సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి/సత్తెనపల్లి : టీడీపీ, జనసేన మూకలు గుంటూరులో విధ్వంసానికి తెరలేపాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని కొత్త కార్యాలయంపై ఆ మూకలు రాళ్ల దాడిచేశాయి. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు చంద్రమౌళినగర్ మెయిన్‌రోడ్డులో మంత్రి రజిని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తున్నారు. సోమవారం ఉదయం ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ, జనసేన కార్యకర్తల ముసుగులో కొందరు గూండాలు పెద్ద సంఖ్యలో బైక్‌లపై ర్యాలీగా వచ్చారు.
ముందుగా పార్టీ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 12 గంటల తర్వాత కేక్ కటింగ్ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా.. తెలుగుదేశం, జనసేన జిందాబాద్.. అంటూ నినాదాలు చేస్తూ మంత్రి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దీంతో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయం మొత్తం టీడీపీ రౌడీమూకలు విసిరిన రాళ్లతో నిండిపోయింది.
అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఆఫీసు సెక్యూరిటీ మాసారపు చిరంజీవి అడ్డుకోబోతే అతనిపైనా దాడిచేశారు. కార్యాలయం ప్రారంభానికి సంబంధించిన ఫ్లెక్సీలను టీడీపీ మూకలు చించివేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు మేడా ప్రకాష్, సాధు రఘు, మద్దులూరి రామబ్రహ్మం, పుల్లా రేవంత్, కోనేటి సాయిమణికంఠ, పాములపాటి రాంబాబుతోపాటు మరో 24 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సుమారు వంద మంది పాల్గొన్నట్లు పట్టాభిపురం పోలీసులు నిర్ధారించారు. మిగిలిన వారిపైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
పథకం ప్రకారమే దాడి..
ఈ దాడి పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే.. మంత్రి రజినిని ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్‌సీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రమౌళినగర్‌లో పార్టీ కార్యాలయాన్ని ఆమె ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఆమెకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రత్యర్థులు దాడికి దిగినట్లు తెలిసింది. మరోవైపు.. జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కూడా రజినిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వీడియో విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సామాజికవర్గం ఎక్కువగా ఉండే ప్రాంతంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడాన్ని సహించలేని తెలుగుదేశం నేతలు ఈ దాడిని ప్రేరేపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బీసీ మహిళపై టీడీపీ రౌడీయిజం : మంత్రి రజిని
ఈ ఘటనపై మంత్రి రజిని స్పందిస్తూ.. తన పార్టీ కార్యాలయంపై దాడి టీడీపీ గూండాల అధికార దాహానికి పరాకాష్ట అని మండిప డ్డారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళ పోటీచేయడాన్ని చూసి తట్టుకోలేక టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారన్నారు. వారికి ఇప్పటికే ఓటమి భయం పట్టుకుందని.. అందుకే ధ్వంస రచనకు తెరతీశారని ఆమె ఆరోపించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందన్నారు.
వాహనాల ద్వారా బస్తాల్లో రాళ్లు తీసుకొచ్చి పార్టీ కార్యాలయంపై విసిరారని.. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. మంత్రి కార్యాలయంపైనే టీడీపీ రౌడీమూకలు దాడులకు పాల్పడ్డాయంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థంచేసుకోవచ్చన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణే ఉండదన్నారు. ఇలాంటి వారి చేతుల్లో అధికారం పెడితే.. రాష్ట్రం సర్వనాశనమవుతుందని మంత్రి చెప్పారు. భౌతిక దాడులతో నైతికంగా తమను దెబ్బతీయాలని చూస్తున్నారని.. తమ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం ఎవరి తరం కాదని రజిని హెచ్చరించారు. టీడీపీ దౌర్జన్యాలు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో గుంటూరు ప్రజలు ఒకసారి ఆలోచించాలని కోరారు.
దాడి దుర్మార్గం : ఎమ్మెల్యే మద్దాళి గిరి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీసీ మహిళ పోటీచేయడాన్ని టీడీపీ గూండాలు సహించలేకపోతున్నారని స్థానిక ఎమ్మెల్యే మద్దాళి గిరి తెలిపారు. బీసీలను అందలం ఎక్కిస్తామంటూ ఓ పక్క మాయమాటలు చెబుతూ మరోవైపు బీసీలపై ఇలా దాడులకు తెగబడటం టీడీపీకే చెల్లిందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులు చేసిన వారికి ప్రజలే బుద్ధిచెబుతారని హెచ్చరించారు.
బలహీనవర్గాలపై టీడీపీ, జనసేన దాడులు : మంత్రి జోగి
ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ కూడా స్పందిస్తూ.. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీల వారు సంఘ విద్రోహశక్తులుగా, గూండాలుగా మారి బలహీనవర్గాలపై దాడులకు తెగబడుతున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్, పవన్‌లు తమ శ్రేణులను రెచ్చగొడుతూ.. ఇతర పార్టీలపై దాడులు చేయిస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థిర నివాసం కూడా లేని వీరు సీఎం జగన్‌పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న వీరికి రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెబుతారన్నారు.
టీడీపీ, జనసేన కలిశాకే అరాచకాలు : మంత్రి అంబటి
ఇక టీడీపీ, జనసేన పార్టీల కలయిక ప్రజాప్రయోజనాల కోసం కాదని, అరాచకం సృష్టించేందుకేనని.. గుంటూరులో బీసీ మహిళ మంత్రి విడదల రజిని కార్యాలయంపై దాడి ఇందులో భాగమేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రజినీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం టీడీపీ దాష్టీకమని, దీనిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు.
టీడీపీ, జనసేన పార్టీలు కలిసిన తర్వాతే అరాచకాలు పెరిగాయన్నారు. చంద్రబాబునాయుడు నిరాశా నిస్పృహల్లో ఉన్నాడని, పవన్‌కల్యాణ్ ఒక అరాచక శక్తి అని ఆయన నిప్పులు చెరిగారు. ‘ఎర్ర’బుక్కులో పేర్లు రాసుకుని అధికారంలోకి వస్తే అధికారుల తాటతీస్తానని లోకేశ్ హెచ్చరిస్తున్నాడని, టీడీపీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన ఎద్దేవా చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు కుప్పంను కనీసం మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్‌గా కూడా చేసుకోలేని చంద్రబాబుకి ఇప్పుడు ఎన్నికల ముందు అక్కడి ప్రజలు గుర్తుకొచ్చారని అంబటి విమర్శించారు. అంతకుముందు.. ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ.. ఈ ఏడాదంతా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment