ఏ తీరమేగినా...తీరు మారదా! | The pattern does not change any tiramegina ...! | Sakshi
Sakshi News home page

ఏ తీరమేగినా...తీరు మారదా!

Published Tue, Oct 14 2014 10:59 PM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

సరితా రాజీవ్ - Sakshi

సరితా రాజీవ్

లైంగిక ఎంపిక
 
సరితా రాజీవ్! గృహిణి. రచయిత్రి. కాలమిస్టు. బ్లాగర్. అన్నిటినీ మించి ‘గిఫ్టింగ్ స్పెషలిస్టు’. గిఫ్టింగ్ స్పెషలిస్టు అంటే... ఏ సందర్భంలో ఎవరికి ఎలాంటి గిఫ్టులను ఇవ్వాలి? వాటిని సృజనాత్మకంగా ఎలా ప్యాక్ చెయ్యాలి అనే విషయాలలో గైడ్ అన్నమాట. సరిత నిన్నమొన్నటి వరకు ఇండియాలో ఉన్నారు. ప్రస్తుతం డెన్మార్క్‌లో ఉంటున్నారు. తన బ్లాగులో ఆమె రకరకాల అంశాలపై అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా, ప్రభావవంతంగా వ్యాసాలు రాస్తుంటారు. తాజాగా ఆమె ‘జెండర్ సెలక్షన్, జెండర్ బ్యాలెన్స్’ అనే ధోరణులపై తన అభిప్రాయాలను పాఠకులతో పంచుకున్నారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ వివరాలు... ఆమె మాటల్లోనే.
 
లైంగిక వివక్ష లేదు!: ముందుగా నేను డెన్మార్క్ గురించి కొంత చెప్పాలి. ఇక్కడ ఉన్నంత లైంగిక సమానత్వం మరే దేశంలోనూ ఉండేదేమో అనిపిస్తుంది. ఇది నన్నెంతో సంతోషపరచిన సంగతి. డెన్మార్క్ కుటుంబాలలో మగపిల్లలను, ఆడపిల్లలను సమానంగా ఆదరిస్తారు. ఏ విషయంలోనూ చిన్నపాటి వ్యత్యాసం కూడా చూపరు. ప్రేమానురాగాలను సమానంగా పంచుతారు. ఇద్దరినీ సమస్థాయిలో ప్రోత్సహిస్తారు. చదువుగానీ, ఆటపాటలు గానీ, అవకాశాలలో గానీ, మొత్తం పెంపకంలోనే గానీ ఆడామగా ఇద్దరూ ఒకటే. అలాగే పిల్లల పెంపకం బాధ్యతలను తల్లిదండ్రులిద్దరూ సమానంగా స్వీకరిస్తారు. ‘ఇది నీ పని, ఇది నా పని’ అనే తేడాలు ఉండవు. అంటే ఆడపనీ, మగపనీ అన్న భేదభావం ఉండదు. ఆడవాళ్లు టార్గెట్‌లనీ, డెడ్‌లైన్‌లనీ, మీటింగ్‌లనీ ఎంతో ఉత్సాహంతో ఆఫీస్‌కు పరుగులు తీస్తూ కనిపిస్తారు. అలాగే మగవాళ్లు పిల్లలకు స్నానం చేయించడం, బట్టలు మార్చడం, స్కూలు దగ్గర దించడం వంటి పనులన్నీ బాధ్యతగా చేస్తారు. ఇప్పటి వరకూ ఇలాగే ఉండింది కానీ, ఇక ముందు ఈ పరిస్థితి మారబోతుందా అనే అందోళన కలుగుతోంది. అందుకు కారణం ఇటీవల ఈ దేశంలో జరిగిన ఒక సర్వే!
 
సర్వే... ఒక సంకేతమా?: ‘జెండర్ సెలక్షన్’ (గర్భధారణకు మగ లేదా ఆడ శిశువును ఎంపిక చేసుకునే అవకాశం) అనే అంశంపై ‘యుగవ్’ అనే సంస్థ సర్వే జరిపింది. అందులో మొత్తం 1004 మంది డెన్మార్క్ పౌరులు పాల్గొన్నారు. వారిలో 11 శాతం మంది వైద్య ప్రక్రియల ద్వారా శిశువును ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తూ డెన్మార్క్ ఒక చట్టాన్ని తెస్తే బాగుంటుందన్న భావాన్ని వ్యక్తం చేశారు. 6 శాతం మంది అలాంటి చట్టం కనుక ఉంటే శిశువును ఎంపిక చేసుకునే అవకాశాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. ఈ ధోరణి నన్నెంతో కలవరపరచింది. డెన్మార్క్ వంటి ‘సమభావ’ దేశంలో కూడా వివక్షపూరితమైన ఆలోచనలు పొడసూపబోతున్నాయా అన్న బాధ నన్ను వెంటాడుతూ ఉంది. ఇదలా ఉంచితే, గత నాలుగు నెలల వ్యవధిలోనే 250 మంది డెన్మార్క్ దంపతులు జెండర్ సెలక్షన్ కోసం సైప్రెస్‌కు ప్రయాణించి, అక్కడి సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించడం ఆందోళన కలిగిస్తోంది. రెండు వందల యాభై అన్నది పైకి పెద్ద సంఖ్యగా కనిపించకపోవచ్చు. అయితే భవిష్యత్తులో సంభవించనున్న మార్పులకు ఈ వైఖరి ఒక సంకేతంలా అర్థం చేసుకోవలసి ఉంటుంది.
 
సమ ఆదరణ ఉండాలి: డెన్మార్క్ కూడా క్రమక్రమంగా మగశిశువుల పట్ల మొగ్గు చూపబోతోందా? లేక ఆడ శిశువులను మాత్రమే ఎంపిక చేసుకునే వైపుగా సామాజిక పరిణామాలు సంభవిస్తాయా? ఈ రెండు మార్పులు కూడా ఆహ్వానించదగినవి కావు. లైంగిక సమానత్వం ఉన్న సమాజాలను... శిశువును ఎంపిక చేసుకునే అవకాశాలు వివక్ష వైపు మళ్లించే ప్రమాదం తప్పనిసరిగా ఉంటుంది. శిశువును ఎంపిక చేసుకునే విషయమై ఎవరి వాదనలు వారికి ఉంటాయి నిజమే. ఉదాహరణకు ముగ్గురు మగ పిల్లలు ఉన్న దంపతులు నాలుగోసారి ఆడ శిశువను కోరుకోవచ్చు. అలాగే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నవారు నాలుగో అవకాశంగా మగ శిశువును ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఈ వాదనకు ప్రతి వాదన ఉంది. మరీ ముగ్గురు నలుగురు పుట్టేవరకు ఆగడం ఎందుకు? తొలి ప్రయత్నంలోనే మనం కావాలనుకున్న శిశువును పొందవచ్చు కదా అనే వారు ఉంటారు. ఈ తరహా ఆలోచనా ధోరణిని ప్రోత్సహించే జెండర్ సెలక్షన్‌ను చట్టంగా చేయడం అంటే ఆడ, మగ  మధ్య సమతూకాన్ని సంఖ్య పరంగా, ఆదరణ పరంగా దెబ్బతీసి, వివక్షకు దారి తియ్యడం తప్ప మరొకటి కాదు. ప్రకృతి సహజంగా ఏ బిడ్డ పుడితే ఆ బిడ్డను స్వీకరించడం ఆరోగ్యకరమైన విధానం అని నా అభిప్రాయం.
 
ఇండియాలో కూడా శిశువును ఎంపిక చేసుకునే వైద్య ప్రక్రియలపై, లింగనిర్థారణ పరీక్షలపై నిషేధం ఉంది. అయినప్పటికీ కొంతమంది దంపతులు కడుపులో ఉన్నది ఆడా మగా అని తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. మరీ విషాదం ఏమిటంటే గర్భంలో ఉన్నది ఆడశిశువైతే భ్రూణహత్యలకు కూడా పాల్పడుతుంటారు. ఇండియా అయినా, డెన్మార్క్ అయినా అమానుషమైన ఈ ఆలోచనా విధానాన్ని ఒక్క చట్టాలు మాత్రమే నియంత్రిస్తే సరిపోదు. ఎవరికి వారు పరిణతి చెందిన మనసుతో వ్యవహరిస్తే సమాజంలో లైంగిక సమానత్వం పరిఢవిల్లుతుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement