Homemaker
-
క్రియేటివిటీతో లక్షల్లో సంపాదన: ఓ ‘అమ్మ’ సక్సెస్ స్టోరీ
మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం చాలా ముఖ్యం. నిజానికి గృహిణులుగా ఉంటూ గ్రామీణ మహిళలు కుటుంబానికి చాలా అండగా ఉంటారు. పశు పోషణ అంతా వారి మీదే ఆధారపడి ఉంటుంది. పాలమ్మి, పిడకలమ్మి, విస్తరాకులు కుట్టి, లేసులు అల్లి మిషన్ కుట్టి ఇలా ఒకటి కాదు.. ఏదో రకంగా తమకంటూ కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. కానీ వారి సంపాదన, శ్రమ లెక్కలోకి రాదు అంతే. విద్యావంతులైన మహిళలు కూడా తమ చదివిన చదువుకు సార్థకత సాధించాలనే ఆలోచిస్తారు. ఆలా యూకేకు చెందిన మహిళ తనకు నచ్చిన విద్యతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. లక్షలు వెనకేసింది. పూర్తి వివరాల కోసం కథనాన్ని చదవండి. రాచెల్ పెళ్లి, పిల్లల తరువాతఇంట్లోనే ఉంటూ కుటుంబ జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ, ఆర్థికంగా పటిష్టంగా నిలబడింది. రాచెల్ తన కసృజనాత్మకతకు పదును పెట్టి, ఒక పనిని ఎంచుకుంది. సరికొత్తగా కెరీర్ బాటలు వేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించింది. ఆకర్షణీయంగా చెవిపోగులను తయారు చేస్తూ పేరు తెచ్చుకుంది. క్రమంగా అది విస్తరించి వ్యాపారంగా మారిపోయింది. అది కూడా చాలా తక్కువ సమయంలోనే దాదాపు 13 లక్షల రూపాయలను ఆర్జించింది. రాచెల్‌కు ఇద్దరు పిల్లల తల్లిగా వారి ఆలనా పాలనా చేసుకుంటూనే డబ్బులు సంపాదించే మార్గాన్ని అన్వేషించింది. ఈ క్రమంలోనే పిల్లలు నిద్రపోతున్న సమయంలో స్కల్పే పాలిమర్ క్లేతో అందమైన డిజైన్లతో చెవిపోగులు తయారు చేయడం ప్రారంభించింది. సిరా, వైట్, యాక్రిలిక్ పెయింట్‌తో తయారు చేసిన ఇయర్ రింగ్స్ డిజైన్స్‌కు మంచి ఆదరణ లభించింది. ఆన్లైన్ వెంచర్ (Etsy) ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంది. ఒక్కో జతను ఎట్సీలో దాదాపు 30 పౌండ్ల (రూ.3,000) చొప్పున విక్రయించేది. తన వెంచర్‌ను లాభదాయకంగా మార్చుకుంది. హ్యాండ్‌మేడ్ ఒరిజినల్ ఆభరణాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. 2021 నుంచి దాదాపు 435 జతల చెవిపోగులను విక్రయించి, రూ. 13 లక్షలకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. నేర్చుకోవాలనే ఆసక్తివున్న ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తుంది. -
ఎక్స్పీరియన్స్ ఉందా? ...ఆ గృహిణిగా బోలెడంత!
ఒక ఉద్యోగంలో ఎవరైనా ఎన్ని గంటలు పని చేస్తారు? 8 గంటలు. మరి గృహిణి? 24 గంటలు. ఆ అనుభవం ఎక్కువా? ఈ అనుభవం ఎక్కువా? సీట్లో కూచుని చేసే ఉద్యోగం అనుకోండి... గృహిణికి ఇల్లే కదా సీటు. ఆ సీటు వదులుతుందా ఆమె. అందులోనే కూచుని అన్ని పనులూ చక్కబెడుతుంది. పిల్లలూ, వంట, బట్టలుతకడం, అత్తామామలను చూసుకోవడం, బంధువులొస్తే చేసి పెట్టడం.... సరే. బయట తిరిగి చేయాల్సిన ఉద్యోగం అనుకోండి. గృహిణి ఏమన్నా ఇంట్లో కూచుంటుందా ఏం? బయటే కదా తిరగాలి. పిల్లల్ని స్కూల్లో వదలడానికి, కూరగాయలు తేవడానికి, కరెంటు బిల్లు కట్టడానికి, సరుకుల కోసం, ఇంట్లో ఉండే పెద్దవాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి, మందులకూ మాకులకూ... తిరగాల్సిందే కదా. ఉద్యోగంలో నీకు అనుభవం ఉందా అనంటే ఆఫీసులో చేసిన ఉద్యోగానిది మాత్రమే అనుభవమా... గృహిణిగా ఉండి చేసింది అనుభవం కాదా? ఈ ప్రశ్నే వేసింది ఒక గృహిణి. అసలేం జరిగింది సాధారణంగా కొత్త జాబ్ వెతుక్కోవాలంటే సి.వి (రెజ్యూమె)ని పక్కాగా రెడీ చేసుకోవాలి. విద్యార్హతలు, నైపుణ్యాలతోపాటు అనుభవం తప్పనిసరిగా చెప్పాలి. ఉద్యోగం మానేసి మధ్యలో గ్యాప్ ఉంటే ఆ సమయంలో ఏం చేశామో కూడా సదరు కంపెనీకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం చాలామంది రకరకాల కారణాలను చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటోన్న ఓ మహిళ మాత్రం గతంలో ఉద్యోగం చేసి మానేసి తిరిగి ఉద్యోగానికి అప్లయి చేస్తూ గ్యాప్‌లో 13 ఏళ్లపాటు గృహిణిగా పని చేసానని రెజ్యూమెను అప్లోడ్ చేసింది. గ్రౌతిక్ అనే కంటెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు యుగన్ష్ చోక్రా ఆమె సి.వి.ని చూసి మురిసిపోయాడు. ఈమె ఎంతో నిజాయితీగా గృహిణిగా పని చేశానని చెబుతోంది అని ప్రశంసిస్తూ సి.వి.ని లింక్డ్ఇన్లో పోస్టు చేశారు. ఈ పోస్టుప్రకారం... ఓ మహిళ గతంలో ఉద్యోగం చేసి 2009లో ఇంటి అవసరాల నిమిత్తం మానేసింది. ఇప్పుడు కాస్త వెసులుబాటు దొరకడంలో మళ్లీ చేసేందుకు రెడీ అయ్యింది. తన రెజ్యూమెని తయారు చేసింది. అందులో గ్యాప్‌లో ఏం చేశావ్? అనే ప్రశ్నకు పదమూడేళ్లపాటు గృహిణిగా చేశానని చెప్పింది. ‘గృహిణి అంటే ఫుల్‌టైమ్ జాబ్. సి.వి.లో దానిని ప్రత్యేకంగా చెప్పడం చాలా మంచి విషయం. ఎంతో మంది గ్యాప్‌లో ఏం చేశారంటే అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేశామని ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌లు పెడుతుంటారు. కానీ ఈమె చాలా నిజాయితీగా చెప్పి తన వ్యక్తిత్వమేమిటో చెప్పకనే చెప్పింది’ అని చోక్రా ప్రశంసించారు. ఈ పోస్టును చూసిన నెటిజన్లు ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇదో మేలుకొలుపు ఈ పోస్టు ఎంతో మంది మహిళలకు, కంపెనీలకు మేలుకొలుపులాంటిది. నిజానికి గృహిణిగా ఉండటానికి ఏ ఉద్యోగి అయినా గ్యాప్ తీసుకుంటే ఆమెకు అదొక ప్రత్యేక అర్హతగా భావించి ప్రత్యేక రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలిస్తే తప్పు లేదు. కారణం? గృహిణిగా స్త్రీ ఇంటì ని, తద్వారా సమాజాన్ని నిలబెడుతుంది. పిల్లలను ఆరోగ్యకరంగా పెంచి మంచి పౌరులుగా సమాజానికి ఇస్తుంది. భర్త ఇంటి టెన్షన్లలో మునగకుండా పని మీద శ్రద్ధ పెట్టి మంచిగా పని చేసి వ్యవస్థ ముందుకెళ్లడంలో సాయపడుతుంది. ఇన్ని చేసిన స్త్రీ– తనకు వెసులుబాటు దొరికి ఉద్యోగం చేస్తానంటే పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీలకు ఉంటుంది. అలాంటి స్త్రీలను ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజానికుంటుంది. హోం మేకర్‌గా ఇక జీవితం అయిపోయింది అనుకోకుండా అదే ఒక అర్హతగా ఉద్యోగం వెతుక్కోవచ్చని ఈ పోస్టు భరోసా ఇస్తోంది. ఇంకెందుకు ఆలస్యం... గృహిణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ధైర్యంగా ఉద్యోగాలు వెతుక్కోండి మహిళలూ. -
Sangita Success Story: విజయాన్ని పెట్టెలో పెట్టింది
పిండి కొద్ది రొట్టె ఏమోకాని స్వీటు కొద్ది పెట్టె ఉండాలంటుంది సంగీతా పాండే. స్వీట్ బాక్సులను అందంగా తయారు చేయడం మొదలుపెట్టిన ఈ గోరఖ్‌పూర్ సాధారణ గృహిణి 500 రూపాయల పెట్టుబడితో బయల్దేరి ఆరేళ్లలో 3 కోట్ల టర్నోవర్‌కు చేరింది. అత్తామామలు, భర్త సహకరించకపోయినా గృహిణికి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని పట్టుదలగా విజయం సాధించింది. తనలాంటి 100 మంది స్త్రీలకు ఉపాధి కల్పించడంతో ఆమె పొందుతున్న సంతృప్తి వెల లేనిది. ఆరేడేళ్ల క్రితం. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్. మూడవ సంతానంగా కుమార్తె పుట్టాక 9 నెలలు నిండేసరికి ఇక ఇంట్లో ఉంటూ కేవలం అత్తామామల సేవ, వంట వంటి పనులు మాత్రమే చేయకూడదు అనుకుంది సంగీతా పాండే. భర్తకు పోలీసు ఉద్యోగం. బదిలీల మీద తిరుగుతుండేవాడు. ఆర్థికస్థితి అంతంత మాత్రం. తనూ ఉద్యోగం చేయాలని నిశ్చయించుకుంది. భర్త ఒప్పుకోలేదు. అత్తామామలు ఒప్పుకోలేదు. కాని ఎదిరించి తను చదివిన డిగ్రీ అర్హత మీద ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం తెచ్చుకుంది. మొదటిరోజు కూతురితోపాటు హాజరైంది. ఆఫీసువాళ్లు అభ్యంతరం చెప్పడంతో మరుసటి రోజు పాపను ఇంట్లో వదిలి ఆఫీసుకు వెళ్లింది. మనసు ఒప్పలేదు. పిల్లలను దూరం పెట్టి పని చేసే ఉద్యోగం వద్దు అనుకుని మరుసటి రోజే మానేసింది. కాని ఏదో చేయాలి. ఏం చేయాలి? స్వీట్‌షాపులో డబ్బాలు ఆమె ఒకసారి స్వీట్‌షాపులో స్వీట్స్ కొంటున్నప్పుడు ఎవరో వచ్చి ఖాళీ బాక్సులు స్టాకు పడేసి వెళ్లడం చూసింది. తనక్కూడా అలాంటివి తయారు చేసి అమ్మాలని అనిపించింది. అందుకోసం గోరఖ్‌పూర్‌లో వాటిని తయారు చేస్తున్న ఒకరిద్దరు స్త్రీలను కలిసింది. అయితే వారు ఆమెకు పని గురించి అంతంత మాత్రమే చెప్పారు– పోటీకి వస్తుందని. సంగీతా పాండేకి సృజన ఉంది. కొత్తగా చేసే ఆలోచన ఉంది. అందుకే తానే రంగంలో దిగింది. అప్పటికి తన దగ్గర 1500 ఉన్నాయి. ఓ పాత సైకిలుంది. ఆ సైకిల్ మీద తిరుగుతూ రా మెటీరియల్ కొని తెచ్చింది. 8 గంటల్లో 100 డబ్బాలు తయారు చేసింది. తనే వాటిని సైకిల్ వెనుక కట్టుకుని స్వీట్ షాపులకు అమ్మేందుకు బయలుదేరింది. అవి బాగుండటంతో అమ్ముడుపోయాయి కాని ఇంతకంటే తక్కువకు సరుకు వేస్తున్నారని తెలిసింది. గోరఖ్‌పూర్ రత్న ఇటీవలే ఉత్తరప్రదేశ్ సి.ఎం ఆదిత్యానాథ్ మహిళా అంట్రప్రెన్యూర్‌గా ఎంతో స్ఫూర్తినిస్తున్న సంగీతా పాండేని ‘గోరఖ్‌పూర్ రత్న’ బిరుదుతో సత్కరించాడు. ఇప్పుడు సంగీతా పాండే తయారు చేస్తున్న స్వీట్ బాక్సులు ఢిల్లీ వరకూ వెళుతున్నాయి. స్వీట్లను ఒకదాని మీద ఒకటి కుక్కే విధంగా కాకుండా సంగీతా స్వీట్‌బాక్సులు ఒకదాని పక్కన ఒకటి అంటకుండా అమర్చేలా ఉండటంతో ఆదరణ పొందుతున్నాయి. సంప్రదాయం కోసం కొద్ది స్వీట్లతో ఒక బుట్టను ప్రెజెంట్ చేసేలా కూడా పెట్టెలు తయారు చేస్తోంది. స్వీట్లలోని రకాలను బట్టి ఈ ప్యాకింగ్ బాక్సులు మారిపోతుంటాయి. సృజన, శ్రమ కలిస్తే సక్సెస్ అదే వస్తుందనడానికి మరో ఉదాహరణ సంగీతా పాండే. అసలు కిటుకు రా మెటీరియల్ లక్నో, ఢిల్లీలలో తక్కువకు దొరుకుతుందని, వాటితో కళాత్మకంగా డబ్బాలు తయారు చేసి తక్కువకు ఇవ్వగలిగితే చాలా గిరాకీ ఉంటుందని తెలుసుకుంది సంగీతా పాండే. వెంటనే చురుగ్గా ఉండే నలుగురైదుగురు స్త్రీలను పనిలోకి తీసుకుంది. డిస్ట్రిక్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి 2 లక్షలు లోన్ సాధించింది. పనిలోకి దిగింది. కిలో, అరకిలో, పావుకిలో డబ్బాలు మంచి రంగులతో లోపల జలతారు వస్త్రంతో తయారు చేసి గోరఖ్‌పూర్, లక్నోలలో స్టాకు వేయడం మొదలెట్టింది. ‘నాణ్యత విషయంలో ఒక పైసా నష్టం వచ్చినా రాజీ పడకూడదు అనే నియమం పెట్టుకున్నాను’ అంటుంది సంగీతా పాండే. ఆ నాణ్యత, ముస్తాబు వల్ల ఆమె ఖాళీ బాక్సులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఇప్పుడు ఆమె నగలు కుదువ పెట్టి మరో 3 లక్షలు తీసుకుని వ్యాపారాన్ని విస్తరించింది. ఆ తర్వాత బ్యాంకులే వెతుక్కుంటూ వచ్చి 30 లక్షలు లోను మంజూరు చేశాయి. ఒక ఫ్యాక్టరీ ఆవరణ, పని చేసే స్త్రీలు, వీరు కాకుండా ఇళ్ల దగ్గర ఉంటూ పనిచేసే స్త్రీలు వీరంతా ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు. సంగీతా పాండే దూసుకుపోయింది. -
హిచ్ హైకింగ్: ఎవరెస్ట్ వరకూ లిఫ్ట్ అడిగింది
ఎవరెస్ట్ వరకూ వెళ్లాలంటే ఎవరైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. నలుగురితో కలిసి వెళతారు. ఆమె ఒక్కతే వెళ్లాలనుకుంది. అదీ లిఫ్ట్ అడుగుతూ వెళ్లాలనుకుంది. అలా ఒక్కరే ప్రయాణ ఖర్చులు లేకుండా దొరికిన వాహనంతో పర్యటించడాన్ని ‘హిచ్ హైకింగ్’ అంటారు. ఐదుగురు పిల్లల తల్లి నాజిరా నౌషాద్ సాహసంతో ఈ పని చేసి ‘ఈ దేశం స్త్రీలకు సురక్షితమైనదే’ అని సందేశం ఇస్తోంది. ఇది వింత సంగతి. ఘనంగా చెప్పుకోవలసిన సంగతి. లారీల్లో లిఫ్ట్ అడుగుతూ (హిచ్ హైకింగ్) కేరళ నుంచి ఒక ఒంటరి మహిళ ట్రావెల్ చేయగలదా? చేయగలదు అని నిరూపించింది నాజిరా నౌషాద్. ఫిబ్రవరి 9న బయలు దేరి కేరళ నుంచి నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లిరావడానికి 50 రోజుల లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేరళలోని కుట్టనాడ్‌లోని మన్‌కొంబు నాజిరా ఊరు. అది సముద్ర మట్టానికి 10 అడుగుల దిగువ. అక్కడి నుంచి బయలుదేరి సముద్రమట్టానికి 17,500 అడుగుల పైన ఉన్న ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు హిచ్ హైకింగ్ చేయాలని నిశ్చయించుకుంది నాజిరా. అలా చేయడంలో ఎంతో రిస్క్. ఒంటరి స్త్రీల మీద ఏ అఘాయిత్యం అయినా జరగొచ్చు. ‘లారీ డ్రైవర్ల మీద చాలా అపప్రథలు ఉన్నాయి. కాని నేను చూసిన లారీడ్రైవర్లు ఎంతో స్నేహపాత్రంగా ఉన్నారు. నా లక్ష్యం చేరుకోవడానికి సాయం చేశారు’ అంటుంది నాజిరా. షి కెన్ ట్రావెల్ అలోన్ ‘ఒంటరిగా స్త్రీ ప్రయాణించగలదు’ అనే స్లోగన్‌తో 33 ఏళ్ల నాజిరా ఈ యాత్ర మొదలెట్టింది. ఆమె భర్త ఒమన్‌లో ఉద్యోగం చేస్తాడు. ఆమెకు ఐదుగురు పిల్లలు. నాజిరా ట్రావెల్ వ్లోగర్. అంటే యాత్రా కథనాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఆమెకు ఫాలోయెర్స్ ఉన్నారు. నాలుగేళ్ల క్రితం భర్త ఇండియా వచ్చినప్పుడు కారులో వాళ్లు టూరు చేశారు. అప్పుడే ఆమెకు తాను కూడా ప్రయాణాలు చేసి సోషల్ మీడియాలో పంచుకోవాలనిపించింది. ‘గత సంవత్సరం మరో ఇద్దరు మహిళలతో కలిసి లదాఖ్ వరకు యాత్ర మొదలెట్టాను రోడ్డు మార్గం ద్వారా. కాని 20 రోజులకే వారు వెనక్కు వెళ్లిపోయారు. నేను మాత్రం యాత్ర కొనసాగించాను. వెనక్కు తిరిగి వచ్చి ‘నేను చూసిన దేశం’ అనే పుస్తకం రాసి ప్రచురించింది. ఆ తర్వాత నెల రోజులకే కేవలం షిప్ చార్జీలు జేబులో పెట్టుకుని లక్షద్వీప్‌కు వెళ్లింది. 10 దీవులను 25 రోజుల్లో తిరిగి వచ్చింది. తన ఫాలోయెర్స్ ఇళ్లల్లో లేదా స్థానికుల ఇళ్లలో రిక్వెస్ట్ చేసి బస చేసేది. ఇప్పుడు ఈ ఎవరెస్ట్ యాత్ర చేసింది. మన దేశం సురక్షితమే ‘మన దేశం స్త్రీ పర్యాటకులకు సురక్షితమే అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మన దేశాన్ని మనం చూడకుండా విదేశాలకు వెళ్లి అక్కడ భద్రత ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు’ అంటుంది నాజిరా. వీపుకు ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని ఫిబ్రవరి 9న ఆమె కేరళలో బయలుదేరింది. పిల్లల్ని చూడటానికి ఇంట్లో తల్లి ఉంటుంది. ‘పిల్లల్ని అలా వదిలి బయలుదేరడం అందరికీ నచ్చదు. కాని మాటలు అనేవారిని నేను పట్టించుకోను’ అంటుంది నాజిరా. కేరళ నుంచి లారీలు, ట్రక్కులు పట్టుకుంటూ ఫిబ్రవరి 21కి ఆమె ఢిల్లీ చేరుకుంది. మరో లారీ దొరికే వరకు దిగిన ఊరులో ఏదో ఒక ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లో బస చేస్తూ వెళ్లింది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సొనౌలీ చేరుకుని అక్కడి నుంచి నేపాల్‌లోని లుల్కాకు విమానంలో వెళ్లింది. రికార్డు జర్నీ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లాలంటే లుల్కా నుంచి ట్రెక్ చేయాలి. అంటే కాలినడకన వెళ్లాలి. 2860 మీటర్ల ఎత్తున్న లుల్కా నుంచి 5364 మీటర్ల ఎత్తున్న బేస్‌క్యాంప్‌కు నడవాలంటే 8 రోజులు పడుతుంది. ‘కాని నేను ఐదురోజుల్లో చేరుకున్నాను. ఒక మహిళ ఇంత వేగంగా చేరుకోవడం రికార్డు’ అంటుంది నాజిరా. ఈ దారిలో ఆమె ప్రయాణించడానికి గైడ్‌ను మాట్లాడుకుంది. బేస్‌క్యాంప్ దగ్గర ఆమె దిగిన ఫొటో నిజంగానే ఒక సాహస చిహ్నం. కొంతమంది మరొకరు అనుకరించడానికి వీలులేని సాహసాలు చేస్తారు. నాజిరాను ఎంతమంది స్ఫూర్తిగా తీసుకోగలరు? అంత రిస్క్ ఎవరు చేయగలరు? కాని చేయాలనుకుంటే ఒక విజేత అంతకు ముందు దారి వేసింది అని చెప్పడానికి నాజిరా ఉంది. నాజిరా ఈజ్ గ్రేట్. -
చిన్నారి కిడ్నాప్.. రూ.60లక్షల డిమాండ్
తమిళనాడు, తిరువొత్తియూరు: చెన్నై అమందకరై షెనాయ్ నగర్ చెల్లమ్మాల్ వీధికి చెందిన అరుల్‌రాజ్ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతని భార్య నందిని ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌గా ఉన్నారు. వీరి కుమార్తె అన్వికా (03). గురువారం సాయంత్రం చిన్నారి అన్వికా, పనిమనిషి అంబిక (25) అదృశ్యమైనారు. దుకాణానికి వెళ్లి ఉండవచ్చునని తల్లిదండ్రులు అనుకున్నారు. కాని వారిద్దరు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన నందిని కుమార్తె కోసం అన్ని చోట్ల గాలించారు. కొద్ది సమయం తర్వాత పనిమనిషి అంబిక ఫోన్ నుంచి నందిని సెల్‌ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. ఆమె తనను, చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తాము ఎక్కడ ఉన్నామో తెలియలేదని కాపాడమని చెప్పినట్టు తెలిసింది. దీంతో భయాందోళనకు గురైన నందిని ఈ సంగతి గురించి తన భర్త అరుల్రాజ్కు సమాచారం ఇచ్చారు. కొద్ది సమయం తర్వాత అదే ఫోన్ నుంచి నందినికి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి చిన్నారి, అంబిక ప్రాణాలతో బయట పడాలంటే రూ.60 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు ఇచ్చాడు. దీంతో అమందైకరై పోలీసుస్టేషన్లో నందిని ఫిర్యాదు చేశారు. పోలీసు కమిషనర్ కె.కె.విశ్వనాథన్, అదనపు కమిషనర్ దినకరన్, జాయింట్ కమిషనర్ విజయకుమారి, డిప్యూటీ కమిషనర్ముత్తుస్వామి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని అమందకరై ప్రాంతంలో వున్న ఈసీటీవీలో తనిఖీ చేశారు. అలాగే జాయింట్ కమిషనర్ విజయకుమారి నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. అంబిక ఫోన్ నెంబరు ఆధారంగా వారు కోవలంలో వున్నుట్టు గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి కారును చుట్టుముట్టడంతో కారులో వున్న ముగ్గురు పారిపోయారు. తరువాత చిన్నారిని సురక్షితంగా కాపాడారు. కారులో వున్న పనిమనిషి అంబిక, మహ్మద్ అలీబుల్లాను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేయగా అంబికను మహ్మద్ అలీబుల్లా ప్రేమిస్తున్నాడని వివాహం చేసుకోవడానికి ఖర్చుల కోసం వారిద్దరు డాక్టర్ కుమార్తెను కిడ్నాప్ చేసి నాటకమాడినట్టు తెలిసింది. దీంతో అంబికను, ఆమె ప్రియుడు మహ్మద్ అలీబుల్లాను పోలీసులు అరెస్టు చేశారు. కారు నుంచి పారిపోయిన ముగ్గురు దుండగుల వివరాల కోసం విచారణ చేస్తున్నారు. -
నాన్‌వెజ్ పచ్చళ్లకు ఆన్లైన్ దారి
రాజు పికిల్స్.కామ్ పాఠకుల నుంచి స్టార్టప్ డైరీ కాలమ్‌కు విశేష స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా స్టార్టప్స్ సంస్థలు తమ సేవల గురించి పాఠకులకు అందించేందుకు స్టార్టప్స@సాక్షి.కామ్‌కు మెయిల్స్ పంపిస్తున్నాయి. అయితే స్థలాభావం కారణంగా వాటిల్లో నుంచి ఉపయుక్తమైన కొన్నింటిని ఎంపిక చేసి విడతల వారీగా ప్రచురిస్తున్నాం. ఈవారం ‘స్టార్టప్ డైరీ’లో రాజు పికిల్స్.కామ్, జీరోకాస్ట్ హైరింగ్.కామ్ గురించి! –హైదరాబాద్, బిజినెస్ బ్యూరో చదివింది ఇంటరే. పైగా గృహిణి. తెలిసిందల్లా నోరూరే వంటలు చేయడం. అందులోనూ మాంసాహార పచ్చళ్లలో అందె వేసిన చేయి. అదే వ్యాపార అవకాశంగా మలుచుకుందామె. రాజు పికిల్స్.కామ్ పేరిట ఆన్లైన్లో పచ్చళ్లను విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ దాట్ల సౌజన్య మాటల్లోనే.. ⇔ మాది తూర్పు గోదావరిలోని భీమవరం. మావారి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాం. భీమవరం పచ్చళ్లకు బాగా ఫేమస్ కావటంతో ఎప్పుడు నేను ఊరెళ్లినా సరే ఇక్కడి చుట్టుపక్కల వాళ్లు వచ్చేటప్పుడు పచ్చళ్లు తీసుకురమ్మని చెప్పేవాళ్లు. చాలాసార్లు తీసుకొచ్చా కూడా. ఒకసారి అనుకోకుండా ఊరి నుంచి తీసుకొచ్చే బదులు మనమే తయారు చేసి విక్రయిస్తే పోలే అనిపించింది. ఇంకేముంది మా వారి సహకారంతో 2015 మార్చిలో రాజు పికిల్స్.కామ్‌ను ప్రారంభించా. ⇔ రాజు పికిల్స్లో కేవలం చికెన్, మటన్, రొయ్యలు, నాటుకోడి పచ్చళ్లుంటాయి. వెజిటేబుల్ పచ్చళ్లు తయారు చేయాలంటే అన్ని కాలాల్లో సెట్‌కాదు. పైగా మార్జిన్స్ కూడా తక్కువ. మియాపూర్‌లోని మా ఇంట్లో తయారు చేస్తాం. పచ్చళ్లలో వాడే కారం, మసాలాలు, దినుసుల వంటివన్నీ భీమవరం నుంచి దిగుమతి చేసుకుంటాం. ⇔ ధరలు కిలోకు చికెన్ రూ.875, నాటుకోడి రూ.1,600, మటన్, రొయ్యలు రూ.1,200గా నిర్ణయించాం. 45–60 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ప్రస్తుతం నెలకు 140 కిలోల పచ్చళ్లను డెలివరీ చేస్తున్నాం. సుమారు 80–100 మంది కస్టమర్లు ఆర్డర్లిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ నగరాల నుంచే కాకుండా యూఎస్, యూకే, కెనడా దేశాల నుంచి కూడా ఆర్డర్లొస్తున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా మా కస్టమర్లుగా ఉన్నారు. ⇔ ఏడాదికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నాం. సరుకుల డెలివరీ కోసం ఫెడెక్స్, డెల్హివరీ కొరియర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఫేస్బుక్, పలు మీడియా సంస్థల ప్రచారంతో ఇతర దేశాల్లోని కస్టమర్లనూ అకర్షించగలిగాం. -
మహిళా సాక్షిగా!
ఆమె... పేరుకే సర్పంచ్... పెత్తనం అంతా మిస్టర్ సర్పంచ్‌దే. ఇదీ... మన దగ్గర సాగుతున్న మహిళాసాధికారత. ఇంటి పనికి జీతం ఉండదు... ఇంట్లో జీతం తెచ్చే వాడిదే పై చేయి. ఇదీ మన గృహిణికి ఉన్న ఆర్థిక సాధికారత. సమాజంలో మహిళ వెతలకు అంతే లేదు. ఆమె సమస్యలకు సమాధానం ఒక్కటే! మహిళ ఇంకా ఇంకా ఎదగడం... దేశ నిర్మాణంలో భాగం కావడం! అందమైన... ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఆమె బలమైన ఇరుసు కావాలి. అప్పుడే ఆమెకు... ఆర్థిక స్వావలంబన... సామాజిక గుర్తింపు... మానసిక వికాసం!! ఆల్ ఇండియా ఉమెన్ జర్నలిస్ట్‌ల వర్క్‌షాప్... ఉద్దేశమూ అదే. స్వతంత్ర భారతంలో ఇలాంటి ప్రయత్నం ఇదే మొదటిది!! అధికార ముద్రిక ఆమె అయితే... ఆ ముద్రను వేసే చేయి మగవాడిది కాకూడదు. అధికారం నిజంగానే మహిళకు దక్కాలి. బస్తాల కొద్దీ పిస్తాలు రికార్డుల్లో మాత్రమే కాదు... పిల్లల చేతుల్లో ఉండాలి. ఒక మాట మహిళల కోసం... మరోమాట పిల్లల కోసం... ఈ రెండు మాటలు చెప్పింది కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మనేకా గాంధీ. ప్రదేశం... ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లోని ఈస్ట్ హాల్. తేదీ: జూన్ 7, 2016. ఉదయం పదిగంటల సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మహిళా విలేఖరుల సమావేశంలో అన్న ఈ మాటలు దేశమంతటికీ వర్తించేవి... అన్ని రాష్ట్రాలవారూ అనుసరించాల్సినవి. పదకొండు భాషల ప్రసారమాధ్యమాల నుంచి దాదాపుగా 250 మందికి పైగా మహిళా విలేఖరులు హాజరైన సందర్భంగా వారిని ఉద్దేశించి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ ప్రసంగిస్తూ అన్న మాటలివి. దేశనిర్మాణంలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి గడచిన రెండేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలతోపాటు మరికొన్ని కొత్త ప్రతిపాదనలను మహిళా విలేఖరుల ముందుంచారు మంత్రి. అమలులో అవసరమైన మార్పులు, సూచనలను స్వాగతించారామె. ‘సమాచారమే శక్తి. ఆ శక్తితో పురోగతి సాధించవచ్చు’ అంటూ సాగిన ప్రసంగంలో, మహిళా విలేఖరులు ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’కు సోషల్ ఏజెంట్లుగా సహాయసహకారాలందించాల్సిగా ఆమె కోరారు. మహిళలు, పిల్లల హక్కులకు భంగం కలిగినప్పుడు ఆ వివరాలను నేరుగా మంత్రిత్వ శాఖ నెట్‌వర్క్‌తో పంచుకోవడం ద్వారా త్వరితగతిన ప్రక్షాళన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. ఆరు గంటలు సాగిన సెషన్లో, దేశం నలుమూలలా మహిళలు, పిల్లలకు ఎదురవుతున్న సమస్యలను మనేకాగాంధీ ప్రస్తావించారు. తమ సందర్శన సందర్భంగా తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటనలను ఉదాహరించారు. పిల్లలకు పోషకాహారాన్ని పెట్టాల్సిన అంగన్వాడీ సెంటర్లు... పిల్లలకు రుచి, నాణ్యత లేని ఆహారం పెట్టడాన్ని, ఉత్తరాఖండ్‌లో దాబా నుంచి నూనెలో వేయించిన పదార్థాలు కొని పెట్టడాన్ని నిరసించారు. కర్ణాటకలో తనకు ఎదురైన చిత్రమైన అనుభవాన్ని పంచుకున్నారు. ‘అక్కడి ఎన్జివో నిర్వహకులు పిల్లలకు పిస్తా, పండ్లు, గుడ్లు పెట్టారు ఆ రోజు. పిల్లలను పరిశీలిస్తే... రోజూ అలాంటి ఆహారం తీసుకుంటున్నట్లు ఏ మాత్రం నమ్మకం కుదరడం లేదు. పోషకాహార లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది’ అని చెప్పారు. కేవలం మంత్రి పర్యటించే రోజున మాత్రం పని చేసినట్లు కనిపించే చర్యలను తప్పుపట్టారు. తాను ప్రతిరోజూ పర్యటించి పరిశీలించడం సాధ్యమయ్యే పని కాదు, కాబట్టి మహిళా విలేఖరులు వీటి మీద ఒక కన్ను వేసి ఏమైనా పొరపాట్లు దొర్లివుంటే మంత్రిత్వశాఖ వెబ్సైట్ ద్వారా తన దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు. తల్లిపాలతో పిల్లలు ఆరోగ్యంగా పెరిగితేనే దేశం శక్తిమంతమవుతుందనీ, అందుకే ప్రసవించిన మహిళకు 26 వారాల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలనే నిబంధనను గుర్తు చేశారామె. వీటన్నింటినీ సక్రమంగా అమలయ్యేలా చూసే మరో నేత్రంగా విమెన్ మీడియా పనిచేయాలని, మహిళల స్థితిగతులను మెరుగుపరచడంలో సహకరించాలని మనేకా గాంధీ కోరారు. ఇది మహిళల వికాసానికి మంత్రి హోదాలో ఓ మహిళ చేస్తున్న ప్రయత్నం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి సంక్షేమం కోసం... పథకాలు... ప్రతిపాదనలు! జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015... కౌమారదశలోని పిల్లల నేరాన్ని బాల్యచేష్టగా పరిగణించడమా, శిక్షార్హమైన నేరంగా పరిగణించడమా అనేది విచక్షణతో వ్యవహరించాలి. మిస్సింగ్, ట్రాఫికింగ్... పారిపోయిన పిల్లల కోసం ‘ఖోయా-పాయా’ పోర్టల్ ఏర్పాటు చేశారు. ఇందులో రైల్వేలతో ఒప్పందం కుదుర్చుకుని బోగీలకు వివరాల పట్టికను అతికిస్తారు. పారిపోయిన పిల్లలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరడానికి ఎన్నుకునే ప్రధాన రవాణా మార్గం రైల్వేలే అయి ఉంటాయి. అందుకే ప్రతి స్టేషన్లోనూ ఇలాంటి పిల్లలను గుర్తించి ప్రభుత్వ హోమ్‌లకు సమాచారం అందించి పిల్లలను చేర్చడానికి ఒక సెల్ ఏర్పాటు. కాంప్రహెన్సివ్ అడాప్షన్ రిఫార్మ్స్... ఆర్థిక పరిపుష్టి ఉన్న దంపతులు తమ పిల్లలతోపాటు ఒక అనాథ బాలికను పెంచుకోవడాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఇందులో పాక్షిక దత్తతనూ ప్రోత్సహిస్తారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సిఎస్ఆర్) ద్వారా కంపెనీలు కూడా అనాథ బాలికలను దత్తత తీసుకోవచ్చు. ప్రతి బాలికకూ ప్రభుత్వం ఒక ఐడీ నంబరు ఇస్తుంది. స్కూల్లో చేర్చడానికి, ఇతర సౌకర్యాలకు ఆ ఐడి సరిపోతుంది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్... అంగన్ వాడీ సెంటర్ల మౌలిక సదుపాయాల పెంపు... పిల్లలకు అందుతున్న ఆహారంలో నాణ్యత, స్వచ్ఛ్ అంగన్వాడీ అభియాన్ ద్వారా డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ రెమ్యూనరేషన్ వంటివి ఈ కార్యక్రమాల కింద ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ పథకాల ప్రచారంలో పని చేయించుకోవడం ద్వారా వాళ్లు పిల్లల సంరక్షణ మీద దృష్టి పెట్టలేకపోతున్నారని, వారికి అదనపు పనులు కేటాయించరాదనేది తప్పక పాటించాల్సిన నియమం. సాధారణంగా గ్రామానికి ఒక అంగన్వాడీ సెంటర్ ఉంటుంది. దాని పరిధిలో చిన్న చిన్న నివాస ప్రాంతాలు దూరదూరంగా ఉంటాయి. అలాంటి చోట్ల ఆ పిల్లలందరూ ఒక సెంటర్‌కు రావడం సాధ్యం కానప్పుడు మినీ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.జంక్‌ఫుడ్ గైడ్‌లైన్స్... స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ అమ్మడం మీద నిషేధం విధించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. మహిళల కోసం... మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్ ఏర్పాటు... ప్రత్యేకమైన యాప్ ద్వారా ప్రమాదం సంభవించినప్పుడు మొబైల్ ఫోన్లోని నిర్దేశిత బటన్ నొక్కితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌తోపాటు సమీపంలో ఉన్న పది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషులకు సమాచారం అందుతుంది.మహిళా-ఇ-హాట్... మహిళలు ఇంట్లోనే ఉండి తమకు చేతనైన పనులు చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. ఇతర మెళకువలేమీ లేకపోయినా సరే... స్వీట్లు, మురుకుల వంటి తినుబండారాలు చేయడం మాత్రమే వచ్చిన వాళ్లు కూడా ఈ-మార్కెటింగ్ వెబ్సైట్లతో కనెక్ట్ అవుతారు. బేటీ బచావో బేటీ పడావో... ఆడబిడ్డను రక్షించాలి, చదివించాలని సమాజాన్ని చైతన్యవంతం చేసే క్యాంపెయిన్. స్వచ్ఛ భారత్‌లో భాగంగా బాలికలున్న అన్ని స్కూళ్లలో టాయిలెట్ల నిర్మాణం దీని లక్ష్యం. వితంతువుల పునరావాసం... యూపీలోని బృందావనంలో పిల్లలు వదిలేసిన మహిళల కోసం హోమ్. ఇతర చోట్ల అలాంటి హోమ్‌ల అవసరాన్ని గుర్తించి నిర్మించాలి.ఉమెన్ హెల్ప్‌లైన్... మహిళల హక్కుల కోసం సలహాలు, సహాయం కోసం పని చేస్తుంది.హెరాస్మెంట్ ప్రివెన్షన్ సెల్... పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అరికట్టడానికి ఉద్దేశించిన‘సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్ 2013’ ప్రకారం... ప్రతి ఆఫీసులోనూ ఒక సెల్ ఏర్పాటయ్యే వరకు మహిళలు ఉద్యమస్ఫూర్తితో పనిచేయాలి.పోలీసు నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ ... చట్టాన్ని ఆశ్రయించిన మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడడం వంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. ఇందుకోసం పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండాలి. హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ అచీవర్స్ కాంటెస్ట్... నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ వంటి సంస్థాగతమైన అంశాలతోపాటు మాట్రిమోనియల్ వెబ్సైట్ల వాడకంలో చట్టపరమైన నిబంధనలు రూపొందాలి. ఈ వెబ్సైట్ల ద్వారా మగవాళ్లు మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రశ్నలు వేయడాన్ని శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు (ఒక పెళ్లి కొడుకు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఒక అమ్మాయితో ‘పెళ్లికి ముందు శీల పరీక్షకు సిద్ధమేనా’ అని అడిగిన సంగతి ప్రస్తావించారు మనేక). పంచాయితీరాజ్‌లో మహిళా ప్రతినిధులకు శిక్షణ... ప్రభుత్వ పథకాలు, వాటిని ఏయే కార్యాలయాల ద్వారా చేయించుకోవాలనే అంశాల్లో శిక్షణ ఇవ్వడం, ఒక యాప్ ద్వారా మహిళా ప్రతినిధులను కనెక్ట్ చేయడం, ‘సర్పంచ్పతి’ విధానానికి అడ్డుకట్ట వేయడం ద్వారా మహిళల రిజర్వేషన్‌ను పటిష్టంగా అమలు చేయడం. మహిళల పని వేళలు... రాత్రిళ్లు పని చేయాల్సిన ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక సదుపాయాల కల్పన, మహిళల మీద అఘాయిత్యం జరిగినప్పుడు ‘లో నెక్ బ్లవుజ్, పొట్టి దుస్తులు’ అనే నేలబారు వ్యాఖ్యానాల నిరోధానికి పటిష్టమైన చట్టాల ఆవశ్యకత వంటి అనేక ప్రతిపాదనలతోపాటు నారీ శక్తి పురస్కారాన్ని ప్రస్తావించారు. ఇందులో అభ్యుదయ రీతిలో వ్యవహరించిన మహిళలకు మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందిస్తారు. ఈ ఏడాది కూతుళ్లిద్దరినీ రైఫిల్ షూటర్లను చేసి ఒక మహిళకు పురస్కారం అందించినట్లు గుర్తు చేసుకున్నారు. ఇలాంటి అర్హులైన మహిళలను గుర్తించి వారి వివరాలను మంత్రిత్వ శాఖ ఫేస్బుక్లో పోస్ట్ చేయవలసిందిగా మహిళా విలేఖరులను కోరారు మనేకా గాంధీ. ఫేస్బుక్ యూజర్సే ఈ ఎంట్రీలకు న్యాయనిర్ణేతలు. -
ఆ ఇల్లే ఓ ఉద్యానవనం
ఇంటిపంట ‘సాక్షి’ ఇంటిపంట ఇచ్చిన స్ఫూర్తితో... స్వయంగా పండించిన సేంద్రియ పండ్లు, కూరగాయలనే తన కుటుంబ అవసరాలకు వినియోగించాలనే లక్ష్యంతో మేడపైన ఇంటి పంటలు పెంచుతున్నారు వనమామళె నళిని. గృహిణిగా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం 300 కుండీల్లో వివిధ రకాల పూలు, పండ్లు, కాయగూర మొక్కలను టైపై పెంచుతున్నారు. తమ కుటుంబానికి సరిపడా పండ్లు, వారంలో మూడు రోజులకు సరిపోయే కూరగాయలను, ఇంటిపట్టునే పండించుకోవటం విశేషం. హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన వనమామళ నళిని ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇంటిపంట’ శీర్షిక స్ఫూర్తితో తమ ఇంటిపైన పండ్లమొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. అరటి, మునగ, పాల సపోటా, ఉసిరి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, రెడ్ మలేషియన్ గోవా, చెర్రీ, థాయ్మాంగో లాంటి పండ్ల మొక్కలు.. బూడిద గుమ్మడి, పుచ్చ, దోస, కాకర, బీర, పొట్ల, సొర, చిక్కుడు తదితర తీగజాతి కూరగాయలు.. క్యాబేజీ, కాలీఫ్లవర్ , ఉల్లి, టమాటా, ఫ్రాన్స్ చిల్లీ, వంగ, బెండ తదితర కాయగూరలు... కరివేపాకు, గోంగూర, మెంతికూర, చుక్కకూర, బిర్యానీ ఆకు, పాలకూర లాంటి ఆకుకూరలను ఆవిడ మేడపైన కుండీల్లో పెంచుతున్నారు. ఇందుకోసం పాత ప్లాస్టిక్ డబ్బాలు, మినరల్ వాటర్ డబ్బాలు, చెక్క పెట్టెలు, పాలిథిన్ కవర్లు, మట్టి కుండీలను వినియోగిస్తున్నారు. ‘మట్టి, వరిపొట్టు, వర్మీ కంపోస్టు, కోకోపిట్లను సమాన నిష్పత్తిలో కలిపిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నాను. ఏడాదికోసారి కుండీల్లోని 60 శాతం మట్టి మిశ్ర మాన్ని తొలగించి.. కొత్త మట్టి మిశ్రమాన్ని నింపుతాను. వంటింటి వ్యర్థాలతో తయారుచేసిన కంపోస్టుతోపాటు జీవామృతాన్ని వారానికి ఒకసారి మొక్కలకు అందిస్తాను. ప్రతి రోజూ సాయంత్రం మొక్కలకు నీరు పోస్తున్నా. హానిచేసే కీటకాల నుంచి మొక్కలను రక్షించేందుకు కుంకుడు కాయల రసం, త్రీజీ (అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు సమాన నిష్పత్తిలో కలిపిన) కషాయాన్ని ఉపయోగిస్తున్నాను. ఈ మిశ్రమానికి 1:10 నిష్పత్తిలో నీరు కలిపి పది రోజులకు ఒకసారి పిచికారి చేస్తాను. దీంతోపాటు పల్చటి మజ్జిగను కొంచెం సర్ఫ్‌తో కలిపి పిచికారీ చేయటం వల్ల కీటకాలు, తెగుళ్ల బెడదను పూర్తిగా నివారించవచ్చు. వంటకు ఉపయోగించే ముందు చేప ముక్కలు కడిగిన నీళ్లను 3 రోజులు మురగబెట్టి కుండీల్లో నెలకోసారి పోస్తుంటాను. దీనివల్ల మొక్కల పెరుగుదల బాగుంది. పూత రాలటం ఆగిపోయింది.’ అన్నారామె. వేసవి ఎండల నుంచి మొక్కలకు రక్షణ కల్పించేందుకు గ్రీన్ షేడ్‌నెట్‌ను నళిని ఏర్పాటు చేసుకున్నారు. కుండీల్లో తేమ ఆరిపోకుండా కొబ్బరిపొట్టు, ఎండుటాకులను ఆచ్ఛాదనగా వేస్తున్నారు. రోజూ ఒక గంట సమయం కేటాయిస్తే చాలన్నారు. ఇదివరకు ప్రతి చిన్న విషయానికీ విసుగు, కోపం వచ్చేవని.. ఇంటిపంటల సాగు ప్రారంభించాక ఉత్సాహంగా ఉందన్నారు. ఖాళీ సమయాన్ని వెచ్చించి కుటుంబ సభ్యులకు ఆరోగ్యకరమైన ఆహారాన్నందిస్తున్నానన్న భావన ఎంతో తృప్తిని కలిగిస్తోంది. థాంక్స్ టూ ‘ఇంటిపంట’ అంటున్నారు నళిని. ్చజీజీ.ఠిఝఠీఃజఝ్చజీ.ఛిౌఝ ద్వారా ఆమెను సంప్రదించవచ్చు. - దండేల కృష్ణ, ఇంటిపంట డెస్క్ -
గృహిణిపై గ్యాంగ్ రేప్
లిఫ్ట్ నెపంతో తీసుకెళ్లి అకృత్యం అత్తాపూర్: మానవ మృగాలు రెచ్చిపోయాయి... లిఫ్ట్ అడిగిన పాపానికి ఓ గృహిణిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్‌కి చెందిన గృహిణి(26) ఈనెల 28న తన తల్లి అనసూయ, కూతురు శ్రావణి(8)తో కలిసి అత్తాపూర్ చింతల్మెట్లోని కల్లు దుకాణానికి వచ్చింది. తల్లిని, కూతురిని ఇంటికి పంపేసి తాను మాత్రం అక్కడే ఉంది. సాయంత్రం కల్లు దుకాణం నుంచి బయటకు వచ్చిన ఆమె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడింది. అదే సమయంలో అటుగా బైక్వెళ్తున్న ఫర్వీద్ (26)ను లిఫ్ట్ అడిగింది. అతను ఆమెను బైక్‌పై ఎక్కించుకొని మిరాలం చెరువు వైపు తీసుకెళ్లాడు. తన స్నేహితులు వాజిద్(45), ఫసి(28)లకు ఫోన్ చేసి చెరువు వద్దకు రమ్మన్నాడు. ముగ్గురూ కలిసి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడి పారిపోయారు. కాగా, బాధితురాలు సోమవారం రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డిని కలిసి దుండగులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఇంటిపంట’ స్ఫూర్తితో... మేడపైనే పండ్లు, కూరగాయలు!
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గృహిణి రేణుక తమ మేడపైన పచ్చని ఫుడ్ ఫారెస్ట్‌ను సృష్టించారు. వ్యవసాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న ఆమె ‘ఇంటిపంట’ స్ఫూర్తితో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ ప్రారంభించారు. తమ కుటుంబం కోసం ఆరోగ్యదాయకమైన పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. అప్పుడప్పుడూ ఇరుగు పొరుగు వారికీ రుచిచూపిస్తున్నారు. ఈ టై తోటను మెచ్చిన ‘చిన్న పిచ్చుక’ అందులోనే ఓ బుజ్జి గూడు కట్టుకుని.. సంతానం వృద్ధి చేసుకుంది! ఆదిలాబాద్‌లోని ద్వారకానగర్‌లో వ్యాపారి అరుణ్‌కుమార్ ఖత్రి (9849267774), రేణుక ఖత్రి కుటుంబం మూడంతస్తుల సొంత భవనంలో నివాసం ఉంటోంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకొని గృహిణిగా జీవనం కొనసాగిస్తున్న రేణుకకు పూల మొక్కలంటే ఇష్టం. అయితే, నాలుగేళ్ల క్రితం ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ చదివిన తర్వాత ఆమె దృష్టి సేంద్రియ ఇంటిపంటల వైపు మళ్లింది. హైదరాబాద్ కల్యాణ్‌నగర్‌కు చెందిన వేగేశ్న రామరాజు గారి టై గార్డెన్‌పై కథనం చదివి.. స్వయంగా వెళ్లి చూసి స్ఫూర్తి పొందానని ఆమె తెలిపారు. అప్పటి నుంచి తమ మేడ మీద సేంద్రియ పద్ధతుల్లో పండ్లు, కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. ‘ఇంటిపంట’ కాలమ్ అందిస్తున్న మెలకువలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయన్నారు. కాంక్రీటు మేడల మధ్య వీరి టై పచ్చగా అలరారుతోంది. 100 చదరపు గజాల టైపై 25 ప్లాస్టిక్ డ్రమ్ములు, 40 మట్టి కుండీలు ఏర్పాటు చేసి రేణుక నిక్షేపంగా ఇంటిపంటలు పండిస్తున్నారు. నల్లమట్టి, ఎర్రమట్టి, ఆవు పేడ ఎరువు, వరిపొట్టు, వేపపిండి, వర్మీకంపోస్టుతో కూడిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. సీతాఫలం, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, అల్లనేరేడు, ఉసిరి, సపోట, మామిడి, రేగు తదితర 15 రకాల పండ్ల చెట్లతోపాటు వివిధ కూరగాయ మొక్కలు, ఔషధ, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. రెండేళ్లుగా సొంత పండ్లు, సొంత కూరగాయలపైనే ఎక్కువగా వాడుతున్నామని రేణుక వివరించారు. వంటింటి వ్యర్థాలతో తయారైన కంపోస్టుతోపాటు జీవామృతాన్ని సొంతంగా తయారు చేసి కిచెన్ గార్డెన్‌కు 15 రోజులకోసారి వాడుతున్నారు. నాటు విత్తనాలతోనే టమోటా, గోరుచిక్కుడు, మిరప, చిక్కుడు, బీర, కాకర, వంగ, బెండ, చేమగడ్డ, మునగ, గోంగూర, కొత్తిమీర, మెంతికూర, ఇతర ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తమ ఇంటిపంటను అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుకీ పంచుతున్నారు. భర్త సహాయ సహకారాల్లేకుండా ఇంటిపంటల సాగు సాధ్యమయ్యేది కాదని, ఆయన తోడ్పాటుతోనే హైదారాబాద్, కడియం నర్సరీల నుంచి కోరుకున్న మొక్కలు తెప్పించుకుంటున్నానన్నారు రేణుక. సంధ్యా సమయాల్లో టై తోట పక్షుల కిలకిలారావాలతో సందడిగా ఉంటుంది. పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తూ మానసికోల్లాసాన్ని కలిగిస్తోందన్నారు రేణుక. గత ఏడాది నాగమల్లి చెట్టుపై చిన్న పిచ్చుకలు గూడు పెట్టడం.. మూడు పిల్లల్ని చేయడం.. తమ ‘ఇంటిపంట’లో మరువలేని మధుర జ్ఞాపకంగా మిగిలిందని ఆమె తృప్తిగా చెప్పారు. - కొండా శ్రీనివాస్, ఆదిలాబాద్ -
ఏ తీరమేగినా...తీరు మారదా!
లైంగిక ఎంపిక సరితా రాజీవ్! గృహిణి. రచయిత్రి. కాలమిస్టు. బ్లాగర్. అన్నిటినీ మించి ‘గిఫ్టింగ్ స్పెషలిస్టు’. గిఫ్టింగ్ స్పెషలిస్టు అంటే... ఏ సందర్భంలో ఎవరికి ఎలాంటి గిఫ్టులను ఇవ్వాలి? వాటిని సృజనాత్మకంగా ఎలా ప్యాక్ చెయ్యాలి అనే విషయాలలో గైడ్ అన్నమాట. సరిత నిన్నమొన్నటి వరకు ఇండియాలో ఉన్నారు. ప్రస్తుతం డెన్మార్క్‌లో ఉంటున్నారు. తన బ్లాగులో ఆమె రకరకాల అంశాలపై అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా, ప్రభావవంతంగా వ్యాసాలు రాస్తుంటారు. తాజాగా ఆమె ‘జెండర్ సెలక్షన్, జెండర్ బ్యాలెన్స్’ అనే ధోరణులపై తన అభిప్రాయాలను పాఠకులతో పంచుకున్నారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ వివరాలు... ఆమె మాటల్లోనే. లైంగిక వివక్ష లేదు!: ముందుగా నేను డెన్మార్క్ గురించి కొంత చెప్పాలి. ఇక్కడ ఉన్నంత లైంగిక సమానత్వం మరే దేశంలోనూ ఉండేదేమో అనిపిస్తుంది. ఇది నన్నెంతో సంతోషపరచిన సంగతి. డెన్మార్క్ కుటుంబాలలో మగపిల్లలను, ఆడపిల్లలను సమానంగా ఆదరిస్తారు. ఏ విషయంలోనూ చిన్నపాటి వ్యత్యాసం కూడా చూపరు. ప్రేమానురాగాలను సమానంగా పంచుతారు. ఇద్దరినీ సమస్థాయిలో ప్రోత్సహిస్తారు. చదువుగానీ, ఆటపాటలు గానీ, అవకాశాలలో గానీ, మొత్తం పెంపకంలోనే గానీ ఆడామగా ఇద్దరూ ఒకటే. అలాగే పిల్లల పెంపకం బాధ్యతలను తల్లిదండ్రులిద్దరూ సమానంగా స్వీకరిస్తారు. ‘ఇది నీ పని, ఇది నా పని’ అనే తేడాలు ఉండవు. అంటే ఆడపనీ, మగపనీ అన్న భేదభావం ఉండదు. ఆడవాళ్లు టార్గెట్లనీ, డెడ్లైన్లనీ, మీటింగ్లనీ ఎంతో ఉత్సాహంతో ఆఫీస్‌కు పరుగులు తీస్తూ కనిపిస్తారు. అలాగే మగవాళ్లు పిల్లలకు స్నానం చేయించడం, బట్టలు మార్చడం, స్కూలు దగ్గర దించడం వంటి పనులన్నీ బాధ్యతగా చేస్తారు. ఇప్పటి వరకూ ఇలాగే ఉండింది కానీ, ఇక ముందు ఈ పరిస్థితి మారబోతుందా అనే అందోళన కలుగుతోంది. అందుకు కారణం ఇటీవల ఈ దేశంలో జరిగిన ఒక సర్వే! సర్వే... ఒక సంకేతమా?: ‘జెండర్ సెలక్షన్’ (గర్భధారణకు మగ లేదా ఆడ శిశువును ఎంపిక చేసుకునే అవకాశం) అనే అంశంపై ‘యుగవ్’ అనే సంస్థ సర్వే జరిపింది. అందులో మొత్తం 1004 మంది డెన్మార్క్ పౌరులు పాల్గొన్నారు. వారిలో 11 శాతం మంది వైద్య ప్రక్రియల ద్వారా శిశువును ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తూ డెన్మార్క్ ఒక చట్టాన్ని తెస్తే బాగుంటుందన్న భావాన్ని వ్యక్తం చేశారు. 6 శాతం మంది అలాంటి చట్టం కనుక ఉంటే శిశువును ఎంపిక చేసుకునే అవకాశాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. ఈ ధోరణి నన్నెంతో కలవరపరచింది. డెన్మార్క్ వంటి ‘సమభావ’ దేశంలో కూడా వివక్షపూరితమైన ఆలోచనలు పొడసూపబోతున్నాయా అన్న బాధ నన్ను వెంటాడుతూ ఉంది. ఇదలా ఉంచితే, గత నాలుగు నెలల వ్యవధిలోనే 250 మంది డెన్మార్క్ దంపతులు జెండర్ సెలక్షన్ కోసం సైప్రెస్కు ప్రయాణించి, అక్కడి సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించడం ఆందోళన కలిగిస్తోంది. రెండు వందల యాభై అన్నది పైకి పెద్ద సంఖ్యగా కనిపించకపోవచ్చు. అయితే భవిష్యత్తులో సంభవించనున్న మార్పులకు ఈ వైఖరి ఒక సంకేతంలా అర్థం చేసుకోవలసి ఉంటుంది. సమ ఆదరణ ఉండాలి: డెన్మార్క్ కూడా క్రమక్రమంగా మగశిశువుల పట్ల మొగ్గు చూపబోతోందా? లేక ఆడ శిశువులను మాత్రమే ఎంపిక చేసుకునే వైపుగా సామాజిక పరిణామాలు సంభవిస్తాయా? ఈ రెండు మార్పులు కూడా ఆహ్వానించదగినవి కావు. లైంగిక సమానత్వం ఉన్న సమాజాలను... శిశువును ఎంపిక చేసుకునే అవకాశాలు వివక్ష వైపు మళ్లించే ప్రమాదం తప్పనిసరిగా ఉంటుంది. శిశువును ఎంపిక చేసుకునే విషయమై ఎవరి వాదనలు వారికి ఉంటాయి నిజమే. ఉదాహరణకు ముగ్గురు మగ పిల్లలు ఉన్న దంపతులు నాలుగోసారి ఆడ శిశువను కోరుకోవచ్చు. అలాగే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నవారు నాలుగో అవకాశంగా మగ శిశువును ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఈ వాదనకు ప్రతి వాదన ఉంది. మరీ ముగ్గురు నలుగురు పుట్టేవరకు ఆగడం ఎందుకు? తొలి ప్రయత్నంలోనే మనం కావాలనుకున్న శిశువును పొందవచ్చు కదా అనే వారు ఉంటారు. ఈ తరహా ఆలోచనా ధోరణిని ప్రోత్సహించే జెండర్ సెలక్షన్‌ను చట్టంగా చేయడం అంటే ఆడ, మగ మధ్య సమతూకాన్ని సంఖ్య పరంగా, ఆదరణ పరంగా దెబ్బతీసి, వివక్షకు దారి తియ్యడం తప్ప మరొకటి కాదు. ప్రకృతి సహజంగా ఏ బిడ్డ పుడితే ఆ బిడ్డను స్వీకరించడం ఆరోగ్యకరమైన విధానం అని నా అభిప్రాయం. ఇండియాలో కూడా శిశువును ఎంపిక చేసుకునే వైద్య ప్రక్రియలపై, లింగనిర్థారణ పరీక్షలపై నిషేధం ఉంది. అయినప్పటికీ కొంతమంది దంపతులు కడుపులో ఉన్నది ఆడా మగా అని తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. మరీ విషాదం ఏమిటంటే గర్భంలో ఉన్నది ఆడశిశువైతే భ్రూణహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఇండియా అయినా, డెన్మార్క్ అయినా అమానుషమైన ఈ ఆలోచనా విధానాన్ని ఒక్క చట్టాలు మాత్రమే నియంత్రిస్తే సరిపోదు. ఎవరికి వారు పరిణతి చెందిన మనసుతో వ్యవహరిస్తే సమాజంలో లైంగిక సమానత్వం పరిఢవిల్లుతుంది.