ఏడాదంతా నిషేధం విధించాలా వద్దా అనే అంశాన్ని తేల్చండి
ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని సృష్టించే ఏ రకమైన కార్యకలాపాలనూ ఏ మతమూ ప్రోత్సహించబోదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఏడాదంతా బాణసంచాను ఢిల్లీ పరిధిలో నిషేధించాలా వద్దా అనే అంశంపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలో బాణసంచా తయారీ, విక్రయాలపై నిషేధం అమల్లో ఉన్నాసరే దీపావళి వేళ ఢిల్లీ వ్యాప్తంగా విపరీతంగా బాణసంచా కాల్చడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సంబంధిత కేసును సోమవారం సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌ల ధర్మాసనం విచారించింది.
‘‘కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం అనేది ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కు. దీనిని రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ రక్షణ కల్పిస్తోంది. కాలుష్యకారక ఏ పనినీ ఏ మతమూ ప్రోత్సహించదు. సరదాగా బాణసంచా కాల్చినాసరే తోటి పౌరుల ఆరోగ్యకర జీవన హక్కుకు భంగం వాటిల్లినట్లే’’ అని వ్యాఖ్యానించింది. సంవత్సరం పొడవునా ఢిల్లీలో బాణసంచాపై నిషేధం అంశంపై ప్రభుత్వానికి కోర్టు సూచన చేసింది. ‘‘ సంబంధిత అన్ని వర్గాలతో సంప్రతింపులు జరపండి. ఆ తర్వాత నవంబర్ 25వ తేదీలోపు మీ నిర్ణయాన్ని తెలియజేయండి’’ అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మీ రాష్ట్రాల్లోనూ బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించడంపై స్పందన తెలియజేయాలని ఢిల్లీ పొరుగు రాష్ట్రాలనూ కోర్టు కోరింది.
ఢిల్లీ పోలీసులకు చీవాట్లు
నిషేధం ఉన్నాసరే ఊపిరాడనంతగా బాణసంచా కాల్చుతుంటే చూస్తూ ఊరుకున్నారని ఢిల్లీ పోలీసులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ నిషేధించాలంటూ గతంలో మేం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ పోలీసులు బేఖాతరు చేశారని స్పష్టమైంది. గతంలో బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకం అనుమతులు తీసుకున్న సంస్థలకు మా ఉత్తర్వుల కాపీలు అందినట్లు కనపించట్లేదు. మొదట ఢిల్లీ పోలీసులు చేయాల్సిన పని లైసెన్స్ దారులు టపాకాయలు విక్రయించకుండా అడ్డుకో వాలి. అమ్మకాలను ఆపేశారని, నిషేధం అమల్లోకి వచ్చిందని, ఆన్‌లైన్ వేదికలపై విక్రయాలు, డెలివరీ సౌకర్యాలను స్తంభింపజేసేలా సంబంధిత వర్గాల కు ఢిల్లీ పోలీసు కమిషనర్ తక్షణం సమా చారం ఇవ్వాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. క్షేత్రస్థాయిలో నిషేధాన్ని అమలు చేయా ల్సిన బాధ్యత స్థానిక పోలీస్‌స్టేషన్‌లదే. అక్టోబర్ 14వ తేదీదాకా మా ఉత్తర్వులు ఎవరికీ అందకుండా ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఆలస్యం చూస్తుంటే మాకే ఆశ్చర్యంవేస్తోంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
సాకులు చెప్పిన పోలీసులు
దీనిపై ఢిల్లీ పోలీసులు తప్పును ఆప్ సర్కార్‌పై నెట్టే ప్రయత్నంచేశారు. ఢిల్లీపోలీసుల తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదించారు. ‘‘ మాకు ఉత్తర్వులు రాలేదు. దసరా అయి పోయిన రెండ్రోజుల తర్వాత ఆప్ సర్కార్ ఆదేశా లు జారీచేసింది. ఆదేశాలు వచ్చాకే మేం నిషేధం అమలుకు ప్రయత్నించాం’’ అని భాటీ అన్నారు. దీపావళి, ఆ తర్వాతి రోజు ఢిల్లీలో వా యునాణ్యత దారుణంగా పడిపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఆదేశాలు అమలుకా కపోవడంపై కోర్టు ధిక్కరణగా భావించింది.
Comments
Please login to add a commentAdd a comment