ఆరిలోవ(విశాఖ తూర్పు): వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఖైదీలకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తోంది. తాజాగా ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోపాటు జైలు నుంచి విడుదలయ్యాక నేర ప్రవృత్తిని విడనాడి అందరిలాగే పనిచేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది.
ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల విశాఖ కేంద్ర కారాగారంలో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన సోషల్ వర్కర్లను సభ్యులుగా నియమిస్తారు. దీనికోసం ఈ నెల 5న సోషల్ కౌన్సెలర్, ఎన్‌జీవోలు, సోషల్ వర్కర్లు, సైకాలజిస్ట్‌లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా స్కిల్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేంద్ర కారాగారంలో సమావేశం నిర్వహించారు. వారిలో ఐదుగురిని ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు.
సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏం చేస్తారంటే...
► ఖైదీలకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకువస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కృషి చేస్తారు.
► ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ప్రతినిధులు వచ్చి ఖైదీలకు వివిధ చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి సర్టీఫికెట్ అందజేస్తారు.
► ఈ శిక్షణ వల్ల ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత సమాజంలో పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
► ఏపీఎస్‌ఎస్‌డీసీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉన్న ఖైదీలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు.
► ఈ చర్యల వల్ల ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గుతుందని, ఆర్థికంగా ఎదిగి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment