తరచూ ప్రమాదాలకు కారణం పాత రియాక్టర్లే
అధిక పీడనం లేదా ఉష్ణోగ్రతలు పెరిగితే పేలుళ్లు
రసాయనాల మిశ్రమాల కొలతల్లో తేడాలు ఉన్నా ఇంతే
నాణ్యత లోపించడం వల్లే ప్రమాదాలు
ప్రతి 6 నెలలకోసారి రియాక్టర్లను తనిఖీలు చెయ్యాల్సిందే
కనీసం పట్టించుకోని ఫార్మా కంపెనీలు
ఒక్కో రియాక్టర్‌లో వేల లీటర్ల రసాయనాలు
అత్యాధునిక రియాక్టర్లయితే పేలుడును నియంత్రించే వ్యవస్థ
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమలే ఉసురు తీస్తున్నాయి. ఫార్మా కంపెనీల్లోని రియాక్టర్లే ప్రాణాలు గాల్లో కలిపేస్తున్నాయి. కార్మికుల భద్రతని గాలికొదిలేస్తూ.. భద్రతా ప్రమాణాల్ని పట్టించుకోకుండా.. కేవలం లాభాలు గడించేయాలన్న దురాలోచనతో పరిశ్రమలు వేస్తున్న తప్పుటడుగులతో కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోతున్నాయి. ఫార్మా కంపెనీల్లోని రియాక్టర్లలో నాణ్యత లోపించడం వల్లే ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.
రియాక్టర్ల తనిఖీలు పట్టించుకోవడం లేదు.. వీటిని పర్యవేక్షించాల్సిన ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో పేలుడుకు అది పాతకాలం రియాక్టర్ కావడమేనని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో తరచూ ప్రమాదాలకు పాత రియాక్టర్లే కారణమవుతున్నాయని అంటున్నారు. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లే అత్యంత కీలకం. వీటిలోనే రసాయనాలను మిశ్రమం చేస్తారు.
ఈ కొలతల్లో తేడా వచ్చినా పీడనం, ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు సంభవించినా ఈ రియాక్టర్లు ఒక్కసారిగా పేలిపోతాయి. ఇప్పుడు ఎసెన్షియా ఫార్మా కంపెనీలో కూడా రియాక్టర్ పేలడానికి ఎక్సోథర్మల్ రియాక్షనే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకసారి రసాయనాల మిశ్రమంలో తేడా వస్తే దాని ఉధృతిని ఆపే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. రసాయన మిశ్రమాల పరిమాణంపై దీని నష్ట తీవ్రత ఆధారపడి ఉంటుందంటున్నారు.
ఇప్పటికీ చాలా కంపెనీల్లో పాత రియాక్టర్లే..
విదేశాల్లో పోలిస్తే మన దేశ ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు తరచూ పేలడానికి సరైన నిబంధనలు, పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. చాలా కంపెనీలు ఇప్పటికీ అత్యాధునిక రియాక్టర్లను కాకుండా పాత కాలం నాటి రియాక్టర్లనే వాడుతున్నాయని.. ఇవే ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణమని విశ్లేíÙస్తున్నారు. అత్యాధునిక రియాక్టర్లలో ఎక్సో థర్మల్ రియాక్షన్ మొదలైతే దానికదే నీటిని వెదజిమ్ముకోవడం లేదా ఉష్ణోగతలను తగ్గించుకోవడం, తీవ్రతను బట్టి దానికదే ఆగిపోవడం జరుగుతుందంటున్నారు.
కానీ మన రాష్ట్రంలో కొత్త రియాక్టర్లు ఖరీదైనవి కావడంతో పాతకాలం రియాక్టర్లనే కంపెనీలు కొనసాగిస్తున్నాయి. పాత రియాక్టర్ల స్థానే కొత్త రియాక్టర్లను బిగించుకునేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. అప్పుడే ఇలాంటి ప్రమాదాలను అరికట్టగలమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎసెన్షియా ఫార్మాలో పేలుడు జరగడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని, విచారణలో ప్రమాద కారణాలు తెలియాల్సి ఉందంటున్నారు.
ఇదీ చదవండి: మృత్యుఘోష.. అచ్యుతాపురం సెజ్‌లో భారీ విస్ఫోటం
అనుక్షణం అప్రమత్తత..
అచ్యుతాపురం సెజ్‌లో దాదాపు 208 ఫార్మా కంపెనీలు దాదాపు పక్కపక్కనే ఉన్నాయి. ప్రతి ఫార్మా పరిశ్రమలోనూ సామర్థ్యాన్ని బట్టి 2 నుంచి 10కి పైగా రియాక్టర్లు ఉంటాయి. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లలో హై టెంపరేచర్‌లో ద్రావకాలను మరిగించాల్సి ఉంటుంది. రియాక్టర్‌కు 140 డిగ్రీల సెల్సియస్ నుంచి 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకునే సామర్థ్యం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రియాక్టర్‌పై ఒత్తిడి పెంచే సమయంలో సంబంధిత నిపుణులు, కార్మికులు దానిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా.. రియాక్టర్లు వేడిని తట్టుకోలేక పేలిపోతుంటాయి. రియాక్టర్ టీమ్‌లో ఉండేవారు దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. 140 డిగ్రీల నుంచి 180 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత పెరుగుతున్న సమయంలో వెంటనే దానిని చల్లబర్చాల్సి ఉంటుంది. రియాక్టర్‌లో రసాయనాల్ని బాయిల్ చేయడం ఆపివేయాల్సి ఉంటుంది.
ఒత్తిడి తగ్గించే రప్చర్ డిస్‌్క, సేఫ్టీ వాల్వ్
రియాక్టర్ ప్రెజర్ కుక్కర్ మాదిరిగా పనిచేస్తుంటుంది. కుక్కర్‌లో ఎలా అయితే ఒత్తిడి పెరిగితే విజిల్ రూపంలో దాన్ని బయటికి పంపిస్తుంటుందో.. ప్రతి రియాక్టర్‌కు రప్చర్ డిస్‌్క, సేఫ్టీ వాల్వ్ ఉంటాయి. రియాక్టర్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఒత్తిడి ఎక్కువైనట్లు అనిపిస్తే.. రప్చర్ డిస్క్ ఓపెన్ అయి.. ప్రెజర్‌ని రిలీజ్ చేస్తుంటుంది. అది పనిచేయకపోతే సేఫ్టీ వాల్వ్ వెంటనే ఓపెన్ అయి.. ప్రెజర్‌ని బయటకు పంపించేస్తుంటుంది. ఈ రెండూ సక్రమంగా పనిచేస్తే ఏ రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉండదు.
ఎసెన్షియాలో ఏం జరిగి ఉంటుంది?
ఎసెన్షియాలో రియాక్టర్ నాణ్యమైనది కాకపోవడం వల్ల పేలిందా లేక రియాక్టర్‌లో ఒత్తిడి కారణంగా అనేది తెలియాల్సి ఉంది. రియాక్టర్‌లో రసాయనాలను మిశ్రమం చేస్తున్నప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతని బయట నుంచి పరిశీలించేందుకు టెంపరేచర్ గేజ్ ఉంటుంది.
రియాక్టర్ తట్టుకునే ఉష్ణోగ్రతని దాటుతుందా లేదా అనేది ఇక్కడ పరిశీలిస్తుంటారు. అప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది దీన్ని పరిశీలించలేదా? లేదా ఆ సమయంలో ప్రెజర్ పెరిగితే రప్చర్ డిస్క్ ఓపెన్ అవ్వలేదా? పోనీ అది విఫలమయితే.. వెంటనే సేఫ్టీ వాల్ ఓపెన్ అవ్వాలి. ఈ మూడు జరగకపోతేనే రియాక్టర్ పేలుతుంది. ఇక్కడ అదే జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఫార్మాలో నాలుగు రకాల రియాక్టర్లు
ఫార్మా రంగంలో ప్రధానంగా చిన్న స్థాయి ఉత్పత్తి కోసం బాచ్ రియాక్టర్లు, ఉత్పత్తి నాణ్యతను నిరంతరం నిలిపి ఉంచడం కోసం కంటిన్యూ స్టిర్డ్–ట్యాంక్ రియాక్టర్లు, పెద్ద స్థాయి ఉత్పత్తి కోసం ప్లగ్ ఫ్లో రియాక్టర్లు, అధిక పీడనం, ఉష్ణోగ్రత అవసరం ఉండే వాటి కోసం ఆటోక్లేవ్ రియాక్టర్లను ఉపయోగిస్తారు.
రెండు లేదా అంతకంటే ఎక్కువ రసాయనాలను మిశ్రమం చేస్తున్నప్పుడు ఉత్పత్తి అయ్యే ఉష్ణం, పీడనాన్ని నియంత్రించలేనప్పుడు, రియాక్టర్ల సరైన నిర్వహణ లేనప్పుడు, మానవ తప్పిదాలు ప్రమాదాలు జరగడానికి కారణమవుతున్నాయి. రియాక్టర్ల ప్రమాదాలను నియంత్రించాలంటే ఈ చర్యలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
సంపూర్ణ డిజైన్– నిర్వహణ..
» రియాక్టర్లు, అవి ఉపయోగించే రసాయన ప్రతిక్రియలకు తగ్గట్టు డిజైన్ చేయాలి. అందుకు తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలి.
» పరికరాల్లోని యాంత్రిక సమస్యలను గుర్తించడానికి, పరిష్కరించడానికి నిరంతర పరిశీలన, తగిన నిర్వహణ అవసరం.
ఆధునిక నిఘా నియంత్రణ వ్యవస్థలు
» ఉష్ణోగ్రత, పీడనం, ఇతర ముఖ్యమైన పారామితులను నిరంతరం ట్రాక్ చేసే ఆటోమేటెడ్ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను ముందే గుర్తించవచ్చు.
» ‘ఎమర్జెన్సీ స్టాప్’ వ్యవస్థలు ఉండాలి. ఇవి ప్రమాదం సంభవించినప్పుడు ప్రతిక్రియలను సురక్షితంగా నిలిపివేయడానికి ఉపయోగపడతాయి.
రసాయనాల నిల్వలో జాగ్రత్తలు
» ప్రమాదకర రసాయనాల నిల్వ, నిర్వహణకు కఠినమైన ప్రోటోకాల్స్ పాటించాలి.
» రసాయనాల లక్షణాలపై ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం లేదా అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు.
నిరోధకాలు ఉపయోగించాలి..
» వేడిని గరిష్ట స్థాయి నుంచి తగ్గించే ఏర్పాట్లను వినియోగించుకోవడం అవసరం. ఉదాహరణకు కూలింగ్ జాకెట్లు లాంటివి వాడాలి.
» కెమికల్ రియాక్షన్ వేగాన్ని తగ్గించడానికి నిరోధకాలు ఉపయోగించాలి. రియాక్షన్ కైనెటిక్స్‌ను సవరించడం ద్వారా అధిక ఉష్ణం ఉత్పత్తి అయ్యే పరిస్థితులను నివారించవచ్చు.
ఉద్యోగ శిక్షణ, భద్రతా డ్రిల్లులు
» రియాక్టర్ల ఆపరేషన్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానాలపై క్రమం తప్పకుండా సిబ్బందికి శిక్షణ అవసరం. అందుకు తగిన విధంగా శిక్షణ కార్యక్రమాలు ఉండాలి.
» భద్రతా డ్రిల్లులు నిర్వహించడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు వేగంగా, సమర్థంగా స్పందించవచ్చు.
నెలకోసారి మెయింటెనెన్స్ డే నిర్వహించాలి
ఫార్మా పరిశ్రమల్లో డ్రగ్స్ తయారీ సమయంలో వివిధ రసాయన మిశ్రమాలను రియాక్టర్లలో కలుపుతారు. ఈ సమయంలో ఆర్గానిక్ సాల్వెంట్స్ బాయిలింగ్ టెంపరేచర్ వద్ద త్వరగా ఆవిరైపోతుంటాయి. అప్పుడు రియాక్టర్లలో ఒత్తిడి పెరుగుతుంది. వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువైనా రియాక్టర్ పేలుతుంది. ఒక్కోసారి ప్రెజర్ మీటర్, సేఫ్టీ వాల్వ్ పనిచేయవు. ఆ సమయంలో సరిగా గమనించకపోతే రియాక్టర్ పేలిపోతుంది.
అందుకే ప్రతి రోజూ సేఫ్టీ వాల్వ్ చెక్ చేస్తుండాలి. ఫార్మాలో పెద్ద పెద్ద రియాక్టర్లని స్థానికంగా స్టీల్ కొనుగోలు చేసి పరిశ్రమల్లోనే తయారు చేస్తుంటారు. ఈ సమయంలో జాయింట్స్‌ని వెల్డింగ్ చేస్తారు. రసాయన మిశ్రమాలు నిరంతరం జరుగుతున్నప్పుడు ఈ జాయింట్స్ వీక్ అవుతుంటాయి.
ఒత్తిడి పెరిగినప్పుడు జాయింట్స్ సక్రమంగా లేకపోయినా పేలుడు జరుగుతుంది. అందుకే రియాక్టర్స్ జాయింట్స్‌ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రతి పరిశ్రమ నెలకోసారి మెయింటెనెన్స్ డే నిర్వహించి ఒకరోజు షట్‌డౌన్ చేయాలి. అప్పుడు ప్రతి విభాగాన్ని కచి్చతంగా తనిఖీ చేసుకోవాలి. అయితే పరిశ్రమలు ఇలా చేయడం లేదు. అందువల్లే ప్రమాదాలు తలెత్తుతున్నాయి. – ప్రొ.జి.నాగేశ్వరరావు,ఏయూ ఫార్మాస్యూటికల్ ప్రొఫెసర్, కోల్ ఇండియా డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment