5 సెకన్లలో 2 పేలుళ్లు | Report of the High Level Committee on Essentia Accident: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

5 సెకన్లలో 2 పేలుళ్లు

Published Mon, Aug 26 2024 5:03 AM | Last Updated on Mon, Aug 26 2024 5:03 AM

Report of the High Level Committee on Essentia Accident: Andhra Pradesh

ఎసైన్షియా ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ నివేదిక  

మొదట మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ ప్యానెల్‌ గదిలో పేలుడు 

5 సెకన్లలోనే ఎయిర్‌ హ్యాండ్లింగ్‌ యూనిట్‌లో రెండో పేలుడు 

కార్మికులు తప్పించుకునే అవకాశమే లేకపోయింది 

భవన నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం

రసాయనం లీకేజీ గుర్తించిన కార్మికులు 

వెంటనే స్పందించని సంబంధిత సిబ్బంది 

భవనం అన్ని అంతస్తులకు ఒక్కటే మెట్ల మార్గం 

అత్యవసర మార్గాలు, ప్రత్యామ్నాయ మెట్లు లేవు 

అందువల్లే ప్రాణనష్టం అధికంగా ఉంది 

పేలుడు ధాటికి కూలిన గ్రౌండ్‌ ఫ్లోర్‌ గోడలు 

కుప్పకూలిన మొదటి అంతస్తు శ్లాబు భాగం

సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫార్మా కంపెనీలో నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం సంభవించిందని, ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ వెల్లడించింది. తొలి పేలుడు జరిగిన 5 సెకన్లలోనే మరో పేలుడు సంభవించిందని తెలిపింది. భారీ పేలుళ్ల ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, గ్రౌండ్‌ ఫ్లోర్‌ గోడలు, మొదటి అంతస్తు శ్లాబు కొంత భాగం కూలడం, ఈ సంస్థ భవనాలకు అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేకపోవడంతో కార్మికులు తప్పించుకోలేక ప్రాణ నష్టం అధికంగా ఉందని వెల్లడించింది.

ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఈ నెల 21న జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ, బాయిలింగ్, ఫైర్‌ సేఫ్టీ, ఏపీపీసీబీ అధికారులు, నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగింది, కారణాలేమిటో క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రాథమిక నివేదిక రూపొందించింది. వారం రోజుల్లో మరో నివేదిక ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

నివేదికలోని ప్రధానాంశాలు..
కొత్త డ్రగ్స్‌ తయారీకి ప్రయోగాలు ఇక్కడే జరుగుతుంటాయి. బ్యాచ్‌ల వారీగా పరిశోధనలు చేస్తుంటారు. మూడు నెలల విరామం తర్వాత ఫస్ట్‌ బ్యాచ్‌ పరిశోధన ప్రారంభించింది. 
ఆ రోజు రియాక్టర్‌లో 500 లీటర్ల మిౖథెల్‌ టెర్ట్‌ బ్యూటైల్‌ ఈథర్‌ (ఎంటీబీఈ) ద్రావకం తయారీకి వ్యాక్యూమ్‌ డిస్టిలేషన్‌ ప్రారంభించారు. 

 ఇక్కడ తయారయ్యే వ్యాక్యూమ్‌ డిస్టిలేషన్‌ని నైట్రోజన్‌ ప్రెజర్‌ ద్వారా రెండో ఫ్లోర్‌లో ఉన్న 5 వేల లీటర్ల స్టోరేజ్‌ ట్యాంక్‌కు పంపింగ్‌ చేస్తున్నారు. 
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రెండో అంతస్తులో ఎంటీబీఈ లీకై ఘాటైన వాసన వస్తుండటాన్ని ప్రొడక్షన్‌ టీమ్‌ గుర్తించింది. ఇది క్రమంగా మొదటి అంతస్తుకూ వ్యాపించింది. 

 మొదటి అంతస్తులోని కార్మికులు ఆ వాసనను గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి రెండో అంతస్తుకు వెళ్తున్న ఎంటీబీఈ పైప్‌లైన్‌ను పరిశీలించారు. ట్రాన్స్‌ఫర్‌ లైన్‌లో ఎంటీబీఈ వ్యాక్యూమ్‌ లీకవుతున్నట్లు గుర్తించారు. 
ఈ కెమికల్‌ పైపుల నుంచి ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న విద్యుత్‌ కేబుల్స్‌ వెళ్తున్న కటౌట్స్‌ పైన పడి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ (ఎంసీసీ) ప్యానెల్‌పై పడుతున్నట్లు గుర్తించారు. 

  వెంటనే ఇంజినీరింగ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ సిబ్బందికి కార్మికులు సమాచారమిచ్చారు. లంచ్‌ టైమ్‌ కావడంతో ఆ సమయంలో ఆ సిబ్బంది అందరూ భోజనం చేస్తున్నారు. దీంతో లీకేజీని అరికట్టేందుకు ఎవ్వరూ రాలేదు. 
 బిల్డింగ్‌లో ప్రతి ఫ్లోర్‌ను అనుసంధానం చేసేలా ఎయిర్‌ హ్యాండ్లింగ్‌ యూనిట్స్‌ (ఏహెచ్‌యూ) ఉన్నాయి. ఏహెచ్‌యూ ప్రధాన యూనిట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంది. ఏవైనా వాయువులు లీకైతే ఏహెచ్‌యూ ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. కానీ.. ఆ రోజు లీకైన ఎంటీబీఈ రసాయనం ఆవిరి ఏహెచ్‌యూ ద్వారా ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ (పీడీ) ల్యాబ్, కార్యాలయం గదులు, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎస్యూరెన్స్‌ గదులు, యుటిలిటీ అండ్‌ మెటీరియల్‌ నిల్వ ప్రాంతాలకు వ్యాపించింది.

 మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భోజనం అనంతరం వచి్చన బృందాలు లీకేజీని అరికట్టే ప్రక్రియ ప్రారంభించాయి.  
కానీ.. అప్పటికే ఏహెచ్‌యూల ద్వారా కమ్ముకున్న ఆవిరి లోవర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ లిమిట్‌ (ఎల్‌ఈఎల్‌) స్థాయికి చేరుకుంది. దీంతో హఠాత్తుగా గ్రౌండ్‌ ఫ్లోర్లోని ఎంసీసీ ప్యానెల్‌లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి గ్రౌండ్‌ ఫ్లోర్‌ ప్లెయిన్‌ సిమెంట్, కాంక్రీట్‌ (పీసీసీ) గోడలు కూలిపోయాయి. మొదటి అంతస్తు శ్లాబులో కొంత భాగం కుప్పకూలింది. 

 వెంటనే కార్మికులు, సిబ్బంది బయటకు వెళ్లిపోయేందుకు ప్రయతి్నంచారు.  
 5 సెకెన్లలోనే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న ఏహెచ్‌యూ మెయిన్‌ ప్యానల్‌లో రెండో పేలుడు సంభవించింది. దీంతో.. ఎయిర్‌ హ్యాండ్లింగ్‌ యూనిట్స్‌ ఉన్న మొదటి, రెండో అంతస్తుల్లోని అన్ని రూములూ తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. 

 ఈ పేలుడు తీవ్రత పీడీ ల్యాబ్, యుటిలిటీ, ప్రొడక్షన్‌ ఏరియాలోనూ తీవ్ర ప్రభావం చూపింది. 
 వెంటవెంటనే పేలుళ్లు సంభవించడంతో అత్యవసర మార్గాలు లేక కార్మికులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. 
ఎంటీబీఈ 28 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద లోవర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ లిమిట్‌ (ఎల్‌ఈఎల్‌) 1.6 శాతం, అప్పర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ లిమిట్‌ (యూఈఎల్‌) 15.1 శాతం ఉంది. ఈ ఎంటీబీఈ ఆవిరి అన్ని ప్రాంతా­లకూ తీవ్రస్థాయిలో విస్తరించడమే ప్రమాదానికి ప్రధాన కారణం.

దాదాపు బిల్డింగ్‌లోని అన్ని ప్రాసెసింగ్‌ ప్రాంతాలకూ ఏహెచ్‌యూల ద్వారా ఎంటీబీటీఈ వ్యాక్యూమ్‌ చేరుకుంది. దీనివల్ల పేలుడు తీవ్రత ఎక్కువైంది. 
 బిల్డింగ్‌ నిర్మాణంలో లోపాలు కూడా ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణం. పీడీ ల్యాబ్, ఆఫీస్‌ బిల్డింగ్, మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ పక్కపక్కనే ఉండకూడదు. కానీ.. అన్నీ ఒకేచోట ఏర్పాటు చేశారు. 

 అంతేకాకుండా ఈ భవనాలన్నింటినీ ఏహెచ్‌యూతో అనుసంధానం చేశారు. ప్రాసెసింగ్‌ ప్రక్రియ చేయని రూమ్‌లకూ వీటిని అనుసంధానం చేయడం కూడా ప్రధాన లోపమే. 
 ముఖ్యంగా.. గ్రౌండ్‌ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్‌ ఫ్లోర్లకు ఒక్కటే మెట్ల మార్గం ఉంది. ఎలాంటి అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేవు. ఉన్న ఒక్క మార్గం మొదటి పేలుడు ధాటికే కూలిపోయింది. 

  భవనం చుట్టూ ఎక్స్‌టర్నల్‌ కారిడార్లు లేవు. అనుసంధానించే మెట్లు కూడా లేవు. దీనివల్ల కొందరు దూకేందుకు 
ప్రయతి్నంచినా.. భవన శిథిలాల కింద పడి నలిగిపోయారు. 
 ప్రతి ఫార్మా కంపెనీలోనూ ఉత్పత్తి ప్రారంభించే ముందు ప్రతి విభాగాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తారు. దీన్నే ప్రీ స్టార్టప్‌ చెక్స్‌ (పీఎస్‌ఎస్‌ఆర్‌) అంటారు. ఈ పరిశ్రమలో అది కూడా చెయ్యడం లేదు. 

 రసాయన మిశ్రమాలు, రసాయనిక ఆవిరి వెళ్లే లైన్లు సరిగ్గా విద్యుత్‌ కేబుల్స్‌ పైనే వేశారు. దీనివల్ల ఏ చిన్న సాల్వెంట్‌ లీకేజీ జరిగినా నేరుగా విద్యుత్‌ కేబుల్‌ కటౌట్స్‌పై పడటంతో పాటు ఎంసీసీ ప్యానెల్స్‌ దెబ్బతినేలా వ్యవస్థ ఉంది. 
ఎంటీబీఈ లీకేజీని గమనించిన తర్వాత తక్షణమే స్పందించేందుకు ఎవ్వరూ లేకపోవడం వల్ల.. ఈ సాల్వెంట్‌ ఆవిరి వాసన పీల్చి ఉద్యోగులు, కార్మికులు ఇబ్బంది పడ్డారు. అయినా..  ఈ ప్రమాదం జరుగుతుందని ఎవ్వరూ ఊహించకపోవడంతో బయటకు వెళ్లకుండా పనిలోనే నిమగ్నమయ్యారు. ఫలితంగా ప్రాణనష్టం ఎక్కువగా సంభవించిందని ఉన్నతస్థాయి విచారణ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement