విశాఖ సిటీ: ఎసైన్షియా అడ్వాన్స్›డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో అనేక విస్మయకర విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది. కొత్త డ్రగ్ ఉత్పత్తిని వేగంగా ప్రారంభించాలన్న ఆత్రంలో ట్రయల్ రన్ నిర్వహించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వంటివే ఈ భారీ ప్రమాదానికి కారణమన్న విషయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.
ప్రమాద కారణాలతో పాటు కంపెనీలో 6 లోటు పాట్లను హైలెవల్ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అత్యవసర ద్వారాలు, భవనానికి బాహ్య కారిడార్లు లేకపోవడం, ప్రీ స్టార్టప్ తనిఖీలు చేయకపోవడం, విద్యుత్ వైరింగ్ బహిరంగంగా ఉండడం, రసాయనం లీక్ అయిన వెంటనే దాన్ని నిలువరించకపోవడం వంటి కారణాలను నివేదికలో పొందుపరిచింది.
ముందస్తు తనిఖీలు నిల్
ఎసైన్షియాలో కొత్త డ్రగ్ ఉతి్పత్తిని ఇటీవలే ప్రారంభించింది. వాస్తవానికి ఏ డ్రగ్ ఉత్పత్తి చేయాలన్నా ముందు తప్పనిసరిగా ట్రయల్ రన్ నిర్వహించాలి. ఈ ప్రక్రియలో అన్నీ సజావుగా ఉన్నట్లు నిర్థారించుకున్నాకే ఉత్పత్తిని ప్రారంభించాలి. సదరు కంపెనీ యాజమాన్యం మాత్రం ముందస్తు తనిఖీలు లేకుండానే, వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ఉపక్రమించింది. ఫలితంగానే ఈ ప్రక్రియలో నెలకొన్న అనేక లోటుపాట్లను గుర్తించలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నత స్థాయి కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది.
గతంలోనూ ఇదే వైఖరి
ఈ కంపెనీ గతంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించినట్లు కమిటీ పరిశీలనలో గుర్తించింది. ప్రీ స్టార్టప్ తనిఖీలు లేకుండానే భారీ స్థాయిలో డ్రగ్ ఉత్పత్తిని చేపడుతున్నట్లు వెల్లడైంది. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో కంపెనీలో వరుసగా అదే తరహాలో ఔషధాల ఉత్పత్తి ప్రక్రియను నిర్వహిస్తోంది.
తాజాగా అదే విధానాన్ని కొనసాగించగా.. మిౖథెల్ టెర్ట్ బ్యూటిల్ ఎథర్(ఎంటీబీఈ) రసాయనం లీకై గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఎంసీసీ ప్యానల్ మీద పడడంతో భారీ ప్రమాదం సంభవించింది. 17 మంది మృత్యువాత పడ్డారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్న ఉన్నత స్థాయి కమిటీ ఇదే అంశాలపై నివేదిక తయారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment