punishment
-
అధికారులకు అరగంట శిక్ష!
అధికారులు ప్రజలతో వ్యవహరించే తీరు కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతుంటుంది. ఆ టైంలో చూసేవాళ్లకు రక్తం మరిగిపోతుంటుంది. వాళ్లు ఉన్నది తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడానికే కదా! అనుకుంటాం. అయితే.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఇక్కడ ఓ ఉన్నతాధికారి భలే శిక్ష విధించారులేండి.అది నోయిడా అథారిటీ కార్యాలయం. సోమవారం నాడు ఓ వృద్ధ జంట తమ పని కోసం అక్కడికి వచ్చారు. చాలాసేపు దాకా అక్కడున్నవాళ్లెవరూ వాళ్లను పట్టించుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ వాళ్లు అలా నిలబడే ఉండిపోయారు. ఇది నోయిడా అథారిటీ సీఈవో లోకేష్ ఎం గమనించారు. మరో అరగంట పోయాక చూస్తే.. ఆ వృద్ధ జంట అలాగే నిలబడి ఉన్నారట!. దీంతో.. ఆయన తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు.వెంటనే.. బయటకు వచ్చి అరగంట పాటు నిలబడి పని చేయండి అని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో అక్కడున్నవాళ్లంతా నిర్ఘాంతపోయారు. అలా నిలబడి పని చేస్తే.. ఆ వృద్ధ జంట పడ్డ కష్టమేంటో మీకు తెలుస్తుంది అని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. హ్యాట్సాఫ్ సర్!.. ప్రస్తుతం ఆ శిక్షకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.In Noida Authority, an elderly couple was struggling to get their file approved but faced complete neglect. Witnessing this, the CEO took a bold step – ordered all employees to stand and work for 30 minutes as punishment!#CEO #Noida pic.twitter.com/RrZMOAc4xn— Sneha Mordani (@snehamordani) December 17, 2024 -
లైంగిక దాడి ముద్దాయికి 25 ఏళ్ల శిక్ష
విశాఖ–లీగల్: వావి వరసలు మరిచి వరుసకు కూతురయ్యే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన సవతి తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది గురువారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించారు. ప్రభుత్వం రూ.4 లక్షలు బాలికకు పరిహారంగా చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఆర్ మూర్తి అందించిన వివరాలు.పశ్చిమగోదావరి జిల్లా రాజఒమ్మంగి మండలం పాక గ్రామానికి చెందిన కుర్ర ఇమాన్యుయేల్ ప్రస్తుతం ఏఎస్ఆర్ జిల్లా లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఉంటున్నాడు. వృత్తి రీత్యా అతడు చర్చి ఫాదర్. బాధితురాలి తల్లి నందినికి ఆయన రెండో భర్త. నిందితుడు రోజూ కొంతమందితో అడవిలోని మోదుగ ఆకులు ఏరించి, పట్టణ ప్రాంతాలకు విక్రయించేవా డు. 2021 ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అడవిలోని ఒక నిర్జన ప్రదేశంలో నందిని కుమార్తెపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు. -
ప్రభుత్వాలు మేల్కొనాలి!
స్వేచ్ఛ నిజమైన విలువేమిటో గుర్తించాలంటే కారాగారం గురించి కాస్తయినా తెలిసి వుండాలంటారు. జైలంటే కేవలం అయినవాళ్లకు దూరం కావటమే కాదు... సమాజం నుంచి పూర్తిగా వేరుపడి పోవడం, పొద్దస్తమానం తనలాంటి అభాగ్యుల మధ్యే గడపాల్సిరావటం. అటువంటివారిలో విచా రణ ఖైదీలుగా ఉన్నవారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా ప్రకటన ఊరటనిస్తుంది. కేసు విచారణ పూర్తయి పడే గరిష్ట శిక్షలో కనీసం మూడోవంతు కాలం జైల్లో గడిపి ఇంకా న్యాయం కోసం ఎదురుచూస్తూనేవున్న ఖైదీలను ఈనెల 26న జరగబోయే రాజ్యాంగ దినోత్సవానికి ముందు విడుదల చేస్తామని అమిత్ షా తెలియజేశారు. విచారణ కోసం దీర్ఘకాలం ఎదురుచూస్తూ గడిపే ఖైదీ ఒక్కరు కూడా ఉండరాదన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఇది మంచి నిర్ణయం. ప్రజాస్వామిక వాదులు ఎప్పటినుంచో ఈ విషయంలో ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనేవున్నారు. కఠిన శిక్షలుపడి దీర్ఘకాలం జైల్లో వున్నవారిలో సత్ప్రవర్తన ఉన్నపక్షంలో జాతీయ దినోత్సవాల రోజునో, మహాత్ముడి జయంతి రోజునో విడుదల చేయటం ఆనవాయితీగా వస్తోంది. అయితే విచారణలోవున్న ఖైదీల విషయంలో ప్రభుత్వాలు క్రియాశీలంగా ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. తగిన విధానం రూపొందించ లేదు. ఇందువల్ల జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయి. వాటి సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య ఉండటంతో జైళ్ల నిర్వహణ అసాధ్యమవుతున్నది. అసహజ మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఖైదీల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఖైదీల్లో అత్యధికులు అట్టడుగు కులాలవారూ, మైనారిటీ జాతుల వారూ ఉంటారు. వీరంతా నిరుపేదలు. కేవలం ఆ ఒక్క కారణం వల్లే వీరి కోసం చొరవ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసేవారు ఉండరు. కనీసం పలకరించటానికి రావాలన్నా అయినవాళ్లకు గగన మవుతుంది. రానూ పోనూ చార్జీలు చూసుకుని, కూలి డబ్బులు కోల్పోవటానికి సిద్ధపడి జైలుకు రావాలి. అలా వచ్చినా ఒక్కరోజులో పనవుతుందని చెప్పడానికి లేదు. రాత్రి ఏ చెట్టుకిందో అర్ధాకలితో గడిపి మర్నాడైనా కలవడం సాధ్యమవుతుందా లేదా అన్న సందేహంతో ఇబ్బందులుపడే వారెందరో! బెయిల్ వచ్చినా ఆర్థిక స్తోమత లేక కారాగారాల్లోనే ఉండిపోతున్న ఖైదీల కోసం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్లో ఒక పథకాన్ని ప్రతిపాదించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల సిఫార్సుతో ఈ పథకం వర్తిస్తుంది. విచారణలోవున్న ఖైదీకి రూ. 40,000, శిక్షపడిన ఖైదీకి రూ. 25,000 మంజూరుచేసి బెయిల్‌కు మార్గం సుగమం చేయటం దాని ఉద్దేశం. బెయిల్ వచ్చినా జామీను మొత్తం సమకూరకపోవటంతో 24,879 మంది ఖైదీలు బందీలుగా ఉండి పోయారని మొన్న అక్టోబర్‌లో సుప్రీంకోర్టు పరిశోధన విభాగం సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ (సీఆర్పీ) వెల్లడించింది. అయితే దీనివల్ల లబ్ధి పొందినవారు ఎందరని తరచి చూస్తే ఎంతో నిరాశ కలుగుతుంది. ప్రముఖ డేటా సంస్థ ‘ఇండియా స్పెండ్’ ఢిల్లీతోపాటు ఎనిమిది రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు ఎలావున్నదో ఆరా తీస్తూ సమాచార హక్కు చట్టంకింద దరఖాస్తులు చేస్తే ఇంతవరకూ కేవలం ఆరు రాష్ట్రాలు జవాబిచ్చాయి. అందులో మహారాష్ట్ర 11 మందిని, ఒడిశా ఏడుగురిని విడు దల చేశామని తెలపగా 103 మంది అర్హులైన ఖైదీలను గుర్తించామని ఢిల్లీ తెలిపింది. మూడు బిహార్ జైళ్లు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా విడుదలైనవారి వివరాలిచ్చాయి తప్ప పథకం లబ్ధిదారు లెందరో చెప్పలేదు. పథకం ప్రారంభం కాలేదని బెంగాల్ చెప్పగా, బీజేపీ రాష్ట్రాలైన యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు డేటా విడుదల చేయలేదు. కేరళ స్పందన అంతంతమాత్రం. ఫలానా పథకం అమలు చేస్తే ఇంత మొత్తం గ్రాంటుగా విడుదల చేస్తామని కేంద్రం ప్రకటిస్తే అంగలార్చుకుంటూ తొందరపడే రాష్ట్రాలకు దిక్కూ మొక్కూలేని జనానికి తోడ్పడే పథకమంటే అలుసన్న మాట!ఒక డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఖైదీల సంఖ్య 5,73,220 కాగా, అందులో 75.8 శాతంమంది... అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు విచారణలో ఉన్న ఖైదీలే. మొత్తం 4,34,302 మంది విచారణ ఖైదీలని ఈ డేటా వివరిస్తోంది. విచారణ ఖైదీల్లో 65.2 శాతంమందిలో 26.2 శాతంమంది నిరక్షరాస్యులు. పదోతరగతి వరకూ చదివినవారు 39.2 శాతంమంది. రద్దయిన సీఆర్పీసీలోని సెక్షన్ 436ఏ నిబంధనైనా, ప్రస్తుతం వున్న బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 479 అయినా నేరానికి పడే గరిష్ట శిక్షలో సగభాగం విచారణ ప్రారంభంకాని కారణంగా జైల్లోనే గడిచిపోతే బెయిల్‌కు అర్హత ఉన్నట్టే అంటున్నాయి. అయితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే నేరాలు చేసినవారికి ఇది వర్తించదు. బీఎన్ఎస్ఎస్ అదనంగా మరో వెసులుబాటునిచ్చింది. తొలి నేరం చేసినవారు విచారణ జరిగితే పడే గరిష్ట శిక్షలో మూడోవంతు జైలులోనే ఉండిపోవాల్సి వస్తే అలాంటి వారికి బెయిల్ ఇవ్వొచ్చని సూచించింది. బహుళ కేసుల్లో నిందితులైన వారికిది వర్తించదు.నిబంధనలున్నాయి... న్యాయస్థానాలు కూడా అర్హులైన వారిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిరుడు కేంద్రమే ఖైదీల కోసం పథకం తీసుకొచ్చింది. పైగా బీఎన్ఎస్ఎస్ 479 నిబంధనను ఎందరు వర్తింపజేస్తున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు 36 రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతా లకూ మొన్న ఆగస్టులో ఆదేశాలిస్తే ఇంతవరకూ 19 మాత్రమే స్పందించాయి. ఇది న్యాయమేనా? పాలకులు ఆలోచించాలి. ఈ అలసత్వం వల్ల నిరుపేదలు నిరవధికంగా జైళ్లలో మగ్గుతున్నారు.కేంద్రం తాజా నిర్ణయంతోనైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. విచారణలోవున్న ఖైదీల్లో ఎంతమంది అర్హుల్లో నిర్ధారించి, కేంద్ర పథకం కింద లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలి. -
బాలికలపై ప్రిన్సిపాల్ కర్కశత్వం 44 మందికి అస్వస్థత..
-
నా తండ్రిని అవమానించారు: షేక్ హసీనా
ఢాకా: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోసం విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధానిగా రాజీనామా చేసి.. భారత్ చేరుకున్నారు. ఆమె ప్రస్తుతం భారత్‌తో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లా సంక్షోభం, అల్లర్ల అనంతరం షేక్ హసీనా తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘జులైలో విద్యార్థుల నిరసనల్లో హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా. దేశ పౌరులు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న జాతీయ సంతాప దినాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా. బంగాబంధు స్మారకం వద్ద పూల మాలలు వేసి మృతి చెందినవారి ఆత్మ శాంతించాలని ప్రార్థించండి.గత జూలై నుంచి ఆందోళనలతో విధ్వంసం, హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసులు పాత్రికేయులు, శ్రామిక ప్రజలు, అవామీ లీగ్, అనుబంధ సంస్థల నాయకులు, కార్మికులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ఆమె అన్నారు. షేక్ హసీనా విడుదల చేసిన ప్రకటనను ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ ‘ఎక్స్’లో షేర్ చేశారు.‘‘ నా తండ్రి, జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడింది. తాజా పరిణామాలతో ఆయన ఘోర అవమానానికి గురయ్యారు. లక్షలాది మంది అమరవీరుల రక్తాన్ని అవమానించారు. దేశప్రజల నుంచి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.Son of deposed Prime Minister of Bangladesh Sheikh Hasina, Sajeeb Wazed Joy releases a statement on behalf of Sheikh Hasina on his social media handle X....I appeal to you to observe the National Mourning Day on 15th August with due dignity and solemnity. Pray for the salvation… pic.twitter.com/b1qRgOP06r— ANI (@ANI) August 13, 2024 -
అటవీ భూమిని దున్నేస్తారా.. రెండొందల మొక్కలు నాటండి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ హైదరాబాద్: రెండు ఎకరాల్లో చెట్ల నష్టానికి బాధ్యుడైన పిటిషనర్‌కు హైకోర్టు అరుదైన(బాధ్యతాయుత) శిక్ష విధించింది. ఎకరానికి 100 చొప్పున రెండు ఎకరాల్లో 200 మొక్కలు నాటాలని ఆదేశించింది. ఈ మొక్కలను సరఫరా చేయాల్సిందిగా సూర్యా పేట డీఎఫ్‌ఓకు స్పష్టం చేసింది. ఆర్డర్ కాపీ అందిన నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని పిటిషనర్‌కు తెలి్చచెప్పింది. మొక్కలు నాటేందుకు న్యాయస్థానం విధించిన ఆదేశాలను పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.అయితే, చెట్ల నష్టం కలిగిందని చెబుతున్న కంపార్ట్మెంట్ నం.441ని గుర్తించేందుకు పిటిషనర్‌కు సాయం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాలని కోరగా.. అందుకు కోర్టు సమ్మతించింది. దీనిపై తదుపరి విచారణలోగా నివేదిక అందజేయాలని అటవీ అధికారులను ఆదేశిస్తూ, విచారణ సెపె్టంబర్ 6కు వాయిదా వేసింది. మంచిర్యాలజిల్లా నెన్నెల మండలం నాగారానికి చెందిన మాదె మల్లేశ్ వ్యవసాయదారుడు.కుశెనపల్లి రేంజ్ కంపార్ట్మెంట్ నంబర్ 441లోని అటవీప్రాంతంలో అక్రమంగా ట్రాక్టర్‌తో భూమిని దున్ని చెట్లు తొలగించారన్న లింగాల సెక్షన్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు 2024, జూలై 1న మల్లేశ్, మరో ఇద్దరిపై కేసు నమోదైంది. మధ్యవర్తి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించిన అధికారులు అదే రోజు ట్రాక్టర్‌ను సీజ్ చేసి బెల్లంపల్లిలోని కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు.అటవీ భూమి ఆక్రమణకు యత్నించారుసీజ్ చేసిన తన ట్రాక్టర్‌ను తిరిగి అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాదె మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పిటిషనర్ ఎలాంటి తప్పు చేయలేదని, భూమి దున్న డానికి ఎలాంటి సంబంధం లేదని, వ్యవసాయ పనుల నిమి త్తం ట్రాక్టర్‌ను మరో ఇద్దరి(ఏ–1, ఏ–2)కి అద్దెకు మాత్రమే ఇచ్చారని మల్లేశ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.మరోవైపు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ అలవాటైన నేరస్తుడని, అతనిపై మరికొన్ని కేసులు కూడా ఉన్నాయని, వాటిపై ట్రయల్ కోర్టులో విచారణ సాగుతోందని చెప్పారు. పిటిషనర్‌తోపాటు మరికొందరు బృందంగా ఏర్పడి తరచూ అటవీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ట్రాక్టర్ విడుదలకు గతంలో ఇదే కోర్టు ఇచి్చన ఉత్తర్వులను పాటించాలన్నారు. రూ.50 వేల బాండ్‌తోపాటు ఇద్దరు పూచీకత్తు సమరి్పంచాలని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ ట్రాక్టర్‌ను అమ్మడంగాని, వేరొకరి పేరు మీదకు మార్చడంగాని చేయనని అఫిడవిట్ ఇవ్వాలని.. అధికారులు ఆదేశించినప్పుడు ట్రాక్టర్ వారి వద్దకు తీసుకురావాలని.. ఈ ఉత్తర్వుల కాపీ అందిన నాలుగు వారాల్లోగా అఫిడవిట్లు అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించారు. అనంతరం ట్రాక్టర్‌ను విడుదల చేయాలని అధికారులకు చెప్పారు. చెట్లకు నష్టం కలిగించినందుకు.. అదే అటవీ ప్రాంతంలో 200 మొక్క లు నాటాలని పిటిషనర్‌కు తేలి్చచెప్పారు.కాగా, స్పష్టమైన ఆదేశాలు ఉంటే తప్ప అటవీశాఖ మొక్కలు సరఫరా చేయదని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మొక్కలు సరఫరా చేయాలని సూర్యాపేట డీఎఫ్ఓను ఆదేశించారు. నెలరోజుల్లో మొక్కలు నాటి నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. పిటిషనర్ మాదె మల్లేశ్ కోర్టు తీర్పుపై ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎకరం భూమి దున్నితే రూ.2వేలు వస్తాయని కిరాయి(అద్దె)కి ట్రాక్టర్‌ను ఇస్తే, తనకు ఊహించని వి«ధంగా తీర్పు వచి్చందన్నారు. మరోవైపు జిల్లా అటవీ అధికారులు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. -
మహాపరాధి ట్రంప్!
అధికారంలోకొచ్చింది మొదలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నేరస్తుడిగా నిరూపించాలని తపిస్తున్న డెమాక్రాటిక్ పార్టీ వాంఛ చివరి అంకంలో నెరవేరింది. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ నోరు మూయించడానికి భారీగా సొమ్ము ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని ట్రంప్ తన కంపెనీ ఖాతాల్లో వేరేగా చూపారన్న ఆరోపణ రుజువు కావటంతో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయన్ను మహాపరాధిగా తేల్చింది. భిన్న రంగాలకు చెందిన అయిదుగురు మహిళలతో సహా 12 మందితో కూడిన జ్యూరీ... ఈ వ్యవహారంలో ట్రంప్‌కు విధించబోయే శిక్ష ఏమిటన్నది ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల 11న వెల్లడించే ఆ శిక్ష తప్పనిసరిగా కారాగారవాసమే కానవసరం లేదని, అది జరిమానా మొదలుకొని ప్రొబేషన్‌లో ఉంచటం వరకూ ఏదైనా కావొచ్చన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇది క్రిమినల్ కేసే అయినా వ్యక్తిని హతమార్చటం వంటిది కాదు గనుక జైలు శిక్ష ఉండకపోవచ్చంటున్నారు. జైలుకు పోయినా పోకపోయినా దేశాధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడటానికి అదేమీ అవరోధం కాదు. తీర్పు వెలువరించే ముందు జ్యూరీకి నాయకత్వం వహించిన న్యాయమూర్తి జువాన్ మెర్కన్ తన సహచరులను లాంఛనంగా ‘తీర్పుతో మీరు ఏకభవిస్తున్నట్టేనా...’ అని అడగటం, వారు అంగీకారాన్ని తెలపటం పూర్తయ్యాక ట్రంప్ అక్కడినుంచి నిష్క్రమించారు. వెళ్లేముందు ‘ఇది మోసపూరితమైన, సిగ్గుమాలిన తీర్పు. అసలు తీర్పును నవంబర్ 5న అమెరికా ప్రజలివ్వబోతున్నారు’ అని ఆయన చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. వచ్చే అయిదారు నెలల్లో ఆ దేశ రాజకీయ పోకడలెలా ఉండబోతున్నాయో ట్రంప్ వ్యాఖ్య చెబుతోంది. ట్రంప్ నేరం రుజువై అపరాధిగా తేలిన తొలి కేసు ఇదే.దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్‌ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఏకరువు పెట్టగా, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్‌కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. 2006 నాటి తన రాసలీలల సంగతి బయటపెట్టొద్దని అభ్యర్థిస్తూ న్యాయవాది ద్వారా స్టార్మీకి పంపిన 1,30,000 డాలర్ల డబ్బే ఇప్పుడు ట్రంప్‌ను నిండా ముంచింది. ఈ కేసులో వచ్చిన మొత్తం 34 అభియోగాలూ రుజువయ్యాయని న్యాయస్థానం తేల్చింది. ట్రంప్ గద్దెనెక్కకుండా నిరోధించేది ప్రజా తీర్పేనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా ఆ విషయంలో డెమాక్రాటిక్ పార్టీకి పెద్దగా ఆశలున్నట్టు కనబడదు. తటస్థులైన ఓటర్లలో ఒకటి రెండు శాతంమంది తాజా తీర్పు వెలువడ్డాక ట్రంప్‌కు వోటేయాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పినా అదేమంత ఉపయోగపడేలా కనబడటం లేదు. తొక్కేయాలని చూస్తున్నకొద్దీ ఆయన మరింత బలశాలిగా మారుతున్నాడంటూ రిపబ్లికన్ వ్యూహకర్త స్కాట్ రీడ్ చేసిన వ్యాఖ్య అవాస్తవం కాదు. గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరగటం, ఆయనకొచ్చే విరాళాల వెల్లువ ఇందుకు తార్కాణం. అయిదారేళ్లుగా రిపబ్లికన్ పార్టీ తన సామాజిక మాధ్యమాల ద్వారా, ఫాక్స్ న్యూస్ వంటి పార్టీ అనుకూల మీడియా ద్వారా సాగిస్తున్న ప్రచారం దీనికి కారణం. పార్టీ మొత్తం ట్రంప్ వెనక దృఢంగా నిలబడి ఆయన మాటలనూ, చేష్టలనూ సమర్థిస్తూ వచ్చింది. తమ నాయకుడిది తప్పంటున్న డెమాక్రాటిక్ నేతలే నేరగాళ్లంటూ ఊదరగొట్టింది. వీటి మాటెలావున్నా న్యాయస్థానం మహాపరాధిగా తేల్చిన వ్యక్తి దేశాధ్యక్షుడిగా వ్యవహరించటం సరైందేనా అన్న మీమాంస నడుస్తోంది. నాలుగు వందల ఏళ్లనాటి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలు ఎప్పుడూ రాలేదు. నేర నిరూపణ అయిన వ్యక్తి వందేళ్ల క్రితం జైలునుంచి పోటీచేసిన చరిత్రవున్నా మాజీ అధ్యక్షుడు మహాపరాధిగా తేలటం, ఆయనే మరోసారి బరిలో దిగటం కనీవినీ ఎరుగనిది. ఈ విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనేదీ లేదు. ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థికి రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని బదలాయించటానికి బదులు అనుచరులను రెచ్చగొట్టి అవరోధాలు సృష్టించాలని చూసిన ట్రంప్‌కు ఇప్పటికీ వ్యవస్థలంటే గౌరవం లేదు. తిరిగి నెగ్గితే ఆయన చేయబోయే పనుల్లో వలసలను కట్టడి చేయటం మొదలుకొని అంతర్జాతీయ సాయానికి కత్తెరేయటం వరకూ చాలావున్నాయి. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రతను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. గెలిచి అందలమెక్కితే ట్రంప్‌పై కేసులు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే కాదు... అమెరికాకు సైతం సమస్యగా మారడం ఖాయం. -
కొడుక్కు తుపాకీ అందుబాటులో ఉంచారని... తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు
వాషింగ్టన్: కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. స్కూల్లో తుపాకీతో కాల్పులు జరిపిన నలుగురు పిల్లలను బలి తీసుకోవడంతో పాటు ఏడుగురిని గాయపర్చిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్ 30న మిషిగన్ రాష్ట్రంలోని ఆక్స్ఫర్డ్ హైసూ్కల్లో ఎథాన్ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్, జెన్నిఫర్ తప్పేనని కోర్టు తేల్చింది. -
IPL 2024- MI Punishment Jumpsuit: ఆలస్యం చేశారో అందరికీ ఇదే పనిష్మెంట్! (ఫోటోలు)
-
ఫలించిన నిరీక్షణ
సిరిసిల్ల: 18 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దుబాయ్ జైల్లో బందీలుగా ఉన్న ఇద్దరు విడుదలై ఇల్లు చేరా రు. చాలాకాలానికి ఇల్లు చేరిన వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. 2005 లో దుబాయ్ వెళ్లిన వలసజీవులు.. అక్కడ హత్య కేసులో ఇరు క్కుని 18 ఏళ్లపాటు శిక్ష అనుభవించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల శివారులోని పెద్దూరు ఒడ్డెరకాలనీకి చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి (45) బుధవారం ఇంటికి వచ్చారు. వీరు దుబాయ్‌లో కల్లీవెల్లి వీసా(కంపెనీ వీసా కాదు)పై పనిచేశారు. 2006లో దుబాయ్‌లో నేపాల్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు హత్య కేసులో నలుగురు పాకిస్తానీయులు, ఆరుగురు తెలంగాణవాసులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. జైలు శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయు లు, కరీంనగర్ జిల్లాకు చెందిన సయ్యద్ కరీం ఇప్పటికే విడుదలయ్యారు. సిరిసిల్లకు చెందిన మల్లేశం, రవి, కోనరావుపేటకు చెందిన లక్ష్మణ్, జగిత్యాల జిల్లాకు చెందిన శివరాత్రి హన్మంతు, చందుర్తి మండలం మల్యాలకు చెందిన నాంపల్లి వెంకటి జైలు శిక్షను పొడిగించడంతో బందీలుగా ఉన్నారు. వీరిలో లక్ష్మణ్, హన్మంతు ఇటీవల విడుదలకాగా.. తాజాగా మల్లేశం, రవి విడుదలయ్యారు. వెంకటి మరో నెల రోజుల్లో విడుదల కానున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ వీరి విడుదల కోసం ఎంతో కృషిచేశారు. మ ల్లేశం, రవికి విమాన టికెట్లు, హైదరాబాద్ నుంచి పెద్దూ రు చేరేందుకు వాహనాన్ని కేటీఆర్ ఏర్పాటు చేశారు. మల్లేశం, రవి కుటుంబ సభ్యులతో అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ ఫోన్లో మాట్లా డారు. బాధితుల కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
దుబాయ్ బందీలకు విముక్తి
సిరిసిల్ల: దుబాయ్‌లోని అవీర్ జైల్లో 18 ఏళ్లుగా ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వలసజీవులు ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈనెల 21న జైలు నుంచి విడుదలై భారత్‌కు రానున్నారు. దుబాయ్ జైలు నుంచి నేరుగా భారత్‌కు వచ్చేందుకు విమాన టికెట్లు సిద్ధమయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం(48), శివరాత్రి రవి(45) అన్నదమ్ములు. కోనరావు పేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్(48), చందుర్తికి చెందిన నాంపల్లి (గొల్లెం) వెంకటి(43), జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు(51), కరీంనగర్ జిల్లాకు చెందిన సయ్యద్ కరీం బతుకుదెరువు కోసం దుబాయ్‌కి వెళ్లారు. వీరిలో కరీం మినహా ఐదుగురు ఓ సెక్యూరిటీగార్డు హత్య కేసులో 18 ఏళ్లుగా దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరి విడుదల కోసం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దుబాయ్ వెళ్లి ప్రయత్నం చేశారు. ఐదుగురు ఎన్నారై ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, దుబాయ్ కాన్సుల్ జనరల్ రామ్‌కుమార్, ఈ కేసు వాదిస్తున్న అరబ్ న్యాయవాదితో మాట్లాడారు. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ క్షమాభిక్ష ప్రసాదించేలా ప్రయతి్నంచాలని కోరారు. ఆ దౌత్యం ఫలించి ఎట్టకేలకు మల్లేశం, రవి, హన్మంతు విడుదలవుతున్నారు. నాలుగు నెలల కిందట దుండుగుల లక్ష్మణ్ విడుదలయ్యారు. వెంకటి విడుదలకు కొంత సమయం పడుతుందని తెలిసింది. ఇదీ కేసు నేపథ్యం 2006లో దుబాయ్‌లోని జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థ ఆవరణలో నేపాల్‌కు చెందిన దిల్ ప్రసాద్‌రాయ్ అనే సెక్యూరిటీగార్డు హత్య కు గురయ్యాడు. అక్కడ టన్నుల కొద్దీ ఉన్న ఇత్తడి విద్యుత్ తీగలను పది మంది కలిసి దొంగిలించేందుకు యత్నించారని, అడ్డుకున్న ప్రసాద్‌రాయ్‌ని హత్య చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసు నింది తుల్లో ఆరుగురు తెలంగాణ వారుకాగా, నలుగురు పాకిస్తానీయులు. ఈ పది మందిని అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ.. పాకిస్తానీయులకు తొమ్మిదేళ్ల చొప్పున, తెలంగాణ వారికి పదేళ్ల చొప్పున శిక్ష విధించింది. శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయులు, సయ్యద్ కరీం విడుదలయ్యారు. మిగిలిన వారికి హత్యకేసులో క్షమాభిక్ష లభించినా.. దొంగతనం, దేశం విడిచివెళ్లే ప్రయత్నం చేసిన కేసుల్లో జైల్లో ఉన్నారు. అప్పీలుకు వెళ్తే.. పెరిగిన శిక్ష జైల్లో ఉన్న ఐదుగురి విడుదల కోసం హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. ఆ నిర్ణయమే వారి పాలిట శాపంగా మారింది. హైకోర్టులో ఈ కేసులు విచారించిన ధర్మాసనం ఈ హత్యను క్రూరమైనదిగా పరిగణించింది. మల్లేశం, రవి, వెంకటి, హన్మంతు, లక్ష్మణ్‌లకు కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను 2015లో యావజ్జీవ కారాగార శిక్షకు పెంచింది. నేరం నుంచి తప్పించునేందుకు కత్తిని పూడ్చిపెట్టడంతోపాటు, అక్రమంగా దేశం దాటేందుకు ప్రయత్నించారని.. ఇవన్నీ తీవ్రమైన నేరాలని ధర్మాసనం పేర్కొంది. దీంతో దోషుల విడుదల ఆలస్యమైంది. అయితే, నాడు మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. -
‘హిట్ అండ్ రన్’కు ఏ దేశంలో ఎటువంటి శిక్ష?
కేంద్ర ప్రభుత్వం ‘హిట్ అండ్ రన్’ కేసులో కఠినమైన నిబంధనలను రూపొందించింది. పదేళ్ల జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధించింది. దేశంలో చాలావరకూ రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. మనదేశాన్ని మినహాయించి ఇతర దేశాల్లో ‘హిట్ అండ్ రన్’ కేసులలో ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్‌లో వాహన చట్టం, 1927 ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత, పోలీసులు అక్కడికి వచ్చి చర్యలు చేపట్టే వరకు వాహనం డ్రైవర్ తన వాహనంతో పాటు అక్కడే ఉండాలి. బంగ్లాదేశ్‌లో హిట్ అండ్ రన్ లేదా ఏ వాహన సంబంధిత ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైనవారు నేరస్తులవుతారు. ‘హిట్ అండ్ రన్’కేసులో మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంది. ఇటువంటి కేసులో డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేస్తారు. అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు. చైనా చైనాలో ‘హిట్ అండ్ రన్’లో పెను ప్రమాదం జరిగితే నేరస్తుని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. జీవితకాల నిషేధం కూడా ఉండవచ్చు. చైనా క్రిమినల్ కోడ్, ఆర్టికల్ 133 కింద హిట్ అండ్ రన్ కేసులో తీవ్రమైన శారీరక హాని లేదా మరణం సంభవించినట్లయితే, నేరస్తునికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. బ్రిటన్ యూకేలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ తన పూర్తి పేరు, చిరునామాను పోలీసులకు తెలియజేయాలి. అలాంటి సందర్భాలలో నేరస్తునికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష, ఐదు వేల పౌండ్ల జరిమానా కూడా ఉంటుంది. దీనితో పాటు అతను డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తారు. అమెరికా యునైటెడ్ స్టేట్స్లో ‘హిట్ అండ్ రన్’లో విధించే శిక్ష ప్రతీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. దీనిని థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. శిక్షాకాలం ఒకటి నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో హిట్ అండ్ రన్ ఉదంతంలో డ్రైవర్ ప్రమాద స్థలంలో వాహనాన్ని ఆపి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ నేరాల కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఉంది. ఇది ప్రతి రోడ్డు ప్రమాదంలో దాని తీరుతెన్నులను గమనించి డ్రైవర్‌కు ఒక పాయింట్‌ను ఇస్తుంది. దీని ప్రకారం డ్రైవర్‌కు జరిమానా విధించవచ్చు. లేదా అతని లైసెన్స్‌ను సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంది. కెనడా కెనడాలో క్రిమినల్ కోడ్ ప్రకారం ‘హిట్ అండ్ రన్’ను నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే అందుకు కారకులపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో ‘హిట్ అండ్ రన్’ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి ప్రమాదంలో ఎవరైనా చనిపోయి, డ్రైవర్ పరారైతే అతనికి కనీసం ఐదేళ్ల జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీనితో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. హాంకాంగ్ హాంకాంగ్‌లో ప్రమాదం జరిగిన తర్వాత, డ్రైవర్ వెంటనే వాహనం ఆపివేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరస్తుడు హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితులకు సహాయం చేయకపోతే, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ న్యూజిలాండ్‌లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు వాహనాన్ని తప్పనిసరిగా ఆపాలి. ఒకవేళ డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోతే, అతనికి మూడు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అతని డ్రైవింగ్ లైసెన్స్ కనీసం ఆరు నెలల పాటు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే అందుకు కారకులపై ఐదేళ్ల జైలు శిక్ష లేదా 20 వేల న్యూజిలాండ్ డాలర్లు జరిమానాగా విధించే అవకాశం ఉంది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏడాది పాటు రద్దు చేసేందుకు అవకాశం ఉంది. -
చంద్రబాబు తప్పించుకోలేరు..‘యావజ్జీవం’ తప్పదు!
‘చంద్రబాబు శాశ్వతంగా జైలు పక్షిగా మారక తప్పదు. ఒకట్రెండ్రోజులు ఆలస్యం కావచ్చు తప్ప, యావజ్జీవ కారాగార శిక్ష మాత్రం పక్కా’ అని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఐపీసీ 409 సెక్షన్ కింద ఒక్కో కేసులో విడివిడిగా యావజ్జీవ కారాగార శిక్ష, పీసీ యాక్ట్ 13(బి) కింద ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు రూ.కోటి ఫీజు చెల్లిస్తూ.. ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు తీసుకువచ్చే న్యాయవాదులతో కేసు విచారణను కాస్త జాప్యం చేయగలరేమోగానీ నేరం నుంచి మాత్రం తప్పించలేరని స్పష్టం చేస్తున్నారు.భారీ అవినీతి కుంభకోణాల కుట్రదారు, లబ్దిదారులు.. చంద్రబాబు, ఆయన కుటుంబం, సన్నిహితులు, బినామీలేనని డాక్యుమెంటరీ ఆధారాలు, న్యాయ స్థానాల్లో నమోదు చేసిన కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుపై అభియోగాలతో ఏకీభవిస్తూ ఏసీబీ న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడాన్ని బట్టి చూస్తుంటే.. ఈ ఒక్క కేసు చాలు చంద్రబాబుకు యావజ్జీవ శిక్ష పడటానికి అని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.అనారోగ్య కారణాలతో స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ ఇస్తున్నప్పుడు గానీ.. తాజాగా మూడు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ సందర్భంగా గానీ చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. తద్వారా చంద్రబాబు, లోకేశ్‌తోపాటు సహచర కుట్రదారులైన టీడీపీ ప్రభుత్వంలో మంత్రులది కూడా జైలు దారేనన్నది స్పష్టమవుతోంది. స్కిల్ కార్పొరేషన్, ఫైబర్‌నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఎంతగా బరితెగించిందనే విషయం చర్చనీయాంశమైంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్కిల్ కార్పొరేషన్, ఫైబర్‌నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాలకు కర్త, కర్మ, క్రియ గత ముఖ్యమంత్రి చంద్రబాబే అని సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతో వెల్లడి కావడంతో ఆయనకు ఏ రకంగా చూసినా జీవిత ఖైదు తప్పదని న్యాయ నిపుణులు బల్ల గుద్ది చెబుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన సర్వం తానై కుట్ర పన్నారు. అందుకోసం కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేశారు. స్కిల్ ప్రాజెక్ట్, ఫైబర్ నెట్, బినామీల పేరుతో అసైన్డ్ భూములు పొందిన వారికి భూ సమీకరణ ప్యాకేజీ, మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ పన్ను.. జీఎస్టీ ఎత్తివేత, ఉచిత ఇసుక విధానం.. ఇలా అన్ని కుంభకోణాలకు మార్గం సుగమం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం వేర్వేరు జీవోలను జారీ చేసింది. ఆ జీవోకు కూడా కేబినెట్ ఆమోదం లేకపోవడం చంద్రబాబు కుట్రను వెల్లడిస్తోంది. ఆ జీవోలకు సంబంధించిన నోట్ ఫైళ్లను కూడా మాయం చేయడం గమనార్హం. మాయం చేసిన నోట్ ఫైళ్లను సీఐడీ అధికారులు రిట్రీవ్ చేసి వెలుగులోకి తేవడంతో అన్ని కుంభకోణాల కుట్రలకు కీలక ఆధారాలు లభించాయి. చంద్రబాబు ముఠా గల్లంతు చేసిన అమరావతిలో అసైన్డ్ భూముల రికార్డులను సీఐడీ వెలికి తీసింది. స్కిల్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్‌లలో కొల్లగొట్టిన నిధులు చంద్రబాబు నివాసానికే చేర్చిన అవినీతి నెట్‌వర్క్‌ను బ్యాంకు ఖాతాల వివరాలతోసహా ఛేదించింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు, క్విడ్ ప్రో కో కింద చంద్రబాబు కరకట్ట నివాసం పొందడం, హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు దక్కడం, చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట భూ సమీకరణ ప్యాకేజీ పొందడం మొదలైనవన్నీ రికార్డులతో సహా వెలుగులోకి వచ్చాయి. ఈ విధంగా చంద్రబాబు, లోకేశ్, నారాయణల పాత్రను స్పష్టం చేస్తూ పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలు లభించాయి. మరోవైపు ఈ కుంభకోణాలన్నింటికి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. అది కూడా 164 సీఆర్సీపీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమని చెప్పినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదని అప్పటి సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, గుంటూరు జిల్లా కలెక్టర్ వాంగ్మూలాలు ఇచ్చారు. ఫైబర్‌నెట్, స్కిల్ స్కామ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేయొద్దని చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని కీలక అధికారుల వాంగ్మూలాలు నమోదు చేశారు. షెల్ కంపెనీల ప్రతినిధులు కూడా అప్రూవర్‌గా మారి అదే విషయాన్ని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కన్సల్టెన్సీ కంపెనీ, స్కిల్ స్కామ్‌కు సంబంధించి సీమెన్స్ కంపెనీ కూడా 164 సీఆర్సీపీ కింద వాంగ్మూలాలు నమోదు చేశాయి. ఈ విధంగా అన్ని కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్దిదారు అనేదానికి అటు డాక్యుమెంటరీ ఆధారాలు, ఇటు కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసా«ద్యమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబును రిమాండ్‌కు పంపడమే తార్కాణం ఒక్క మెతుకు చూస్తే చాలు అన్నం ఉడికిందో లేదో చెప్పొచ్చు. అలానే చంద్రబాబు పాల్పడ్డ ఇన్ని కుంభకోణాలలో ఒక్క స్కిల్ స్కామ్‌ను పరిశీలిస్తే చాలు.. ఆయన అవినీతి బాగోతం తెలిసిపోతోంది. సీఐడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరు పరిచింది. ఆ సందర్భంగా దాదాపు 10 గంటలపాటు ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత ఆయనకు జ్యుడిషి యల్ రిమాండ్ విధించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సీఐడీ నమోదు చేసిన అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. దాంతోనే చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతోనే ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఇక సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించ లేదు. ముందస్తు బెయిల్‌పై ఎల్లో మీడియా వక్రీకరణ ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక కుంభకోణాల కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆ సందర్భంగా కూడా ఆయన అవినీతికి ఆధారాలు లేవని న్యాయస్థానం చెప్ప లేదు. కేసు పూర్వాపరాల్లోకి ఇంకా తాము వెళ్లడం లేదని కూడా స్పష్టం చేసింది. కేవలం షరతులతోనే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. విచారణకు చంద్రబాబు సహకరించాలని.. విచారణకు పిలిస్తే వెళ్లాలని కూడా చెప్పింది. కానీ హైకోర్టు తీర్పుకు వక్రభాష్యం చెబుతూ చంద్రబాబుకు క్లీన్ చిట్ లభించినట్టుగా ఈనాడు, ఇతర ఎల్లో మీడియా హడావుడి చేయడం విస్మయ పరుస్తోంది. సీఐడీ సేకరించిన ఆధారాలతో నేరం రుజువు కావడం ఖాయమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేరం నిరూపితమైన తర్వాత ఒక్కో కేసులో చంద్రబాబుకు యావజ్జీవ జైలు శిక్ష పడుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఆయనపై సీఐడీ నమోదు చేసిన వివిధ సెక్షన్ల తీవ్రత, కేసుల విచారణ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్న నిపుణులు ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు వీరే ♦ నారా చంద్రబాబునాయుడు ♦ నారా లోకేశ్, పొంగూరు నారాయణ ♦ కింజరాపు అచ్చెన్నాయుడు ♦ దేవినేని ఉమామహేశ్వరరావు ♦ కొల్లు రవీంద్ర, పీతల సుజాత ♦ చింతమనేని ప్రభాకర్ తవ్వేకొద్దీ అవినీతే ♦ స్కిల్ స్కామ్‌లో రూ.241 కోట్లు చంద్రబాబు నివాసానికి చేరాయని సీఐడీ ఆధారాలతోసహా వెలుగులోకి తెచ్చింది. ♦ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు తన బినామీ అయిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టేశారు. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ టెండరు అప్పగించారు. నాసిరకం పనులు చేసినాసరే పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా రూ.244 కోట్లు చెల్లించగా అందులో రూ.144 కోట్లు చంద్రబాబు నివాసానికే చేరాయి. ♦ అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్, నారాయణ భారీ భూ బాగోతానికి పాల్పడ్డారు. తమ బినామీ అయిన లింగమనేని కుటుంబానికి చెందిన భూములను ఆనుకుని నిర్మించేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఖరారులో క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. కృష్ణా నదికి ఇటూ అటూ కూడా లింగమనేని కుటుంబం, హెరిటేజ్ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 355 ఎకరాల సమీపం నుంచి నిర్మించేలా రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అందుకోసం కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్లు పిలవకుండా నామినేషన్‌పై కట్టబెట్టారు. అనంతరం అదే అలైన్‌మెంట్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చేలా ముందుగానే షరతు విధించి మరీ రాజధాని మాస్టర్ ప్లాన్ డెవలపర్‌ను నిర్ణయించారు. దాంతో అప్పటి వరకు చంద్రబాబు, లింగమనేని, నారాయణ భూముల మార్కెట్ విలువ మొత్తం రూ.177.50 కోట్లు ఉండగా.. అలైన్మెంట్ ఖారారుతో ఏకంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చెప్పిన దాని ప్రకారమే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచిన తర్వాత అమాంతంగా రూ.2,130 కోట్లకు పెరుగుతుందని స్పష్టమైంది. అంటే అలైన్మెంట్ ఖరారులో అక్రమాలకు పాల్పడి దాదాపు రూ.2 వేల కోట్ల అక్రమ లబ్ధికి పచ్చముఠా కుట్ర పన్నింది. ♦ చంద్రబాబు కనుసన్నల్లో సాగిన అమరావతిలోని అసైన్డ్ భూముల దందా దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీగా రికార్డు సృష్టించింది. సీఎం పదవిని అడ్డుపెట్టుకుని ఏకంగా కేంద్ర అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు. అందుకోసం అమరావతి పరిధిలో అసలు 1954 తర్వాత అసైన్డ్ భూములే ఇవ్వలేదంటూ భూ రికార్డులు తారుమారు చేశారు. అసైన్డ్ భూములను జిరాయితీ భూములుగా రికార్డుల్లో కనికట్టు చేశారు. పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటుందని రైతులను భయపెట్టారు. అందుకోసం మొదట జీవో నంబర్–1 జారీ చేశారు. ఆ జీవోను బూచిగా చూపిస్తూ తమ ఏజంట్ల ద్వారా 617.70 ఎకరాల అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. అనంతరం అసైన్డ్ భూములకు కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో నంబర్–41 జారీ చేశారు. తద్వారా భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.3,737.30 కోట్ల విలువైన స్థలాలు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూములను కూడా తమ బినామీల భూములుగా చూపిస్తూ ఏకంగా 328 ఎకరాలను కొల్లగొట్టారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద రూ.760.25 కోట్లు విలువైన స్థలాలు పొందారు. ♦ పేరుకు ఉచిత ఇసుక అని చెప్పి.. చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులు మాత్రమే ఉచితంగా ఇసుక కొల్లగొట్టి బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయించేలా చక్రం తిప్పారు. తద్వారా ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ♦ తమ అస్మదీయ, బినామీ కంపెనీలకు మద్యం కొనుగోళ్ల కాంట్రాక్టులు కట్టబెడుతూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న మద్యం దుకాణాలు, బార్లపై ఉన్న ప్రివిలేజ్ ట్యాక్స్.. జీఎస్టీని తొలగిస్తూ చీకటి జీవోలు జారీ చేశారు. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్ల యజమానుల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల మేర గండి కొట్టారు. ఆరు కేసుల్లోనూ శిక్ష తప్పదు చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటిలో అత్యంత కీలకమైనది సెక్షన్ 409. ఆ సెక్షన్ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇతర సెక్షన్లు సరేసరి. ఈ ఆరు కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్షలు పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికే బాబుకు 73 ఏళ్లు నిండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓసారి నేరం నిరూపితమై ఒక్కో కేసులో ఐపీసీ 409 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష, అవినీతి నిరోధక చట్టం 13(2) కింద గరిష్టంగా పదేళ్ల కారాగార శిక్ష పడితే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ కూడా నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు కూడా ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. సీఎంగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓమ్ ప్రకాశ్ చౌతాలకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడిన ఉదంతాన్ని ఉదాహరిస్తున్నారు. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. బాబుపై నమోదైన ఐపీసీ సెక్షన్లు ఇవే.. 120 (బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37, అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) 409 సెక్షన్ కింద నేరం నిరూపితమైతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. 13 (2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే పదేళ్ల వరకు శిక్ష పడుతుంది. -
నేరాలకు దూరంగా... ఉపాధికి దగ్గరగా..!
ఆరిలోవ(విశాఖ తూర్పు): వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఖైదీలకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తోంది. తాజాగా ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోపాటు జైలు నుంచి విడుదలయ్యాక నేర ప్రవృత్తిని విడనాడి అందరిలాగే పనిచేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల విశాఖ కేంద్ర కారాగారంలో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన సోషల్ వర్కర్లను సభ్యులుగా నియమిస్తారు. దీనికోసం ఈ నెల 5న సోషల్ కౌన్సెలర్, ఎన్జీవోలు, సోషల్ వర్కర్లు, సైకాలజిస్ట్‌లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేంద్ర కారాగారంలో సమావేశం నిర్వహించారు. వారిలో ఐదుగురిని ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏం చేస్తారంటే... ► ఖైదీలకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకువస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కృషి చేస్తారు. ► ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రతినిధులు వచ్చి ఖైదీలకు వివిధ చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి సర్టీఫికెట్ అందజేస్తారు. ► ఈ శిక్షణ వల్ల ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత సమాజంలో పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ► ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉన్న ఖైదీలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ► ఈ చర్యల వల్ల ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గుతుందని, ఆర్థికంగా ఎదిగి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్ చర్యలకు సిద్ధమవుతోంది. డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. డీప్‌ఫేక్‌ల సమస్యపై చర్చించేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో నిర్వహించిన సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించారు. డీప్‌ఫేక్ సమాజంలో కొత్త ముప్పుగా మారిందని వైష్ణవ్ అన్నారు. అనంతరం అశ్విన్ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా డీప్‌ఫేక్‌లు ఉద్భవించాయన్నారు. వీటిన సృష్టించి, వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. డీప్‌ఫేక్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటి నియంత్రణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. అంతేకాదు సంఘవిద్రోహ శక్తులు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. రానున్న పదిరోజుల్లోనే నిబంధనల ముసాయిదాను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో డీప్‌ఫేక్ డీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. (ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు ) కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గార్బా నృత్యం చేస్తున్నట్టు వచ్చిన నకిలీ వీడియోతోపాటు, సినీ హీరోయిన్లు రష్మికా మందాన, కాజోల్ పేరుతో కొన్ని అభ్యంతర వీడియోలు నెట్టింట హల్ చేసిన నేపథ్యంలో ఐటీ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. -
Odisha: గుంజీలు తీస్తూ విద్యార్థి మృతి
జాజ్‌పూర్(ఒడిశా): బడి ఆవరణలో స్నేహితులతో ఆడుకుంటున్న విద్యార్థికి టీచర్ వేసిన శిక్ష ప్రాణం మీదకు తెచ్చింది. నాలుగో తరగతి విద్యార్థి గుంజీలు తీస్తూ కుప్పకూలి ఆస్పత్రిలో కన్నుమూసిన విషాధ ఘటన ఒరాలీ గ్రామం దగ్గర్లోని సూర్యనారాయణ్ నోడల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో జరిగింది. రసూల్పూర్ బ్లాక్ విద్యాధికారి(బీఈఓ) నీలాంబర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం పదేళ్ల పిల్లాడు రుద్ర నారాయణ్ సేథీ బడి ప్రాంగణంలో మధ్యాహ్నం పూట మూడు గంటలకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్నాడు. అది క్లాసులు జరిగే సమయం కావడంతో ‘‘క్లాస్ వదిలేసి ఏంటీ ఆటలు?’’ అంటూ కోప్పడి అక్కడి టీచర్.. సేథీసహా ఐదుగురిని గుంజీలు తీయండని ఆదేశించారు. దీంతో గుంజీలు తీస్తూ సేథీ కొద్దిసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దగ్గర్లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి, మెరుగైన వైద్యం కోసం కటక్‌లోని ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధృవీకరించారు. ‘ చిన్నారి మరణానికి వీళ్లే కారకులు అంటూ ఎవ్వరూ మాకు ఫిర్యాదు చేయలేదు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని బీఈఓ నీలాంబర్ స్పష్టం చేశారు. -
నేరం చేస్తే మూడు తరాలకు శిక్ష? ఎందుకలా?
ఏ దేశంలోనైనా నేరానికి తగిన శిక్ష విధిస్తారు. నేరం చేసిన వ్యక్తి శిక్షనుంచి తప్పించుకోలేడు. అయితే ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలు శిక్షను అనుభవించాల్సి వస్తే.. అది మన ఊహకు అందదు. ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలవారు శిక్ష అనుభవించే చట్టం ఆ దేశంలో అమలులో ఉంది. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న దేశం పేరు ఉత్తర కొరియా. నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. ఈ దేశం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు చర్చలు జరుగుతుంటాయి. ఇక్కడ చట్టం అమలయ్యే తీరు తెలుసుకుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఉత్తర కొరియాలో ఎవరైనా నేరం చేస్తే వారి తల్లిదండ్రులు, పిల్లలు కూడా శిక్షను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏ నేరానికి ఇంతటి శిక్ష విధిస్తారనే ప్రశ్న ఇప్పుడు మన మదిలో మెదులుతుంది. దేశంలోని ఏ ఖైదీ కూడా జైలు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని రూపొందించారని సమాచారం. ఇక ఉత్తర కొరియాలోని ప్రత్యేక చట్టాల విషయానికొస్తే జుట్టు కటింగ్‌కు సంబంధించి కూడా చట్టాలు రూపొందించారు. ఉత్తర కొరియాలో ప్రభుత్వం 28 హెయిర్ కటింగ్ స్టైల్స్‌కు మాత్రమే అనుమతినిచ్చింది. వీటిలో మహిళలకు 18, పురుషులకు 10 హెయిర్ కటింగ్ స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్స్ కాకుండా, ఎవరైనా వేరే విధంగా జుట్టు కత్తిరించుకున్నట్లయితే దానిని నేరంగా పరిగణిస్తారు. అందుకు తగిన శిక్ష కూడా విధిస్తారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇటువంటి చట్టాలు కనిపించవు. 21వ శతాబ్దంలో కూడా ఉత్తరకొరియా ప్రపంచంలోని ఇతర దేశాలకు భిన్నంగా కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూనియన్ జాక్ ఎందుకు? -
ఖతార్‌లో అత్యాచారానికి విధించే శిక్ష ఎంత కఠినం?
ఖతార్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. భారతదేశానికి చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లకు ఖతార్ మరణశిక్ష విధించింది. వారందరినీ కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. వారు గూఢచర్యానికి పాల్పడ్డారని ఖతార్ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ నేపధ్యంలో ఖతార్‌లో అమలయ్యే వివిధ శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని కఠినమైన చట్టాలను ఖతార్ అమలు చేస్తోంది. వీటిలో అత్యాచారానికి సంబంధించిన చట్టం కూడా ఉంది. ఈ శిక్ష గురించి తెలిస్తేచాలు ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఖతార్‌లో ఒక్కో రకమైన నేరానికి ఒక్కో రకమైన శిక్ష విధిస్తారు. ముఖ్యంగా చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు, అత్యాచారాలకు కఠినమైన శిక్షలు అమలు చేస్తారు. దేశంలో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. మరోమారు ఇటువంటి నేరం చేసే సాహసం చేయలేని రీతిలో శిక్ష విధిస్తారు. ఖతార్‌లో అత్యాచారానికి పాల్పడిన నేరస్తులపై రాళ్లతో దాడిచేస్తారు. తరువాత వారి శరీర భాగాలను కూడా నరికివేస్తారు. అంతేకాదు ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అంటే అత్యాచారానికి పాల్పడిన తర్వాత దోషికి వీలైనంత త్వరగా శిక్ష పడుతుందన్నమాట. కాగా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా అత్యాచారాలకు కఠినమైన శిక్షలు విధించే నిబంధనలున్నాయి. ముస్లిం దేశమైన కువైట్‌లో కూడా అత్యాచార నిందితులకు ఏడు రోజుల్లో మరణశిక్ష విధిస్తారు. అదేవిధంగా ఇరాన్లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటల్లో అంతమొందిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కాల్చివేసే శిక్ష అమలు చేస్తారు. ఈ శిక్ష వారంలోపు విధిస్తారు. సౌదీ అరేబియాలో అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జననాంగం కోయడం లేదా ఉరి శిక్ష అమలు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాలను రూపొందించిన దేశాల జాబితాలో ఖతార్ కూడా ఉంది. ఖతార్ తొలిసారిగా ఫిఫా ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఈ చట్టాలు, నియమాలు ప్రపంచానికి మరింతగా తెలిశాయి. ఇది కూడా చదవండి: హమాస్‌ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్యపై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, పల్నాడు: కునిరెడ్డి కృష్ణారెడ్డి హత్య దిగ్భ్రాంతి కలిగించిందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని చెప్పారు. హత్యకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎస్పీని కోరినట్లు చెప్పారు. అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారని దుయ్యబట్టారు. 'చాలా కిరాతకంగా కృష్ణారెడ్డిని హత్య చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారు. టీడీపీ నేతలకు ఏం చేయాలో తెలియక ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు. సీఎం జగన్ దృష్టికి ఈ విషయం తీసుకెళతాం. కృష్ణారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న గ్రామాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ‘భర్త అవినీతి చేయలేదని భువనేశ్వరి ప్రమాణం చేస్తారా?’ -
మీ బాస్‌కి బుద్ధి లేదు,వాడో శాడిస్ట్.. టార్గెట్ రీచ్ కాలేదని బలవంతంగా..ఛీ!
సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల నుంచి సాధ్యమైనంత పనిని చేయించు కోవాలనుకుంటాయి. ఇక కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు టార్గెట్ల పేరుతో వేధిస్తుంటాయి. తాజాగా ఓ బాస్ తన ఉద్యోగులకు విచిత్రమైన శిక్ష వేశాడు. తమ సంస్థలో పని చేసే ఉద్యోగుల పనితో సంతృప్తి లేదని వెరైటీ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇదంతా అందులో ఒక ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ బాస్ బండారం బయటపడింది. ఈ వింత ఘటన చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. అదో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కంపెనీ. పేరు సుఝౌ దనావ్ ఫాంగ్చెంగ్షీ ఇన్ఫర్మేషన్ కన్సల్టింగ్. ఈ కంపెనీకి సంబంధించిన చాలా మంది ఉద్యోగులు బలవంతంగా చేదు కాకరకాయల్ని బలవంతంగా తిన్నారు. చైనీస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో, చాలా మంది ఉద్యోగులు పచ్చి పొట్లకాయ తింటున్నారు. కంపనీలో చేరే ముందు వారి పని తీరు సంతృప్తిగా లేకపోతే ఇలాంటి పనిష్మెంట్కి ఉద్యోగులు అంగీకరిస్తూ అగ్రిమెంట్ కూడా చేయించుకున్నట్లు కంపెనీ తెలిపింది. అది రివార్డ్, పనిష్మెంట్ స్కీమ్ అని పేర్కొంది. ఇలా ఎందుకు చేశారని చైనా మీడియా ఆ సంస్థ ప్రతినిధిని అడగగా.. వారు మొండిగా సమాధానం ఇచ్చారు. ఉద్యోగులకు ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో వారు కఠినంగా, హార్డ్ వర్క్ చేస్తారని అన్నారు. తద్వారా మాత్రమే టార్గెట్ రీచ్ అవ్వగలరని అన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కంపెనీ బాస్‌పై మండిపడుతున్నారు. ఇదేం స్కూల్ కాదు ఇలాంటి శిక్షలు వేయడానికి.. ఆ బాస్ బుద్ధిలేదు, వాడో శాడిస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: రష్యాకి తగిలిన వాగ్నర్ సైన్యం షాక్‌కి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే.. -
చిన్న శిక్షతో సరిపెడతారా?
సాక్షి, అమరావతి : ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్ కమిషనర్‌ను, అతనికి సాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా, హిందూపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్‌పై నామమాత్రపు చర్యలు తీసుకున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు సమాజానికి సంరక్షకులని, అలాంటి పోలీసు తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని స్పష్టం చేసింది. రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించడం చాలా చిన్న శిక్ష అని, ఇలాంటి శిక్ష విధించడం ద్వారా సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని ప్రశ్నించింది. కింది కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేసిన పోలీసు అధికారికి చిన్న శిక్ష విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వొకేట్ కమిషనర్, కోర్టు సిబ్బందిని ఇస్మాయిల్ కొట్టారంటూ అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా మలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐ ఇస్మాయిల్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. తదుపరి విచారణకు సైతం హాజరు కావాలని ఇస్మాయిల్‌ను ధర్మాసనం ఆదేశించింది. -
'మన్ కీ బాత్' వినకపోతే నన్ను కూడా శిక్షిస్తారా?.. మహువా మొయిత్రా ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌కు హాజరుకాలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష విధించింది చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కళాశాల. వీరిని వారం రోజుల పాటు హాస్టల్ నుంచి కాలు బయటపెట్టొద్దని ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థులు వసతిగృహానికే పరిమితమయ్యారు. పీజీ వైద్య కళాశాల తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అసలు మోదీ రేడియా కార్యక్రమానికి హాజరుకాకపోతే శిక్షించడం ఏంటి? అని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మన్ కీ బాత్ ఒక్క ఎపిసోడ్ కూడా వినలేదని, అందుకు తనను కూడా ఇంట్లో నుంచి వారం రోజులు బయటకు రాకుండా శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. అలాగే మోదీ మన్ కీ బాత్‌ను మంకీ బాత్ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు మహువా. ఈమేరకు ట్వీట్ చేశారు. విద్యార్థులకు శిక్షపడిన విషయంపై ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథానాన్ని కూడా ట్వీట్‌కు జతచేశారు. I haven’t listened to monkey baat either. Not once. Not ever. Am I going to be punished as well? Will l be forbidden from leaving my house for a week? Seriously worried now. pic.twitter.com/HaqEQwsWOj — Mahua Moitra (@MahuaMoitra) May 12, 2023 మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న జరిగింది. ఆరోజు విద్యార్థులంతా తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని పీజీఐఎంఆర్ కాలేజీ విద్యార్థులకు సర్కులర్ జారీ చేసింది. అయితే నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 28 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్‌కు చెందిన 8 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాని డుమ్మా కొట్టారు. ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. ఈ విషయంపై ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. ఈ ఎపిసోడ్‌కు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని ముందుగానే చెప్పామని, ఆరోజు గెస్ట్ లెక్చర్స్, ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ సరైన కారణం లేకుండా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. చదవండి: ఉద్ధవ్‌ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు -
బీఎస్పీ ఎంపీకి నాలుగేళ్ల జైలుశిక్ష
-
భారత సంతతి తంగరాజును ఉరితీసిన సింగపూర్.. కేసు ఇదే..
సింగపూర్: భారత సంతతికి చెందిన వ్యక్తి తంగరాజు సుప్పయ్య(46)ను సింగపూర్ అధికారులు ఉరి తీశారు. కాగా, తంగరాజు.. సింగపూర్‌కు కేజీ గంజాయిని అక్రమంగా తరలించారనే కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో, ఉరిశిక్షను అధికారులు అమలు చేశారు. వివరాల ప్రకారం.. సింగపూర్‌కు కిలోకిపైగా గంజాయిని రవాణా చేసేందుకు తంగరాజు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల్లో తంగరాజు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో, తంగరాజుకు అక్టోబర్ 9, 2018లో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున చాంగి జైలులో తంగరాజు సుప్పయ్యను ఉరి తీసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సుప్పయ్య కుటుంబ సభ్యులు, ఐక్యరాజ్య సమితి యాక్టివిస్టులు విజ్ఞప్తులు చేసినప్పటికి సింగపూర్ అధికార యంత్రాంగం ఉరి శిక్షను అమలు చేసింది. ఇదిలా ఉండగా.. తంగరాజు సుప్పయ్య కుటుంబ సభ్యులు, యాక్టివిస్టులు ఆయనకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ సింగపూర్ అధ్యక్షుడు హలిమా యాకోబ్‌కు చివరి నిమిషంలో లేఖ రాశారు. అయినప్పటికీ ఉరి శిక్షను అమలు చేయడం గమనార్హం. అయితే, తంగరాజు.. నేరం చేయలేదనే బలమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులో దోషిగా తేలాడు. ఆయనకు విచారణ సమయంలో కూడా పరిమితంగా లీగల్ మద్దతు లభించిందని యాక్టివిస్టులు చెబుతున్నారు. మరోవైపు.. తంగారాజు ఉరిశిక్షపై ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత వారం తంగరాజు ఉరిశిక్షకు సంబంధించిన నోటీసు వచ్చిన తర్వాత ఛాంగి జైలులో గ్లాస్ కిటికీ మధ్యలో నుంచి తాము సుప్పయ్యను చూసేందుకు ప్రయత్నించామని తెలిపారు. ఈ రోజు వస్తుందని తంగరాజు మానసికంగా సిద్ధమై ఉన్నారని, అన్యాయం జరిగిందని ఆయన భావిస్తున్నారని చెప్పారు. కాగా, సింగపూర్‌లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సింగపూర్ చెబుతోంది. అందుకు ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వారికి కఠిన శిక్షలను అమలు చేస్తున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. Singapore has hanged 46-year-old Tangaraju Suppiah who was found guilty in 2018 of trafficking more than 1kg of cannabis https://t.co/TZ5yq6rIVv pic.twitter.com/P5aM22AUIa — Al Jazeera English (@AJEnglish) April 26, 2023 -
విద్యార్థిని హత్య కేసులో 143 రోజుల్లోనే తీర్పు
కాకినాడ లీగల్: ఓ విద్యార్థిని పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రేమోన్మాదికి కేవలం 143 రోజుల్లోనే శిక్ష పడింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.కమలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. రాష్ట్రంలో కేసులు త్వరితగతిన విచారణ జరిగి, నిందితులకు శిక్ష పడాలని, బాధితులకు సత్వర న్యాయం జరగాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ ఇందుకు దోహదం చేసింది. గత ఏడాది జరిగిన హత్య కేసు విచారణ వేగంగా జరిగి, నిందితుడికి కఠిన శిక్ష పడింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ కూరాడలో మేనమామ ఇంట్లో ఉండేవాడు. అదే గ్రామంలో కె.దేవిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుకునేది. దేవికను ప్రేమించానంటూ సూర్యనారాయణ వెంటపడేవాడు. సుమారు ఏడాది పాటు వెంట పడి వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఇతని వేధింపులు భరించలేక దేవిక విషయాన్ని బంధువులకు చెప్పింది. పెద్దలు యువకుడ్ని మందలించి పంపించేశారు. అయినా అతడు తన చేష్టలు ఆపలేదు. గతేడాది అక్టోబర్ 8న కాండ్రేగుల – కూరాడ మధ్య కాపు కాశాడు. యాక్టివా మోపెడ్‌పై వస్తున్న దేవికను ఆపి నడిరోడ్డుపై కత్తితో 18 సార్లు కిరాతకంగా పొడిచాడు. ఆమె అక్కడకక్కడే చనిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాసు త్వరితగతిన కేసు దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించి 7 రోజులలోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ త్వరితగతిన జరిగింది. నేరం రుజువు కావడంతో సూర్యనారాయణకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి పి.కమలాదేవి తీర్పు చెప్పారు. కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థతో సత్ఫలితాలు విద్యార్థిని పాశవిక హత్య ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. వెంటనే మృతురాలి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. త్వరితగతిన విచారణ జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎస్పీ ఎం.రవీంధ్రనాథ్‌బాబు నిరంతరం దర్యాప్తును పర్యవేక్షించారు. ఇందుకు కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ చక్కగా పనిచేసింది. కేసు నమోదు చేసిన 143 రోజుల్లో విచారణ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు చెంపపెట్టు అవుతుందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. కేసు విచారణ విషయంలో ప్రభుత్వం బాగా స్పందించిందని, నిందితుడికి కఠిన శిక్ష పడిందని మృతురాలి తల్లి నాగమణి అన్నారు.