housewife
-
HousewifeDermatitis గురించి విన్నారా? చలి చేతికి చిక్కొద్దు!
ఈ చర్మవ్యాధిని గృహిణులకు వచ్చే సమస్యగా ప్రత్యేకంగా పేర్కొంటారు. ఎందుకంటే ఇంటి గచ్చును శుభ్రం చేస్తుండటం, బట్టలు ఉతికే సమయంలో సబ్బు (డిటెర్జెంట్) వీళ్ల చేతుల్ని ప్రభావితం చేస్తుండటం, ఇంటిపనుల్లో ఇంకవైనా రసాయనాలు తగిలి చేతులు ఇరిటేషన్‌కు లోనవ్వడం వంటివి జరుగుతుంటాయి కాబట్టి దీన్ని ‘హౌజ్ వైఫ్ డర్మౖటెటిస్’ అంటారు. దాంతోపాటు చెయ్యిపై దుష్ప్రభావాలు పడతాయి కాబట్టి దీన్ని ‘హ్యాండ్ ఎక్సిమా’, ‘హ్యాండ్ డర్మటైటిస్’ అని కూడా అంటారు. నిజానికి ఇది కేవలం గృహిణులనే కాకుండా పలు రకాల రసాయనాలు వాడే వృత్తుల్లో ఉండే వారందరికీ వస్తుంది. ముఖ్యంగా శుభ్రం చేసే వృత్తుల్లో ఉన్నవారూ, కేటరింగ్, బ్యూటీ కేర్ సెలూన్లలో హెయిర్ డ్రస్సింగ్ చేసేవారూ, హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఉన్నవారు... వీళ్లంతా ఏదో ఒక డిటర్జెంట్ లేదా రసాయనం చేతుల్లోకి తీసుకొని పనిచేస్తుంటారు కాబట్టి వీళ్లందరినీ ఈ ఎగ్జిమా లేదా డర్మటైటిస్ ప్రభావం చూపుతుంది. పైగా చలి పెరిగే ఈ సీజన్లో ఇది మరింత బాధిస్తుంటుంది. మహిళలను ఎక్కువగా బాధించే ఈ సమస్య గురించి తెలుసుకుందాం. ఈ వింటర్ సీజన్లో మామూలుగానే చర్మం పొడిబారడం ఎక్కువ. దీనికి తోడు రసాయనాలూ చేతులపై దుష్ప్రభావం చూపడం వల్ల ఈ సమస్య మరింతగా అరచేతులూ, చేతివేళ్లూ, గోళ్ల చుట్టూ ఉండే చర్మం (పెరీ ఉంగ్యువల్) ప్రభావితమయ్యే భాగాల్లో ఈ సమస్య తీవ్రంగా మారినప్పుడు అక్కడ నీటిపొక్కుల్లా రావడాన్ని పామ్ఫాలిక్స్’ అని అంటారు. ఒక్కోసారి కొందరిలో ఈ సమస్య అనువంశీకంగానూ కనిపిస్తుంది. తమ సొంత వ్యాధి నిరోధక శక్తే తమ చర్మాన్ని దెబ్బతీయడం వల్ల ఇలా జరుగుతుంది. కొన్ని అలర్జిక్ రియాక్షన్స్, ఆహారం వల్ల కలిగే అలర్జీలు, చాలాసేపు నీళ్లలో ఉండటం వంటి అంశాలూ దీన్ని మరింత పెచ్చరిల్లేలా చేస్తాయి. డ్రై స్కిన్ ఉన్నవారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఇక్కడ ఇన్ఫెక్షన్లా కూడా మారి మరింత ఇబ్బంది కలిగించే అవకాశముంది. నివారణ / మేనేజ్మెంట్ / చికిత్స... ఇంటి పనులు అయిన వెంటనే ఘాటైన సువాసనలు లేని మంచి క్లెన్సర్‌ను గోరు వెచ్చని నీటిలో వేసి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. (ఇందుకు వేడి నీళ్లు ఉపయోగించకూడదు. కేవలం గోరువెచ్చని నీళ్లే వాడాలి). ఇక క్లెన్సర్‌ను ఎంపిక చేసే విషయంలో వాటిల్లో ఘాటైన లేదా చేతికి హానిచేసే తీవ్రమైన రసాయన సాల్వెంట్స్ లేకుండా జాగ్రత్తపడాలి. ∙చేతులకు ఈ సమస్యను తెచ్చిపెట్టే డిటర్జెంట్లు / రసాయనాలు కలిపిన నీళ్లు... వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం లేదా తప్పనప్పుడు ఈ ఎక్స్పోజర్ వ్యవధిని వీలైనంతగా తగ్గించడం. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం (హ్యాండ్ హైజీన్‌ను పాటించడం). ఇందుకోసం ఘాటైన సబ్బులను కాకుండా గ్లిజరిన్, ఆల్కహాల్ బేస్డ్ మైల్డ్ శానిటైజర్లు వాడటం. (కీర్తి సురేష్ పెళ్లి చీర : స్పెషల్‌గా కీర్తి ఏం చేసిందో తెలుసా?)ఇల్లు శుభ్రం చేసే సమయంలో లేదా ఇంటి పనులప్పుడు శుభ్రమైన కాటన్ గ్లౌజ్ వాడటం. ఇంటికి సంబంధించిన కాస్తంత మురికి పనులు (డ్రైయిన్లు శుభ్రం చేయడం వంటివి) చేసేటప్పుడూ గ్లౌజ్ ధరించడం. చర్మ సంరక్షణ కోసం వాడే వాసన లేని ఎమోలియెంట్స్ (చేతులకు హాయిగొలిపే లేపనాల వంటివి) వాడటం. అరచేతులు, చేతివేళ్లు తేమ కోల్పోకుండా ఉండేందుకు చేతికి కొబ్బరి నూనె లేదా చేతులు తేమ కోల్పోకుండా చేసే ఆయింట్మెంట్స్ / క్రీమ్స్ వాడటం. చేతులకు తగిలే చిన్న చిన్న దెబ్బలు, గీరుకుపోవడం వంటి వాటినీ నిర్లక్ష్యం చేయకుండా వాటికి తగిన బ్యాండ్ఎయిడ్ వంటివి వేయడం. ఈ జాగ్రత్తలు పాటించాక కూడా ఇంకా చేతులు పొడిబారిబోయి, చర్మం లేస్తుండటం, పొట్టురాలుతుండటం, పగుళ్లు వస్తుండటం జరుగుతుంటే డర్మటాలజిస్టుకు చూపించాలి. వారు తగిన పూతమందులు, ఇతరత్రా చికిత్సలతో సమస్యను తగ్గిస్తారు. లక్షణాలు... చేతులపై చర్మం బాగా పొడిగా మారడం, ఇంతగా పొడిబారడంతో పొట్టు లేస్తుండటం చేతివేళ్లపై పగుళ్లు, ఈ పగుళ్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న పుండ్లలా మారడం (బ్లిస్టర్స్) చర్మం ఊడిపోతూ ఉండటం , చర్మం ఎర్రబారడం ఒక రకమైన నొప్పితో కూడిన ఇబ్బంది. -డా. స్వప్నప్రియసీనియర్ డర్మటాలజిస్ట్ -
ఈ సంవత్సరం ఏం చేశారు?
2023కు వీడ్కోలు ఇవన్నీ ప్రశ్నలే.పునరావలోకనం చేసుకోవాలి.కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలెట్టాలి.జీవితం ఒక్కటే. సాధించాల్సినవి లక్ష.స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు.ఎంత బాగా గడిచాయో అనుకోవాలి.అందుకు తరచి చూసుకుని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం.‘ఏం చేస్తున్నావమ్మా?’ అని పిల్లలు అడిగి ‘అన్నం పెట్టు’ అంటారు. ‘ఏం చేస్తున్నావోయ్’ అని భర్త అడిగి, ‘నా వైట్‌షర్ట్ ఎక్కడా?’ అని ప్రశ్నిస్తాడు. అత్తగారు, మామగారు ‘ఏం చేస్తున్నావమ్మా’ అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్లంతా ఏ పనీ చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి.ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 మరో రెండు మూడు రోజుల్లో వీడ్కోలు తీసుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. గృహిణిగా/ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా ఈ సంవత్సరమంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? ఎన్ని పుస్తకాలు చదివారు? స్త్రీకి మెదడు ఉంటుంది... దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతిఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమేజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే 2023ను మీరు వృథా చేసి ఉంటే మీరు మీ బౌద్ధిక వ్యాయామాన్ని వృథా చేసినట్టు. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్ట్ చేసి మీ స్నేహితులకు పంపి ఇన్‌స్పయిర్ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలని లక్ష్యం పెట్టుకోండి. మంచి సినిమాలు చూశారా? సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటిటిలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నయినా మీరు ఎంచుకుని చూశారా? పోనీ... పాత క్లాసిక్స్... మీరు ఎప్పటినుంచో చూడాలనుకున్నవి... ఎవరూ మధ్యలో డిస్ట్రబ్ చేయని విధంగా చూశారా? సంతోషించారా? ఎంతమంది మిత్రులను పొందారు? ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంతమేరకు నిలబెట్టుకున్నారు. లేదా ఇంటి ఇరుగు పోరుగున, పని చేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు. ఇవాళ రేపు మనుషుల పట్ల నెగెటివిటి పెరిగింది. కాని లోపాలు ఎంచటం తక్కువ... స్నేహాన్ని కొనసాగించడం తక్కువ కొనసాగించారా? బాగా చికాకుగా, డల్‌గా ఉన్నప్పుడు మీరు కాల్ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా? తగ్గిందా? ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు? బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యం అయ్యింది. కాని బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికీ చెడ్డకీ ఆధారపడాల్సింది బంధువులే కదా? ఈ బాంధవ్యాలను, అనుబంధాలను డ్యామేజీ చేశారా? లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు జరగకూడదు? ఎన్ని కొత్తప్రాంతాలు తిరిగారు? సంవత్సరమంతా ఇంటి నాలుగ్గోడలు, ఆఫీసుప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్తప్రాంతాన్ని చూడలేదా? కొత్తనేలను తాకి కొత్తగాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్తప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో కదలండి కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం: కుటుంబం జీవన సర్వస్వం. ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి ఒక్కోసారి. కడుపున పుట్టిన వాళ్ల మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలరా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి. ఎంత పోదుపు చేశారు? పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్లు చేశారా? 2023లో కూడా అదే చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరచరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది. మీ కోసం మీరుఎంత పోదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా? కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయంసమృద్ధికే. ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారు? ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందాం అని ఇంకా ఎన్నేళ్లు అనుకుంటారు. ఈ సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్ కేటాయించుకోండి. జిమ్‌లో చేరండి. వాకింగ్ చేయండి. యోగా క్లాసులకెళ్లండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడాన్ని హక్కుగా పొందండి. 2024లో కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి.కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీ కోసం కూడా మీరు జీవించండి. -
వానరాల వీరంగం.. తీవ్రగాయాలతో గృహిణి మృతి
మహబూబాబాద్ రూరల్: వానరాల మూక చేష్టలతో తీవ్రంగా గాయపడిన ఓ గృహిణి మృతి చెందింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ అర్జున్‌రెడ్డి ఆస్పత్రి సమీపంలో ఆదివారం జరిగిన ఈ సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యుల కథనమిది. స్థానికంగా నివసించే ఎండీ గౌస్ భార్య సాబీరా బేగం (55) ఎప్పట్లాగే ఉదయం నిద్రలేచి ఇంటి ముందు వాకిలి ఊడుస్తోంది. ఈ క్రమంలో ఆమె ఇంటిపై సిమెంటు దిమ్మెకు కట్టిన విద్యుత్ తీగను కోతుల గుంపు ఊపడంతో.. ఆ దిమ్మె ఒక్కసారిగా ఊడిపోయింది. అదే సమయంలో వాకిలి ఊడ్చి ఇంట్లోకి వెళ్లడానికి కదులుతున్న సాబీరాబేగంపై దిమ్మె పడిపోయింది. దీంతో ఆమె తలకు లోపలి భాగంలో తీవ్రగాయమై.. కాలు విరిగింది. రక్తస్రావంతో కుప్పకూలిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త, కుమార్తె ఉన్నారు. -
విధిని ఎదిరించిన పవర్
కృష్ణాడెస్క్: విధి వక్రీకరించింది. సాఫీగా సాగుతున్న జీవితాన్ని ఒక్క కుదుపు కుదిపింది. బయటి ప్రపంచం తెలియని గృహిణిని అభాగ్యురాలిని చేసింది. భర్త, పిల్లలే సర్వస్వం అనుకుని జీవిస్తున్న ఆమెకు మూడు పదుల వయస్సులోనే పసుపు కుంకుమలను దూరం చేసింది. అయినా ఆ మహిళ పరిస్థితులను తలచుకొని కుంగిపోలేదు. విధిరాతను ఎదురించి ఆత్మస్థైర్యంతో జీవనపోరాటం సాగిస్తోంది. విషాదాన్ని దిగమింగుకుంటూ మహిళలకు కష్టతరమైన వృత్తిని సైతం చేపట్టి కుటుంబ భారాన్ని మోస్తోంది. మగవారికే పరిమితమైన పవర్ టూల్స్ మెకానిక్ వృత్తిని చేపట్టి నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన వీరనాగమల్లేశ్వరికి ఇంటర్ చదువుతుండగానే పొరుగు గ్రామం ఉమామహేశ్వరపురానికి చెందిన ఎలక్ట్రీషియన్ చొప్పా రాముతో పెళ్లి చేశారు. వీరికి ఆడ, మగ కవలలు జన్మించారు. పదేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి వైవాహిక జీవితాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో రాముకు కడుపులో ఇన్ఫెక్షన్ సోకింది. క్రమంగా వ్యాధి తీవ్రమై శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి రూ.8 లక్షల రుణం తీసకుని ఆపరేషన్ చేయించినా ఫలితం దక్కలేదు. గతేడాది జూలైలో రాము మరణించాడు. అప్పటికీ రెండో తరగతి చదువుతున్న ఇద్దరు చిన్న పిల్లలతో మూడు పదుల వయస్సు కూడా దాటని నాగమల్లేశ్వ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. గుండె దిటవు చేసుకున్న ఆమె విధిని ఎదురించి నడవాలని సంకల్పించింది. భర్త ఆపరేషన్ కోసం చేసిన రూ. 8 లక్షల రుణభారంతోపాటు కుటుంబ పోషణ, పిల్లల చదువులు ఆమె ముందు సవాళ్లుగా నిలిచాయి. దీంతో అప్పటి వరకు ఇతరులతో మాట్లాడటానికే జంకే నాగ మల్లేశ్వరి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధ పడింది. హనుమాన్‌జంక్షన్ నూజివీడు రోడ్డులో రాము నిర్వహించే రాజధాని పవర్ టూల్స్ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించింది. గతంలో భర్తతో కలిసి షాప్‌కి వెళ్లినప్పుడు పవర్ టూల్స్ రిపేర్లు, విడి భాగాల కొనుగోళ్లు, అమ్మకాలను గమనిస్తుండటంతో కొంత అవగాహన ఏర్పడింది. ఏడాదిగా భవనాల కూల్చివేత, ఐరన్ బార్ బెండింగ్, కార్పెంటర్, ఎలక్ట్రికల్ పనుల కోసం ఉపయోగించే పవర్ టూల్స్ అద్దెకిస్తూ.. వాటికి రిపేర్లు చేస్తూ పిల్లలిద్దరినీ చదివించుకుంటోంది. కుంగిపోకుండా ముందుకు.. బయటకొచ్చి పని చేయటం తెలియని గృహిణికి ఇప్పుడు నిత్యం పదుల సంఖ్యలో కస్టమర్లకు సమాధానం చెప్పే ధైర్యం వచ్చింది. భర్తే తనకు కొండంత ధైర్యమని, ఆయనే తనలో ధైర్యాన్ని నింపి ఈ వ్యాపారం నడిస్తున్నారని చెమర్చిన కళ్లతో నాగ మల్లేశ్వరి చెబుతోంది. పరిస్థితులు తారుమారయ్యాయని కుంగిపోకుండా జీవితంలో ముందుకు సాగటమే తాను నేర్చుకున్న పాఠమని, సవాళ్లను ఎదుర్కొని కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్ కోసం తాను కష్టపడుతున్నానని చెబుతున్న నాగమల్లేశ్వరి మహిళలకు స్ఫూర్తిదాయకం. -
ఎక్స్పీరియన్స్ ఉందా? ...ఆ గృహిణిగా బోలెడంత!
ఒక ఉద్యోగంలో ఎవరైనా ఎన్ని గంటలు పని చేస్తారు? 8 గంటలు. మరి గృహిణి? 24 గంటలు. ఆ అనుభవం ఎక్కువా? ఈ అనుభవం ఎక్కువా? సీట్లో కూచుని చేసే ఉద్యోగం అనుకోండి... గృహిణికి ఇల్లే కదా సీటు. ఆ సీటు వదులుతుందా ఆమె. అందులోనే కూచుని అన్ని పనులూ చక్కబెడుతుంది. పిల్లలూ, వంట, బట్టలుతకడం, అత్తామామలను చూసుకోవడం, బంధువులొస్తే చేసి పెట్టడం.... సరే. బయట తిరిగి చేయాల్సిన ఉద్యోగం అనుకోండి. గృహిణి ఏమన్నా ఇంట్లో కూచుంటుందా ఏం? బయటే కదా తిరగాలి. పిల్లల్ని స్కూల్లో వదలడానికి, కూరగాయలు తేవడానికి, కరెంటు బిల్లు కట్టడానికి, సరుకుల కోసం, ఇంట్లో ఉండే పెద్దవాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి, మందులకూ మాకులకూ... తిరగాల్సిందే కదా. ఉద్యోగంలో నీకు అనుభవం ఉందా అనంటే ఆఫీసులో చేసిన ఉద్యోగానిది మాత్రమే అనుభవమా... గృహిణిగా ఉండి చేసింది అనుభవం కాదా? ఈ ప్రశ్నే వేసింది ఒక గృహిణి. అసలేం జరిగింది సాధారణంగా కొత్త జాబ్ వెతుక్కోవాలంటే సి.వి (రెజ్యూమె)ని పక్కాగా రెడీ చేసుకోవాలి. విద్యార్హతలు, నైపుణ్యాలతోపాటు అనుభవం తప్పనిసరిగా చెప్పాలి. ఉద్యోగం మానేసి మధ్యలో గ్యాప్ ఉంటే ఆ సమయంలో ఏం చేశామో కూడా సదరు కంపెనీకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం చాలామంది రకరకాల కారణాలను చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటోన్న ఓ మహిళ మాత్రం గతంలో ఉద్యోగం చేసి మానేసి తిరిగి ఉద్యోగానికి అప్లయి చేస్తూ గ్యాప్‌లో 13 ఏళ్లపాటు గృహిణిగా పని చేసానని రెజ్యూమెను అప్లోడ్ చేసింది. గ్రౌతిక్ అనే కంటెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు యుగన్ష్ చోక్రా ఆమె సి.వి.ని చూసి మురిసిపోయాడు. ఈమె ఎంతో నిజాయితీగా గృహిణిగా పని చేశానని చెబుతోంది అని ప్రశంసిస్తూ సి.వి.ని లింక్డ్ఇన్లో పోస్టు చేశారు. ఈ పోస్టుప్రకారం... ఓ మహిళ గతంలో ఉద్యోగం చేసి 2009లో ఇంటి అవసరాల నిమిత్తం మానేసింది. ఇప్పుడు కాస్త వెసులుబాటు దొరకడంలో మళ్లీ చేసేందుకు రెడీ అయ్యింది. తన రెజ్యూమెని తయారు చేసింది. అందులో గ్యాప్‌లో ఏం చేశావ్? అనే ప్రశ్నకు పదమూడేళ్లపాటు గృహిణిగా చేశానని చెప్పింది. ‘గృహిణి అంటే ఫుల్‌టైమ్ జాబ్. సి.వి.లో దానిని ప్రత్యేకంగా చెప్పడం చాలా మంచి విషయం. ఎంతో మంది గ్యాప్‌లో ఏం చేశారంటే అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేశామని ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెడుతుంటారు. కానీ ఈమె చాలా నిజాయితీగా చెప్పి తన వ్యక్తిత్వమేమిటో చెప్పకనే చెప్పింది’ అని చోక్రా ప్రశంసించారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇదో మేలుకొలుపు ఈ పోస్టు ఎంతో మంది మహిళలకు, కంపెనీలకు మేలుకొలుపులాంటిది. నిజానికి గృహిణిగా ఉండటానికి ఏ ఉద్యోగి అయినా గ్యాప్ తీసుకుంటే ఆమెకు అదొక ప్రత్యేక అర్హతగా భావించి ప్రత్యేక రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తే తప్పు లేదు. కారణం? గృహిణిగా స్త్రీ ఇంటì ని, తద్వారా సమాజాన్ని నిలబెడుతుంది. పిల్లలను ఆరోగ్యకరంగా పెంచి మంచి పౌరులుగా సమాజానికి ఇస్తుంది. భర్త ఇంటి టెన్షన్లలో మునగకుండా పని మీద శ్రద్ధ పెట్టి మంచిగా పని చేసి వ్యవస్థ ముందుకెళ్లడంలో సాయపడుతుంది. ఇన్ని చేసిన స్త్రీ– తనకు వెసులుబాటు దొరికి ఉద్యోగం చేస్తానంటే పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీలకు ఉంటుంది. అలాంటి స్త్రీలను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజానికుంటుంది. హోం మేకర్‌గా ఇక జీవితం అయిపోయింది అనుకోకుండా అదే ఒక అర్హతగా ఉద్యోగం వెతుక్కోవచ్చని ఈ పోస్టు భరోసా ఇస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... గృహిణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ధైర్యంగా ఉద్యోగాలు వెతుక్కోండి మహిళలూ. -
భర్త సవాలును స్వీకరించి.. సక్సెస్ సాధించి.. ఓ గృహిణి రూ.500 కోట్ల వ్యాపారం కథ!
దేశంలో చాలా మంది గృహిణుల్లో ఉత్తమ వ్యాపార అభిరుచి ఉంటుంది. సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే వారికి ఆశించిన తోడ్పాటు, ఆర్థిక వనరులు ఉండవు. దీంతో తమ వ్యాపార ఆలోచనను అక్కడితోనే ఆపేస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఒక గృహిణి ఇంట్లోనే లోదుస్తులు, ఇన్నర్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించి విజయవంతంగా నడిస్తోంది. తనకంటూ సొంత పేరును సంపాదించుకుంది. కేరళకు షీలా కోచౌఫ్, ఒక వ్యాపారవేత్త భార్య. వారిది బాగా స్థిరపడిన కుటుంబం. అయినా ఆమె తనకంటూ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించింది. తన ఆలోచనను భర్తతో పంచుకుంది. కానీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె భర్త రెండు షరతులు పెట్టాడు. ఒకటి వ్యాపారానికి కుటుంబానికి సంబంధించిన డబ్బును వాడుకోకూడదు. రెండోది వ్యాపార కార్యాలయానికి ఖాళీగా అద్దె కట్టకూడదు. సవాలుకు సై! చాలా సంవత్సరాలు గృహిణిగా ఉన్న షీలా, తన భర్త సవాలును స్వీకరించింది. ఒక బ్యాంకు నుంచి చిన్నపాటి లోన్ తీసుకొని వీ-స్టార్ క్రియేషన్స్ అనే తన లోదుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అలా బ్యాంకు రుణంతో 1995లో ఓ 10 మందితో చిన్న బట్టల వ్యాపారంగా ప్రారంభించింది. కేరళలో విక్రయిస్తున్న ఇన్నర్‌వేర్ లోదుస్తులు చాలామటుకు ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి వస్తున్నాయని గ్రహించిన ఆమె రాష్ట్రంలోనే స్థానిక బ్రాండ్‌గా ఎదిగే లక్ష్యంతో వివిధ డిజైన్లు, రంగులతో నాణ్యమైన లోదుస్తులు, ఇన్నర్వేర్లను తయారు చేయడం ప్రారంభించింది. ప్రారంభంలో బ్రాలు, ప్యాంటీలను 10 మంది ఉద్యోగులు చేతితో కుట్టేవారు. సింపుల్ డిజైన్లు, అందుబాటు ధరల కారణంగా వీ-స్టార్ క్రియేషన్స్ వృద్ధి చెందడం ప్రారంభించింది. ఇప్పుడు మల్టీ-మిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. 1995లో షీలా కొచౌఫ్ స్థాపించిన వీ-స్టార్ క్రియేషన్స్ ఆదాయం 2022 నాటికి దాదాపు రూ. 500 కోట్లకు చేరుకుందని టోఫ్లర్ పేర్కొంది. జీ బిజినెస్ ప్రకారం.. షీలా కోచౌఫ్ మొత్తం నెట్‌వర్త్ 2020లో రూ. 540 కోట్లు. ఇదీ చదవండి ➤ Mira Kulkarni: కొవ్వొత్తుల తయారీతో మొదలుపెట్టి కోట్ల సంపాదన వరకు.. సక్సెస్ స్టోరీ అంటే ఈ ఒంటరి తల్లిదే..! -
అరవైలో అల్లికలు
అభిరుచి ఏ వయసులోనైనా మనకు ఆదాయ వనరుగా మారవచ్చు. గుర్తింపును తీసుకురావచ్చు. ఈ మాటను ‘లక్ష’రాల నిజం చేసి చూపుతోంది ఆరు పదుల వయసులో ఉన్న కంచన్ భదానీ అనే గృహిణి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉండే కంచన్ ఏడాది క్రితం వరకు గృహిణి. ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. అదీ తనకు బాగా నచ్చిన అల్లికల బొమ్మలతో. యేడాదిలోనే రూ.14 లక్షల రూపాయలు సంపాదించడమే కాకుండా, యాభై మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ తన సత్తా ఏంటో నిరూపించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కంచన్కు వచ్చిన ఈ ఆలోచన గురించి ఎవరైనా అడిగితే ఎన్నో విషయాలు వెలిబుచ్చుతుంది. ‘‘వస్త్ర పరిశ్రమ ఎంతో వేగవంతంగా మారిపోతోంది. అయినా ఇప్పటికీ ఇళ్లలో చేతితో కుట్టే ఎంబ్రాయిడరీకి, అల్లిన వస్తువులకు ఎనలేనంత డిమాండ్ ఉంది. ఒకప్పుడు తల్లులు, అమ్మమ్మలు చాలా సాధారణంగా రోజువారీ ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత టేబుల్ క్లాత్‌లు, సోఫా కవర్లు, బొమ్మల వరకు అనేక అలంకార వస్తువులను తయారుచేసేవారు. అలాంటి వస్తువులు కాలక్రమంలో తగ్గిపోతున్నాయి. ఇది గమనించే 2021లో ‘లూప్హూప్’ పేరుతో క్రోచెట్ బొమ్మల యూనిట్‌ను స్టార్ట్ చేశాను. దీనికి ముందు 50 మంది గిరిజన మహిళలకు క్రోచెట్ కళలో శిక్షణ ఇచ్చి, వారికి వర్క్స్ ఇస్తుండేదాన్ని. కోల్‌కతాలో పుట్టిన పెరిగిన నేను మా అమ్మమ్మ, అత్తలు తయారుచేసే క్రోచెట్ బొమ్మలు, టేబుల్ క్లాత్ తయారు చేయడం చూసి నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ప్రతి ఆడపిల్లకు కుట్లు, అల్లికలు నేర్పేవారు. ► స్కూల్లోనూ నైపుణ్యం.. ఇంట్లోనే కాదు, స్కూల్లోనూ క్రోచెట్ వస్తువుల తయారీలో శిక్షణ ఉండేది. దీంతో ప్రాక్టీస్ బాగా అయ్యింది. పెళ్లయ్యాక పట్టణప్రాంతానికి వెళ్లాల్సి రావడం, బాధ్యతలు పెరగడంతో పై చదువులకు వెళ్లలేకపోయాను. కానీ, వచ్చిన క్రోచెట్ కళను ఇష్టంగా చేస్తుండేదాన్ని. మా వారి ఉద్యోగరీత్యా మేం జార్ఖండ్‌లోని జుమ్రీ తెలయాకు మారినప్పుడు అక్కడ గిరిజన స్త్రీలను చూశాను. వారు గనులలో పనులు చేసేవారు. రోజువారి కూలీ ఏ మాత్రం వారికి సరిపోదు. వారి బాధలను చూసి, ఏదైనా మార్పు తీసుకురాగలిగితే బాగుంటుందని ఆలోచించేదాన్ని. ఏదైనా చేస్తాను అనుకుంటాను, కానీ, ఏం చేయాలో కచ్చితంగా తెలిసేది కాదు. ► కుటుంబ బాధ్యతలలో.. ముగ్గురు పిల్లల తల్లిగా నాకు ఇంటి బాధ్యతలు ఎక్కువే ఉండేవి. ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. దీంతో నా సామాజిక ఆకాంక్షలపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. పిల్లలు పెద్దయ్యి, వారి జీవితాల్లో స్థిరపడ్డాక నా అభిరుచిని కొనసాగించాలనే ఆలోచన పెరిగింది. క్రోచెట్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు అప్పుడప్పుడు క్లాసులు తీసుకునేదాన్ని. 2021లో మా పిల్లలతో కూర్చొని చర్చిస్తున్నప్పుడు ఈ క్రోచెట్ బొమ్మల తయారీ పెద్ద ఎత్తున చేసి, అమ్మకాలు జరిపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ► సోషల్ మీడియాలో.. క్రోచెట్ బొమ్మల అమ్మకాలను ఆన్లైన్ ద్వారా చేయాలనే ఆలోచనతో వెబ్సైట్, సోషల్ మీడియా సెటప్స్కి మా పిల్లలు సాయం చేశారు. నేను గిరిజన మహిళలకు క్రొచెట్ వర్క్ నేర్పిస్తూ, వారితో ఈ బొమ్మలను తయారుచేయిస్తుంటాను. యాభై మంది గిరిజన మహిళలు తమ ఇళ్ల వద్దే ఉంటూ సౌకర్యంగా ఈ పనులు చేస్తుంటారు. నా దగ్గర కావల్సిన మెటీరియల్ తీసుకెళ్లి, బొమ్మలతో వస్తారు. ఒక్కొక్కరు రోజుకు 2–3 గంటల క్రోచెట్ అల్లిక చేస్తే నెలకు ఐదు వేల రూపాయలు వస్తాయి. మా జట్టులో ఉండే కొందరు నెలలో 30 బొమ్మలకు పైగా చేస్తారు. దీంతో ఇంకొంత ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా ఏడాది కాలంలో మూడు వేల బొమ్మలను అమ్మగలిగాను. పద్నాలుగు లక్షల రూపాయలు సంపాదించగలిగాను. చదువుకునే పిల్లలు, తీరిక ఉండే గృహిణుల్ని ఈ పనిని ఎంచుకుంటున్నారు. ► మృదువైన బొమ్మలు తాబేళ్లు, కుందేళ్లు, ఆక్టోపస్‌లు, ఏనుగులు, మనుషుల బొమ్మలు వీటిలో ప్రధానంగా ఉంటాయి. వెబ్సైట్, సోషల్‌మీడియా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలోనూ ఈ బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. ఏ పదార్థాలనూ వృథా చేయకుండా ఉన్నితో వీటిని తయారుచేస్తాం. పసిపిల్లలు వీటితో ఆడుకోవడం చాలా ఇష్టపడతారు. ఆదివాసీ సమాజం కోసం ఏదైనా చేయాలన్న నా కల ఇలా తీరడం సంతోషంగా ఉంది. ఏదైనా పనిని ప్రారంభించడానికి అభిరుచి ఉండాలి కానీ, వయసుపైబడటం ముఖ్యం కాదని నమ్ముతున్నాను’’ అని వివరిస్తుంది కంచన్. -
డ్యూటీకెళ్లిన భర్త.. ఇంటికొచ్చేసరికి భార్య అదృశ్యం.. చివరికి..
దుండిగల్(హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చర్చిగాగిల్లాపూర్ చైతన్య కాలనీకి చెందిన సుధాకర్, లక్ష్మిప్రసన్న(23) భార్యాభర్తలు. కాగా ప్రైవేట్ ఉద్యోగి అయిన సుధాకర్ ఈ నెల 10వ తేదీన డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి వచ్చాడు. చదవండి: హాస్టల్లో కామాంధుడు.. విద్యార్థులకు అశ్లీల వీడియోలు చూపించి.. అయితే భార్య ఇంట్లో లేకపోవడంతో చుట్టు పక్కల వారిని వాకబు చేయగా తెలియదని చెప్పారు. ఆందోళన చెందిన అతను లక్ష్మిప్రసన్న సెల్‌ఫోన్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోడంతో భర్త సుధాకర్ ఆదివారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మాటే సోపానం
ఇంటిని చక్కదిద్దుకోవడంలోనే కాదు వంటలు, ఆటలు, కళలు, రకరకాల వృత్తులు, వ్యాపారాలు .. ఇదీ అన్ని చెప్పలేనంత ప్రతిభను మహిళలు మాత్రమే కనబరుస్తారు. వీటన్నింటిలో రాణించాలంటే అవసరమైనది మంచి మాట. ‘నలుగురితో ఎలా మెలగాలో తెలుసుండటంతో పాటు ‘మంచి మాట’ కూడా తోడైతే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలరు అని వివరిస్తున్నారు డాక్టర్ డి.కల్పన. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉంటున్న ఈ పబ్లిక్ స్పీకింగ్ ట్రెయినర్ గృహిణిగా ఉన్న తన జీవితమే ‘మాట’ను ఉపాధిగా మార్చుకోవడానికి ఉపకరించిందని తెలియజేశారు. ‘‘డిగ్రీ పూర్తి చేసిన నాకు పెళ్లి తర్వాత ‘మాట’ సమస్య వచ్చింది. కొన్నాళ్లు నలుగురిలో మాట్లాడటానికి జంకడం నాకు నేనుగా గమనించాను. అది గుర్తించి ఈ సమస్య నుంచి బయటపడాలనుకున్నాను. అందుకు నా కుటుంబం మద్దతుగా నిలిచింది. సమస్య నుంచి బయట పడ్డాను. నాలాగ మొదట మాట తడబడటం అనే సమస్య చాలా మందిలో ఉండటం గమనించాను. కొందరు ‘మాట’తో ఎంతగా వృద్ధిలోకి వస్తున్నారో గమనించాను. కొందరు ప్రతిభ ఉన్నా వెనకంజలో ఉంటున్నవారినీ చూశాను. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు. అప్పుడే ‘పబ్లిక్ స్పీకింగ్’ కాన్సెప్ట్‌పై శిక్షణ అవసరం గ్రహించి, ఇంట్లోవారితో చర్చించాను. అందకు నాకు పూర్తి మద్దతు లభించింది. మీడియా జంక్షన్ పేరుతో పబ్లిక్ స్పీకింగ్పైన 18 ఏళ్లుగా శిక్షకురాలిగా ఉన్నాను. తరగతులకు వచ్చేవారిలో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్నవారు, వచ్చినవారూ పాల్గొన్నారు. వారందరికీ చెప్పిన విషయాల్లో ముఖ్యమైనవి... భయం గడప దాటాలి ప్రతి ఒక్కరిలోనూ వారి మనసు పొరల్లో ఎన్నో అంశాల దాగి ఉంటాయి. కానీ, వాటిని బయటకు సరిగ్గా వ్యక్తపరచలేరు. కొందరు వ్యక్తపరిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. మరికొందరి మాటలను అస్సలు వినలేం. ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించగల నేర్పుతో ‘మాట’ ఉండాలంటే సాధన అవసరం. దానికి ముందు ‘ఏం మాట్లాడితే ఏం అనుకుంటారో’ అనే భయాన్ని వదిలిపెట్టాలి. తల్లిగా పిల్లలతో కథల రూపేణా, వారి విషయాలు కనుక్కోవడంలోనూ మాట్లాడుతూ ఉండాలి. పేరెంట్ టీచర్ మీటింగ్స్‌లో పాల్గొని అక్కడి టీచర్స్‌తో మాట్లాడాలి. అలాగే, ఇంటికి ఎవరో ఒకరు అతిథులుగా వస్తారు. వారితోనూ మాట కలపచ్చు. కాలనీలు, అపార్ట్మెంట్లలో గెట్ టుగెదర్ లాంటివి ఏర్పాటు చేసుకొని, మీరు చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేయాలి. వచ్చిన చిన్న అవకాశాన్నే అయినా ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉంటే అదే సరైన దారి చూపుతుంది. మాట్లాడటం అనే కళను ఒంటపట్టేలా చేస్తుంది. చిన్న చిన్న పార్టీలే మాటకు వేదికలు మాట మనపైన మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకు మహిళలకు తరచూ తారసపడేవి నలుగురైదుగురితో ఏర్పాటుచేసుకునే కిట్టీపార్టీ, బర్త్ డే పార్టీ, చిన్న చిన్న వేడుకలలో ఒక యాక్టివిటీ ప్రోగ్రామ్‌ను ఏర్పాటుచేసి, అందులో పాల్గొనాలి. ఒక్కొక్క పాయింట్ మీద ఒక్క నిమిషం మాట్లాడాలి. ఉదాహరణకు.. క్యాండిల్ కేర్, పెన్ను, పుస్తకం, బెలూన్స్.. ఇలా మీ కళ్ల ముందు ఉన్న వస్తువులను ఉపయోగించుకుంటూ దాని ప్రాముఖ్యాన్ని బయటకు వ్యక్తపరచడం అన్నమాట. మాటతో సమస్యలు దూరం డాక్టర్ మాట ద్వారానే సగం జబ్బు తగ్గిపోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే లాయర్లు కూడా మాట ద్వారానే రాణించాలి. కొన్ని సార్లు మాట కటువుగా, కొన్నిసార్లు మృదువుగా ఉండాలి. ఎక్కడ ఆపాలి, స్వరం ఎక్కడ పెంచాలి అనే విషయాల్లో మనకు పూర్తి ఆత్మవిశ్వాసం వస్తే కోరుకున్న రంగాల్లో కోరుకున్న ప్రగతి సాధించడానికి ‘మాట’ ఎంతగానో సాయపడుతుంది. ‘మాట’ సరైన విధంగా ఉపయోగించకపోతే ఆ ‘మాట’నే వారికి అథఃపాతాళానికి చేరుస్తుంది. ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుంచుకొని వృద్ధిలోకి రావడానికి ‘మాట’ను మంత్రంగా ఉపయోగించుకొని ఎదుగుదలకు సోపానంగా మలచుకోవాలి’’ అని వివరించారు ఈ ట్రెయినర్. బొమ్మలతో స్పీచ్ సాధ్యమే నలుగురైదుగురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒక చోట చేరినప్పుడు ఒక బాక్స్‌లో చిన్న చిన్న బొమ్మలు, వస్తువులు వేసి... ఎవరికి ఏ వస్తువు వస్తే ఆ టాపిక్ మీద నిమిషం సేపైనా మాట్లాడాలి. దినపప్రతికల్లో వచ్చిన ఏదైనా ఒక వార్త తీసుకొని మాట్లాడవచ్చు. మా దగ్గర నాలుగు రోజుల ప్రోగ్రామ్ స్పీకింగ్ కోర్స్‌లో, ఒకరోజు ఫుల్ డే కేటాయిస్తాం. అందుకు అందరికీ వీలున్న సెలవురోజున ఎంచుకుంటున్నాం. డాక్టర్ డి. కల్పన – నిర్మలారెడ్డి -
గృహిణులకు యాక్సిస్ బ్యాంక్ తీపికబురు..!
న్యూఢిల్లీ: విద్యావంతులైన పట్టణ ప్రాంత గృహిణులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ’హౌజ్వర్క్ఈజ్వర్క్(ఇంటిపని కూడా పనే)’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఇంటి పనులకే పరిమితమైపోతున్న మహిళలకు, ఉద్యోగాలు చేయగల సత్తా, నైపుణ్యాలు తమలో కూడా ఉన్నాయనే భరోసా కల్పించేందుకు ఇది తోడ్పడుతుందని బ్యాంక్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) రాజ్‌కమల్ వెంపటి తెలిపారు. దీని కింద గిగ్-ఎ-ఆపర్చూనిటీస్ పేరిట వివిధ ఉద్యోగావకాశాలను యాక్సిస్ బ్యాంక్ తమ ప్లాట్‌ఫామ్‌పై ఉంచిందని వెంటి వివరించారు. దీనికి 3,000 పైచిలుకు దరఖాస్తులు రావడంతో, రాబోయే రోజుల్లో మరింత మందిని రిక్రూట్ చేసుకునేలా హైరింగ్ పరిమితిని పెంచినట్లు పేర్కొన్నారు. వేతనాల విషయానికొస్తే.. చేరే వారి నైపుణ్యాలు, అనుభవాన్ని బట్టి ఉంటాయని.. పూర్తి స్థాయి ఉద్యోగుల తరహాలోనే ఇతరత్రా ఉద్యోగ ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. (చదవండి: మదుపరులకు శుభవార్త.. ఎల్ఐసీ ఐపీఓకు సెబీ ఆమోదం..!) -
ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం!
ఇంటిని, కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది ఇల్లాలు. నిర్ణయమైనా, పనైనా కుటుంబ యోగ క్షేమాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతుంటారు గృహిణులు. ఈ కోవకు చెందిన ఇల్లాలే విజయా రాజన్. తన భర్త, పిల్లలకు పుష్కలంగా పోషకాలతో నిండిన ఆహారాన్ని అందించాలని ఎప్పుడూ అనుకుంటుండేది. ఈక్రమంలో ఎటువంటి ఆహారంలో.. శరీరానికి కావల్సిన పోషకాలు దొరుకుతాయో జాగ్రత్తగా పరిశీలించి, ఆహార పదార్థాలను ఎంపిక చేసి, వాటితో రకరకాల స్నాక్స్‌ను తయారుచేసి కుటుంబ సభ్యులకు పెట్టేది. విజయ చేసే స్నాక్స్ ఇరుగుపొరుగు స్నేహితులకు కూడా నచ్చడంతో .. వారి సలహాతో చిన్న స్టార్టప్‌ను ప్రారంభించింది విజయ. స్టార్టప్ దినదినాభివృద్ధి చెందుతూ నేడు కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది. ఇంగ్లిష్ చానల్ ఈదేందుకు.. విజయ భర్త రాజన్ శ్రీనివాసన్ కి టెలికాంలో ఉద్యోగం. ఆయన సైక్లిస్ట్, రన్నర్, స్విమ్మర్ కూడా. అతడు 2015లో ఇంగ్లిష్ చానల్ ఈదడానికి శిక్షణ తీసుకుంటున్నారు. ఆ చానల్‌ను ఈదాలంటే శరీరంలో శక్తి బాగా ఉండాలి. అందుకోసం బలమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ఆలోచించిన విజయ భర్తకు అధికమొత్తంలో శక్తినిచ్చే ఆహారం ఏంటి? అని మరింత లోతుగా వెతికింది. ఈక్రమంలోనే ఖనిజ పోషకాలు ఉండే ఆహారాలను పంచదార, ప్రిజర్వేటివ్‌లు వాడకుండా స్నాక్స్ తయారు చేసి భర్తకు పెట్టేదామె. వాటిని తిన్న రాజన్ చురుకుగా, ఆరోగ్యంగా కనిపించేవారు. డ్రైఫ్రూట్స్, ధాన్యాలు, పండ్లతో తయారుచేసిన స్నాక్స్‌ని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేవారు. అంతేగాక మూడు నాలుగురోజులపాటు స్నాక్స్ తాజాగా ఉండేవి. ఇదే సమయంలో తన బంధువులు, స్నేహితుల్లో కొందరు కూడా.. పోషకాలతో కూడిన ఆహారం కోసం వెతుకుతున్నారని తెలిసి, తాను తయారుచేసిన స్నాక్స్‌కు వారికి ఇచ్చి రుచిచూడమనేది. అవి తిన్నవాళ్లు ‘‘చాలా బావున్నాయి, ఇలాంటి ఫుడ్ మార్కెట్లో దొరకడం చాలా కష్టంగా ఉంది. నువ్వు ఎందుకు ఈ స్నాక్స్‌ను బయట అమ్మకూడదు. బయట అమ్మావంటే మంచి ఆదాయం కూడా వస్తుంది’’ అని ప్రోత్సహించారు. సిరిమిరి.. కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆదరణతో విజయ స్నాక్స్ విక్రయాలను ప్రారంభించింది. పోషకాలతో కూడిన స్నాక్స్ కావడంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో.. స్నాక్స్ విక్రయాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇదే క్రమంలో 2017లో బెంగళూరులో 15 మంది పనివాళ్లతో ‘సిరిమిరి’ పేరిట స్టార్టప్‌ను ప్రారంభించింది. తన కుటుంబం కోసం తయారు చేసిన స్నాక్స్‌లో కొద్దిపాటి మార్పులు చేసి, మార్కెట్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించి పెద్దమొత్తంలో మార్కెట్లో విక్రయిస్తోంది. విజయ తన బ్రాండ్ పేరు అర్థవంతంగా ఉండాలనుకుని, ‘సిరిమిరి’ని బ్రాండ్ నేమ్‌గా పెట్టుకుంది. కన్నడలో సిరిమిరి అంటే లక్ష్మీదేవి అని అర్థం. వ్యాపార విస్తరణలో భాగంగా ‘అమెజాన్ సహేలి కార్యక్రమం’లో సిరిమిరి ఉత్పత్తులను చేర్చింది. ఈ కార్యక్రమం ద్వారా తన ఉత్పత్తులను మార్కెట్లో ఎలా విక్రయించాలో నేర్చుకుని కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా సిరిమిరి ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇంతింతై వటుడింతై.. భర్త, పిల్లల ఆరోగ్యం కోసం వచ్చిన ఐడియా విజయను ఎంట్రప్రెన్యూర్‌గా మార్చేసింది. తొలినాళ్లలో మూడు రకాల ఎనర్జీ బార్లను విక్రయించిన సిరిమిరి క్రమంగా తమ ఉత్పత్తులను పెంచుకుంటూ పోయింది. ప్రస్తుతం సిరిమిరి పేరిట ఎనిమిది హెల్థీ బార్స్, ఆరు కండరాలకు పుష్టినిచ్చే బార్లు, మరొక హెల్థీ మిక్స్ ఉత్పత్తిని విక్రయిస్తున్నారు. తన స్టార్టప్‌లో తయారైన ఉత్పత్తులను ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తోంది. స్టార్టప్ ప్రారంభంలో కేవలం రెండున్నర లక్షల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికి ప్రస్తుతం కోట్ల రూపాయల టర్నోవర్‌తో సిరిమిరి వ్యాపారం సాగుతోంది. భార్య స్నాక్స్ వ్యాపారం ఇంతింటై వటుడింతయై అన్నట్లుగా విస్తరించడంతో... బ్రిటీష్ టెలికమ్లో కంప్యూటర్ ఇంజినీర్‌గా రెండు దశాబ్దాలుగా చేస్తోన్న ఉద్యోగాన్ని వదిలేసి రాజన్ ఇండియా తిరిగి వచ్చి, సిరిమిరి వ్యాపారంలో భార్యకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారాభివద్ధికి కృషి చేస్తున్నారు. ఆడవాళ్లు అనుకోవాలేగానీ ఏదైనా సాధించగలరు అన్న మాటకు విజయారాజన్ ఉదాహరణగా నిలుస్తూ, ఎంతోమంది ఔత్సాహిక మహిళలకు ప్రేరణనిస్తున్నారు. చదవండి: టెక్సాస్ కొత్త అబార్షన్ చట్టానికి మహిళల నిరసన సెగ..!! -
ఇల్లు – ఆఫీస్ వేగం తగ్గినా రన్నింగే
చంద్రవంక వంటి వంతెన మీద నడక ఒకే వేగంతో ఉండదు. వంతెనకు ఈ చివర ఇల్లు. ఆ చివర ఆఫీస్. ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్ నుంచి ఇంటికీ వంతెన ప్రయాణం. ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ మహిళ అడుగులు వేస్తున్నప్పుడు.. ఎంత అలవాటైన ప్రయాణం అయినా ఏదో ఒక పరిస్థితిలో ఆఫీస్ ఉన్న వైపు నడక వేగం తగ్గుతుంది. అడుగులు ఇంటివైపు లాగుతుంటాయి! కెరీర్ ‘స్లో డవున్’ అయ్యే దశ అది! ‘నువ్వీ రోజు ఆఫీస్‌కి వెళ్లొదు, ‘నువ్వా క్యాంప్‌ను క్యాన్సిల్ చేసుకో’, ‘కొన్నాళ్లు సెలవు పెట్టొచ్చు కదా’.. అని ఇల్లు డిమాండ్ చేస్తుంది. వినకుంటే ఆదేశిస్తుంది. అప్పటికీ కాదంటే.. ఆర్యోగంపై, మనసుపై ఒత్తిడి తెస్తుంది. అప్పుడేం చేయాలి?! ‘‘ఏమాత్రం ఒత్తిడి తీసుకోకుండా.. స్లో డవున్ అవడమే మంచిది. ఆ స్లో డవునే ఆ తర్వాత మీ కెరీర్‌ని ‘స్పీడ్ అప్’ చేస్తుంది’’ అని నమ్మకంగా చెబుతున్నారు అశ్విని నందిని. అశ్విని ఎంత పెద్ద ఉద్యోగినో, అంతకన్నా పెద్ద బాధ్యతలు గల గృహిణి. అశ్విని గురించి చెప్పుకుంటున్నాం కనుక అశ్విని అంటున్నాం కానీ.. ఎంత సాధారణ ఉద్యోగం చేసే మహిళ నుంచైనా ఇల్లు అసాధారణ స్థాయిలోనే తన నిర్వహణ కోసం పట్టుబడుతుంది! ‘నువ్వు దగ్గర లేకుండా నేనెలా నడుస్తాను’ అని ఇల్లు ఏ మాత్రం దయ, జాలి, సానుభూతి, మొహమాటం లేకుండా అనేస్తుంది. అశ్విని నోయిడాలోని ‘గ్లోబల్‌లాజిక్ ఇండియా’ లోని డెలివరీ అస్యూరెన్స్ విభాగానికి అధిపతి. ఆ సంస్థ హెడ్ ఆఫీస్ కాలిఫోర్నియాలో ఉంది. ఉద్యోగం చేసే ఏ మహిళకైనా ఆమె చెప్పేదొక్కటే.. ‘మీరు సూపర్ ఉమన్‌లా ఇంట్లో, ఆఫీస్‌లో పడీ పడీ చేయడానికి ప్రయత్నించకండి. భుజంపై కావడి లా రెండిటినీ మోసుకుని వంతెన పై ఒక రోబోలా ప్రయాణించకండి..’’ అని. మల్టీ టాస్కింగ్ పట్ల ఆమెకు గొప్ప అభిప్రాయమేమీ లేదు. ఇంట్లో ముఖ్యమైన పని ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆప్పుడు ఆఫీస్‌కు రెండో స్థానం. ఇక ఆఫీస్‌లో చేసి తీరవలసిన పని ఉంటే ఆఫీస్ పనికే ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడు ఇంటికి రెండో స్థానం’’ అని చెబుతారు అశ్విని. అలా కుదురుతుందా? ‘ఎందుకు కుదరదు?’ అని ఆమె ప్రశ్న. ఈ ప్రశ్న వేయగలిగినంత సమన్వయ బలాన్ని ఆమె ఇల్లు, ఆఫీసే ఆమెకు ఇచ్చాయి. 1980 లలో ఢిల్లీ యూనివర్సిటీలో మేథ్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటికి వచ్చారు అశ్విని. తర్వాత ఏమిటి? అప్పట్లో డిగ్రీ చేసిన వారెవరికైనా మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకుంటే హాటెస్ట్ కోర్సు.. ‘ఎంసీఎ’. మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఆ కోర్సులో చేరాకే మొదటిసారి కంప్యూటర్ని చూశారు అశ్విని. కంప్యూటర్ని వేళ్లతో తాకడం కూడా అప్పుడే. ఆ క్షణంలోనే కంప్యూటర్‌తో ఆమెకు అనుబంధం ఏర్పడి పోయింది. మేథ్స్ ఉపయోగించి సమస్యల్ని పరిష్కరించడం ఆమెకో ఆటలా ఉండేది. ఆ ఆటకు కంప్యూటర్ సాధనం అయింది. కోడ్స్ రాయడం, అల్గోరిథమ్స్ వృద్ధి చేయడం ఆమెకు ఇష్టమైన కఠిన వ్యాయామాలు. గ్లోబల్‌లాజిక్ ఇండియా డెలివరీ అస్యూరెన్స్ హెడ్‌గా ఇప్పుడు ఆమె చేస్తున్న పని అదే. అదొక టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ. కంపెనీలకు అవసరమైన ప్రోగ్రామింగ్‌లను రాసి, తన టీమ్ చేత రాయించి డెలివరీ చేయిస్తుంటారు. ‘ఇంటెరల్ ఐటీ’, ‘టాటా యునిసిస్’ వంటి పెద్ద సంస్థల్లో పని చేసి వచ్చాక 2007లో ఆమె గ్లోబల్‌లాజిక్‌లో చేరారు. ఇక ఇప్పుడు ఆమె ఆఫీస్ బయట చేస్తూ వస్తున్న ఉద్యోగం కూడా ఒకటి ఉంది. లైఫ్ కోచ్. ఉద్యోగం అంటే ఎవరి దగ్గరో లైఫ్ కోచ్‌గా చేయడం కాదు. తనే సొంతంగా ‘వంతెన మీద నడిచే’ గృహిణి కమ్ ఉద్యోగినులకు బ్యాలెన్సింగ్‌లో తర్ఫీదు ఇస్తుంటారు. ‘‘ఇల్లు ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా అని రెండిటి మధ్య పరుగు పందెం పెట్టకండి. ఇల్లు పరుగెత్తదు. ఆఫీసూ పరుగెత్తదు. మీరే పరుగెత్తాలి. కనుక.. అప్పటికి ఏది ప్రాధాన్యమో దానివైపు మొగ్గ చూపండి. నష్టమేం లేదు’’ అన్నది ఆమె తరచు చెబుతుండే పాఠం. లైఫ్ కోచ్‌గా ఆమె దగ్గరకు వస్తుండే వాళ్లంతా మల్టీ నేషనల్ కంపెనీలలో నాయకత్వ బాధ్యతల్లో ఉన్న మహిళలే. వాళ్లంతా ఇంటికి, ఆఫీస్‌కి మధ్య చిక్కుకున్నవారు. అశ్విని లైఫ్ కోచ్ అవడానికి స్వీయానుభవాలే ప్రేరేపించాయి. ‘‘సమాజాన్ని మెరుగు పరిచినా, సామాజిక జీవన స్థితిగతుల్ని క్షీణింపజేసినా ఇల్లూ, ఆఫీసేనని ఆమె అభిప్రాయం. అంత ప్రాముఖ్యం గల రెండు వ్యవస్థల్ని సవ్యసాచిలా నడుపుతున్న మహిళలు.. సమానత్వాన్ని, సాధికారతను సాధిస్తూనే ఉన్నా వంపు వంతెనపై నడవడం వారికి పెద్ద సవాలుగా ఉంటుంది. నన్నే చూడండి. నా కూతురు పన్నెండో తరగతి చదువుతున్నప్పుడు తనని దగ్గరుండి చదివించడానికి, తనకి కావలసినవి వేళకు అమర్చడానికి నేను ఉద్దేశపూర్వకంగా ఇంటì వేగాన్ని పెంచి, ఆఫీస్ వేగాన్ని తగ్గించుకున్నాను. అందువల్ల నా కెరీర్ కూడా కొంత దెబ్బతినింది. పట్టించుకోలేదు. ఆ తర్వాత నా ఆఫీస్ వేగాన్ని పెంచుకున్నాను’’ అని చెప్తారు ఇద్దరు పిల్లల తల్లి అయిన అశ్విని. ఆమెకు మరొక అనుభవం కూడా ఉంది. కెరీర్ ఆరంభంలో ఆఫీస్ తరఫున అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. కొన్ని నెలల పాటు అక్కడే ఉండిపోవాలి. అప్పటికి ఆమె మొదటి బిడ్డ తల్లి. క్షణం కూడా ఆలోచించకుండా అమెరికా ఆఫర్‌ని కాదనేశారు. ‘‘వెళ్లొచ్చా అని అడగడం కాదు. వెళ్లాలో వద్దో మనకే తెలిసిపోవాలి’’ అంటారు అశ్విని. ఇల్లు ముఖ్యమా, ఆఫీసు ముఖ్యమా అని రెండిటి మధ్య పరుగు పందెం పెట్టకండి. ఇల్లు పరుగెత్తదు. ఆఫీసూ పరుగెత్తదు. మీరే పరుగెత్తాలి. కనుక.. అప్పటికి ఏది ప్రాధాన్యమో దాని వైపు మొగ్గు చూపండి. నష్టమేం లేదు. -
భర్త తిట్టాడనే మనస్తాపంతో!
కొత్తకోట రూరల్: పట్టణ కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన కొమ్ము నర్సమ్మ(60) సోమవారం భర్త తిట్టాడని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువుల దగ్గర వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం, ఆమె భర్త చంద్ర య్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు సెల్ నంబర్ 94407 95727కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ పేర్కొన్నారు. చదవండి: పక్కింటికే కన్నం వేసిన జల్సారాయుడు! -
ఇద్దరు పిల్లలతో సహా గృహిణి అదృశ్యం
సాక్షి, రాజేంద్రనగర్: ఇద్దరు పిల్లలతో సహా గృహిణి కనిపించకుండాపోయిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ కేపీఆర్ కాలనీకి చెందిన బాల్‌రెడ్డి, రాధిక(23) భార్యాభర్తలు. వీరికి గౌరీష్రెడ్డి(4), రిత్విక్‌రెడ్డి(5 నెలలు) సంతానం. ప్రైవేటు ఉద్యోగి అయిన బాల్‌రెడ్డి సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం ఉండడంతో భార్య, పిల్లలు బజారుకు వెళ్లి ఉంటారని వేచి చూశాడు. రాత్రి వరకు భార్యాపిల్లలు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్థానిక ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో వాకబు చేశాడు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉదయం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేటీఎం అప్డేట్ కేటుగాళ్లకు సంకెళ్లు! సాక్షి, హైదరాబాద్: పేటీఎం ఖాతాలోని ‘నో యువర్ కస్టమర్ (కేవైసీ)’ వివరాలు అప్డేట్ పేరుతో బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు సైబర్ నేరగాళ్లను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం జమ్తారా, దేవ్గఢ్లో పట్టుకున్న వీరిని ట్రాన్సిట్ వారంట్‌పై మంగళవారం తీసుకొచ్చారు. నిందితుల నుంచి రూ.1,47,000ల నగదుతో పాటు ఆరు సెల్ఫోన్లు, రెండు ఆధార్ కార్డులు, మూడు డెబిట్‌కార్డులు, ఐదు విద్యుత్ బిల్లుల చెల్లింపు కాపీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ ఏసీపీ వి.శ్యాంబాబుతో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ మీడియాకు తెలిపారు. విద్యుత్ బిల్లులు చెల్లించి నగదుగా మార్పు... ఈజీ మనీ కోసం అలవాటు పడిన జార్ఖండ్‌కు చెందిన నంకు మండల్, రాజేష్ మండల్లు పేటీఎం అప్డేట్ పేరుతో బాధితుల ఖాతా నుంచి డబ్బును మొబిక్విక్, ఫోన్‌పే,పేటీఎం వ్యాలెట్స్‌కు బదిలీ చేసుకునేవారు. దానిని నగదు రూపంలోకి మార్చుకునేందుకు శివశక్తికుమార్ అలియాస్ అమిత్ బర్నవల్ను కలిశారు. ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు మదన్ లాల్ బజాజ్ కు చెందిన రూ.1,60,000 విద్యుత్ బిల్లులను గౌరవ్ అరుణ్ అనే వ్యక్తి శివశక్తికుమార్కు అందించాడు. ఇవే బిల్లులను నంకు, రాజేష్ మండల్లకు ఇవ్వడంతో తమ వ్యాలెట్‌లో ఉన్న కొట్టేసిన డబ్బులతో ఆన్లైన్లో బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత శివశక్తికుమార్ తన 30 శాతం కమిషన్ మినహాయించుకొని మిగతా డబ్బులను వీరికి అందించాడు. కాగా, రష్యాలో మెడిసిన్ చేసి భారత్‌లో ఎంబీబీఎస్ వ్యాలిడిటీ కోసం నిర్వహించే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పరీక్షలో ఫెయిల్ అయిన గౌరవ్ అరుణ్ అనే వ్యక్తి 20 శాతం కమిషన్ తీసుకొని విద్యుత్ బిల్లులను శివశక్తికుమార్ ఇచ్చాడు. దిల్కుష్ కుమార్ సింగ్ అనే వ్యక్తి నకిలీ బ్యాంక్ ఖాతాలను నంకు మండల్‌కు సమకూర్చేవాడు. వీరిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు టెక్నికల్ డాటాతో ఐదుగురినీ జార్ఖండ్‌లో పట్టుకొని ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. ఇలా మొసగించారు.. ‘ఈ ఏడాది సెప్టెంబర్ 1న డియర్ కస్టమర్...మీ కేవైసీ సస్పెండ్ అయింది. పేటీఎం ఆఫీసు నంబర్ 8345989385కు వెంటనే కాల్ చేయండి. లేకపోతే 24 గంటల్లో మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది. థ్యాంక్ యూ పేటీఎం’ అంటూ సెల్‌ఫోన్‌కు వచ్చిన సంక్షిప్త సమాచారం(ఎస్ఎంఎస్)కు మియాపూర్‌కు చెందిన బాధితురాలు స్పందించారు. సదరు పేటీఎం ఉద్యోగిగా చెప్పుకున్న సైబర్ నేరగాడికి ఫోన్‌కాల్ చేశారు. అతడు చెప్పినట్టుగా సెల్ఫోన్లో టీవ్ వీవర్ క్విక్ సపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ ఐడీ నంబర్‌ను సైబర్ నేరగాడికి చెప్పడంతో సెల్‌ఫోన్‌ను ఆపరేట్ చేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత రూ.1 పేటీఎం వ్యాలెట్‌కు యాడ్ చేయమని చెప్పాడు. దీంతో బాధితురాలు పేటీఎం వ్యాలెట్‌కు వెళ్లి బ్యాంక్ ఖాతా వివరాలు పేటీఎంలో ఎంటర్ చేశారు. సెకన్లలోనే ఆమె సెల్‌ఫోన్‌కు మీ ఖాతా నుంచి రూ.4,29,360లు డెబిట్ అయ్యాయని ఎస్ఎంఎస్లు వచ్చాయి. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సెప్టెంబర్ 2న సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.’ భారీ డిస్కౌంట్ల పేరుతో రూ.6 లక్షలు స్వాహా సాక్షి, హైదరాబాద్: తమతో వ్యాపారం చేస్తే భారీ డిస్కౌంట్‌తో ఆయిల్స్ సరఫరా చేస్తామంటూ నగర వాసికి ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.6 లక్షలు కాజేశారు. బాధితుడు సోమవారం రాత్రి సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హిమాయత్‌నగర్ ప్రాంతానికి చెందిన అనిరుద్ధ్ అగర్వాల్‌కు ఇండియా మార్ట్ అనే ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ నుంచి కాల్ వచ్చింది. ఆ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నంటూ అజయ్ కులారియా అనే ఓ వ్యక్తి మాట్లాడాడు. గుజరాత్‌కు చెందిన శివ ఎంటర్ ప్రైజెస్ సంస్థ వివిధ రకాలైన ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటోందని, వీరితో కలిసి వ్యాపారం చేస్తే భారీ రాయితీతో వాటిని తీసుకోవచ్చని ఎర వేశాడు. ఇతర వివరాలు కోసమంటూ రాహుల్ పటేల్ అనే వ్యక్తిని సంప్రదించమని ఫోన్ నంబర్ ఇచ్చాడు. అనిరుద్ధ్ అతడితో మాట్లాడటంతో సరుకు విలువలో 50 శాతం ముందు చెల్లిస్తే ఆయిల్ పంపుతామని చెప్పాడు. ఇది నమ్మిన బాధితుడు రూ.6 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత నుంచి నేరగాళ్లు స్పందించడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన అనిరుద్ధ్ బుధవారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. తొలిసారిగా ఒకే ఒక్క కేసు... నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ఎఫెక్ట్ సైబ ర్ క్రైమ్ బాధితుల పైనా పడింది. ఈ కారణంగానే మంగళ వారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఒకే ఒక్క కేసు న మోదైంది. గడిచిన రెండుమూడేళ్ల కాలంలో ఇలా జరగడం మొదటిసారని అధికారులు చెప్తున్నారు. పేటీఎం ఖాతాకు సంబంధించిన కేవైసీ అప్డేట్ చేయాలంటూ నగర వాసికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.70 వేలు కాజేశారు. బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆత్మహత్య చేసుకుంటున్నా... సాక్షి, బంజారాహిల్స్: తాను ఆ త్మహత్య చేసుకుంటున్నాన ని తండ్రికి మెసేజ్ పెట్టి ఓ యువ దర్శకుడు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటగిరిలోని కమలా నిలయంలో ఒడిశాకు చెందిన దీపక్ రంజన్ బెహరా(27) అద్దెకుంటున్నాడు. ఈ నెల 11న మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో భోజనానికి వెళ్తున్నానని స్నేహితుడు సునీల్‌కి చెప్పి వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తన తండ్రి హరిశ్చంద్ర బెహెరా ఫోన్‌కు దీపక్ ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పెట్టాడు. తనకు రూ. 6 లక్షల అప్పు ఉందని, దాన్ని తీర్చాలని మెసేజ్‌లో పేర్కొన్నాడు. వెంటనే దీపక్‌కు అతడి సోదరుడు దినేష్ ఫోన్ చేయగా కలవలేదు. దీపక్ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దిశ సినిమాను నిలుపుదల చేయాలి సాక్షి, బన్సీలాల్‌పేట్: దిశ సంఘటన ఆధారంగా రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న దిశ సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని రెడ్డి జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రెడ్డి జేఏసీ ప్రతినిధులు మంగళవారం కవాడిగూడ సీజీఓ టవర్స్‌లోని సెన్సార్ బోర్డు రీజినల్ అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి జేఏసీ గ్రేటర్ అధ్యక్షుడు కె. ధర్మారెడ్డి, మహిళా అధ్యక్షురాలు విజితా రెడ్డి, సుమతీరెడ్డి, శ్వేతారెడ్డి మాట్లాడుతూ...దిశ సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆ బాధ నుంచి కోలుకోక ముందే దిశ పేరిట రాంగోపాల్‌వర్మ సినిమా తీసి విడుదల చేస్తామనడం సరికాదన్నారు. నవంబర్ 26న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయని, వెంటనే సెన్సార్ బోర్డు దిశ సినిమాను నిలిపివేయాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ ప్రతినిధులు విజయారెడ్డి, రాంచంద్రారెడ్డి, రంగారెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోటీశ్వరి
సక్సెస్ స్టోరీలన్నీ కష్టాల నుంచే మొదలవ్వవు. మంచి ఆలోచనల నుంచి కూడా అవి ‘తయారవుతాయి’. శశిరేఖకు మొదట వచ్చిన ఆలోచన.. ఇంటి పనిలో దొరికించుకున్న ఖాళీ సమయంలో తనేదైనా పని చెయ్యాలని. రెండో ఆలోచన.. తను పని చేస్తూ, కొంతమందికి పని కల్పించాలని. అలా మొదలైందే.. జీవీఎస్ ఫుడ్స్. రెడీమేడ్ రొట్టెలతో అమ్మకాలను మించిన నమ్మకాన్ని పొందుతున్న శశిరేఖను రోటీశ్వరి అనడమే ఆమె విజయానికి సరైన పోలిక. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటారు శశిరేఖ. గృహిణి. భర్త ప్రైవేట్ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. అంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు.. ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు భార్యాభర్తల మాటల్లోకి చపాతీలు, జొన్నరొట్టెలు, పుల్కాలు వచ్చాయి. ‘‘అవును, ఇప్పుడంతా ఉదయం పూట టిఫిన్‌గా, రాత్రి భోజనానికి బదులుగా అవే తింటున్నారు’’ అని భార్య అంటే.. బయట మార్కెట్లో కూడా బాగా గిరాకీ కనిపిస్తోంది’’ అని భర్త అన్నాడు. అప్పుడొచ్చింది శశిరేఖకు ఆలోచన. తను కూడా చపాతీలు, జొన్నరొట్టెలు, పుల్కాలు చేసి అమ్మితే?! అయితే అప్పటికప్పుడు వాటిని తయారు చేసి అమ్మడం కాకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినేందుకు వీలుగా ప్యాక్ చేసి మార్కెట్‌కు వెయ్యడం కరెక్ట్ అనిపించింది ఆమెకు. భర్త బాలరాజుకూ ఆ ఆలోచన నచ్చింది. ఆవిర్భావం! భర్త ఓకే అన్నాడు. కావలసిన సామగ్రి తెచ్చిపెట్టాడు. తయారీకి ఐదుగురు మహిళల్ని తీసుకున్నారు. కొద్దిపాటి వ్యాపారమే. మెల్లిగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక చేతులు సరిపోవడం లేదు. యంత్రాలు కావలసిందే. ఉన్నవి అమ్ముకుని కొంత, బ్యాంక్ లోను కొంత కలిపి యాభై లక్షల రూపాయలతో కోయంబత్తూర్ నుంచి ఆటోమేటిక్ అన్కుక్డ్ మెషిన్లు రెండింటిని తెప్పించారు. ఇంటినే కర్మాగారంగా మార్చేశారు. ఒక్కో మిషన్‌పై గంటకు 500 చపాతీలు తయారవుతాయి. రెండు మెషీన్ల నుంచి వెయ్యి చపాతీలను గంటలోనే తయారు చేస్తారు. పిండి కలపడం, ముద్దలుగా చేయడం, ప్రెస్ చేయడం, మిషనరీపై నుంచి తయారైన వాటిని ప్యాక్ చేసేయడం. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరలకే ఇస్తుండడంతో డిమాండ్ కూడా బాగా పెరిగింది. రెడీమేడ్‌గా తయారు చేసిన ఈ చపాతీలు, జొన్నరొట్టెలను పొయ్యిపై పెనం పెట్టి కొంచెం వేడి చేసుకుంటే చాలు. కమ్మగా తినచ్చు. ప్యాకింగులో వారం రోజులు నిల్వ ఉంటాయి. తల్లి మనసు ‘‘మేలు రకం గోధుమపిండి, వంటనూనె, మినరల్ వాటర్‌ను వీటి తయారీకి ఉపయోగిస్తాం. నాణ్యత, స్వచ్ఛతే మా వ్యాపారాభివృద్ధికి మార్గమైంది’’ అంటారు శశిరేఖ. ‘‘మా రెడీమేడ్ చపాతీలను, జొన్నరొట్టెలను గృహిణులు ఇంట్లో చేసి, స్కూలుకు వెళ్లే చిన్నారులకు సైతం టిఫిన్ బాక్సుల్లో పెట్టి పంపిస్తున్నారు. పిల్లలు ఎంతో ఇష్టంతో తింటున్నారు’’ అని సంతోషంగా చెబుతున్నప్పుడు శశిరేఖలో మనకు వ్యాపారవేత్త కన్నా, తల్లి మనసే కనిపిస్తుంది! ‘‘బీపీ, షుగర్, ౖథైరాయిడ్, ఒబేసిటీ ఉన్నవారు చపాతీలు, పుల్కాలు, జొన్నరొట్టెలు తినడం మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. దాంతో ఇటు చిన్నారుల నుంచే కాకుండా పెద్దల నుంచి కూడా మా ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని’’అంటారు శశిరేఖ. ఇతర రాష్ట్రాల నుంచీ..! రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తుంటాయి. ‘‘హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, దాబాలు, రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు పెరిగాయి. అంతేకాకుండా అమెరికాకు వెళ్లే మన తెలుగు వారికి ఇక్కడినుంచి చపాతీలు, పుల్కాలు, జొన్నరొట్టెల పార్సిళ్లు పంపుతున్నాం’’ అని చెప్పారు శశిరేఖ. – మొలుగూరి స్వర్ణలత, సాక్షి, హైదరాబాద్ -
ఢోక్లా క్వీన్
ఢోక్లాతో మొదలుపెట్టి ఖాండ్వి, భేల్పురి, సేవ్‌పురి, ఘుగ్రా వంటి గుజరాత్ సంప్రదాయ వంటకాలన్నింటినీ ఇష్టపడి, వాటికి అలవాటు పడిన ముంబై మహానగరం నేటికీ నీలా మెహతాను తలచుకుంటూనే ఉంది. ముంబైలో ఢోక్లా క్వీన్‌గా, మిగతా ప్రపంచానికి భేల్ క్వీన్‌గా ప్రసిద్ధురాలైన ఈ గుజరాతీ గృహిణి.. స్నాక్స్ వ్యాపారంలో ఒక ట్రెండ్‌ను సృష్టించి వెళ్లారు. అది 1974. నీలా మెహతా అనే యువతి పెళ్లి చేసుకుని గుజరాత్‌లోని బారుచ్ నుంచి ముంబైకి వచ్చింది. అప్పటి గృహిణులకు తెలిసింది.. భర్త, పిల్లలకు వండి పెట్టుకుంటూ, ఇంటిని చక్క దిద్దుకుంటూ గడపడమే. అయితే ముంబై మహానగరంలో ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవదని అర్థమైందామెకి. తనకు ఇష్టమైన ఎంబ్రాయిడరీ చేసింది. చీర మీద సన్నని అందమైన ఎంబ్రాయిడరీ చేయడానికి నెల రోజులు పట్టేది. నెల రోజులపాటు పడిన శ్రమకు వచ్చిన డబ్బు సంతృప్తినిచ్చేది కాదు. అప్పుడే ఒక కొత్త అడుగు వేశారు నీలా మెహతా. తనకు చెయ్యి తిరిగిన గుజరాత్ వంటకాలను ముంబైవాసులకు రుచి చూపించారు. ‘ఢోక్లా’ పేరు వినడమే కానీ దాని రుచితో పరిచయం లేని ముంబై వాళ్లు లొట్టలేసుకుని తిన్నారు. ఢోక్లాతో పరిచయం ఉండి, ఉద్యోగరీత్యా ముంబయిలో స్థిరపడిన వాళ్లు నీలా మెహతా చేతి ఢోక్లా తిని సొంతూరికి వెళ్లి వచ్చిన అనుభూతికి లోనయ్యారు. ఢోక్లాతో మొదలు పెట్టి ఖాండ్వి, భేల్పురి, సేవ్‌పురి, ఘుగ్రా వంటి గుజరాత్ సంప్రదాయ వంటకాలన్నింటినీ ఇష్టపడడం ముంబై వాళ్లకు అలవాటై పోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ముంబై నగరం నీలా చేతి వంటకు దాసోహం అయింది. ఇందుకోసం నీలా మెహతా పెద్ద పెట్టుబడి పెట్టిందేమీ లేదు. తాను నివసిస్తున్న ఇంటి వంట గదిలో తనకు చేతనైన వంటకాలను చేయడం, వాటిని డోర్ డెలివరీ చేయడం. ఇక్కడ ఆమె ప్రవేశ పెట్టిన డోర్ డెలివరీ మార్కెటింగ్ టిప్... ఆమెకు అతి కొద్ది సమయంలోనే ‘ఢోక్లా’ క్వీన్ బిరుదును తెచ్చి పెట్టింది. రంగుల ప్రయోగం వ్యాపార రంగంలో ఒకరు ఒక కొత్త ఐడియాతో వచ్చిన తర్వాత వారి అడుగుజాడల్లో నడవడానికి మరెంత మందో సిద్ధంగా ఉంటారు. నీలా మెహతా ఐడియా సక్సెస్ కావడంతో మగవాళ్లు కూడా తమ రాష్ట్రాల సంప్రదాయ వంటల వ్యాపారంలోకి వచ్చేశారు. అప్పుడు నీలా మెహతా తన హోమ్ఫుడ్లో ప్రయోగాలు మొదలు పెట్టారు. స్వాతంత్య్రోద్యమం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో మూడు రంగుల ఢోక్లాను ప్రవేశపెట్టారు. ఒక వరుస శనగపిండితో చేసిన పసుపు రంగు ఢోక్లా, మరో వరుసలో బియ్యం గోధుమ పిండితో చేసిన తెల్లటి ఢోక్లా, వాటి మధ్యలో పుదీనా వంటి ఆకుపచ్చ రంగు చట్నీతో ‘తిరంగి ఢోక్లా’ను రుచి చూపించారు. ఢోక్లా వడ్డించడం ఓల్డ్ ఫ్యాషన్ అని శాండ్‌విచ్‌లతో ఆతిథ్యం ఇచ్చే సంపన్న కుటుంబాలు కూడా తమ ఇళ్లలోని వేడుకలకు ఈ తిరంగి ఢోక్లా కోసం నీలా మెహతాకు ఆర్డర్ ఇవ్వడం మొదలైంది. పెళ్లి సీమంతం వంటి వేడుకలకు ఐదురంగులతో ‘పంచరంగ్’ ఢోక్లా చేశారు నీలా మెహతా. ‘ఎంటర్ప్రెన్యూర్ అనే పదం మహిళాలోకానికి చెందినది కాదు, ఆ రంగంలో పేటెంట్ రైట్స్ అన్నీ పురుష ప్రపంచానివే’ అని సమాజం పరిధులు విధించుకున్న రోజుల్లో.. మహిళలను ఎంటర్ప్రెన్యూర్ అయిన మగవాళ్ల దగ్గర పీఏ ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేసిన సమాజంలో... నీలా మెహతా ఒక ట్రెండ్‌ను సెట్ చేశారు. ‘ఒక మహిళ ఒక పరిశ్రమ నడిపిస్తోందంటే.. అది ఆమెకు తండ్రి లేదా భర్త నుంచి వారసత్వంగా వచ్చిన పరిశ్రమను నడిపించడం లేదా అంతటి సంపన్న కుటుంబాల నుంచి కొత్త ఆలోచనలతో వచ్చిన మహిళలకు మాత్రమే సాధ్యం... అంతే తప్ప మామూలు మహిళలకు అది అసాధ్యం’ అనే భావనను కూడా తుడిచి పెట్టేశారు నీలా మెహతా. బజాజ్ వాళ్లింటి పెళ్లి ఉమెన్ అసోసియేషన్ సమావేశానికి ఇరవై ఢోక్లా పార్సిళ్లు ఇవ్వడంతో పడిన నీలా తొలి అడుగు... రోజుకు అరవై నుంచి డెబ్బై కిలోల ఢోక్లా ఆర్డర్లు అందించే స్థాయికి చేరింది. ఈ ప్రయాణంలో ఆమెను తీవ్రమైన ఉత్కంఠకు గురి చేసిన సంఘటన బజాజ్ కుటుంబంలో పెళ్లి. ‘‘ఆ పెళ్లికి పదహారు వందల కిలోల ఢోక్లా ఆర్డర్ వచ్చింది. దినుసులన్నీ సమకూర్చుకున్నాం, అదనంగా పని వాళ్లను కూడా పిలుచుకున్నాం. హఠాత్తుగా నీళ్లు బంద్. వాటర్ ట్యాంకర్ల కోసం పరుగులు పెట్టాం. వంట చేయడం కంటే నీళ్ల ట్యాంకర్లు సమకూర్చుకోవడమే పెద్ద సవాల్ అయింది. రెండు రోజుల పాటు ఇంట్లో వాళ్లకు, పని వాళ్లకు తిండి, నిద్ర లేవు. మొత్తం అందిచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాం’’ అని చెప్పారు నీలా మెహతా కొడుకు ప్రతీక్.చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉద్యోగం చేసిన ప్రతీక్ తర్వాత తల్లికి సహాయంగా ఆమె వ్యాపారంలోనే స్థిరపడ్డారు. ‘‘ఢోక్లా క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మకు నిల్వ ఉండే భేల్ వంటి పదార్థాలను కూడా చేర్చమని సలహా ఇచ్చాం. వాటిని ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, యూఎస్, యూకేలకు ఎగుమతి చేసింది అమ్మ. ముంబై వాళ్లు ఢోక్లా క్వీన్‌ని చేశారు, అమ్మ చేతి భేల్ రుచి చూసిన బయటి నగరాల వాళ్లు ఆమెను ‘భేల్ క్వీన్’అని ప్రశంసించారు’’ అని చెప్పారు ప్రతీక్ మెహతా. 83 ఏళ్ల నీలా మెహతా పోయిన మంగళవారం అక్టోబర్ 15వ తేదీన తుది శ్వాస వదిలారు. ముంబై నేటికీ ఆమెను తలచుకుంటూనే ఉంది. -
కదిలించే కథలు
వంద పదాల సారాన్ని ఒక్క దృశ్యం చూపిస్తుంది. జీవితకాలపు సందేశాన్ని పదిసెకండ్ల ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సెల్యులాయిడ్ తరం కాదు.. సెల్యులర్ టైమ్! ఏదైనా అరచేతి ఫోన్లో ప్రత్యక్షం కావాలి. సెకన్లలో తెలిసిపోవాలి. ఇవ్వాళ్టి మార్కెట్ స్ట్రాటజీ కూడా బ్రివిటీనే. ఈ జనరేషన్ కోరుకుంటున్న ఆ డిమాండ్‌ను అనుసరించే ఫేస్బుక్ ఓ కొత్త ప్రయత్నాన్ని పోస్ట్ చేసింది. దాని పేరే థంబ్స్టాపర్స్. పదిసెకన్లలో కమర్షియల్ యాడ్స్‌ను ప్రమోట్ చేసే సిస్టమ్. ‘‘షార్ట్‌స్టోరీస్ మూవ్ హార్ట్స్’’ పేరుతో వాటిని ప్రదర్శించడం మొదలు పెట్టేసింది కూడా. ప్రముఖ దర్శకురాలు కిరణ్‌రావు తీసిన రెండు షార్ట్‌ఫిల్మ్స్‌తో. ధైర్యం చేయడానికి క్షణం చాలు.. గృహహింసకు వ్యతిరేకంగా కిరణ్‌రావు తీసిన షార్ట్‌ఫిల్మ్‌కి క్యాప్షన్ అది. భర్త చేతిలో శారీరక హింసకు గురైన ఓ గృహిణికి ఒక యువతి ఫోన్ ఇస్తుంది .. 100 నంబర్ డయల్ చేసి. ఒక లిప్తపాటు తాత్సారం చేసి ప్రెస్ బటన్ నొక్కుతుంది ఆ గృహిణి. అప్పుడు వస్తుందీ కాప్షన్.. ధైర్యం చేయడానికి క్షణం చాలు అని. ఇంటి నుంచే మొదలవ్వాలి.. ఇది ఆమె తీసిన ఇంకో షార్ట్‌ఫిల్మ్... జెండర్ డిస్క్రిమినేషన్ మీద. ఒక అమ్మ తన కొడుకు, కూతురికి రెండుగ్లాసుల్లో పాలు పోసి ఇస్తుంది. కూతురి గ్లాస్లో కన్నా కొడుకు గ్లాస్లో పాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని గమనించిన ఆ అబ్బాయి తన గ్లాస్‌లోంచి చెల్లి గ్లాస్‌లోకి పాలు వంపి.. రెండు గ్లాసుల్లో పాలను సమం చేస్తాడు. మార్పు మొదలవడానికి రెండు క్షణాలు చాలు అనే వ్యాఖ్యతో ఈ షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది. గొంతుచించుకోకుండా నిరసన తెలపొచ్చు.. సిటీబస్‌లో.. నిలబడ్డ ఒక అబ్బాయి తన ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి ఛాతీ వంక అదేపనిగా చూస్తూంటాడు. ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న ఇంకో అబ్బాయి అది గమనించి తన షర్ట్ కాలర్‌ను ఛాతి కిందకు జారుస్తూ ‘‘ఇప్పుడు చూడు’’అన్నట్టుగా సైగ చేస్తాడు నిలబడ్డ అబ్బాయితో. అంతే అతను గతుక్కుమని చూపు తిప్పుకుంటాడు. ‘‘నాట్ ఆల్ ప్రొటెస్ట్స్ ఆర్ లౌడ్’’ అనే కాప్షన్ వస్తుంది. మాతృత్వానికి జెండర్ లేదు.. రుతుక్రమం గురించి నెట్లో సెర్చ్ చేసి కూతురికి వివరిస్తూంటాడు తండ్రి. ‘‘మదర్‌హుడ్ హాజ్ నో జెండర్’’ అనే మెస్సేజ్‌తో ముగుస్తుంది ఈ షార్ట్‌ఫిల్మ్. సామర్థ్యమే ముఖ్యం జిమ్‌లో.. ఒక స్థూలకాయురాలు.. అలవోకగా శీర్షాసనం వేస్తుంది అందరూ ఆశ్చర్యపోయేలా. అప్పుడు వస్తుంది కాప్షన్ ఎబిలిటీ మ్యాటర్స్ అని. అందమైన లోకం ఒక ట్రాన్స్ ఉమన్ పెట్టుకున్న చెవి జుంకాలు చూసి ‘‘ఎక్కడ కొన్నావ్.. చాలా బావున్నాయ్.. నీ అందాన్ని పెంచేలా’’ అంటూ కితాబిస్తుంది ఓ యువతి. ఆనందంగా ‘థాంక్స్’ చెప్తుంది ఆ ట్రాన్స్ ఉమన్. ‘‘యాన్ ఈక్వల్ వరల్డ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్’’ అనే వ్యాఖ్యతో ఎండ్ అవుతుంది ఆ షార్ట్‌స్టోరీ. -
టిక్‌టాక్ ఎడబాటు..ఫేస్బుక్ డిప్రెషన్
పిల్లలు చదువుకుంటుంటారనీ,భర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారని, గృహిణులు ఇల్లు చక్కదిద్దుకుంటూ ఉంటారనీ అనుకునే రోజులు పోయాయా? ఒక్కళ్లే ఉంటూ కూడా వారు చేతిలో ఉన్న ఫోన్‌తో ఒక పెద్ద ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నారు. ఆ పెద్ద ప్రపంచం వారికి మేలు చేస్తోందా కీడు చేస్తోందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రమాదకరమైన పరిణామం. అనగనగా ఒక అమ్మాయి. అబ్బాయి. ఇద్దరూ ఒకరికొకరు తెలియదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ టిక్‌టాక్ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఆ జంటకు మంచి పేరు వచ్చింది. ఫాలోయెర్స్ పెరిగారు. ఆ అమ్మాయి ఈ టిక్‌టాక్‌లు మానేసి వేరే కెరీర్లోకి వెళదామనుకుంది. కానీ ఆ అబ్బాయికి ఇది నచ్చలేదు. కుదర్దు మనం చేయాల్సిందే అన్నాడు. నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడు. అంతే కాదు.. సోషల్ మీడియాలో వారి స్నేహాన్ని చర్చలో పెట్టాడు. ఫాలోయెర్స్ దీని మీద తీర్పరులుగా మారారు. రకరకాల కామెంట్స్. ఇద్దరికీ మనశ్శాంతి లేదు. గతంలో కాలేజీ ఫీజులు లేవు... మంచి బట్టలు లేవు... సినిమాకు డబ్బులు లేవు... ఇవి యువతీయువకులకు సమస్యలుగా ఉండేవి. ఇప్పుడు టిక్‌టాక్ జోడితో స్నేహం పోయింది అనేది పెద్ద సమస్యగా మారింది.స్మ్యూల్ అనేది ఒక సింగింగ్ యాప్. పాటల సంగీతం అలాగే ఉంచి మన గొంతుతో పాడే వీలు కల్పిస్తుంది. తాజాగా నిన్న కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఈ యాప్ ఒక గృహిణి ఆత్మహత్యకు కారణమైంది. చిక్బళ్లాపూర్కు చెందిన 35 ఏళ్ల గృహిణి ఇద్దరు పిల్లల తల్లి. భర్త వృత్తిరీత్యా ప్లంబర్. ఒక మోస్తరు గొంతు ఉన్న ఆమె స్మ్యూల్ ద్వారా పాటలు పాడి అప్లోడ్ చేసేది. ఇలాగే పాటలు పాడి అప్లోడ్ చేసే మరో గాయకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఫేస్బుక్ ద్వారా ఫోన్ నంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకున్నారు. అంతేకాదు ఇద్దరూ కలిసి రకరకాల డ్యూయెట్లు పాడి అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఈ జంటకు 18 వేల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. అయితే ఇటీవల కొంతమంది ఫాలోయెర్స్ ఈ జంట మీద కామెంట్లు ఏవో పెట్టారట. దాంతో ఆ సహపాటగాడు ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఇలా చేయడం గురించి ఆమె అతనితో పోట్లాడింది. అయినా సరే ఫలితం లేకపోవడంతో శనివారం ఉదయం (సెప్టెంబర్ 28) ఆత్మహత్యకు పాల్పడింది. గృహహింస, వివాహేతర సంబంధాలు కాకుండా కేవలం సోషల్ మీడియా స్నేహాలు విఫలం అవడం కూడా ప్రాణాలు తీయగలవని నిరూపించే సంఘటన ఇది. ఇటీవల ఫేస్బుక్ నుంచి విరమించుకునేవారు పెరిగారు. దానికి కారణం ఏదైనా పోస్ట్‌కు ఎదురవుతున్న పరుషమైన కామెంట్లు. లైకులు పెట్టకపోవడం గురించి, వేరే వారికి పెట్టడం గురించి, మన మీద ఎవరో పెట్టిన విమర్శకు మన స్నేహితులు లైక్ కొట్టడం గురించి, చెప్పా పెట్టకుండా మనల్ని అన్‌ఫ్రెండ్ చేయడం గురించి ఫేస్బుక్లో ఉన్నవారికి తీవ్రమైన వ్యాకులత ఎదురవుతోంది. రెగ్యులర్‌గా లైక్ కొట్టేవారు రెండు మూడు పోస్ట్‌లకు లైక్ కొట్టలేదంటే పనులన్నీ మాని ఇక వారి గురించి ఆలోచన చేయడం మొదలెడుతున్నారు. బయటి సమాజంలో పరువు, మర్యాదల గురించి ఒక స్థితి ఉంటే ఫేస్బుక్లో నిర్మితమయ్యే పరువు, మర్యాదల స్థితి మరొకటి ఉంటుంది. ఫేస్బుక్లో ఎవరు ఎవరినైనా బద్నామ్ చేయొచ్చు. ఇదంతా అవసరమా అని ఫేస్బుక్ నుంచి పారిపోతున్నవారు ఉన్నారు. ఇటీవల తెలంగాణలో ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ అయిన కుర్రాడు ఒక అమ్మాయిని హత్య చేయడం ఈ మీడియా వల్ల కలిగే ప్రమాదాన్ని పతాకస్థాయిలో నిలబెట్టింది. ఇరుగుపొరుగు వారికి ముఖాలు చూస్తూ మాట్లాడతాం. రచ్చబండ దగ్గర, టీసెంటర్ దగ్గర ముఖాలు చూస్తూ వాదనలు పెట్టుకుంటాం. చర్చలు చేస్తాం. నలుగురూ సమక్షంలో ఉంటారు. పరిస్థితి చేయి దాటకుండా ఒక రక్షణ ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో ఇలా కాదు. అనేవాడు ఎక్కడో ఉంటాడు. పడేవాళ్లు ఎక్కడో ఉంటారు. ఎప్పుడూ కలవకుండా తీవ్రమైన స్నేహితులుగా తీవ్రమైన మిత్రులుగా మారిపోయే పరిస్థితిని ఈ మీడియా కల్పిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే ఒకరు ఒకరిని ఏమైనా అంటే అందులోని వాలిడ్ పాయింట్‌ని పట్టించుకోకుండా గ్రూప్‌ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సామాజిక వర్గాన్ని బట్టి, జెండర్‌ని బట్టి కొంతమంది ఏకమై ఆ పాయింట్‌ని లేవదీసిన వారిని ట్రోల్ చేసే పరిస్థితి ఫేస్బుక్ కల్పిస్తోంది. దాంతో గుండె గాయపడి గిలగిలలాడేవారి సంఖ్య పెరుగుతోంది.నిజానికి సోషల్ మీడియా ఒక మంచి ప్రచార మాధ్యమం. వ్యక్తిగత విశేషాలు, అభిప్రాయాలు, చైతన్యపరిచే సంగతులు, ఈవెంట్స్, హెల్త్ టిప్స్, వంటలు... ఇలా ఏవైనా సరే రూపాయి ఖర్చులేకుండా వేలాది మందితో షేర్ చేసుకోవచ్చు. టాలెంట్ ఉంటే ప్రదర్శించవచ్చు. కానీ దీనిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోకపోవడం తెలియచేసేవారు లేకపోవడమే సమస్య. ఎవరినైనా ఎంతెంతైనా అనేయవచ్చనుకొని లీగల్ సమస్యల్లో చిక్కుకున్నవారు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో మన చర్యలను గమనించే ఏజెన్సీలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు.ఏమైనా మానవ సంబంధాలు భౌతిక స్థాయిలో ఏర్పరచుకోలేని స్థితిలో సమాజం ఉంది. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడం, ఒకరిని మరొకరు కలవడం దుస్సాధ్యమైన స్పీడులో ఉన్నాం. కనుక ఈ సోషల్ మీడియా ద్వారానే ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతున్నాం. ఈ నేపథ్యంలో తారసపడుతున్న అపరిచితుల నుంచి ఎదురయ్యే మంచి, చేదు అనుభవాలు వారి వారి మనోశక్తిని బట్టి నిలబెడుతున్నాయి. కుంగదీస్తున్నాయి.గతంలో పెద్దలు ఎలా ఉన్నావు, భోం చేశావా అని తప్పక అడిగేవారు. ఇవాళ నీ సోషల్ మీడియాలో ఏదైనా సమస్య ఉంటే మాతో షేర్ చేసుకో. లోలోపలే పెట్టుకుని కుమిలిపోకు అని చెప్పాల్సిన రోజులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఒకచోట కూర్చుని ఇంటి విషయాలు, చదువు విషయాలు మాత్రమే కాదు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా యాక్టివిటీని కూడా చర్చించుకుంటే చాలా మేలు. మేలుకో వర్తమాన పౌరుడా... మేలుకో. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
బతుకుతూ... బతికిస్తోంది
కష్టాలకు వెరవలేదు..కన్నీళ్లకు జడవలేదు..మొక్కవోని ధైర్యంతో కష్టాల కడలికి ఎదురీదింది. చివరికి విజయ తీరాలను అందుకుంది. అప్పటి వరకు ఇంటి నాలుగు గోడలకే పరిమితమై, భర్త సంపాదించి పెడుతుంటే సంసారాన్ని నడుపుకుంటూ వచ్చిన ఈ సాధారణ గృహిణి, భర్త హఠాన్మరణంతో దిక్కుతోచక ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో కష్టపడితే ఎలాగైనా బతకొచ్చని నిరూపించింది. భర్త నెలకొల్పిన సంస్థను ఆయన లాగే నిరంతరం శ్రమిస్తూ తాము ఉపాధి కల్పించిన వారిని రోడ్డున పడకుండా చేసి, అందరితో శభాష్ అనిపించుకుంది శ్రీదేవి అలియాస్ లక్ష్మీ.. ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో... గ్రామీణులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో 20 సంవత్సరాల క్రితం వేముల శ్రీనివాస్ మాక్స్ సొసైటీని 20 లక్షల రూపాయల టర్నోవర్‌తో స్థాపించాడు. తాను పొందిన శిక్షణతో గ్రామీణ ప్రాంతంలోని వారికి శిక్షణనిస్తూ, ఉపాధి కల్పించాడు. అదే సమయంలో తన ఇల్లాలికి సైతం చేనేత వృత్తిలోని మెళకువలను కూడా నేర్పించాడు. వీరందరి కృషి, పనిలో నైపుణ్యం కారణంగా ఇక్కడ తయారైన వస్తువులు దేశ విదేశాలకు సైతం ఎగుమతి అయ్యేవి.. ఇల్లందకుంట మండలం లక్ష్మాజిపల్లికి చెందిన వేముల శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు 1997 వ సంవత్సరంలో సీఎమ్ఈవై ద్వారా యువ సహకార సం«ఘాన్ని ఏర్పాటు చేసి 70 మందికి శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ పొందిన వారు రోజుకు 200 నుంచి 300 రూపాయలు సంపాదించుకునేలా తయారు చేశారు. భర్త ఆశయాలే పరమావధిగా... అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆ కుటుంబాన్ని విధి చిన్నచూపు చూసింది. భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఆయన చనిపోయినప్పటికి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలనే దృఢ నిశ్చయంతో లక్ష్మి తాను నేర్చుకున్న విద్యను మరో పదిమందికి నేర్పించుకుంటూ పోయింది. భర్త తనతోనే ఉన్నాడన్నట్లుగా ఆమె బొట్టు, మట్టెలు తీయలేదు. ఆయన తన దగ్గరే ఉండి పని చేయిస్తున్నట్లుగా కష్టపడి పని చేసింది. క్రమ క్రమంగా ఆ గ్రామంలో చేనేత దుస్తులు తయారు చేసే వారు ఎక్కువై పోయారు. ప్రస్తుతం కార్పెట్లు, బెడ్షీట్లు స్సీఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ కార్యాలయాలలో ఉపయోగించే అన్ని రకాల వస్త్రాలను వివిధ రకాల డిజైన్లతో తయారు చేస్తున్నారు. ఇంటిలోనే దాదాపు పదిమందికి పైగా నూలు వడుకుతూ, కార్పెట్లు తయారుచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరు తయారు చే సిన కార్పెట్లు వివిధ మేళాలలో ప్రదర్శించబడడమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఆప్కో టెక్స్‌టైల్స్‌లో విరివిగా అమ్ముడు పోతున్నాయి. ప్రశంసలు, పురస్కారాలు గతంలో ముఖ్యమంత్రి, కలెక్టర్ల నుంచి ప్రశంసాపత్రాలతోబాటు, గత కొద్ది రోజుల క్రితం నాబార్డ్ పూణె సంస్థ ద్వారా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ముంబై, గవర్నర్ల చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్నారు. గత ఫిబ్రవరి నెలలో హర్యానా రాష్ట్రంలోని హరితాబాద్లో జరిగిన అంతర్ రాష్ట్ర్రీయ మేళాలో పాల్గొన్నారు. – స్వర్ణ మొలుగూరి, సాక్షి,హైదరాబాద్ సిటీ ప్రభుత్వ ఆదరణ కరువు మారుమూల గ్రామం నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే వస్త్రాలను ఆప్కోకు విక్రయించడం జరిగిందని, ఇప్పటి వరకు రూ. 15 లక్షలకు పైగా ఆప్కో నుంచి రావాల్సి ఉందని లక్ష్మి వాపోయింది. అదే విధంగా తాము ఎవరి మెప్పు కోసం పనులు చేయడం లేదని, కేవలం పదిమందికి ఉపాధి కల్పించడం కోసమేనని, ఇంత చేసినా తమను ప్రభుత్వం గుర్తించడం లేదని చేనేత కార్మికులకు ఇవ్వవలసిన పింఛన్ సైతం అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. కష్టే ఫలి అంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న లక్ష్మిని స్ఫూర్తిగా తీసుకుని గ్రామంలోని యువత, స్త్రీలు కష్టపడి పని చేస్తున్నారు, శిక్షణతో స్వయం ఉపాధి శ్రీదేవి ఇచ్చిన శిక్షణతో పదేళ్లుగా స్వయం ఉపాధి పొందుతున్నాను. గతంలో నేను నా భార్య కూలీ పనిచేసే వాళ్లం. ప్రస్తుతం ఇద్దరం ఈ సహకార సంఘంలోనే పని చేస్తూ నెలకు దాదాపు ఆరువేలకు పైగా సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. – ఎండీ. గౌసుద్దీన్ అద్దకంలో శిక్షణ పొందాను గత ఆరు సంవత్సరాలుగా కార్పెట్లు, ఇతర వస్త్రాలపై అద్దకంలో శిక్షణను పొందాను. ప్రతిరోజు నేను రెండు కార్పెట్లను తయారు చేస్తాను. దీనివల్ల రోజుకు రూ. 200 నుంచి 300 వరకు వస్తాయి. – ఎండీ ర హీమా -
ఇంటి ఎంపికలో గృహిణిదే ఆధిపత్యం
సాక్షి, హైదరాబాద్: సొంతింటి ఎంపికలో మగవాళ్ల కంటే మహిళలదే పైచేయి. సొంతిల్లు కొనుగోలు నిర్ణయం నుంచి ప్రాంతం, బడ్జెట్ ఎంపిక వరకూ అన్నింట్లోనూ గృహిణి నిర్ణయాధికారమే ఆధిపత్యంగా ఉందని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ కన్జ్యూమర్ రీసెర్చ్ సర్వే తెలిపింది. గృహ నిర్మాణానికి సంబంధించి కొనుగోలుదారుల అభిప్రాయం, ఎంపికలపై సర్వే నిర్వహించింది. జాయింట్ ఫ్యామిలీ బదులు సొంతంగా ఉండేందుకే మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. సొంతింటి ఎంపిక విషయంలో మగవాళ్లు స్నేహితులు లేదా బంధుమిత్రుల నిర్ణయాలనే పాటిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఇల్లు కొనాలి? నిర్మాణ తీరుతెన్నుల గురించి భార్య కంటే ఎక్కువగా ఫ్రెండ్స్ సలహాలే పాటిస్తారని సర్వే తెలిపింది. స్టీల్, సిమెంట్, కాంక్రీట్, బ్రిక్స్, ఎలక్ట్రిక్ వైర్లు, శానిటేషన్ ఉత్పత్తులు వంటి గృహ నిర్మాణ సామగ్రి నాణ్యత, ఎంపికలపై కొనుగోలుదారులకు పూర్తి స్థాయి అవగాహన లేదని.. అందుకే నిర్మాణంలో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపిస్తుందని సర్వే వెల్లడించింది. -
నేనున్నాను కదా..!
ఒకరోజు రాత్రి గస్తీ తిరుగుతుండగా హజ్రత్ ఉమర్ (రజి)కు కొంతమంది పిల్లల రోదనలు వినిపించసాగాయి. పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నారనే విషయం హజ్రత్ ఉమర్ (రజి)కు బోధపడింది. వాళ్లను సముదాయిస్తూ ఆ పిల్లల తల్లి ఒక గిన్నెలో నీళ్లు పోసి పొయ్యిమీద ఏదో వండుతున్నట్లు నటిస్తున్న దృశ్యాలు హజ్రత్ ఉమర్ (రజి) గమనించారు. ఆ సమయంలో తన సేవకుడు అస్లామ్ ఆయన వెంట ఉన్నారు. ఉన్నపళంగా ధనాగారానికి చేరుకున్నారు. పిండి, నెయ్యి, ఖర్జూరాలు తదితర నిత్యావసరాలను ఒక బస్తాలో నింపుకుని ఈ బస్తాను తన నడుముపై పెట్టాలని సేవకుడిని కోరారు. దానికి సేవకుడు అస్లమ్ ‘‘ఖలీఫా ఇంత కష్టం తమరికెందుకు? నేనున్నాను కదా’’ అని అన్నాడు. ‘‘ప్రళయం రోజు ఒకరి బరువును మరొకరు మోయరు కదా అస్లామ్’’ అంటూనే ఆ మూటను మోసుకుంటూ వెళ్లి ఆ గృహిణికి అందించారు ఖలీఫా. స్వయంగా తన స్వహస్తాలతో పొయ్యి రాజేసి వంటను సిద్ధం చేసి పిల్లలకు తినిపించారు. కడుపునిండా తిన్న పిల్లలు ఆడుతూ పాడుతూ కేరింతలు వేయసాగారు. ఆ పిల్లలు ఆటపాటలను చూసి హజ్రత్ ఉమర్ సంతోషించారు. దీనికి కృతజ్ఞతగా ఆ గృహిణి ‘‘ఖలీఫా పదవికి నీవే అన్ని రకాలా అర్హుడివిగా కనపడుతున్నావు. అల్లాహ్ నా దీవెన యథార్థం చేయుగాక’’ అంటూ దీవెనలు అందించింది. ఉమర్ ఆ మహిళ మాటలు విని మనస్సులోనే నవ్వుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. – ఎస్.ఎం. బాషా -
కదలే చైతన్యం రైతు పెద్దమ్మ!
బలమైన సంకల్పం ఉంటే రైతు కుటుంబంలోని సాధారణ గృహిణి కూడా ఇతరులకూ వెలుగుబాట చూపగలిగేంత ఎత్తుకు ఎదుగుతుందనడానికి రాజ్‌కుమార్ దేవి జీవితమే నిలువుటద్దం. బీహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లాలోని కుగ్రామం ఆనంద్‌పుర్ వాస్తవ్యురాలు. వ్యవసాయం గురించి ఏ కాలేజీలోనూ ఆమె చదువుకోలేదు. తన అత్తింటి వారికి ఉన్న ఎకరం పొలంలో 1980లలో ఒక రోజు స్వయంగా పారను చేతబట్టి స్వేదాన్ని చిందించే క్రమంలోనే ఆ నేల స్వభావాన్ని, ఏయే పంటలు సాగు చేస్తే బతుకులు బాగుపడతాయో అధ్యయనం చేసింది. ఆమె 30 ఏళ్ల క్రితం పొలంలో కాలు మోపే నాటికి వరి, గోధుమ, నాటు పొగాకు తప్ప వేరే పంటలు అక్కడి వారికి తెలియవు. పండించిన నాటు పొగాకును ఊరూరా తిరిగి అమ్మడానికి భర్త బయలుదేరడంతో ఆమె వ్యవసాయంపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. పొగాకు ఒక్కటే పండించడం ఎందుకు? కూరగాయలు, పండ్లు తదితర అనేక పంటలు కలిపి ఎందుకు పండించకూడదని ప్రశ్నించుకుంది. తమ ఎకరం పొలాన్ని మడులుగా విభజించి.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు.. వేర్వేరు పంటలు సాగు చేయడం ప్రారంభించింది. కొన్నాళ్లు గడిచే సరికి రాజ్‌కుమార్ దేవి ఒకటికి నాలుగు పంటలు పండించడంలో ప్రయోజనాలను ఆ ఊళ్లో మహిళా రైతులంతా గమనించారు. ఆమెను అనుసరించారు. వ్యవసాయోత్పత్తులకు విలువను జోడించి పట్టణాలకు పంపడంపై ఆమె దృష్టి పెట్టింది. ఇందుకోసం పదేసి మంది మహిళలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులను సేకరించి పట్టణాలకు తరలించి విక్రయించేందుకు తానే ఒక సంస్థను ప్రారంభించింది. ఇంటిపట్టున ఉండి నెలకు రూ. 3 వేల వరకు మహిళలు సంపాయించుకునే దారి చూపింది. తమ గ్రామంతోపాటు ఇరుగుపొరుగు గ్రామాలకు కూడా సైకిల్‌పైనే వెళ్లి మహిళా రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రాజ్‌కుమార్ దేవిని ‘రైతు పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. బహుళ పంటల సాగుతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విక్రయించడం ద్వారా గ్రామీణ మహిళల జీవితాలలో మార్పు తేవచ్చని లోకానికి చాటిచెబుతున్న ఈ ‘రైతు పెద్దమ్మ’కు ఎవరైనా జేజేలు పలకవలసిందే! నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
గృహిణులూ! మీకూ కావాలివి!!
దేశంలో ఎక్కువ మంది మహిళలు వివాహానంతరం ఇంటికి సంబంధించిన బాధ్యతలతో గృహిణి పాత్రలో కనిపిస్తుంటారు. భర్త కేవలం వృత్తి, లేదా ఉద్యోగ బాధ్యతలకు పరిమితమైతే ఆమె ఆ ఇంటిని అన్నీ తానై నడిపిస్తుంటుంది. మరి ఈ విధంగా కుటుంబ బాధ్యతలకు అంకితమైన ఆమె భవిష్యత్తు భద్రతను నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికమనే కాదు తనకు సంబంధించి మరెన్నో కీలక అంశాలపై ఆమె ముందు జాగ్రత్త పడాలి. అవేంటన్నది తెలియజేసే కథనమే ఇది. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం నగదు పరిహారం మీరు గృహిణి అయితే మీ జీవిత భాగస్వామి ప్రతి నెలా ఇంటి అవసరాల కోసం కొంత మొత్తం నగదును ఇస్తూ ఉండొచ్చు. ఇందులో మీ వ్యక్తిగత అవసరాలకు కావాల్సిన మొత్తం కూడా ఉందా, లేదా అన్నది గమనించండి. ఇంటికి సంబంధించి మీరు చేసే పనులకు కావాల్సిన మొత్తాన్ని తీసుకునే హక్కు మీకు ఉంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్ 2011 నాటి అధ్యయనం ప్రకారం సగటున మన దేశంలో ప్రతీ గృహిణి రోజులో ఆరు గంటలు ఇంటి కోసం ఎటువంటి నగదు ప్రయోజనం లేకుండా కష్టపడుతోంది. మరి ఈ ప్రకారం చూస్తే ప్రతీ గృహిణి ప్రతీ నెలా ఎంత మొత్తం పొందాల్సి ఉంటుందో ఆలోచించండి. తమ జీవిత భాగస్వామి ఆర్జన మేరకు ఈ మొత్తాన్ని నిర్ణయించుకోవచ్చు. ఆరోగ్య బీమా తప్పనిసరి కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించే ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం నేడు ఎంతో ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే అందులో తమ పేరు కూడా ఉండేలా చూసుకోవడం గృహిణి బాధ్యత. మెట్రో నగరంలో నివసిస్తుంటే, హెల్త్ కవరేజీ కనీసం రూ.5–10 లక్షలు ఉండాలి. వయసు పెద్దది అవుతుంటే బేసిక్ వైద్య బీమాకు అదనంగా క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా అవసరపడుతుంది. వైద్య పరమైన ద్రవ్యోల్బణం ఏటేటా పెరుగుతుండడం వల్ల ఆ మేరకు పెరిగే ఖర్చులను తట్టుకోవడానికి, జీవన శైలి వ్యాధులు పెరిగిపోతుండడం వల్ల క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ ఆదుకుంటుంది. కవరేజీ కనీసం రూ.20–25 లక్షలు ఉండాలి. భార్యా, భర్తలు ఇద్దరికీ అవసరమే. జీవిత బీమా... గృహిణులకు వ్యక్తిగతంగా ఎటువంటి ఆదాయం లేకపోతే, పిల్లలు కూడా ఉండి ఉంటే, జీవిత భాగస్వామి పేరిట రుణాలు ఉంటే జీవిత బీమా తీసుకోవడం తప్పనిసరి. ఒకవేళ జీవిత భాగస్వామికి ఏదైనా జరిగి అతను దూరమైతే ఆ గృహిణి తనపై పడే ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు జీవిత బీమా అక్కరకు వస్తుంది. తన జీవిత భాగస్వామి వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్ల మేర తక్కువ కాకుండా, రుణాలు ఏవైనా తీసుకుని ఉంటే ఆ మొత్తాన్ని కూడా కలిపి అంత కవరేజీకి టర్మ్ ప్లాన్ తీసుకునేలా చూసుకోవడం ప్రతీ గృహిణి మర్చిపోని అంశం. సంప్రదాయ బీమా పాలసీలు, మనీబ్యాక్ పాలసీలు అక్కరకు రావు. భారీ మొత్తంలో కవరేజీకి టర్మ్ ప్లాన్ తక్కువ ప్రీమియానికే లభిస్తుంది. నామినీగా మీ పేరు కుటుంబ ఆర్థిక విషయాలు, పెట్టుబడుల్లో గృహిణుల పాత్ర కూడా అవసరం. తమకెందుకులేనన్న నిరాసక్తత, బిడియంతో ఉండొద్దు. కనీసం పెట్టుబడులు, బీమా పాలసీల్లో నామినీగా మీ పేరును నమోదు చేశారా, లేదా అని చూసుకోవాలి. అలాగే, పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎక్కడ భద్రపరిచినదీ తెలిసి ఉండాలి. అన్ని రకాల పెట్టుబడుల్లో జాయింట్ హోల్డర్ లేదా నామినీగా తమ పేరును ప్రతిపాదించేలా చూసుకోవాలి. బ్యాంకు ఖాతా కొనసాగింపు వివాహానంతరం ముందు నుంచీ ఉన్న బ్యాంకు ఖాతాను కొనసాగించుకోవడం మంచిది. అలాగే, పెట్టుబడులు కూడా. ముందు నుంచి ఉన్న బ్యాంకు ఖాతాను జాయింట్ అకౌంట్‌గా మారుద్దామని జీవిత భాగస్వామి ప్రతిపాదించినప్పటికీ దాన్ని మీ ఒక్కరి పేరు మీదే కొనసాగించుకోవాలి. అవసరమైతే జీవిత భాగస్వామితో విడిగా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. తమ పేరిట ఉన్న ఖాతాను మాత్రం యథావిధిగా కొనసాగించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రిటైర్మెంట్ అవసరాలు ప్రతీ మహిళ పురుషులతో పోలిస్తే సగటున 5–7 ఏళ్లు అధికంగా జీవిస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. కనుక జీవిత భాగస్వామి దూరమైనా ఆ తర్వాత తమ విశ్రాంత జీవన అవసరాలను తీర్చే నిధి కోసం ప్రణాళిక వేసుకోవాలి. కనుక ఆ మేరకు అవసరాలను తీర్చే విధంగా నిధి ప్రణాళిక అమల్లో పెట్టాలని జీవిత భాగస్వామిని కోరాలి. ఇక ఇద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంటే ఆ మేరకు అదనపు నిధి అవసరం అవుతుంది. ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు గృహిణి అయినప్పటికీ డిజిటల్ అనుసంధానం నేడు అవసరం. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటున్న రోజులు. కనుక నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు తెలిసే ఉంటాయి. లేకపోతే వెంటనే తెలుసుకోవాలి. ఆర్థిక లావాదేవీలపైనా అవగాహన కల్పించుకోవాలి. ఆన్లైన్లో పెట్టుబడులు, చెల్లింపులు, క్లెయిమ్‌లు, సమాచారం తదితర విషయాలను అవసరమైతే జీవిత భాగస్వామి సహకారంతో అయినా వెంటనే తెలుసుకుని ఉంటే మంచిది. -
తెగువచూపి.. తిరగబడి..
- ఇంట్లోకి చొరబడి దోపిడీ - సాహసోపేతంగా పట్టుకునేందుకు గృహిణి విఫలయత్నం గుంటూరు ఈస్ట్: కత్తి చూపించి బెదిరించి నగలు దోపిడీ చేసిన నిందితులపై.. ఓ గృహిణి ధైర్యం చేసి ఎదురు తిరిగింది. ఒంటరిగా ఉన్నాననే భయాన్ని వీడి ఇద్దరు నిందితులపై తిరగబడింది. వెంటాడి వెంటాడి రోడ్డుపై వెళుతూ పోరాడింది. చేతికి తీవ్ర గాయమైనా పట్టించుకోకుండా నింది తులను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. పాతగుంటూరులో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈస్ట్ డీఎస్పీ కండె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. యాదవ హై స్కూల్ సమీపంలో కొత్తమాసు వేణుగోపాల్, సువర్ణలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. బస్టాండ్ సమీపంలోని కృష్ణ క్లాత్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్‌లో వేణుగోపాల్ బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. ఇంట్లోనూ చీరలు, ఫాల్స్ విక్రయిస్తుంటారు. ఆగస్టు 31న ఓ వ్యక్తి, మహిళ వేణుగోపాల్ ఇంటికి వచ్చి చీర ఫాల్ కొనుగోలు చేశారు. తిరిగి సెప్టెంబర్ 2న వేణుగోపాల్ ఇంటికి వచ్చి చీరలు, ఫాల్స్ ధరలు వాకబు చేసి వెళ్లారు. మంగళవారం ఉదయం 11.15 సమయంలో సువర్ణలక్ష్మి ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి ఒక చీర ఫాల్ కొనుగోలు చేశారు. మంచినీరు ఇవ్వమని అడిగారు. సువర్ణలక్ష్మి లోపలికి వెళ్లి వచ్చి మంచినీళ్లు ఇస్తే ఇద్దరూ తీసుకున్నారు. మంచినీళ్లు తాగే సాకుతో లోపలి గదిలోకి వచ్చి తలుపులు వేసి గడియపెట్టి సువర్ణ లక్ష్మిపై ఇద్దరూ దాడి చేశారు. కత్తి పొట్టపై పెట్టి మెడలో ఉన్న రెండు బంగారు చైన్లు, వాటికి ఉన్న తాళిబొట్టు, రూపు, చేతికి ఉన్న రెండు బంగారు గాజులు లాక్కున్నారు. సువర్ణలక్ష్మి ధైర్యంగా వారిని అడ్డగించి కేకలు వేసింది. ఇద్దరిలో పురుషుడు వేగంగా రోడ్డుపైకి వెళ్లి బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు. సువర్ణలక్ష్మి అరుపులు విని ఆ దారిన వెళుతున్న మరో మహిళ పారిపోతున్న నిందితురాలిని గట్టిగా పట్టుకుంది. ఇద్దరు మహిళలూ బైక్‌ను కదలనీయకుండా విఫలయత్నం చేశారు. నిందితుడు వాహనాన్ని వేగంగా నడపటంతో ఇద్దరూ పరారయ్యారు. పెనుగులాటలో సువర్ణ లక్ష్మి చేతికి తీవ్రగాయమై రక్తస్రావమైంది. సువర్ణలక్ష్మి నుంచి 15 సవర్ల బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. వీధిలో అనేక సీసీ కెమెరాలు ఉండటంతో నిందితులు ఫుటేజీలో నమోదయ్యాయి. -
మేడ్చల్‌లో గృహిణిపై కామాంధుడు కాటు