కేసు వేస్తాం. రోగులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన ఆస్పత్రుల్లో రక్షణ చర్యలు కల్పించుకోవాలి. – సందన్న, డివిజినల్ ఫైర్ అధికారి -
నగరానికి లేదు నిశ్చింత
మరో ఫార్మా కంపెనీలో నిప్పురవ్వలు రేగాయి.. ఇద్దరు కార్మికులను బలి తీసుకున్నాయి.. మరో ముగ్గురిని మృత్యువు ముంగిటికి నెట్టాయి.. సరైన ప్రమాణాలు పాటించకుండానే.. అనుమతులు తీసుకోకుండానే కొత్త రియాక్టర్‌ను ట్రయల్ రన్‌కు సిద్ధం చేయడం కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చింది.. ఈరోజు అజికో బయో ఫార్మా.. నిన్న శ్రీకర్ పరిశ్రమ.. అంతకుముందు దక్కన్ కెమికల్స్.. ఇలా వరుసగా రియాక్టర్ల పేలుళ్లు.. బ్లో అవుట్లు.. ప్రాణాలు గాలిలో కలిసిపోవడాలు విశాఖకు సర్వసాధారణంగా మారాయి.. ముఖ్యంగా ఫార్మా పరిశ్రమలు ప్రమాదాలకు చిరునామాలుగా మారుతున్నాయి.. నగరం చట్టుపక్కల ఉన్న మిగిలిన పరిశ్రమలూ దీనికి తాము అతీతం కావని తరచూ నిరూపిస్తున్నాయి.. నగర ప్రజల భద్రతను నిర్లక్ష్యపు ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు మార్చేస్తున్నాయి...దీనికి కారణం.. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం.. ప్రమాదాల నుం చి గుణపాఠాలు నేర్చుకోకపోవడమే.. 2013లో హెచ్‌పీసీఎల్ విస్ఫోటనం.. 2014లో స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం.. గత ఏడాది దువ్వాడ ఎస్ఈజెడ్లోని బయోమాక్స్ పరిశ్రమలో 12 డీజిల్ ట్యాంకులు దగ్ధం కావడం దీన్నే స్పష్టం చేస్తున్నాయి. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 90 రసాయన, ఫార్మా, గ్యాస్ పరిశ్రమలు ఉన్నాయి. నాలుగేళ్ల కిందట అధికారులు జరిపిన తనిఖీల్లో వీటిలో సగానికి పైగా ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించడంలేదని స్పష్టమైంది.. అయినా ఇప్పటికీ తగిన చర్యల్లేవు.. అధికారులు, యాజమాన్యాలూ కళ్లు తెరవలేదు.. ఈ పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులకు జీవన భద్రత లభించడం లేదు. గాజువాక : పారిశ్రామిక జిల్లా విశాఖ... అగ్ని ప్రమాదాల అంచున వేలాడుతోంది. నగరాన్ని చుట్టుముట్టినట్టుండే పరిశ్రమలు జిల్లా ప్రజలను నిత్యం భయంలోకి నెట్టేస్తున్నాయి. ఏక్షణాన ఏ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంటుందోనన్న భయం వెంటాడుతోంది. నగరం చుట్టూ వేలాది చిన్నా పెద్దా కంపెనీలున్నాయి. వీటిలో 90 పరిశ్రమలు మాత్రం అగ్నిప్రమాదాలకు కూతవేటు దూరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు లేక ఏ క్షణాన ఎలాంటి పేలుళ్లు, ప్రమాదాలు జరుగుతాయోనని నిత్యం ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంతోపాటు చుట్టుపక్కల విస్తరించిన అనేక భారీ పరిశ్రమల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ముఖ్యంగా 50 రసాయనిక, ఫార్మా కంపెనీలు, 40 ఎల్పీజీ, గ్యాస్, పెట్రో పరిశ్రమల నుంచి వెలువడే ఘాటైన రసాయనిక వాసనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫార్మా, రసాయనిక, పెట్రోకెమికల్ పరిశ్రమల పరిస్థితి మరీ ఘోరంగా కనిపిస్తోంది. అన్నీ లోపాలే... పరిశ్రమల్లో ప్రమాదకరమైన అగ్ని ప్రమాదాలకు జిల్లా చిరునామాగా మారుతోంది. నగరంతోపాటు, చుట్టుపక్కల హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీ, బ్లాక్అయిల్ ప్లాంట్, డాక్‌యార్డ్, కోరమండల్ వంటి రసాయన, గ్యాస్ ఆధారిత కంపెనీలతో పాటు, ఫార్మా, ఎస్ఈజెడ్లు, ఫార్మాసిటీలోని పలురకాల బల్క్ డ్రగ్స్, రసాయనిక పరిశ్రమలు న్నాయి. ఎల్పీజీ బాట్లింగ్ యూని ట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇలా జిల్లాలో రసాయనిక, ఫార్మా కంపెనీలు, ఎల్పీజీ, గ్యాస్, పెట్రో ఆధారిత, పాల ఉత్పత్తుల పరిశ్రమలు కలిపి మొత్తం 90 భారీ పరిశ్రమలు అత్యంత సున్నితమైనవీ ఉన్నాయి. వీటిలో చాలా కంపెనీలు కనీస భద్రతా చర్యలు చేపట్టడంలేదనడానికి తరచూ చోటు చేసుకొంటున్న అగ్ని ప్రమాదాలే నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రమాదం జరిగితే నివారణకు పరికరాలు, తగిన యంత్రాంగం, ప్రాథమిక చికిత్సకు కావలసిన సౌకర్యాలు వంటివేం లేవని అధికారులు గతంలోనే తేల్చారు. మరో 11 భారీ పరిశ్రమలైతే అసలు నిర్వహణకు ఏమాత్రం తగవని నిర్దారించారు. ప్రమాదకరమైన కంపెనీలకు 123 రకాల ప్రశ్నలతో జాబితా తయారుచేసిన అధికారులు నాలుగేళ్ల క్రితం 90 కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తే అందులో సగానికిపైగా కంపెనీలు అసలు నిర్వహణకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని తేల్చారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఈ కంపెనీల నిర్లక్ష్యం ఫలితంగా వీటిలో ఏ చిన్న అగ్నిప్రమాదం జరిగినా రసాయనాలు గాల్లో కలవడంతోపాటు సులువుగా మంటలు వ్యాపించి జనావా సాలకు తీవ్రస్థాయిలో హానికలిగిస్తాయి. ఫలితంగా నగరంతోపాటు, గాజువాక, అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల్లో ఏ చిన్న ప్రమాదం సంభవించినా జిల్లా మొత్తం వణికిపోతోంది. ఉలిక్కిపడే ఘటనలు కొన్ని హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విశాఖ రిఫైనరీలో 1997లో చోటు చేసుకున్న భారీ ప్రమాదం గుర్తుకొస్తే విశాఖ ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడతారు. నాటి ప్రమాదంలో స్పియర్ ట్యాంకులు పేలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇదే సంస్థలో నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 2013 మేలో లంకెలపాలెం గ్లోకెమ్ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం విశాఖ జిల్లావాసులను కుదిపేసింది. ఒక రసాయన పౌడరు నీటిలో పడటంవల్ల సంభవించిన ఈ ప్రమాదంలో ఆ కంపెనీ మొత్తం బూడిదైన విషయం తెలిసిందే. 2013 ఏప్రిల్ 7న హెరిటేజ్ కంపెనీ విస్తరణ పనుల్లో ప్రమాదాలు చోటుచేసుకుని భారీగా ప్రాణనష్టం సంభవించేలా చేశాయి. 2013 ఆగస్టులో హెచ్పీసీఎల్లో జరిగిన విస్పోటనం ఒక్కసారిగా జిల్లా ప్రజలను కలవరపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. 2014 జూన్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో చోటు చేసుకున్న భారీ పేలుడులో 19 మంది అధికారులు, ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. గత ఏడాది ఏప్రిల్‌లో దువ్వాడ ఎస్ఈజెడ్లోని బయోమాక్స్ డీజిల్స్ లిమిటెడ్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 12 బయో డీజిల్ ట్యాంకులు దగ్ధం కావడంతో విశాఖ వాసులు భయాందోళనలకు గురైన విషయం తెలిసిందే. గతేడాది మేలో ఫార్మాసిటీలోని శ్రీకర్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఒక కార్మికుడు మృతి చెందాడు. నవంబరు 10న లారస్ ల్యాబ్‌లో రియాక్టర్ పేలుడు ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా ఇద్దరి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. డిసెంబర్లో ఎస్విఆర్ డ్రగ్స్ పరిశ్రమలో జరిగిన మరో ప్రమాదంలో గ్యాస్ లీకైన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గతేడాది జనవరిలో పాయకరావుపేట మండలం రాజవరంలోని దక్కన్ కెమికల్స్ కర్మాగారంలో ఇద్దరు దుర్మరణం పాలవగా 26 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా లంకెలపాలెం అజికో బయో ఫోర్ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. నిర్లక్ష్యానికి ప్రాణాలు బలి విశాఖపట్నం : ఔషధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు కంటి తుడుపు చర్యగా నష్టపరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన పరిశ్రమల శాఖ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. జేఎన్ ఫార్మాసిటీలో అజికో పరిశ్రమలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.సత్యనారాయణ, కార్మిక నాయకుడు కన్నూరు వెంకటరమణలు ఆరోపించారు. కొత్త బ్లాక్‌లో ఎటువంటి అనుమతులు లేకుండానే యాజమాన్యం ట్రయల్ రన్ చేపట్టడడం చట్ట విరుద్ధమన్నారు. నిబంధనలను పాటించని యాజమాన్యంపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
కానరాని భద్రత చర్యలు...
ప్రమాదాల వెనుక భద్రతా ప్రమాణాల డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఏడాది జరిగిన అన్ని ప్రమాదాలూ భద్రత ప్రమాణాల లోటుపాట్లను ఎత్తిచూపుతున్నాయి. యాజమాన్యాలు, సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. చాలా కంపెనీలు కనీస నిబంధనలు పాటించడంలేదు. అగ్నిమాపక, పరిశ్రమల శాఖల నుంచి ఎన్వోసీలు కూడా లేకుండా కొన్ని కంపెనీలు నడుస్తున్నాయి. సంబందిత శాఖ అధికారులు మామూళ్ళకు కక్కుర్తి పడి ఆయా కంపెనీల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని తెలుస్తుంది. కనీస అవగాహన లేని వందలాది మంది కార్మికులు ఫార్మాకంపెనీల్లో పనిచేస్తున్నారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో వీరిని విధుల్లో పెట్టడం వలన ఆపరేటింగ్, ఇతరాత్ర పనుల్లో తప్పులు దొర్లి ప్రమాదాలు సంబవిస్తున్నాయి.రసాయనాలు కలిపే సమాయాల్లో వేడి హెచ్చు తగ్గులు, నాసికరం పైపుల లీకేజీల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.రసాయనాలను ఒక దగ్గర ఉంచితే రియాక్షన్ ఏర్పడి మంటలు చెలరేగుతాయి. ఈ కారణంగానే ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి.విద్యుత్ ఉపకరణాలతో పనులు చేసేటపుడు సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం. వరుస ప్రమాదాలు:కొద్ది నెలల క్రితం గ్లొకెమ్ ఔషద కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు రూ.50 కోట్లకు పైగా ఆస్థినష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకపోయినా దాదాపు 200 మంది కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.ఈ కంపెనీలోనే విద్యుత్ఘాతం కారణంగా ఓ కార్మికుడు మరణించాడు. ఐదు నెలల క్రితం ఇదే కంపెనీలో అగ్ని ప్రమాదంలో పది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కంపెనీలో భద్రత ప్రమాణాలు లేవన్న కారణంతో కొన్ని నెలలపాటు అధికారులు మూయించారు. ఆవ్రా, ఆక్టస్ ఫార్మాల్లో ఈ ఏడాది జరిగిన అగ్ని ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు.కనోరేయా పరిశ్రమలో స్టీమ్ పైప్‌లైన్ పగిలిపోయి మంటలు చెలరేగడంతో కార్మికులు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. అరబిందో కంపెనీలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. -
మరిన్ని భద్రతా ప్రమాణాలతో రూ.500, 1,000 నోట్లు
ముంబై: మరిన్ని భద్రతా ప్రమాణాలతో కొత్తగా రూ.500, 1,000 కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక ప్రకటనలో పేర్కొంది. నకిలీ నోట్లను తేలిగ్గా గుర్తించేట్లు రెండు అదనపు ఫీచర్లు తాజా నోట్లలో చేర్చుతున్నట్లు వివరించింది. కాగా ప్రస్తుతం నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని సైతం ఆర్బీఐ ప్రకటన స్పష్టం చేసింది. -
సరికొత్తగా ‘తెలంగాణ ప్రగతి రథం’
సీఎం మైన్‌ప్రూఫ్ వాహనంలో పలు మార్పులు సాక్షి, హైదరాబాద్: పటిష్టమైన భద్రతా ప్రమాణాలు, అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన సీఎం కేసీఆర్ మైన్ ప్రూఫ్ వాహనం సరికొత్త హంగులను సంతరించుకుంటోంది. వాహనం పేరు సైతం ‘తెలంగాణ ప్రగతి రథం’గా నామకరణం చేశారు. హరిత హారం కార్యక్రమాన్ని ప్రతిబింబించే లా వాహనాన్ని తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ముస్తాబు చేశారు. చండీఘర్‌కు చెందిన కోచ్వర్క్ సంస్థ జేసీబీఎల్ ఈ వాహనాన్ని తయారు చేసిన సంగతి తెలిసిందే. సుమారు రూ.5 కోట్లతో రూపుదిద్దుకున్న సీఎం భద్రతా వాహనం హైదరాబాద్‌కు వచ్చిన ఒకటి, రెండు రోజుల్లోనే కొన్ని లోపాలను గుర్తించారు. ఇంటీరియర్ డెకరేషన్‌లోనూ కొన్ని మార్పులు చేయవలసి ఉందని ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గత వారం రోజులుగా హైదరాబాద్-1 డిపోలో జేసీబీఎల్ మెకానిక్ నిపుణులతో పాటు, ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో మార్పులు, చేర్పులు చేపట్టారు.‘వాహనం డిజైన్ ఎంతో బాగుందని, దాని లోపల కొన్ని అదనపు హంగులు, సదుపాయాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు’ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. రెండు, మూడు రోజుల్లో వాహనం సరికొత్త హంగులతో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఇలా మార్పులు చేశారు... * ప్రధాన రహదారులపై వాహన గమనంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇరుకుదారుల్లో ఎక్కడైనా గుంతలు వచ్చినప్పుడు హై స్పీడ్‌తో వెళితే వాహనం లెఫ్ట్ కార్నర్ స్వల్పంగా నేలకు తాకుతున్నట్లు గమనించి దానిని రీమేక్ చేశారు. * సీఎం డయాస్‌పైకి చేరుకొనేందుకు డోర్లు తేలిగ్గా తెరుచుకొనేలా హైడ్రాలిక్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. * సీఎం సూచన మేరకు ఆయన సీటు వద్ద రైటింగ్ ప్యాడ్ ఏర్పాటు చేశారు. * ఆడియో సామర్ధ్యాన్ని పెంచారు. టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపర్చారు. -
గ్లోకెమ్ను మూసేయకపోతే ఆమరణ దీక్ష
పెందుర్తిఎమ్మెల్యే బండారు హెచ్చరిక పేలుడు ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్ భద్రతా ప్రమాణాలు పాటించాకే తెరుస్తామన్న యాజమాన్యం పరవాడ: భద్రతా ప్రమాణాలు పాటించని గ్లోకెమ్ పరిశ్రమను తక్షణమే మూసివేయాలని లేని పక్షంలో ఆమరణ దీక్షలకు దిగుతామని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. ఫార్మాసిటీలో గ్లోకెమ్ పరిశ్రమలో శనివారం జరిగిన పేలుడు ప్రమాద ఘటనకు నిరసనగాఎమ్మెల్యే బండారు ఆదివారం పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. ప్రమాద సంఘటనపై సమగ్ర విచారణ జరిపి పేలుడుకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించని గ్లోకెమ్ పరిశ్రమను తక్షణమే మూసివేయాలని ఆయన పట్టుపట్టారు. పరిశ్రమలో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు అధికారులు, ప్రజా ప్రజాప్రతినిదుల సమక్షంలో నిరూపించుకొన్నప్పుడే పరిశ్రమ తెరవాలన్నారు.గ్లోకెమ్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఆందోళనకారులు బీడీఎం కార్యదర్శి నాగరాజును బలవంతంగా ఎమ్మెల్యే వద్దకు లాక్కొని వ చ్చారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి ప్రమాదాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యే ఆయనను హెచ్చరించారు. పరిశ్రమలో కట్టుదిట్టమైన భద్రత కల్పించిన తరువాతే పరిశ్రమను తెరుస్తామని యాజమాన్యం ప్రకటించడంతో ఆందోళన విరమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గాజువాక ఏసీపీ కె.వి.రమణ, పరవాడ సీఐ పి.రమణ, ఎస్.ఐలు ఎన్.గణేష్, ఎం.సత్యారావు, బి.గోవిందరావు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆందోళన కార్యక్రమంలో పరవాడ జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యదర్శి మాసవరపు అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ ఎం.నీలబాబు, టీడీపీ నాయకులు కె.వి.రమణ, ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.