
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబాన్ని వేధిస్తున్న అప్పలరాజు అరెస్టు
విశాఖపట్నం: ప్రైవేటు వీడియోలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కారు డ్రైవర్ అప్పలరాజును ద్వారకా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేకూరి గిరీష్, భార్య పిల్లలతో కలిసి సీతమ్మధార ప్రాంతంలో నివాసముంటున్నారు. అతనికి అంగవైకల్యం కారణంగా పిల్లలను చూసుకోవడానికి, ఇంటి పనుల కోసం డ్రైవర్‌గా రామెళ్ల అప్పలరాజును పెట్టుకున్నాడు. అతడు నమ్మకంగా ఉండడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఒక రోజు గిరీష్‌ను హోటల్‌కు తీసుకెళ్లి అమ్మాయిని పరిచయం చేశాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను అప్పలరాజు మొబైల్‌లో చిత్రీకరించాడు.
కొద్ది రోజుల తరువాత ఆ వీడియోలు సాయంతో గిరీష్‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు రూ.లక్ష ఇవ్వాలని లేదంటే ఫొటోలు సోషల్ మీడియాలోను, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో పరువు పోతుందని భావించిన గిరీష్ తన బంధువు సిబ్బంది ద్వారా ఆ మొత్తాన్ని ఏర్పాటు చేసి ఆరు యూపీఐ లావాదేవీల ద్వారా డ్రైవర్‌కు బదిలీ చేశారు. చాలా కాలంగా గిరీష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులను డ్రైవర్ అప్పలరాజు వేధిస్తూ వచ్చాడు. ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు. ఐఫోన్16 ప్లస్‌ను కూడా కొనుగోలు చేయించుకున్నాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 21న గిరీష్‌ను అప్పలరాజు కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ.5 వేలు బలవంతంగా తీసుకున్నాడు. అలాగే గిరీష్ తన భార్య పేరు మీద కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను కూడా కాజేయడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా గిరీష్ వీడియోలు అతని భార్యకు పంపించి ఆమెను సైతం వేధింపులకు గురి చేశాడు.
వీరి పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి అక్కడ పోలీస్ స్టిక్కర్ ఉన్న కారును పార్క్ చేసేవాడు. డ్రైవర్ అప్పలరాజు వేధింపులను భరించలేక గిరీష్ చివరకు ద్వారకా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు అప్పలరాజును అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు పంపించారు. అతడి నుంచి నకిలీ పిస్టల్‌తో పాటు కొంత మొత్తంలో నగదు, కారు, ఫోన్ స్వా«దీనం చేసుకున్నారు.