పురుషాంగం తొలగించేలా చట్టం తేవాలి
చెన్నై: 'నేను సూచించే శిక్ష ఆటవికమని కొందరు భావిచవచ్చు, కానీ తాము మనుషులమనే విచక్షణ మరిచి క్రూర మృగాల్లా వ్యవహరించే వారికి ఇలాంటి శిక్ష సరైందే. మానవ హక్కులు.. నేరస్తులకు రక్షణ కవచాలు కావనే వాస్తవాన్ని వివిధ సంఘాల నేతలు గ్రహించాలి' అని వ్యాఖ్యానిస్తూ, లైంగిక దాడులకు పాల్పడి చిన్నారుల జీవితాలను చిదిమేసేవారి పురుషాంగాలను తొలగించేలా చట్టం తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్.. కేంద్రానికి సిఫారసు చేశారు. అలాగే ఉన్నత విద్యాబోధనలో సెక్స్ ఎడ్యుకేషన్‌ను ఒక నిర్బంధ పాఠ్యాంశంగా చేర్చడంపై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
'సంచలన సిఫార్సు'కు నేపథ్యం..
2011లో తమిళనాడులోని ఓ అనాథ బాలుర శరణాలయాన్ని బ్రిటిష్ జాతీయుడు ఒకయన సందర్శించారు. ఆ శరణాలయంలో ఉంటూ 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడిని ఎంపిక చేసుకుని, లండన్ లో ఉన్నత చదువులు చదివిస్తానని నమ్మించి వెంట తీసుకెళ్లాడు. ఢిల్లీలోని వైఎస్‌సీఏ పర్యాటక గృహంలో ఆ బాలుడిని నిర్బంధించి లైంగికదాడి జరిపి.. తనదారిన తాను ఇంగ్లాండ్ పారిపోయాడు.
2011 ఏప్రిల్ 15వ తేదీన ఈ సంఘటన జరిగింది. బాధిత బాలుడు అందించిన సమాచారం ఆధారంగా 'ఐస్టీస్ అండ్ కేర్' అనే స్వచ్ఛంద సేవా సంస్థ.. సదరు విదేశీ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కూడా నమోదయింది. అయితే.. తనపై కేసు కొట్టేయాలని నిందితుడు బ్రిటన్ నుంచే అప్పీలు చేసుకున్నాడు.
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి కృపాకరన్ ముందుకు ఇటీవల ఈ కేసు విచారణకు వచ్చింది. నిందితుడి అభ్యర్థనను తోసిపుచ్చిన ఆయన.. ఈ సందర్భంగా ఆయన కేంద్రానికి ఒక లేఖ రాశారు. చిన్నారులపై లైంగిక దాడులు, సామూహిక అత్యాచారాలకు పాల్పడేవారికి తగిన శిక్ష విధించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు చాలవని, మరింత కఠిన శిక్షలు అవసరమని పేర్కొన్నారు. ఘాతుకాలను చూస్తూ మౌనంగా ఉండకూడదని, చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడిన వారికి శస్త్రచికిత్స ద్వారా పురుషాంగాన్ని తొలగించే చట్టాన్ని తీసుకువచ్చేలా పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు.