
కోల్‌కతా : అత్యవసర పని పడింది. నేను అడిగింది లీవే కదా. లీవ్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ.. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి సహనం కోల్పోయాడు. తాను సెలవు అడిగితే ఉన్నతాధికారి కాదనడంతో కోపం కట్టలు తెంచుకుంది. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఉన్నతాధికారితో పాటు సహచర ఉద్యోగులపై దాడి చేశాడు. అనంతరం, అదే కత్తితో తిరుగుతూ కనిపించారు. ఇప్పుడా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో న్యూటౌన్ ప్రాంతానికి చెందిన కరిగరి భవన్‌లోని సాంకేతిక విద్యా విభాగంలో అమిత్ కుమార్ సర్కార్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఎప్పటిలాగే ఆఫీస్‌కు వచ్చిన కుమార్ లీవ్ కావాలని ఉన్నతాధికారిని అడిగారు. ఆ విషయంలో తన సహోద్యోగులతో గొడవ జరిగింది. ఈ గొడవలో అమిత్ వెంట తెచ్చుకున్న కత్తితో సహచర ఉద్యోగులపై దాడి చేశారు.
అనంతరం, అక్కడి నుంచి వెళ్లి పోయారు. వీపున బ్యాగు, రక్తంతో తడిసిన కత్తితో వెళ్తున్న అమిత్‌ను స్థానికులు వీడియోలు తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆఫీస్‌లో జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై పోలీస్ అధికారి మాట్లాడుతూ.. నిందితుడు తన సహోద్యోగులతో సెలవు విషయంలో గొడవ పడ్డాడు. సెలవు నిరాకరించడానికి గల కారణం, సహోద్యోగులపై కత్తితో ఎందుకు దాడి చేశారో తెలియాల్సి ఉంది. నిందితుడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అనుమానిస్తున్నాం. ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తాం. కాగా, అమిత్ కత్తిదాడిలో జయదేబ్ చక్రవర్తి, శాంతను సాహా, సర్తా లేట్, షేక్ సతాబుల్ గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment