సాక్షి, న్యూఢిల్లీ: పదుల సంఖ్యలో లైంగిక వేధింపుల కేసులు. జైలుకు వెళ్లటం.. బెయిల్‌పై రావటం... మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడటం ఆ కామాంధుడికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఓ యువతిపై ఆ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు గంటలపాటు మృగ చేష్టలతో ఆమెకు నరకాన్ని చూపించాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే...
వసంత్ కుంజ్‌లోని రంగ్‌పూరి పహారిలో ఓ యువతి(27) ఒంటరిగా నివసిస్తోంది. మే 29వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. తాళం తీస్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చి ఓ వ్యక్తి అమాంతం ఆమెను ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు. మంచానికి కట్టేసి ఆమెతో బలవంతగా మందు తాగించి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఆరు గంటలపాటు అతని వికృత క్రీడలు కొనసాగాయి. చివరకు ఉదయం నాలుగు గంటల సమయంలో ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. స్నేహితురాలి సాయంతో వసంత్ కుంజ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె చెప్పిన ఆనవాళ్లతో పోలీసులు ఓ వ్యక్తి ఫోటోను చూపించారు. ఫోటోలో ఉన్నదే నిందితుడిగా ఆమె అతన్ని గుర్తించటంతో గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడైన సందీప్ చౌహాన్‌ను జూన్1న పోలీసులు అరెస్ట్ చేశారు.
సందీప్ నేర చరిత్ర... పశ్చిమ్ విహార్‌కు చెందిన 38 ఏళ్ల సందీప్ వివాహితుడు. ఓ పాప కూడా ఉంది. గతంలో తైక్వాండో ట్రైనర్‌గా పని చేసేవాడు. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. దాంతో ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచి తప్పుడు మార్గంలోనే ప్రయాణిస్తూ వస్తున్నాడు. కంటికి కనిపించిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారి వెంటపడి వేధింపులకు గురిచేయటం, దాడి చేసి వాళ్ల దగ్గరి నుంచి గొలుసులు, ఫోన్లు దొంగతనం చేయటం... అలవర్చుకున్నాడు. ఈ క్రమంలో చాలాసార్లు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటికొచ్చేవాడు. ఇప్పటిదాకా అతనిపై 30 కేసుల దాకా నమోదయినట్లు తెలుస్తోంది.
‘సందీప్ దాడి చేసిన మహిళలెవరూ అతనికి తెలీదు. అప్పటికప్పుడే వారిని లక్ష్యంగా చేసుకుని వారిపై దాడికి పాల్పడుతుంటాడు. కానీ, అత్యాచారం కేసులో అరెస్ట్ కావటం మాత్రం ఇదే తొలిసారి’ అని వసంత్ కుంజ్ ఎస్సై చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం తాను ఉండే ప్రాంతంలోనే ఓ మహిళ ఇంటి ముందు సందీప్ వికృత చేష్టలకు పాల్పడిన నేరంలో జైలుపాలయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఇలా అత్యాచారం కేసులో ఇప్పుడు మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు.
పోలీసులేం చేస్తున్నారు?.. కాగా, ఈ ఘటనపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని కఠినంగా శిక్షించకపోవటం, సమాజంలో తిరుగుతున్న అతనిపై నిఘా వేయకపోవటం ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు. శనివారం ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, సందీప్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment