
దేశంలో రానున్న పదేళ్లలో 10 లక్షల స్టార్టప్‌లు పుట్టుకొస్తాయని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని అంచనా వేశారు. భారతదేశ వ్యవస్థాపక భవిష్యత్తు(entrepreneurial future) ప్రతిష్టాత్మకంగా ఉంటుందని చెప్పారు. ‘ఆర్కామ్ వెంచర్స్ వార్షిక సమావేశం 2025’లో నీలేకని మాట్లాడారు. రానున్న రోజుల్లో స్టార్టప్‌లు సాంకేతికత, మూలధనం, ఆంత్రపెన్యూర్‌షిప్, ఫార్మలైజేషన్ వంటి అంశాలతో వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో 1,50,000 స్టార్టప్‌లు ఉన్నాయని, ఈ రంగంలో 20 శాతం వార్షిక వృద్ధి రేటు ఉంటుందని నీలేకని అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న స్టార్టప్‌లు భవిష్యత్తులో మరిన్ని స్టార్టప్‌ల సృష్టికి ఊతమిచ్చేలా ‘బైనరీ విచ్ఛిత్తి(ఒకటి రెండుగా మారడం)’ని పోలి ఉంటాయని చెప్పారు. అందుకు ఉదాహరణగా ఫ్లిప్‌కార్ట్‌ను చెప్పుకొచ్చారు. ఫ్లిప్‌కార్ట్ వంటి విజయవంతమైన కంపెనీల నుంచి ఉద్యోగులు తమ సొంత సంస్థలను స్థాపించినట్లు గుర్తు చేశారు.
భాషలు, మాండలికాలకు ఏఐ నమూనాలు
ఈ వృద్ధికి దోహదపడటంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాత్ర కీలకంగా మారిందని నీలేకని నొక్కి చెప్పారు. ఆధార్, యూసీఐ వంటి కార్యక్రమాలు ఇప్పటికే బలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది వేశాయని తెలిపారు. భారతీయ భాషలు, ప్రాంతీయ మాండలికాలకు అనుగుణంగా ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నమూనాల అవసరాన్ని ఉద్ఘాటించారు. ఇవి సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో మరిన్ని అవకాశాలు సృష్టిస్తాయని అంచనా వేశారు.
ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ కోఫౌండర్ కొత్త కంపెనీ ప్రారంభం
అత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్‌గా భారత్
2035 నాటికి భారత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగే ఐపీఓ మార్కెట్‌గా అవతరిస్తుందని, రెండో అతిపెద్ద ఐపీవో మార్కెట్‌గా భారత్ ప్రస్తుత స్థానాన్ని అధిగమిస్తుందని నీలేకని తెలిపారు. ఈ మార్పు భవిష్యత్తులో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. ఇది ఉద్యోగాల సృష్టిని వేగవంతం చేస్తుందని, సమీప భవిష్యత్తులో ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే దేశం లక్ష్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment