వరంగల్ లో స్పార్క్10 ఇంక్యుబేషన్ సెంటర్!
♦ ఎంపిక చేసిన 10 స్టార్టప్‌లకు 13 వారాల శిక్షణ కూడా
♦ స్పార్క్ 10 ఫౌండర్ అటల్ మాలవీయ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సరికొత్త ఆలోచన.. వ్యాపార ప్రణాళికలనేవి మెట్రో నగరాలకే పరిమితం కావు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్ణణాల్లోనూ ఉంటాయి. అందుకే మెట్రో నగరాల్లోని స్టార్టప్స్‌తో పాటూ పట్టణాల్లోని స్టార్టప్‌లను, స్థానిక ఆలోచనలను ప్రోత్సహించడం చాలా అవసరం’’ అని స్పార్క్-10 ఫౌండర్ అటల్ మాలవీయ చెప్పారు. అందుకే హైదరాబాద్ లాగే వరంగల్‌లోనూ స్పార్క్ 10 యాక్సలరేటర్ ప్రోగ్రాంతో పాటు స్థానికంగా ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు స్థానిక సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులతో చర్చలు కూడా జరుపుతున్నామన్నారు.
శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూరోపియన్ యాక్సలరేటర్, ఇగ్నైట్ 100 కో-ఫౌండర్ అండ్ సీఈఓ పాల్ స్మిత్, స్పార్క్ 10 సభ్యుడు వివేక్ రెడ్డిలతో కలసి మాలవీయ మాట్లాడారు. ‘‘స్పార్క్ 10 యాక్సలరేటర్ ప్రోగ్రాంకు 500కు పైగా స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో నుంచి ఉత్తమమైన 10 కంపెనీలను ఎంపిక చేశాం. ఎంపికైన 10 కంపెనీల వివరాలు స్పార్క్-10 ఆరిజిన్స్ పేరిట శనివారం హైటెక్స్‌లోని సైబర్ సిటీ కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో వెల్లడిస్తాం. వీటికి వచ్చే నెల నుంచి 13 వారాల శిక్షణ కార్యక్రమాలుంటాయి. ఇందులో రూ.10 లక్షలు నగదు రూపంలో ప్రోత్సాహం ఇవ్వటంతో పాటూ మరో రూ.10 లక్షలు బెనిఫిట్ రూపంలో అందిస్తాం. శిక్షణానంతరం సంబంధిత స్టార్టప్స్‌లో 8 శాతం ఈక్విటీ రూపంలో తీసుకుంటాం’’ అని అటల్ వివరించారు. శిక్షణలో భాగంగా అంతర్జాతీయ మెంటర్స్, వర్క్‌షాప్‌లుంటాయి. దేశీయ స్టార్టప్స్‌లో రెండేళ్ల వ్యవధిలో 100 మిలియన్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.