నగరానికి లేదు నిశ్చింత
మరో ఫార్మా కంపెనీలో నిప్పురవ్వలు రేగాయి.. ఇద్దరు కార్మికులను బలి తీసుకున్నాయి.. మరో ముగ్గురిని మృత్యువు ముంగిటికి నెట్టాయి.. సరైన ప్రమాణాలు పాటించకుండానే.. అనుమతులు తీసుకోకుండానే కొత్త రియాక్టర్‌ను ట్రయల్ రన్‌కు సిద్ధం చేయడం కార్మికుల ప్రాణాల మీదికి తెచ్చింది.. ఈరోజు అజికో బయో ఫార్మా.. నిన్న శ్రీకర్ పరిశ్రమ.. అంతకుముందు దక్కన్ కెమికల్స్.. ఇలా వరుసగా రియాక్టర్ల పేలుళ్లు.. బ్లో అవుట్లు.. ప్రాణాలు గాలిలో కలిసిపోవడాలు విశాఖకు సర్వసాధారణంగా మారాయి.. ముఖ్యంగా ఫార్మా పరిశ్రమలు ప్రమాదాలకు చిరునామాలుగా మారుతున్నాయి.. నగరం చట్టుపక్కల ఉన్న మిగిలిన పరిశ్రమలూ దీనికి తాము అతీతం కావని తరచూ నిరూపిస్తున్నాయి..
నగర ప్రజల భద్రతను నిర్లక్ష్యపు ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్లు మార్చేస్తున్నాయి...దీనికి కారణం.. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం.. ప్రమాదాల నుం చి గుణపాఠాలు నేర్చుకోకపోవడమే.. 2013లో హెచ్‌పీసీఎల్ విస్ఫోటనం.. 2014లో స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదం.. గత ఏడాది దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ పరిశ్రమలో 12 డీజిల్ ట్యాంకులు దగ్ధం కావడం దీన్నే స్పష్టం చేస్తున్నాయి. నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 90 రసాయన, ఫార్మా, గ్యాస్ పరిశ్రమలు ఉన్నాయి. నాలుగేళ్ల కిందట అధికారులు జరిపిన తనిఖీల్లో వీటిలో సగానికి పైగా ఏమాత్రం భద్రతా ప్రమాణాలు పాటించడంలేదని స్పష్టమైంది.. అయినా ఇప్పటికీ తగిన చర్యల్లేవు.. అధికారులు, యాజమాన్యాలూ కళ్లు తెరవలేదు.. ఈ పరిశ్రమలపై ఆధారపడిన కార్మికులకు జీవన భద్రత లభించడం లేదు.
గాజువాక : పారిశ్రామిక జిల్లా విశాఖ... అగ్ని ప్రమాదాల అంచున వేలాడుతోంది. నగరాన్ని చుట్టుముట్టినట్టుండే పరిశ్రమలు జిల్లా ప్రజలను నిత్యం భయంలోకి నెట్టేస్తున్నాయి. ఏక్షణాన ఏ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంటుందోనన్న భయం వెంటాడుతోంది. నగరం చుట్టూ వేలాది చిన్నా పెద్దా కంపెనీలున్నాయి. వీటిలో 90 పరిశ్రమలు మాత్రం అగ్నిప్రమాదాలకు కూతవేటు దూరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు లేక ఏ క్షణాన ఎలాంటి పేలుళ్లు, ప్రమాదాలు జరుగుతాయోనని నిత్యం ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంతోపాటు చుట్టుపక్కల విస్తరించిన అనేక భారీ పరిశ్రమల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ముఖ్యంగా 50 రసాయనిక, ఫార్మా కంపెనీలు, 40 ఎల్పీజీ, గ్యాస్, పెట్రో పరిశ్రమల నుంచి వెలువడే ఘాటైన రసాయనిక వాసనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫార్మా, రసాయనిక, పెట్రోకెమికల్ పరిశ్రమల పరిస్థితి మరీ ఘోరంగా కనిపిస్తోంది.
అన్నీ లోపాలే...
పరిశ్రమల్లో ప్రమాదకరమైన అగ్ని ప్రమాదాలకు జిల్లా చిరునామాగా మారుతోంది. నగరంతోపాటు, చుట్టుపక్కల హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీ, బ్లాక్‌అయిల్ ప్లాంట్, డాక్‌యార్డ్, కోరమండల్ వంటి రసాయన, గ్యాస్ ఆధారిత కంపెనీలతో పాటు, ఫార్మా, ఎస్‌ఈజెడ్‌లు, ఫార్మాసిటీలోని పలురకాల బల్క్ డ్రగ్స్, రసాయనిక పరిశ్రమలు న్నాయి. ఎల్పీజీ బాట్లింగ్ యూని ట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఇలా జిల్లాలో రసాయనిక, ఫార్మా కంపెనీలు, ఎల్పీజీ, గ్యాస్, పెట్రో ఆధారిత, పాల ఉత్పత్తుల పరిశ్రమలు కలిపి మొత్తం 90 భారీ పరిశ్రమలు అత్యంత సున్నితమైనవీ ఉన్నాయి.
వీటిలో చాలా కంపెనీలు కనీస భద్రతా చర్యలు చేపట్టడంలేదనడానికి తరచూ చోటు చేసుకొంటున్న అగ్ని ప్రమాదాలే నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రమాదం జరిగితే నివారణకు పరికరాలు, తగిన యంత్రాంగం, ప్రాథమిక చికిత్సకు కావలసిన సౌకర్యాలు వంటివేం లేవని అధికారులు గతంలోనే తేల్చారు. మరో 11 భారీ పరిశ్రమలైతే అసలు నిర్వహణకు ఏమాత్రం తగవని నిర్దారించారు. ప్రమాదకరమైన కంపెనీలకు 123 రకాల ప్రశ్నలతో జాబితా తయారుచేసిన అధికారులు నాలుగేళ్ల క్రితం 90 కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తే అందులో సగానికిపైగా కంపెనీలు అసలు నిర్వహణకు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని తేల్చారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.
ఈ కంపెనీల నిర్లక్ష్యం ఫలితంగా వీటిలో ఏ చిన్న అగ్నిప్రమాదం జరిగినా రసాయనాలు గాల్లో కలవడంతోపాటు సులువుగా మంటలు వ్యాపించి జనావా సాలకు తీవ్రస్థాయిలో హానికలిగిస్తాయి. ఫలితంగా నగరంతోపాటు, గాజువాక, అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల్లో ఏ చిన్న ప్రమాదం సంభవించినా జిల్లా మొత్తం వణికిపోతోంది.
ఉలిక్కిపడే ఘటనలు కొన్ని
హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విశాఖ రిఫైనరీలో 1997లో చోటు చేసుకున్న భారీ ప్రమాదం గుర్తుకొస్తే విశాఖ ప్రజలు ఇప్పటికీ ఉలిక్కి పడతారు. నాటి ప్రమాదంలో స్పియర్ ట్యాంకులు పేలిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇదే సంస్థలో నాలుగేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 2013 మేలో లంకెలపాలెం గ్లోకెమ్ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం విశాఖ జిల్లావాసులను కుదిపేసింది. ఒక రసాయన పౌడరు నీటిలో పడటంవల్ల సంభవించిన ఈ ప్రమాదంలో ఆ కంపెనీ మొత్తం బూడిదైన విషయం తెలిసిందే.
2013 ఏప్రిల్ 7న హెరిటేజ్ కంపెనీ విస్తరణ పనుల్లో ప్రమాదాలు చోటుచేసుకుని భారీగా ప్రాణనష్టం సంభవించేలా చేశాయి. 2013 ఆగస్టులో హెచ్‌పీసీఎల్‌లో జరిగిన విస్పోటనం ఒక్కసారిగా జిల్లా ప్రజలను కలవరపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. 2014 జూన్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో చోటు చేసుకున్న భారీ పేలుడులో 19 మంది అధికారులు, ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. గత ఏడాది ఏప్రిల్‌లో దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లోని బయోమాక్స్ డీజిల్స్ లిమిటెడ్‌లో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 12 బయో డీజిల్ ట్యాంకులు దగ్ధం కావడంతో విశాఖ వాసులు భయాందోళనలకు గురైన విషయం తెలిసిందే. గతేడాది మేలో ఫార్మాసిటీలోని శ్రీకర్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఒక కార్మికుడు మృతి చెందాడు.
నవంబరు 10న లారస్ ల్యాబ్‌లో రియాక్టర్ పేలుడు ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా ఇద్దరి కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. డిసెంబర్‌లో ఎస్‌విఆర్ డ్రగ్స్ పరిశ్రమలో జరిగిన మరో ప్రమాదంలో గ్యాస్ లీకైన ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. గతేడాది జనవరిలో పాయకరావుపేట మండలం రాజవరంలోని దక్కన్ కెమికల్స్ కర్మాగారంలో ఇద్దరు దుర్మరణం పాలవగా 26 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా లంకెలపాలెం అజికో బయో ఫోర్ ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది.
నిర్లక్ష్యానికి ప్రాణాలు బలి
విశాఖపట్నం : ఔషధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు కంటి తుడుపు చర్యగా నష్టపరిహారం అందించి చేతులు దులుపుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన పరిశ్రమల శాఖ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. జేఎన్ ఫార్మాసిటీలో అజికో పరిశ్రమలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం కూడా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే జరిగిందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.సత్యనారాయణ, కార్మిక నాయకుడు కన్నూరు వెంకటరమణలు ఆరోపించారు. కొత్త బ్లాక్‌లో ఎటువంటి అనుమతులు లేకుండానే యాజమాన్యం ట్రయల్ రన్ చేపట్టడడం చట్ట విరుద్ధమన్నారు. నిబంధనలను పాటించని యాజమాన్యంపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.