
జాబ్ చేసేవారు తమ ఉద్యోగ కష్టాలు.. ఆఫీసులో ఎదురయ్యే అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైనవన్నీ చెప్పుకోవడానికి రెడ్డిట్ ఓ మంచి వేదికగా మారింది. ఇందులో భాగంగానే ఒక వ్యక్తి.. తాను ఆఫీసులో ఎదుర్కొంటున్న కష్టాలను షేర్ చేశారు.
నేను పనిచేసే కంపెనీలో.. ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆదివారాల్లో కూడా ఐదు గంటల నుంచి ఆరు గంటలు పనిచేయాలని మేనేజర్ పేర్కొంటారు. ఇటీవల నేను నాలుగు రోజులు సెలవు కావాలని అడిగాను, చాలా చర్చలు జరిపిన తరువాత సెలవు మంజూరు చేశారు.
సెలవులు ఇచ్చారు, కానీ.. సమయం దొరికినప్పుడల్లా ఆఫీస్ వర్క్ చేయాలని మేనేజర్ చెప్పారు. కానీ ఆ సమయంలో పని చేయడం కష్టమవుతుందని, వీలైతే చేస్తానని నేను (ఉద్యోగి) చెప్పాను. అయితే సెలవుల సమయంలో వర్క్ చేయలేకపోయాను.

సెలవుల తరువాత నేను ఆఫీసుకి తిరిగి వచ్చాను. ఆ రోజు సాయంత్రానికే.. నా పనితీరు తక్కువగా ఉందని, నన్ను పీఐపీ( పర్ఫామెన్స్ ఇంప్రూమెంట్ ప్లాన్)లో ఉంచినట్లు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. దీనికి కారణం సెలవుల్లో పనిచేయకపోవడమే అని నాకు అర్థమైంది. ఇది నన్ను చాలా గందరగోళానికి గురిచేసింది. చట్టబద్ధంగా ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు? సంస్థలకు తాము చేయగలిగింది చేయగలిగేంత అధికారం ఉందా?..ఈ చర్యలను ఎదుర్కోవడానికి తగిన పరిష్కారం ఉందా.. అని పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్
దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కంపెనీ, మేనేజర్ పేరు చెప్పి అవమానించండి అని ఒకరు అన్నారు. చాలా కంపెనీలలో ఇలాగే జరుగుతోందని ఇంకొకరు అన్నారు. హెచ్‌ఆర్‌ను మీకు ఈ మెయిల్ చేయమని చెప్పండి అని మరొకరు అన్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సలహాలు ఇచ్చారు.