Incubation center
-
నేరాలకు దూరంగా... ఉపాధికి దగ్గరగా..!
ఆరిలోవ(విశాఖ తూర్పు): వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఖైదీలకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పించి కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తోంది. తాజాగా ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావడంతోపాటు జైలు నుంచి విడుదలయ్యాక నేర ప్రవృత్తిని విడనాడి అందరిలాగే పనిచేసుకుని ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల విశాఖ కేంద్ర కారాగారంలో సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో వివిధ విభాగాలకు చెందిన సోషల్ వర్కర్లను సభ్యులుగా నియమిస్తారు. దీనికోసం ఈ నెల 5న సోషల్ కౌన్సెలర్, ఎన్జీవోలు, సోషల్ వర్కర్లు, సైకాలజిస్ట్‌లు, వెల్ఫేర్ ఆఫీసర్లు, బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో కేంద్ర కారాగారంలో సమావేశం నిర్వహించారు. వారిలో ఐదుగురిని ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. సోషల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏం చేస్తారంటే... ► ఖైదీలకు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి ప్రవర్తనలో మంచి మార్పు తీసుకువస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కృషి చేస్తారు. ► ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రతినిధులు వచ్చి ఖైదీలకు వివిధ చేతివృత్తుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి సర్టీఫికెట్ అందజేస్తారు. ► ఈ శిక్షణ వల్ల ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత సమాజంలో పని చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ► ఏపీఎస్ఎస్డీసీ ఇచ్చిన సర్టిఫికెట్ ఉన్న ఖైదీలు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. ► ఈ చర్యల వల్ల ఖైదీల్లో నేరప్రవృత్తి తగ్గుతుందని, ఆర్థికంగా ఎదిగి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుందని జైలు అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
నల్లగొండకి ఐటీ కాంతులు.. శుభవార్త చెప్పిన కేటీఆర్
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు నూతన సంవత్సర కానుకగా నల్లగొండ వాసులకు శుభవార్త తెలిపారు. ఐటీ రంగాన్ని ద్వితియ శ్రేణి పట్టణాలకు విస్తరించే కార్యక్రమంలో భాగంగా నల్లగొండలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు భవనం డిజైన్ ఎలా ఉంటుందనే అంశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 2021 డిసెంబరు 31న నల్లగొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌కి శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. 18 నెలల్లో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. After Warangal, Karimnagar, Khammam, Nizamabad & Mahbubnagar now it’s the turn of Nalgonda to get an IT Hub As part of policy to encourage IT in Tier 2 towns, will be laying the foundation today & we plan to inaugurate the facility in 18 months pic.twitter.com/QW7NnUItKH — KTR (@KTRTRS) December 31, 2021 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే వరంగల్‌కి ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ మంజూరైంది. అయితే పనులు నత్తనడకన సాగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్‌లో ఐటీకి మంచిరోజులు వచ్చాయి. సెయింట్, ఆనంద్ మహీంద్రా, మైండ్‌ట్రీ, ఎల్ అండ్ టీ వంటి సంస్థలు వరంగల్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇదే క్రమంలో ఆ తర్వాత కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో కూడా ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రారంభించగా ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. ఈ పరంపరలో నల్గొండకు సైతం ఐటీ సెక్టార్ చేరువకానుంది. చదవండి:హైదరాబాద్‌తో ప్రేమలో పడకుండా ఉండగలమా... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ -
మాస్కే మన వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నిరోధానికి టీకాపై అతిగా ఆధారపడటం తగదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా స్పష్టం చేశారు. టీకా రాకపోయినా దాన్ని ఎదుర్కోవడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు తుది దశలో ఉన్నప్పటికీ వాటి సామర్థ్యం తెలియాలంటే మరికొంత సమయం పడుతుందని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. ‘సమర్థంగా పనిచేసే టీకా అందుబాటులోకి వస్తే సరి. లేదంటే భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం బహిరంగ ప్రదేశాల్లో మాస్కు వేసుకోవడం వంటి చర్యల ద్వారా వ్యాప్తిని అడ్డుకోవచ్చు’అని వివరించారు. ముఖానికి తొడుక్కునే మాస్క్.. వ్యాక్సిన్ లాంటిదే అనే విషయం గుర్తించాలని పేర్కొన్నారు. కరోనా రక్షణ చర్యలన్నీ పాటిస్తే కొంత కాలానికి నిరోధకత ఏర్పడుతుందని, తద్వారా సహజ సిద్ధంగానే వైరస్‌కు చెక్ పెట్టొచ్చని చెప్పారు. అతి తక్కువ సమయంలో ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పలు విధానాలు అందుబాటులోకి రావడం, అందరూ కలసికట్టుగా కృషి చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఒకవేళ టీకా అందుబాటులోకి వచ్చినా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి అందించేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని పేర్కొన్నారు. అలాగే టీకా ఇచ్చినా దాని ప్రభావం ఎంత కాలం పాటు ఉంటుందో కూడా తెలియదని, ఆ విషయం తెలుసుకునేందుకు కనీసం రెండేళ్లు పడుతుందని వివరించారు. అప్పటివరకూ ప్రస్తుతం పాటిస్తున్న అన్ని రకాల జాగ్రత్తలను కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ‘మిషన్’కు రూ. 50 వేల కోట్లు! న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశ ప్రజలకు అందజేయడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.50వేల కోట్లు కేటాయించినట్లు సమాచారం. ఒక్కో వ్యక్తికి వ్యాక్సిన్ ఇవ్వడానికి 6 నుంచి 7 డాలర్ల వరకు ఖర్చవుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో ప్రస్తుత జనాభా 130 కోట్ల పైమాటే. వ్యాక్సినేషన్ మిషన్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.50 వేల కోట్లు కేటాయించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా టీకాలను ప్రజలందరికీ అందజేసే విషయంలో ఖర్చుకు ప్రభుత్వం వెనుకాడబోదని వెల్లడించాయి. భారత్‌లో ఒక్కో టీకా డోసుకు 2 డాలర్ల చొప్పున ఖర్చు కానుందని అంచనా. ఒక్కో వ్యక్తికి రెండు డోసుల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి 4 డాలర్లు ఖర్చవుతాయి. వ్యాక్సిన్ రవాణా, నిల్వ కోసం మరో 3 డాలర్లు అవసరం. మొత్తంమీద ఒక్కో పౌరుడిపై ప్రభుత్వం 7 డాలర్ల (రూ.515) చొప్పున వ్యయం చేయనుంది. -
సృజనాత్మకతకు టీ–వర్క్స్
♦ నూతన సంస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ♦ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం ♦ హార్డ్‌వేర్ నమూనాల అభివృద్ధి, ఇంక్యూబేషన్, నైపుణ్యాభివృద్ధికి సదుపాయాలు ♦ ఆలోచనతో వచ్చి ప్రొడక్ట్‌తో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: మీ దగ్గర ఓ సరికొత్త ఆలోచన ఉందా? ఏదైనా ఒక కొత్త ఉత్పత్తిని సృష్టించాలనుకుంటున్నారా? అందుకు తగిన సదుపాయాల కోసం అన్వేషిస్తున్నారా.. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒక సృజనాత్మక ఆలోచనతో వచ్చి ఉత్పత్తి (ప్రొడక్ట్)ను అభివృద్ధి చేసుకుని వెళ్లగలిగేలా సదుపాయాలను కల్పిస్తూ ‘టీ–వర్క్స్’ పేరుతో నూతన సంస్థకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ రంగాల్లో అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు దీనిని ఏర్పాటు చేసింది. హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ స్థాయి నమూనాల రూపకల్పన (ప్రొటోటైపింగ్) సదుపాయంతో పాటు ఔత్సాహిక పరిశోధకుల అభివృద్ధి కేంద్రం (ఇంక్యుబేషన్ సెంటర్), నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఈ ‘టీ–వర్క్స్’లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు లాభాపేక్ష లేని సంస్థగా టీ–వర్క్స్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణం సృష్టించడం, హార్డ్‌వేర్ నమూనాల తయారీ సదుపాయం కల్పించడం, ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినట్లు నిపుణులైన మానవ వనుల అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేయనుంది. ఈ సంస్థకు డైరెక్టర్లుగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ (ఎలక్ట్రానిక్స్) వ్యవహరిస్తారు. టీ–వర్క్స్ ప్రధాన ఉద్దేశాలివీ..నమూనాల ఉత్పత్తి కోసం: ఏదైనా ఓ ఆలోచనతో ఔత్సాహిక పరిశోధకులు అడుగు పెట్టి.. ఉత్పత్తిని రూపొందించుకుని బయటకు వెళ్లేందుకు కావాల్సిన అత్యాధునిక సదుపాయాలు, యంత్రాలు టీ–వర్క్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తుల నమూనాల అభివృద్ధి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు. ఇంక్యుబేషన్: హార్డ్‌వేర్ ఉత్పత్తికి సంబంధించిన ఆలోచనలకు కార్యరూపం కల్పించి ఉత్పత్తుల తయారీకి సహకరించడం, హార్డ్‌వేర్ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడిదారులు, సలహాదారులు, మార్గదర్శకులను ఆకర్షించడం, హార్డ్‌వేర్ రంగ అభివృద్ధికి పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఏకమై పనిచేసేందుకు ఇంక్యుబేషన్ కేంద్రం ఉపయోగపడనుంది. -
వరంగల్‌లో ప్రతిభకు కొదువ లేదు..
‘సైయంట్’ రాకతో మరిన్ని కంపెనీలు ఐటీ సంస్థ ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మడికొండ : వరంగల్ జిల్లాలో ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఉద్యోగులకు కొదువ లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని ఇంక్యుబేషన్ సెంటర్లో ఏర్పాటుచేసిన సైయంట్ ఐటీ సెజ్ కార్యాలయాన్ని ఆదివారం శ్రీహరి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలకు ఐటీ కంపెనీలను విస్తరించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వరంగల్ జిల్లాకు సైయంట్ సంస్థను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సంస్థను బ్రాండ్ అంబాసిడర్‌గా చూపిస్తూ మరికొన్ని కంపెనీలు ఇక్కడ బ్రాంచ్‌లు ఏర్పాటుచేసేలా కృషి చేయనున్నట్లు వెల్ల డించారు. తద్వారా రెండు నుంచి మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుతం సైయంట్ సంస్థలో వంద మంది కి ఉపాధి కల్పిస్తుండగా, రానున్న రెండేళ్లలో వేయి మందికి ఉపాధి కల్పిస్తారని వెల్లడించారు. వరంగల్‌లో మొదటి దశలో రూ.10 కోట్లతో 45 ఎకరాల స్థలంలో ఐటీ సెజ్‌కు ఏర్పాటుచేయనుండగా.. రెండో దశలో రూ.6కోట్లను ఖర్చు చేయనున్నట్లు శ్రీహరి తెలిపారు. కల నెరవేరింది.. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌కు ఐటీ కంపెనీలు వస్తాయని గత ప్రభుత్వాల ప్రకటనలు నెరవేరకపోగా.. ప్రస్తుతం సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఈ కల నెరవేరుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్తెలిపారు. సైయంట్ సంస్థ ప్రస్థుతం 70శాతం స్థానికులకే ఉద్యోగావకాశం కల్పించనుందని చెప్పారు. సైయంట్ సంస్థ ఫౌండర్ బీవీఆర్.మోహన్‌రెడ్డి, మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 24వ కేంద్రం, దేశంలో 12వ కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటుచేసిందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, నగర మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, సీపీ సుధీర్‌బాబు, కార్పొరేటర్ జోరిక రమేశ్, టీపీఐఐసీ జోనల్ మేనేజర్ రాథోడ్, సైయంట్ సంస్థ వైస్ చైర్మన్లు సునీల్‌కుమార్, నర్సింహన్, నాయకులు ఎల్లావుల లలితాయాదవ్, బైరి కొమురయ్య, మద్దెల నారాయణస్వామి, రవి, శివ, వీరేశ్, రవీందర్, దేశిని హన్మంతరావు, వనంరెడ్డి, బుద్ద వెంకన్న, శంకర్, వినోద్ పాల్గొన్నారు. -
కాకినాడలో ఇంక్యుబేషన్ సెంటర్ : పల్లె
సాక్షి, హైదరాబాద్: చైనా ప్రభుత్వ భాగస్వామ్యంతో కాకినాడలో రూ.16 కోట్ల వ్యయంతో ఇంక్యుబేషన్ సెంటర్‌ని ఏర్పా టు చేయనున్నట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటుకు చైనాకు చెందిన జెడ్‌టీఈ సాఫ్ట్ టెక్నాలజీ, క్వినై అథారిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. సంవత్సర కాలంలో ఈ సంస్థ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని, దీంతో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని చెప్పారు. రాష్ట్రంలో ఈ-ప్రగతి అమల్లోకి వస్తే సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఏపీ తొలి రాష్ట్రమవుతుందన్నారు. సమావేశంలోజెడ్‌టీఈ అంతర్జాతీయ సీఈఓ బెన్ జౌ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీలో మేటి
‘వరంగల్ యాజ్ ఐటీ డెస్టినేషన్’ పేరుతో పాలసీ మడికొండ, రాంపూర్‌లో 100 ఎకరాల స్థలం గుర్తింపు కొత్త కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందుబాటులో ఇంక్యుబేషన్ సెంటర్ హన్మకొండ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు వరంగల్ నగరం సరికొత్త కేంద్రంగా మారనుంది. రాబోయే రోజుల్లో పలు అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పనున్నాయి. ఇటీవల రాష్ట్ర ఐటీ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా వరంగల్ పై దృష్టి సారించింది. ఐటీ పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న అంశాలు, ప్రభుత్వం తరఫున ఇవ్వబోతున్న ప్రోత్సాహకాలను వివరిస్తూ ‘వరంగల్ యాజ్ ఐటీ డెస్టినేషన్’ పేరుతో 3:22 నిమిషాల నిడివి కలిగిన వీడియో ఫేస్బుక్లో ఈ నెల 13న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేరుతో పోస్ట్ అయ్యింది. వరంగల్ ఐటీ పాలసీ ఇదీ.. కొత్త ఐటీ పాలసీని ప్రభుత్వం ఈ నెల 6న ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌కు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ద్వితీయ శ్రేణి నగరాలకు సంబంధించి ముఖ్యంగా వరంగల్‌లో ఐటీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు, ఇక్కడున్న సానుకూల అంశాలను వివరిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ తరఫున ఈ నెల 13న ‘వరంగల్ యాజ్ ఐటీ డెస్టినేషన్’ పేరుతో ఫేస్బుక్లో వీడియోను పోస్టు చేశారు. దీనిలో పేర్కొన్న అంశాల ప్రకారం.... మడికొండలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆఫీస్‌స్పేస్ ఇక్కడ ఉంది. స్టార్ట్అప్ కంపెనీలు ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో కంపెనీలు ప్రారంభివచ్చు. ఇదే చోట ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలికి 45 ఎకరాలు కేటాయించారు. తాజాగా రాంపూర్ వద్ద ఐటీ పరిశ్రమల కోసం 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అంతేకాకుండా వరంగల్ నగరంలో నెలకొల్పే ఐటీ పరిశ్రమలకు మున్సిపల్ కార్పొరేషన్ విధించే పన్నుల నుంచి మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. ఎగ్బిబిషన్ రెంటల్ కాస్ట్లో 50 శాతం రాయితీ, ఐటీ నిపుణులను వృద్ధి చేయడం, నియామకాల్లో సహాయ సహకారాలు, టాస్క్ ద్వారా ప్రత్యేకంగా మానవ వనరులను వృద్ధి చేయడం వంటి కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ శాఖ తరఫున ప్రోత్సాహం ఉంటుంది. నిరంతరం కరెంట్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. అనుకూలమైన నగరం హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఐటీ పరిశ్రమకు రెండో గమ్యస్థానంగా నిలవడంలో వరంగల్‌కు అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. విస్తీర్ణం, జనాభా పరంగా రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా వరంగల్‌కు గుర్తింపు ఉంది. చారిత్రక వారసత్వం, కట్టడాలతో అలరారుతోంది. పర్యాట రంగంలో మంచి వృద్ధి కనబరుస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్డు, రైలు సౌకర్యం ఉంది. హైదరాబాద్ రింగు రోడ్డు నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో వరంగల్ నగరం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), కాకతీయ యూనివర్సిటీ, కిట్స్ వంటి పేరెన్నికగల కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఇటీవల నెలకొల్పారు. ఫలితంగా నాణ్యమైన మానవ వనరుల లభ్యతకు కొదువలేదు. ఆతిథ్యానికి సంబంధించి పదుల సంఖ్యలో త్రీస్టార్ హోటళ్లు ఉన్నాయి. జీవన ప్రమాణాల పరంగా వరంగల్‌లో మాల్స్, ఫుడ్‌కోర్టులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే మామునూరు ఎయిర్‌పోర్టును సైతం పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌లు (టాస్క్) సంయుక్తంగా ప్రతీఏడు వేయి మందిని ఐటీ ప్రొఫెషనల్స్‌గా మారుస్తున్నారు. దీంతో ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు ద్వితీయ శ్రేణి నగరాల్లో వరంగల్‌ను ప్రథమ ప్రాధాన్యత నగరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకుంది. స్పందన.. రాష్ట్ర ఇన్మర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ ప్రచార వీడియోకు అమితమైన స్పందన లభిస్తోంది. ఈ నెల 13న 3:22 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోను పోస్టు చేయగా రెండు రోజుల వ్యవధిలోనే రెండు లక్షల ఇరవై వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పటికే 91 వేల మంది వీక్షించారు. దాదాపు పదహారు వేల మంది ఈ వీడియోను షేర్ చేశారు. వరంగల్‌లో ఐటీ పరిశ్రమ నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, త్వరలో ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తామంటూ కొందరు కామెంట్లు సైతం చేశారు. -
వరంగల్ లో స్పార్క్10 ఇంక్యుబేషన్ సెంటర్!
♦ ఎంపిక చేసిన 10 స్టార్టప్‌లకు 13 వారాల శిక్షణ కూడా ♦ స్పార్క్ 10 ఫౌండర్ అటల్ మాలవీయ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సరికొత్త ఆలోచన.. వ్యాపార ప్రణాళికలనేవి మెట్రో నగరాలకే పరిమితం కావు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్ణణాల్లోనూ ఉంటాయి. అందుకే మెట్రో నగరాల్లోని స్టార్టప్స్‌తో పాటూ పట్టణాల్లోని స్టార్టప్‌లను, స్థానిక ఆలోచనలను ప్రోత్సహించడం చాలా అవసరం’’ అని స్పార్క్-10 ఫౌండర్ అటల్ మాలవీయ చెప్పారు. అందుకే హైదరాబాద్ లాగే వరంగల్లోనూ స్పార్క్ 10 యాక్సలరేటర్ ప్రోగ్రాంతో పాటు స్థానికంగా ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు స్థానిక సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులతో చర్చలు కూడా జరుపుతున్నామన్నారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూరోపియన్ యాక్సలరేటర్, ఇగ్నైట్ 100 కో-ఫౌండర్ అండ్ సీఈఓ పాల్ స్మిత్, స్పార్క్ 10 సభ్యుడు వివేక్ రెడ్డిలతో కలసి మాలవీయ మాట్లాడారు. ‘‘స్పార్క్ 10 యాక్సలరేటర్ ప్రోగ్రాంకు 500కు పైగా స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో నుంచి ఉత్తమమైన 10 కంపెనీలను ఎంపిక చేశాం. ఎంపికైన 10 కంపెనీల వివరాలు స్పార్క్-10 ఆరిజిన్స్ పేరిట శనివారం హైటెక్స్‌లోని సైబర్ సిటీ కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో వెల్లడిస్తాం. వీటికి వచ్చే నెల నుంచి 13 వారాల శిక్షణ కార్యక్రమాలుంటాయి. ఇందులో రూ.10 లక్షలు నగదు రూపంలో ప్రోత్సాహం ఇవ్వటంతో పాటూ మరో రూ.10 లక్షలు బెనిఫిట్ రూపంలో అందిస్తాం. శిక్షణానంతరం సంబంధిత స్టార్టప్స్‌లో 8 శాతం ఈక్విటీ రూపంలో తీసుకుంటాం’’ అని అటల్ వివరించారు. శిక్షణలో భాగంగా అంతర్జాతీయ మెంటర్స్, వర్క్షాప్లుంటాయి. దేశీయ స్టార్టప్స్‌లో రెండేళ్ల వ్యవధిలో 100 మిలియన్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. -
అమాత్యుడి గుప్పెట్లో ఇంక్యుబేషన్
రూ.67.7 కోట్ల {పాజెక్టుపై కన్ను అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టే ఎత్తుగడ డిజైన్‌పై కొర్రీలతో అడ్డుపుల్ల విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)’ విశాఖలో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మించేందుకు మూడేళ్ల క్రితం ముందుకువచ్చింది. అప్పట్లోనే కేంద్రం రూ.16 కోట్లు విడుదల చేసింది. కానీ అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో జిల్లాలో చక్రం తిప్పిన ఓ నేత ఈ ప్రాజెక్టు అంతా తన కనుసన్నల్లోనే సాగాలని పట్టుబట్టారు. అందుకు ఎస్టీపీఐ సమ్మతించకపోవడంతో ఆ ప్రాజెక్టు మూడేళ్లపాటు మూలనపడిపోయింది. ఏడాది క్రితం ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణం అంశాన్ని ఎస్టీపీఐ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చింది. ఎస్టీపీఐ, వుడా సంయుక్తంగా రూ.62.70 కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. తన వాటాగా రూ.16.70 కోట్ల విలువైన స్థలాన్ని ఇచ్చేందుకు వుడా సమ్మతించింది. ఎస్టీపీఐ రూ.44 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తుంది. ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పర్యటన సందర్భంగా ఎస్టీపీఐ, వుడా ఎంవోయూ కుదుర్చుకున్నాయి. 8 ఫ్లోర్లతో 62 వేల చ.అడుగుల వైశాల్యంతో కనీసం 50 ఐటీ యూనిట్లు నెలకొల్పే సామర్థ్యంతో నిర్మించేందుకు డిజైన్‌ను రూపొందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కనీసం 2,500మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావించారు. ఏటా రూ.300 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు సాధించవచ్చని అంచనా వేశారు. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని భావించారు. అందుకు త్వరలో టెండర్లు పిలవడానికి సంసిద్ధమయ్యారు. అమాత్యుడి అడ్డుచక్రం ఇంతటి విలువైన ప్రాజెక్టు పూర్తిగా ఎస్టీపీఐ పర్యవేక్షణలోనే సాగడం జిల్లాకు చెందిన ఓ అమాత్యుడికి ఏ మాత్రం రుచించలేదు. ఆ భారీ కాంట్రాక్టును తమ అస్మదీయ సంస్థకు ఏకపక్షంగా కట్టబెట్టాలన్నది ఆయన ఉద్దేశం. ఆ తరువాత సబ్ కాంట్రాక్టు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలన్నది పన్నాగం. తమ అస్మదీయ సంస్థకు అనుకూలంగా ఉండేలా టెండరు నిబంధనలు రూపొందించాలని భావించారు. కొన్నిరోజుల క్రితం వుడా అధికారులను పిలిపించి ప్రాజెక్టు డిజైన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ డిజైన్ పట్ల సీఎం కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. కాబట్టి మరో డిజైన్‌ను రూపొందించి తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. వాస్తవానికి ఆ డిజైన్ పట్ల సీఎం కార్యాలయ ఉన్నతాధికారి సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఎస్టీపీఐ వర్గాలు చెబుతున్నాయి. వారు ఆమోదించిన తరువాతే టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు చేపట్టామని తెలిపాయి. కానీ అమాత్యుడు ఆ డిజైన్‌ను సీఎం కార్యాలయం తిరస్కరించినట్లు చెబుతుండటంపై ఎస్టీపీఐ వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అమాత్యుడి అభ్యంతరాల వెనుక ఇతరత్రా కారణాలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. డిజైన్‌పై అభ్యంతరాల నెపంతో మొత్తం టెండర్ల ప్రక్రియను అడ్డుకోవాలన్నది ఆయన వ్యూహం. టెండరు నిబంధనలు తమ అస్మదీయ సంస్థకు అనుకూలంగా రూపొందించేవరకు ఈ వ్యవహారాన్ని ఆయన ముందుకు సాగనివ్వరని స్పష్టమవుతోంది. కాగా తమ నిబంధనల మేరకే వ్యవహరిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గేది లేదని ఎస్టీపీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అమాత్యుడి కమీషన్ల వ్యవహారంతో విలువైన ప్రాజెక్టు మరోసారి పెండింగులో పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్టీపీఐ ఇంక్యుబేషన్ సెంటర్... రూ.67.70 కోట్ల ప్రాజెక్టు... 2,500 ఐటీ ఉద్యోగాలు లక్ష్యం... రూ.300 కోట్ల ఐటీ ఎగుమతుల అంచనా... అయితే... నా కేంటి?...‘నా సంగతి’ తేలేవరకు పనులు మొదలు పెట్టొద్దు. అసలు మీ డిజైనే బాగా లేదు. కొత్త డిజైన్‌తో రండి... ఇదీ ఓ అమాత్యుడి హుకుం... విశాఖను ఐటీ హబ్‌గా చేస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు ఆచరణలోకి వచ్చేసరికి అమ్యామ్యాలకే పెద్దపీట వేస్తున్నారు. కేంద్రం నిధులిస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం కమీషన్ల కోసం కక్కుర్తిపడుతూ మోకాలడ్డుతున్నారు. ఎస్టీపీఐ, వుడా సంయుక్తంగా నిర్మించతలపెట్టిన ఇంక్యుబేషన్ సెంటర్ ప్రాజెక్టే అందుకు తాజా తార్కాణం. -
ఈ ఏడాదే ఐఈఈఎంఏ ఇంకుబేషన్ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇందుకోసం ఐఐటీ కాన్పూర్‌తో చర్చిస్తున్నట్టు అసోసియేషన్ డెరైక్టర్ జనరల్ సునీల్ మిశ్రా సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతామని చెప్పారు. పరిశ్రమకు చెందిన ముఖ్యులు మెంటార్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. అసోసియేషన్‌లో 800లకు పైగా కంపెనీలు సభ్యులుగా ఉన్నాయని గుర్తు చేశారు. భారత్‌లో ఏర్పాటైన విద్యుత్ సంబంధ పరికరాల్లో 90 శాతం ఈ కంపెనీలు సరఫరా చేసినవేనని వివరించారు. 25 బిలియన్ డాలర్ల పరిశ్రమ 2016-17లో 5 శాతం వృద్ధి నమోదు చేస్తుందన్న అంచనాలున్నాయి. భారత్‌లో ఏటా రూ.1 లక్ష కోట్ల విలువైన విద్యుత్ చౌర్యానికి గురవుతోందని ఐఈఈఏంఏ చెబుతోంది. కాగా, ఐఈఈఎంఏ బెంగళూరులో ఫిబ్రవరి 13-17 తేదీల్లో ఎలెక్రామా-2016 సదస్సు, ప్రదర్శనను నిర్వహిస్తోంది. నూతన ఆవిష్కరణల ప్రదర్శనకు ఇది వేదిక కానుంది. 100 దేశాలకు చెందిన కంపెనీలు 1,000కిపైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వికాస్ జలాన్ వెల్లడించారు. -
సమూహ ఏరోస్పేస్‌కు ప్రైవేట్ ఈక్విటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రక్షణ, అంతరిక్ష పరిశోధన, పరికరాల తయారీలో దేశ, విదేశీ అవకాశాలను అందుకోవడానికి సమూహ ఏరోస్పేస్ పార్క్ సిద్ధమవుతోంది. పార్కులో ప్లాంట్ల నిర్మాణానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఆరు కంపెనీలు కలసి ఆదిభట్ల వద్ద 200 ఎకరాల్లో సమూహను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పార్క్‌లో 25 కంపెనీలు ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నాయి. రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 26 నుంచి 49 శాతానికి చేర్చడం, మేక్ ఇన్ ఇండియా విధానం, పెండింగు ప్రాజెక్టులకు అనుమతుల వంటి ప్రభుత్వ నిర్ణయాలతో పరిశ్రమ ఉన్నత శిఖరాలకు చేరుతుందని సమూహ డెరైక్టర్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ఎండీ డి.విద్యాసాగర్ తెలిపారు. ఏరోస్పేస్‌కు ప్రత్యేక పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకు రానుండడం హైదరాబాద్ కంపెనీలకు బూస్ట్‌నిస్తుందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆయనింకా ఏమన్నారంటే.. పెట్టుబడికి పీఈ కంపెనీలు.. తయారీ కంపెనీలకు రక్షణ, అంతరిక్ష రంగంలో వెల్లువలా వ్యాపార అవకాశాలున్నాయి. ప్రైవేటు ఈక్విటీ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడికి ముందుకొస్తున్నాయి. జనవరిలోగా సమూహ పార్కులో కంపెనీలు ప్లాంట్ల ఏర్పాటు పనులను ప్రారంభించనున్నాయి. 2016కల్లా ఈ కంపెనీలకు రూ.350 కోట్ల దాకా పెట్టుబడులు అవసరమవుతాయని అంచనా. ఈ అంశమై పీఈ కంపెనీలతో సమూహ చర్చలు జరుపుతోంది. తొలి దశలో రూ.25 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. ఆర్డర్లు పెరిగేకొద్దీ ఈ మొత్తం పెరుగుతుంది. రూ.100 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. స్టార్టప్‌లకు ఈ సెంటర్ వెన్నుదన్నుగా నిలుస్తుంది. అలాగే నిపుణులను తయారు చేసేందుకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో.. దేశంలో అంతర్జాతీయ స్థాయి సంస్థలతో పోటీపడే కంపెనీలు 500 వరకు ఉంటాయి. వీటిలో 15 దాకా హైదరాబాద్‌లో ఉన్నాయి. ఎఫ్‌డీఐలతో విదేశీ పరిజ్ఞానం బదిలీ అయి ఇక్కడి కంపెనీల ప్రమాణాలు మెరుగవుతాయి. వేలాది ఉద్యోగాలను సృష్టించొచ్చు. పన్ను ప్రయోజనాలు ఉంటే ఇతర రాష్ట్రాలతో పోటీపడొచ్చు. ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు కనీసం ఏడాదైనా ప్రాక్టికల్స్ అవసరం. ఎస్ఈసీకి మరిన్ని ఆర్డర్లు.. ఇండైజినైజేషన్ (దేశవాళీ) కార్యక్రమం ఎస్ఈసీకి కలిసి వచ్చింది. ప్రతిష్టాత్మక స్కార్పీన్ సబ్‌మెరైన్స్ (జలాంతర్గాములు) తయారీ కాంట్రాక్టును గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ మజ్‌గావ్‌ఢాక్ నుంచి ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్ కంపెనీ అనే దక్కించుకుంది. డీసీఎన్‌ఎస్‌కు 20 రకాల ప్రధాన విడిభాగాలు భారత్‌లో ఎస్ఈసీ మాత్రమే అందిస్తోంది. 2015కల్లా రూ.350 కోట్ల విలువైన డీసీఎన్ఎస్ నుంచి అందిన తొలి ఆర్డరును పూర్తి చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వజూపుతున్న రూ.50 వేల కోట్ల విలువైన ఆరు జలాంతర్గాముల ఆర్డరును తిరిగి మజ్‌గావ్‌ఢాక్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇదేగనక జరిగితే ఎస్ఈసీకి కలిసి వస్తుంది. -
ఐటీకి పర్యాటకం తోడు
సిటీలో మరో ఇంక్యుబేషన్ సెంటర్‌కు ప్రభుత్వం కసరత్తు మధురవాడ ఐటీ సెజ్‌ను పరిశీలించిన మంత్రి, కలెక్టర్, ఏపీఐఐసీ సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఐటీ రంగానికి విశాఖ మరిం త కీలకంగా మారబోతోంది. భారీ కొండలు, వాటిపై ఆధునిక ఐటీ కంపెనీలు, వాటి మధ్య నుంచి సముద్రాన్ని వీక్షించే వీలుగా పర్యాటకపరంగానూ కీలకంగా మార్చేం దుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తు తం నిర్మాణమవుతున్న ఇంక్యుబేషన్ కేంద్రానికి అదనంగా రెండో కేంద్రాన్ని భారీగా నిర్మించాలని భావిస్తున్నారు. కొండపై సరికొత్తగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని చేపట్టాలని, ఇందుకోసం మధురవాడ ఐటీ సెజ్‌లో ఖాళీ స్థలాల ను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ యువరాజ్, ఇతర అధికారులు ఆదివారం ఈ విషయమై చర్చలు జరిపారు. వస్తే ఐటీకి మేలే... నగరంలో 70 వరకు ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. మున్ముందు భారీ సంఖ్యలో కొత్తవి రానున్నాయి. కానీ కనీస సౌకర్యాలు లేవు. హైదరాబాద్‌లో ఐటీ సంస్థల కోసం ఇంక్యుబేషన్ సెంటర్లు, కన్వెన్షన్సెంటర్లు ఉన్నాయి. విశాఖలో ఇవి లేవు. ఈ నేపథ్యంలో ఐటీకి విశాఖ భవి ష్యత్తు రాజధానిగా మారుతుండడంతో ఇంక్యుబేషన్, కన్వెన్షన్ సెంటర్లను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మధురవాడ ఐటీ సెజ్‌లో రూ.23 కోట్లతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మిస్తున్నారు. ఇది చాలా చిన్నది. విదేశాల నుంచి వచ్చే ఐటీ కంపెనీలకు తక్షణమే కార్యకలాపాలు నిర్వహించేందుకు ఇది సరి పోదు. దీంతో రెండో కేంద్రాన్ని భారీ స్థాయిలో నిర్మిం చాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. మధురవాడ సెజ్ సందర్శన మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, అయ్యన్నపాత్రుడు, ఐటీ సలహాదారు సత్యనారాయణ, కలెక్టర్ యువరాజ్, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య ఆదివారం మధురవాడ సెజ్‌ను పరిశీలించారు. హిల్ నంబర్ 2లో నాన్‌ఐటీ ఎస్ఈజెడ్లో ఆరున్నర ఎకరాలు, హిల్ 3లో 30 ఎకరాలు అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. భవిష్యత్తు అవసరాల కోసం ఈ సెజ్‌లో ఎక్కడోచోట ఐటీ కంపెనీల సమావేశాల నిర్వహణకు కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో కలెక్టర్, ఐటీ సలహాదారు సత్యనారాయణ హిల్3లో విప్రోకు కేటాయించిన 10 ఎకరాలను మంత్రికి చూపించారు. ఈ స్థలాలు వినియోగంలో లేకపోవడంతో అక్కడ దీన్ని నిర్మించవచ్చని వివరించారు. పాత నిధులు సుమారు రూ.20 కోట్లు ఉండడంతో దీనికి సంబంధించి తదుపరి ఏర్పాట్లు చూడాలని మంత్రి వీరిని ఆదేశించారు. ఆ తర్వాత వీరంతా ఐబీఎంను సందర్శించారు. ఈ సంస్థకు గతంలో 26 ఎకరాలు కేటాయించగా, అందులో 3 ఎకరాల్లోనే కంపెనీ ఉండడంతో మిగిలిన భూములను మంత్రితోపాటు అధికారులు వెళ్లారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సింబయాసిస్ టెక్నాలజీ సీఈవో నరేష్‌కుమార్‌లు స్థానిక సమస్యలు వివరించారు. కొండపై ఐటీ కంపెనీలకు ఇంక్యుబేషన్ సెంటర్ లేదని చెప్పారు. ఈలోపు ఐటీ సలహాదారు సత్యనారాయణ జోక్యం చేసుకుని ఎండాడలో 20 ఎకరాల్లో దీన్ని నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. సముద్రం కనిపించేలా ఇంక్యుబేషన్ సెంటర్! కలెక్టర్, ఏపీఐఐసీ చైర్మన్, మంత్రి పల్లె మాట్లాడుతూ సముద్రతీరంతో అత్యద్భుతంగా కనిపిస్తోన్న ఈ ప్రాంతంలో ఇంక్యుబేషన్ నిర్మిస్తే పర్యాటకపరంగానూ మంచి ఆదాయం పెంచుకునేందుకు వీలుం టుందని చెప్పారు. దీంతోపాటే హోటళ్లు నిర్మిస్తే పర్యాటకులకు వీనులవిందుగా ఉంటుందన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ కల్పించుకుని ఐబీఎంకు కేటాయించిన భూముల్లో కార్యకలాపాలు లేనందున 23 ఎకరాల వరకు వెనక్కు తీసుకుంటున్నట్టు ఏపీఐఐసీ అధికారులు వివరించారు. దీంతో ఇక్కడే దీన్ని నిర్మిం చడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని ఆదేశిం చారు. స్థల లభ్యత ఎక్కువగా ఉన్న కారణంగా పది లక్షల అడుగుల్లో దీన్ని నిర్మిస్తే ప్రయోజనకరంగా ఉం టుందని భావించారు. ఇందుకు రూ.800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పీపీపీ పద్ధతి లో అందుబాటులోకి తెచ్చే విషయంపై కొంతసేపు చర్చించారు.