టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో కార్పొరేటర్ సుబ్బారెడ్డిపై కేసు
ఘటన జరిగిన రోజు సుబ్బారెడ్డి అక్కడే ఉన్నారన్న సీఐడీ
ఆ రోజున పెళ్లిలో ఉన్నానంటూ కోర్టుకు ఆధారాలిచ్చిన సుబ్బారెడ్డి
దీనిపై స్వయంగా కోర్టుకొచ్చి వివరణ ఇవ్వాలని సీఐడీ దర్యాప్తు అధికారికి హైకోర్టు ఆదేశం
విచారణ ఈ నెల 12కి వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అడ్డగోలుగా కేసులు పెట్టిన మంగళగిరి పోలీసులు హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయారు. దాడి జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఉన్నారంటూ గుంటూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డిపై తప్పుడు కేసు పెట్టిన పోలీసులు ఇప్పుడు కోర్టు ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ బాసులను సంతృప్తిపరిచేందుకు ముందువెనకా ఆలోచించకుండా కేసులు పెట్టిన పోలీసులు అందుకు తగిన మూల్యం చెల్లించాల్సిన స్థితికి వచ్చారు.
టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో తాను నరసరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నానంటూ సుబ్బారెడ్డి తగిన ఆధారాలను హైకోర్టు ముందుంచడంతో పోలీసులు హైకోర్టుకు దొరికిపోయారు. ఆ ఆధారాలను పరిశీలించిన హైకోర్టు ఘటన జరిగిన సమయంలో సుబ్బారెడ్డి తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే.. ఆయన టీడీపీ ఆఫీసు వద్ద ఉన్నారని, ఇదే విషయాన్ని సాక్షులు కూడా రూఢీ చేశారంటూ సీఐడీ దర్యాప్తు అధికారి కౌంటర్ దాఖలు చేయడంపై ఒకింత విస్మయం వ్యక్తం చేసింది.
సుబ్బారెడ్డి టీడీపీ ఆఫీసు వద్ద ఉన్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిందని కూడా కౌంటర్‌లో చెప్పడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన జరిగిన రోజున సుబ్బారెడ్డి నర్సరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉంటే, అదే రోజున ఆయన టీడీపీ కార్యాలయం వద్ద ఉండటం ఎలా సాధ్యమని పోలీసులను ప్రశ్నించింది. అలా ఉండే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారి అయిన సీఐడీ డీఎస్పీని ఆదేశించింది.
ఈ నెల 12న మధ్యాహ్నం 2.15 గంటలకు స్వయంగా తమ ముందు హాజరు కావాలని డీఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో..
2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు అడ్డగోలుగా కేసులు నమోదు చేశారు. ఘటనా స్థలంలో లేని వారిని కూడా నిందితులుగా చేర్చారు.
అలా నిందితులుగా చేర్చిన వారిలో గుంటూరు 28వ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును సీఐడీకి బదలాయించింది.
సుబ్బారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌లో దర్యాప్తు అధికారి అయిన సీఐడీ డీఎస్పీ కౌంటర్ దాఖలు చేశారు. ఘటన జరిగిన రోజున సుబ్బారెడ్డి టీడీపీ కార్యాలయం వద్దే ఉన్నారని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని తన కౌంటర్‌లో పేర్కొన్నారు. సుబ్బారెడ్డి అక్కడ ఉన్నట్టు సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఉందని వివరించారు.
పోలీసులు చిక్కుకున్నారిలా..
సుబ్బారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం మరోసారి విచారణకు రాగా.. జస్టిస్ శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పోలీసుల అడ్డగోలుతనానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ అని న్యాయస్థానానికి తెలిపారు.
మేనల్లుడి పెళ్లిలో ఉన్న వ్యక్తిని ఘటనా స్థలంలోనే ఉన్నారని పేర్కొంటూ ఏకంగా హైకోర్టు ముందు కౌంటర్ దాఖలు చేసేంత సాహసం చేశారన్నారు. సుబ్బారెడ్డి ఘటన జరిగిన రోజున నరసరావుపేటలో తన మేనల్లుడి పెళ్లిలో ఉన్నారనేందుకు ఇప్పటికే ఆధారాలను కోర్టు ముందుంచామన్నారు. సీఐడీ డీఎస్పీ తన కౌంటర్‌లో సుబ్బారెడ్డి ఘటనా స్థలంలో ఉన్నట్టు పేర్కొన్న విషయాన్ని నాగిరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
పిటిషనర్ సీసీ టీవీలో ఎక్కడ ఉన్నారో చూపేలా డీఎస్పీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి పెళ్లిలో ఉన్న సుబ్బారెడ్డి, ఘటనా స్థలం (టీడీపీ పార్టీ కార్యాలయం) వద్ద ఉండటమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment