ఒక ఉద్యోగంలో ఎవరైనా ఎన్ని గంటలు పని చేస్తారు?
8 గంటలు.
మరి గృహిణి?
24 గంటలు.
ఆ అనుభవం ఎక్కువా? ఈ అనుభవం ఎక్కువా?
సీట్లో కూచుని చేసే ఉద్యోగం అనుకోండి... గృహిణికి ఇల్లే కదా సీటు. ఆ సీటు వదులుతుందా ఆమె. అందులోనే కూచుని అన్ని పనులూ చక్కబెడుతుంది. పిల్లలూ, వంట, బట్టలుతకడం, అత్తామామలను చూసుకోవడం, బంధువులొస్తే చేసి పెట్టడం.... సరే. బయట తిరిగి చేయాల్సిన ఉద్యోగం అనుకోండి. గృహిణి ఏమన్నా ఇంట్లో కూచుంటుందా ఏం? బయటే కదా తిరగాలి. పిల్లల్ని స్కూల్లో వదలడానికి, కూరగాయలు తేవడానికి, కరెంటు బిల్లు కట్టడానికి, సరుకుల కోసం, ఇంట్లో ఉండే పెద్దవాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి, మందులకూ మాకులకూ... తిరగాల్సిందే కదా.
ఉద్యోగంలో నీకు అనుభవం ఉందా అనంటే ఆఫీసులో చేసిన ఉద్యోగానిది మాత్రమే అనుభవమా... గృహిణిగా ఉండి చేసింది అనుభవం కాదా? ఈ ప్రశ్నే వేసింది ఒక గృహిణి.
అసలేం జరిగింది
సాధారణంగా కొత్త జాబ్ వెతుక్కోవాలంటే సి.వి (రెజ్యూమె)ని పక్కాగా రెడీ చేసుకోవాలి. విద్యార్హతలు, నైపుణ్యాలతోపాటు అనుభవం తప్పనిసరిగా చెప్పాలి. ఉద్యోగం మానేసి మధ్యలో గ్యాప్ ఉంటే ఆ సమయంలో ఏం చేశామో కూడా సదరు కంపెనీకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం చాలామంది రకరకాల కారణాలను చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటోన్న ఓ మహిళ మాత్రం గతంలో ఉద్యోగం చేసి మానేసి తిరిగి ఉద్యోగానికి అప్లయి చేస్తూ గ్యాప్‌లో 13 ఏళ్లపాటు గృహిణిగా పని చేసానని రెజ్యూమెను అప్‌లోడ్ చేసింది. గ్రౌతిక్ అనే కంటెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు యుగన్ష్ చోక్రా ఆమె సి.వి.ని చూసి మురిసిపోయాడు. ఈమె ఎంతో నిజాయితీగా గృహిణిగా పని చేశానని చెబుతోంది అని ప్రశంసిస్తూ సి.వి.ని లింక్డ్‌ఇన్‌లో పోస్టు చేశారు.
ఈ పోస్టుప్రకారం...
ఓ మహిళ గతంలో ఉద్యోగం చేసి 2009లో ఇంటి అవసరాల నిమిత్తం మానేసింది. ఇప్పుడు కాస్త వెసులుబాటు దొరకడంలో మళ్లీ చేసేందుకు రెడీ అయ్యింది. తన రెజ్యూమెని తయారు చేసింది. అందులో గ్యాప్‌లో ఏం చేశావ్? అనే ప్రశ్నకు పదమూడేళ్లపాటు గృహిణిగా చేశానని చెప్పింది. ‘గృహిణి అంటే ఫుల్‌టైమ్ జాబ్. సి.వి.లో దానిని ప్రత్యేకంగా చెప్పడం చాలా మంచి విషయం. ఎంతో మంది గ్యాప్‌లో ఏం చేశారంటే అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేశామని ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెడుతుంటారు. కానీ ఈమె చాలా నిజాయితీగా చెప్పి తన వ్యక్తిత్వమేమిటో చెప్పకనే చెప్పింది’ అని చోక్రా ప్రశంసించారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు.
ఇదో మేలుకొలుపు
ఈ పోస్టు ఎంతో మంది మహిళలకు, కంపెనీలకు మేలుకొలుపులాంటిది. నిజానికి గృహిణిగా ఉండటానికి ఏ ఉద్యోగి అయినా గ్యాప్ తీసుకుంటే ఆమెకు అదొక ప్రత్యేక అర్హతగా భావించి ప్రత్యేక రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తే తప్పు లేదు. కారణం? గృహిణిగా స్త్రీ ఇంటì ని, తద్వారా సమాజాన్ని నిలబెడుతుంది. పిల్లలను ఆరోగ్యకరంగా పెంచి మంచి పౌరులుగా సమాజానికి ఇస్తుంది. భర్త ఇంటి టెన్షన్లలో మునగకుండా పని మీద శ్రద్ధ పెట్టి మంచిగా పని చేసి వ్యవస్థ ముందుకెళ్లడంలో సాయపడుతుంది.
ఇన్ని చేసిన స్త్రీ– తనకు వెసులుబాటు దొరికి ఉద్యోగం చేస్తానంటే పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీలకు ఉంటుంది. అలాంటి స్త్రీలను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజానికుంటుంది. హోం మేకర్‌గా ఇక జీవితం అయిపోయింది అనుకోకుండా అదే ఒక అర్హతగా ఉద్యోగం వెతుక్కోవచ్చని ఈ పోస్టు భరోసా ఇస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... గృహిణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ధైర్యంగా ఉద్యోగాలు వెతుక్కోండి మహిళలూ.
Comments
Please login to add a commentAdd a comment