
పార్వతీపురం మహిళకు న్యూడ్ కాల్స్‌తో అనంతపురం జైలర్ వేధింపులు
అరెస్టుకు పోలీసుల ప్రయత్నం
అప్పటికే పరార్.. ఆపై ముందస్తు బెయిల్
విశాఖ సిటీ: ‘నేను చేస్తున్నట్లే... నాకూ న్యూడ్ కాల్ చెయ్యాలంటే ఎంత కావాలో చెప్పు.. నమ్మకం లేకపోతే అకౌంట్ నంబర్ పెట్టు.. వెంటనే డబ్బులు పంపిస్తా’.. అంటూ ఓ గృహిణిని వేధింపులకు గురి చేసిన అనంతపురం కీచక జైలర్ సుబ్బారెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. అరెస్టుకు ప్రయత్నిస్తే, అప్పటికే నిందితుడు ముందస్తు బెయిల్ పొందాడు.
ఈ ఉదంతంపై పోలీసుల వివరాల ప్రకారం, పార్వతీపురం మన్యం జిల్లాలో నివాసముంటున్న గృహిణి ఫేస్‌బుక్ అకౌంట్‌కు కొన్నాళ్ల క్రితం జైలర్ సుబ్బారెడ్డి నుంచి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తాను జైలర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్‌కు అంగీకరించడంతో, స్నేహం పేరుతో చాటింగ్ ప్రారంభించాడు. కొద్ది రోజులకు అసలు రంగును బయటపెట్టాడు. న్యూడ్ కాల్స్, అసభ్య మెసేజ్‌లతో వేధించసాగాడు.
మొదట ‘సారీ’.. ఆ తరువాత ‘కుక్క’ బుద్ధి..!
మహిళ భర్త, మరో బంధువు పోలీస్ శాఖలోనే విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్‌లు, వేధింపుల వ్యవహారాన్ని మహిళ బంధువైన ఏసీపీకి, ఎస్‌ఐగా పనిచేస్తున్న భర్తకు చెప్పింది. దీంతో వారు జైలర్‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. దీనిపై సదరు వ్యక్తి కేవలం ఫ్రెండ్‌షిప్ కోసమే మెస్సేజ్‌లు పంపించానని, సారీ చెప్పాడు. కొన్నాళ్లు మెస్సేజ్‌లు పంపించడం మానేశాడు. మళ్లీ గత నెల 25వ తేదీ నుంచి మెస్సేజ్‌లు, కాల్స్ చేయడం ప్రారంభించాడు.
వేధింపులను భరించలేక సదరు మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సీపీ వెంటనే కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, జైలర్‌ను అరెస్టు చేయడానికి అనంతపురం వెళ్లగా.. అప్పటికే పరారయ్యాడు. విశాఖకు వచ్చి 5వ ఏడీజే (ఫ్యామిలీ) కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం విశాఖ పోలీసులను కలిసి ఆ ముందస్తు బెయిల్ పత్రాలను అందజేశాడు.
శాఖాపరమైన చర్యలు..
కాగా, జైలర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జైళ్ల శాఖ డీజీకి నగర పోలీస్ కమిషనర్ బాగ్చి లేఖ రాశారు. అలాగే ముందస్తు బెయిల్ రద్దుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.