బాలికలపైనే అత్యాచారాలు అధికం! | Most rapes in Delhi by men known to victims | Sakshi
Sakshi News home page

బాలికలపైనే అత్యాచారాలు అధికం!

Published Mon, Jul 14 2014 8:14 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

బాలికలపైనే అత్యాచారాలు అధికం! - Sakshi

బాలికలపైనే అత్యాచారాలు అధికం!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 18 సంవత్సరాలలోపు వయసు ఉన్న బాలికలపైనే అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. తెలిసినవారు, ఇరుగుపొరుగువారే ఎక్కువగా అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు ఢిల్లీ పోలీసుల అధ్యయనంలో తేలింది. ఇటీవల కాలంలో రాజధానిలో  అత్యాచారాలు ఎక్కువగా జరుగుతుండటంతో పోలీస్ శాఖ ఈ అధ్యయనం చేసింది. 2013 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ వరకు జరిగిన అత్యాచారాలకు సంబంధించి ఈ  అధ్యయనం చేశారు. అధ్యయనం వివరాలను ఒక పోలీస్ అధికారి ఐఏఎన్ఎస్ ప్రతినిధికి వివరించారు.

ఈ అధ్యయనం ప్రకారం ఎక్కువ శాతం మంది తమతమ ఇళ్లలోనే అత్యాచారాలకు గురవుతున్నారు. నిందితులు ఉండే ప్రదేశంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. 81.22 శాతం అత్యాచార సంఘటనలు ఈ రకంగా జరిగినవే. 18 సంత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలే 46 శాతం బాధితులుగా ఉన్నారు.

అత్యాచారాలు చేసినవారిలో ఇరుగుపొరుగువారు, తెలిసినవారు, స్నేహితులు, బంధువులు, సోదరులు, తండ్రులు, బావలు, తోటి ఉద్యోగులు, సేవకులు  ఉన్నారు. 16-18 సంవత్సరాల మధ్య వయసువారిపై జరిగిన సంఘటనలు 14 శాతం ఉంటే, 12-16 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారాలు 19.25 శాతం ఉన్నాయి. 7-12 సంవత్సరాల బాలికలపై జరిగిన ఘటనలు 6.5 శాతం, 2-7 సంవత్సరాల బాలికపై జరిగిన అత్యాచారాలు 7.75 శాతం ఉన్నాయి. రెండు సంవత్సరాల లోపువారిపై కూడా ఇటువంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

అత్యాచార కేసులలో నిందితులలో 99 శాతం మంది మొదటిసారి ఇటువంటి చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. 2013లో  ఢిల్లీలో 1647 అత్యాచార ఘటనలు జరిగాయి. అయితే వాటిలో 984 మాత్రమే నమోదయ్యాయి. అత్యాచారాలకు  ఎక్కువగా ఒక్కరే పాల్పడ్డారు. ఇద్దరు కంటే ఎక్కువమంది ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడ్డ సంఘటనలు చాలా తక్కువగా జరిగాయి. 64 శాతం మంది  అల్పాదాయ వర్గాలకు చెందిన మహిళలే అత్యాచారాలకు గురయ్యారు. రాజధానిలో అత్యాచార సంఘటనలు పెరిగిపోతుండటంతో వాటిని నిరోధించడానికి ఢిల్లీ పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement