
రాజధాని పునర్నిర్మాణం ఆహ్వాన పత్రంలో పవన్ పేరేదీ?
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన జనసేన కార్యకర్తలు
మళ్లీ పేరు చేర్చి పత్రాలు ముద్రణ
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న అమరావతి రాజధాని పునహ్వార్మాణ కార్యక్రమం ఆహ్వానపత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ముద్రించకపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడడంతో మళ్లీ ఆయన పేరును చేర్చి ఆహ్వాన పత్రాలు ముద్రించారు. అయితే ఇప్పటికే 90శాతం ఆహ్వాన పత్రాల పంపిణీ జరిగిపోయింది.
మోదీ, బాబు పేర్లు మాత్రమే..!
ఈ నెల 2న వెలగపూడిలో అమరావతి పునర్నిర్మాణం పేరుతో భారీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఆర్‌డీఏ నాలుగు పేజీల ఆహ్వానపత్రాన్ని ముద్రించి అందరికీ పంపిణీ చేసింది. మొదటి పేజీ, చివరి పేజీలో అమరావతి డిజైన్లు, ప్రభుత్వ రాజముద్ర, 2వ పేజీలో ఇంగష్, 3వ పేజీలో తెలుగులో ఆహ్వాన పత్రాన్ని ముద్రించారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే ముద్రించారు. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పేరు లేదు. ఈ ఆహ్వానపత్రికలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీఐపీలు, వీవీఐపీలు, ముఖ్యులకు పంపించారు. ఆహ్వానపత్రికలో పవన్ పేరు లేదని ఆలస్యంగా గుర్తించిన జనసేనపార్టీ మిన్నకుండిపోయింది.
పవన్ కళ్యాణ్ కూడా సర్దుకుపోయారు. అయితే జనసేన శ్రేణులు మాత్రం తీవ్రంగా స్పందించారు. సోషల్‌మీడియాలో ప్రభుత్వ తీరుపై నిప్పులుచెరిగారు. తమ నేతను కరివేపాకులా తీసి పారేశారంటూ ఆవేదన వెళ్లగక్కారు. తమ పార్టీ లేకపోతే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని, తమ నేతకే పంగనామాలు పెడతారా? అంటూ పోస్టులు పెట్టారు. దీనికి టీడీపీ శ్రేణులూ కౌంటర్ ఇచ్చాయి. రెండుపార్టీల మధ్య సోషల్‌మీడియా వార్ జరుగుతోంది.
మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు
ఇది చిలికిచిలికి గాలివానలా మారుతోందని గుర్తించిన టీడీపీ పెద్దలు పేరు మరిచిపోయినట్టు నటించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీంతో సీఆర్డీఏ అధికారులు ఆహ్వానపత్రంలో మొక్కుబడిగా పవన్ పేరు చేర్చి మళ్లీ ముద్రించి విడుదల చేశారు. అయితే ఇప్పటికే 90శాతం పత్రికల పంపిణీ పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనతో కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ప్రాధాన్యంపై సర్వత్రా చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్.. చంద్రబాబుకు తలొగ్గి అన్ని విషయాల్లో బేషరతుగా మద్దతు ఇస్తున్నా ప్రభుత్వంలో ఆయనకు ఏమాత్రం విలువ లేదని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.