Huge Explosions
-
ఆ ఆత్రమే అగ్గిరాజేసింది
విశాఖ సిటీ: ఎసైన్షియా అడ్వాన్స్›డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో అనేక విస్మయకర విషయాలు వెలుగుచూసినట్లు తెలిసింది. కొత్త డ్రగ్ ఉత్పత్తిని వేగంగా ప్రారంభించాలన్న ఆత్రంలో ట్రయల్ రన్ నిర్వహించకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వంటివే ఈ భారీ ప్రమాదానికి కారణమన్న విషయాన్ని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.ప్రమాద కారణాలతో పాటు కంపెనీలో 6 లోటు పాట్లను హైలెవల్ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అత్యవసర ద్వారాలు, భవనానికి బాహ్య కారిడార్లు లేకపోవడం, ప్రీ స్టార్టప్ తనిఖీలు చేయకపోవడం, విద్యుత్ వైరింగ్ బహిరంగంగా ఉండడం, రసాయనం లీక్ అయిన వెంటనే దాన్ని నిలువరించకపోవడం వంటి కారణాలను నివేదికలో పొందుపరిచింది. ముందస్తు తనిఖీలు నిల్ ఎసైన్షియాలో కొత్త డ్రగ్ ఉతి్పత్తిని ఇటీవలే ప్రారంభించింది. వాస్తవానికి ఏ డ్రగ్ ఉత్పత్తి చేయాలన్నా ముందు తప్పనిసరిగా ట్రయల్ రన్ నిర్వహించాలి. ఈ ప్రక్రియలో అన్నీ సజావుగా ఉన్నట్లు నిర్థారించుకున్నాకే ఉత్పత్తిని ప్రారంభించాలి. సదరు కంపెనీ యాజమాన్యం మాత్రం ముందస్తు తనిఖీలు లేకుండానే, వేగంగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ఉపక్రమించింది. ఫలితంగానే ఈ ప్రక్రియలో నెలకొన్న అనేక లోటుపాట్లను గుర్తించలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉన్నత స్థాయి కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. గతంలోనూ ఇదే వైఖరి ఈ కంపెనీ గతంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించినట్లు కమిటీ పరిశీలనలో గుర్తించింది. ప్రీ స్టార్టప్ తనిఖీలు లేకుండానే భారీ స్థాయిలో డ్రగ్ ఉత్పత్తిని చేపడుతున్నట్లు వెల్లడైంది. అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో కంపెనీలో వరుసగా అదే తరహాలో ఔషధాల ఉత్పత్తి ప్రక్రియను నిర్వహిస్తోంది.తాజాగా అదే విధానాన్ని కొనసాగించగా.. మిౖథెల్ టెర్ట్ బ్యూటిల్ ఎథర్(ఎంటీబీఈ) రసాయనం లీకై గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఎంసీసీ ప్యానల్ మీద పడడంతో భారీ ప్రమాదం సంభవించింది. 17 మంది మృత్యువాత పడ్డారు. 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్న ఉన్నత స్థాయి కమిటీ ఇదే అంశాలపై నివేదిక తయారు చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. -
కీవ్‌పై మరోసారి పేట్రేగిన రష్యా
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ శనివారం ఉదయం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. డ్నిప్రొవ్స్కీ ప్రాంతంలోని కీలకమైన మౌలిక వసతులే లక్ష్యంగా రష్యా ఈ దాడులకు ఒడిగట్టినట్లు భావిస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. క్షిపణి దాడులతో పలు ప్రాంతాల్లో 18 వరకు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల మంటలు లేచాయి. ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. కీవ్‌పై జనవరి ఒకటో తేదీ తర్వాత రష్యా దాడులు జరపడం ఇదే ప్రథమం. అంతకుముందు ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లోని పారిశ్రామిక ప్రాంతంపై రష్యా రెండు ఎస్–300 క్షిపణులను ప్రయోగించిందని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. కీలక నగరం సొలెడార్ తమ అధీనంలోకి వచ్చిందంటూ రెండు రోజుల క్రితం రష్యా ప్రకటించగా, ఉక్రెయిన్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. రాజధాని కీవ్, ఇతర నగరాలను లక్ష్యంగా చేసుకొని రష్యా క్షిపణి దాడులకు తెగబడుతుండడంతో ఉక్రెయిన్‌కు అండగా నిలవడానికి బ్రిటన్ ముందుకొచ్చింది. ట్యాంకులు, శతఘ్ని వ్యవస్థలను ఉక్రెయిన్‌కి పంపిస్తామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శనివారం నాడు హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సునాక్ మాట్లాడారు. అనంతరం బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఛాలెంజర్ 2 ట్యాంకులు, ఇతర శతఘ్ని వ్యవస్థ సాయంగా అందిస్తామని సునాక్ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే ఎన్ని ట్యాంకులు పంపిస్తారో, ఎప్పటిలోగా అవి ఉక్రెయిన్ చేరుకుంటాయో వెల్లడించలేదు. బ్రిటీష్ ఆర్మీ చాలెంజర్ 2 ట్యాంకులు నాలుగు వెంటనే పంపిస్తారని, మరో ఎనిమిది త్వరలోనే పంపిస్తారంటూ బ్రిటన్ మీడియా తెలిపింది. ఉక్రెయిన్‌లో మౌలికసదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులకు తెగబడుతోంది. -
పేలుళ్లతో మూడొంతులమేర మునిగిన ఐఎన్ఎస్ సింధురక్షక్
ముంబైలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో జరిగిన మూడు పేలుళ్లు అనంతరం సంభవించిన భారీ అగ్నిప్రమాదం ముంబై వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొంతసేపటివరకు ఏం జరిగిందో ఎవరికీ అంతుబట్టలేదు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అయితే ఉగ్రవాదుల దాడులపై ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఒకవైపు హెచ్చరికలు, స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఈ సంఘటన జరగడం నగరవాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేక విద్రోహ చర్యా అన్న అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయంలో ఉన్న నావల్ డాక్‌యార్డ్‌లో ఈ ఘటన జరగడం అందరిని నిశ్చేష్ఠులను చేసింది. విచారణకు ఆదేశించాం నౌకాదళానికి చెందిన జలాంతర్గామి అగ్నిప్రమాదంలో ముగ్గురు అధికారులతోపాటు మొత్తం 18 మంది మృతి చెందినట్లు అడ్మిరల్ డీకే జోషీ తెలిపారు. ప్రమాదానికి కారణాలేమిటనేది తెలియరాలేదని, విచారణకు ఆదేశించామని చెప్పారు. జలాంతర్గామిలో ఉన్న పేలుడు పదార్థాలు, ఇంధనం, ఆక్సిజన్ సిలిండర్ల వల్ల ఈ పేలుళ్లు సంభవించి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరమ్మతులే కారణమా... ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిని మరమ్మతుల కోసం 2010లో రష్యా పంపించారు. ఆ దేశానికి చెందిన ‘జ్వోదోచ్కా’ అనే కంపెనీ మరమ్మతులు చేపట్టి 2013 జనవరిలో తిరిగి భారత్‌కు అప్పగించింది. నిర్దేశిత లక్ష్యానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సింధురక్షక్లో ఆయుధ సామగ్రి భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. క్షిపణులు, నౌక విధ్వంసక శక్షిపణులు భారీ స్థాయిలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరమ్మతుల అనం తరం మన దేశానికి వచ్చిన ఈ జలాంతర్గామిని అన్ని విధాలా పరీక్షించారు. సాంకేతికంగా ఎలాంటి దోషాలు లేవని స్పష్టం చేసుకున్నారు. అయితే ఈ సంఘటన అనంతరం మరమ్మతుల సమయంలో ఏవైనా లోపాలు ఏర్పడ్డాయా..? అలాంటి లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా... సింధురక్షక్ జలాంతర్గామి గతంలో కూడా ప్రమాదానికి గురైంది. విశాఖపట్టణంలో ఉండగా 2010లో అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు నౌకదళానికి చెందిన ఓ వ్యక్తి మరణించాడు. కాగా, 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం అనంతరం జరిగిన పెద్ద ప్రమాదం ఇదేనని చెబుతున్నారు. ‘ప్రకటన చేయాల్సిందే’ న్యూఢిల్లీ: ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గమిలో జరిగిన పేలుడు, అగ్నిప్రమాదంపై ప్రతిపక్ష బీజేపీ, శివసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై రాజ్యసభలో సర్కార్ నుంచి ప్రకటన చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. రక్షణ శాఖ మంత్రి ఆంటోనీ వెంటనే ప్రకటన చేయాలని, లేకపోతే గురువారం సభ కార్యకలాపాలు జరగనివ్వమని బీజేపీ సభ్యుడు చందన్ మిత్రా అన్నారు. అయితే ముంబైలో ఉన్న ఆంటోని తిరిగి వచ్చిన వెంటనే ప్రకటన చేయిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్ శుక్లా హామీ ఇచ్చారు.