విడతల వారీగా రూ.2,53,76,000 కాజేసిన కేటుగాటు
నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్న వేధింపులు
నిందితుడిని పట్టుకున్న పోలీసులు
తూర్పుగోదావరి: అశ్లీల వీడియోల పేరుతో యువతిని బెదిరిస్తూ నాలుగేళ్ల నుంచి డబ్బులు గుంజుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో డీఎస్పీ జి.దేవకుమార్ వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. నిడదవోలుకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న గాయత్రీ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే హాస్టల్‌లో ఉంటున్న కాజా అనూషాదేవితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలేనికి చెందిన నీనావత్ దేవా నాయక్ అలియాస్ మధు అనే వ్యక్తిని అనూషాదేవి వివాహం చేసుకుంది.
ఈ నేపథ్యంలో స్నేహితురాలికి తన భర్తను పరిచయం చేసింది. అనూషాదేవితో ఉన్న పరిచయం, ఒకే హాస్టల్లో ఉండడంతో బాధితురాలు ఆమెతో అత్యంత సన్నిహితంగా ఉండేది. దీంతో దేవనాయక్ వేరే వ్యక్తి ఫోన్ చేసినట్లుగా బాధితురాలికి ఫోన్ చేసి తన వద్ద ఆమె న్యూడ్ వీడియోలున్నాయని, వాటిని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరించారు. అలా చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. విడతల వారీగా ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు వేయించుకునేవాడు. ఇలా కూడబెట్టిన సొమ్ముతో చిన్న కాకానిలో అపార్ట్‌మెంటు కోనుగోలు చేశాడు.
కారు, బుల్లెట్, పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేశాడు. కాగా..తనను ఒక వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేస్తున్న విషయాన్ని అనూషాదేవికి బాధితురాలు తెలిపింది. ఈ విషయం మళ్లీ దేవానాయక్ దృష్టికి వెళ్లింది. వేరొకరి ద్వారా సెటిల్‌మెంట్ చేసినట్లు బాధితురాలిని నమ్మించాడు. అలాగే పలు అవసరాల కోసం బాధితురాలి దగ్గర డబ్బులు కాజేశాడు. కాగా.. అనూషాదేవి, ఆమె భర్త దేవానాయక్‌లు తనను మోసం చేస్తున్నారని బాధితురాలు గుర్తించించి. దీంతో తల్లిదండ్రులతో కలిసి నిడదవోలు పోలీసులను ఆశ్రయించింది. ఇలా ఆమె 2021 నుంచి 2025 వరకూ దాదాపు రూ. 2,53,76,000 మోసపోయింది. మరో రూ.14 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులను ఆశ్రయించింది.
మూడు రోజుల్లో కేసు ఛేదన
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల్లో దేవా నాయక్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి రూ.1,81,45,000 విలువైన 938 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.2.250 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.75 లక్షల నగదు, కారు, బుల్లెట్ స్వా«దీనం చేసుకున్నారు. చిన్నకాకానిలో కొనుగోలు చేసిన అపార్ట్‌మెంటును స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా
స్వా«దీనం పర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment