
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. ఇప్పుడు మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు? అని ప్రశ్నించారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారా? అంటూ మండిపడ్డారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ప్రధాని మోదీ మట్టి, నీరు తీసుకొచ్చి మా ముఖాన కొట్టారని చంద్రబాబు అనలేదా?. మోదీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గతంలో పవన్ విమర్శించలేదా?. మోదీ, చంద్రబాబు పరస్పర అవసరాల కోసం రాజధానిని వాడుకుంటున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. విభజన హామీలు అడగరు కానీ.. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మిస్తారంట. ఒకరిని ఒకరు పొగుడుకోవడానికే సభ నిర్వహించినట్టు ఉంది.
చంద్రబాబు విధానాలతో ఏపీ తీవ్రంగా నష్టపోతోంది. అమరావతి అంతా భ్రమరావతి అని ప్రజలు గమనిస్తున్నారు. అమరావతిపై ఇప్పటికే రూ.52వేల కోట్లు అప్పు చేశారు. ఈ అప్పులు ఎవరు తీర్చుతారు?. ఈ 52 వేల కోట్లను పారదర్శకంగా ఖర్చు పెడుతున్నారా?. 2014-19 మధ్య అమరావతిలో ఏం నిర్మించారు?. అన్నీ తాత్కాలిక భవనాలనే నిర్మించారు కదా?. తాత్కాలికం అంటూనే రూ.5000 కోట్లు ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.11వేలు ఖర్చు చేసి, డబ్బులు గంగలో కలిపారు. రాజధాని నిర్మాణానికి 53వేల ఎకరాలు సరిపోదా.. మరో 45వేల కావాలంట!. గన్నవరం పక్కనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మిస్తారట. 2014-19 మధ్యలో పూర్తి చేయని రాజధానిని వచ్చే మూడేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని ప్రశ్నించారు.

అమరావతి పున:ప్రారంభ సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారు. అమరావతి ఒక అంతులేని కథ. అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ప్లాప్ అయ్యారు. అందుకే చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. పది సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా విభజన చట్టంలో అవకాశం కల్పించారు. చంద్రబాబును అక్కడ తంతే ఇక్కడికి వచ్చి పడ్డాడు. రాత్రికి రాత్రే ఎందుకు హైదరాబాద్ నుండి వచ్చేశారు?. అమరావతి పేరుతో చంద్రబాబు అందరినీ ముంచేశారు. అమరావతి విధ్వంసం చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ నగరం అని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ నగరానికి 52 వేల కోట్లు ఎందుకు అప్పు చేశారు. వర్షం పడితే అమరావతి పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు.