Venture
-
బ్రిటిషర్లు కొట్టిన దెబ్బ! ‘టాటా’ సాహసోపేత నిర్ణయం..
భారతీయ పరిశ్రమ పితామహుడిగా భావించే జమ్షెడ్జీ టాటా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక పరిశ్రమలు, వ్యాపారాల ద్వారా భారతదేశ వ్యాపార ప్రపంచాన్ని మార్చిన జమ్షెడ్జీ టాటా బ్రిటిష్ పాలకులు కొట్టిన దెబ్బతో కఠిన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్‌లో తొలి సంస్థ మూతపడింది...1890లలో టాటా షిప్పింగ్ లైన్‌ను మూసివేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో వివరించారు. క్లిష్ట సమయంలో నష్టాలను తగ్గించుకోవడానికి, మరింత ఆచరణీయమైన వెంచర్లపై దృష్టి పెట్టడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో జమ్షెడ్జీ టాటా చతురతను ఈ వ్యూహాత్మక చర్య తెలియజేస్తుంది. టాటా గ్రూప్‌నకు చెందిన వెటరన్లు ఆర్ గోపాలకృష్ణన్, హరీష్ భట్ రాసిన "జమ్సెడ్జీ టాటా - పవర్ఫుల్ లర్నింగ్స్ ఫర్ కార్పొరేట్ సక్సెస్" అనే పుస్తకంలో అప్పటి పరిస్థితులను వివరించారు.అది 1880, 90ల కాలం. భారతదేశం నుంచి షిప్పింగ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన P.&O సంస్థదే ఆధిపత్యం. ఆ గుత్తాధిపత్యాన్ని సవాలు చేస్తూ జమ్షెడ్జీ టాటా 'టాటా లైన్'ను ప్రారంభించారు. టాటా పేరును కలిగి ఉన్న మొదటి వ్యాపారం ఇదే. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం మద్దతుతో P.&O భారతీయ వ్యాపారులకు అధిక సరుకు రవాణా రేట్లు విధించింది. బ్రిటిష్, యూదు సంస్థలకు మాత్రం ఎక్కువ రాయితీలను అందించింది.టాటా లైన్ ప్రస్థానం..తన వస్త్ర వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని అనుభవించిన జమ్షెడ్జీ టాటా జపాన్‌లోని అతిపెద్ద షిప్పింగ్ లైన్ అయిన నిప్పాన్ యుసెన్ కైషా (NYK)తో కలిసి పనిచేయడానికి జపాన్‌కు వెళ్లారు. జమ్షెడ్జీ టాటా సమానమైన రిస్క్ తీసుకుని, నౌకలను స్వయంగా నిర్వహించినట్లయితేనే తమతో భాగస్వామ్యానికి ఎన్‌వైకే అంగీకరించింది. దీంతో టాటా 'అన్నీ బారో' అనే ఆంగ్ల నౌకను నెలకు 1,050 పౌండ్లకు అద్దెకు తీసుకున్నారు. ఇది 'టాటా లైన్'లో తొలి నౌక.తాను ప్రారంభించిన ఈ వ్యాపారం మొత్తం భారతీయ వస్త్ర పరిశ్రమకు షిప్పింగ్ రేట్లను తగ్గిస్తుందని, P.&O. గుత్తాధిపత్యాన్ని ఛేదించి టన్ను సరుకు రవాణాకు రూ. 19 నుంచి రూ. 12 వరకు తగ్గుతుందని జమ్సెడ్జీ విశ్వసించారు. అనతికాలంలోనే రెండవ ఓడ 'లిండిస్ఫార్న్'ను అద్దెకు తీసుకున్నారు. 1894 అక్టోబరులో ది ట్రిబ్యూన్ పత్రిక జమ్సెడ్జీ ప్రయత్నాలను ప్రశంసించింది.టాటా లైన్ వ్యాపారాన్ని దెబ్బకొట్టేందుకు P.&O సంస్థ ఎత్తుగడ వేసింది. టాటా లైన్, ఎన్‌వైకే షిప్‌లను ఉపయోగించని వ్యాపారులకు షిప్పింగ్ చార్జీని టన్నుకు 1.8 రూపాయలకు తగ్గిస్తామని ప్రకటించింది. దీంతోపాటు ఇలా అంగీకరించిన కొంతమంది వ్యాపారులకు ఉచితంగా రవాణాను కూడా అందించింది. 'లిండిస్ఫార్న్' నౌక పత్తి రవాణాకు పనికిరాదని పుకార్లు వ్యాప్తి చేసింది.క్రమంగా P.&O ప్రభావానికి భయపడి భారతీయ వ్యాపారులు టాటా లైన్‌తో వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నారు. టాటా లైన్‌ను మూసివేస్తే భవిష్యత్తులో రేట్లు పెరుగుతాయని హెచ్చరించినప్పటికీ వారు అర్థం చేసుకోలేదు. ఫలితంగా జమ్షెడ్జీ టాటా నష్టాలను చవిచూశారు. ప్రతి నెలా రూ. వేలల్లో నష్టాలు.. ధరల పోటీ ముగిసే సమయానికి టాటా లైన్లో రూ. లక్షకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది.పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత టాటా లైన్‌కు స్థిరమైన మార్గం లేదని నిర్ధారించుకున్న జామ్‌సెడ్జీ విజయవంతమైన వ్యాపారవేత్తగా తన ప్రతిష్టను పణంగా పెట్టి వ్యాపారాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు. లీజుకు తీసుకున్న ఓడలను ఇంగ్లండ్‌కు తిరిగి పంపించి టాటా లైన్‌ను ముగించేశారు. అయితే ఎంప్రెస్ మిల్స్, స్వదేశీ మిల్స్, అహ్మదాబాద్ అడ్వాన్స్ మిల్స్, టాటా స్టీల్ టాటా పవర్‌తో సహా జమ్షెడ్జీ టాటా స్థాపించిన అనే వ్యాపారాలు విజయవంతమయ్యాయి. -
నాల్గో రోజూ మోకిలలో అదే జోరు.. గజం రూ.66 వేలు
హైదరాబాద్: మోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గో రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో లేఅవుట్లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70 వేల నుంచి రూ.1,05,000 వరకు ధర పలికిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్లో ఫేజ్–1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్–2లో 300 ప్లాట్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టీ.సీ. వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా, ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్లు, మూడో రోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ప్లాట్ల కొనుగోలుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు. -
వైఎస్సార్ జిల్లా: బీటెక్ రవి దౌర్జన్యకాండ
సాక్షి, వైఎస్సార్: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి దౌర్జన్యకాండకు తెగబడ్డాడు. ఆదివారం పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేటలో ఓ వెంచర్లో ఆయన తన అనుచరులతో హల్ చల్ చేశాడు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆ వెంచర్ ఫెన్సింగ్‌ను తన అనుచరులతో కలిసి తొలగించి.. అక్కడ దున్నించాడు బీటెక్ రవి. అయితే.. వెంచర్ ఓనర్ మాత్రం తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అయినా రవి తన అనుచరులతో దౌర్జన్యానికి దిగారని చెబుతున్నారు. ‘‘అనుచరులతో మాపై ఆయన దౌర్జన్యం చేయడం దారుణం. బీటెక్ రవి తన దగ్గర ఉన్న ఆధారాలు చూపాలి’’ అని వెంచర్ ఓనర్ కోరుతున్నారు. అంతేకాదు అడ్డొచ్చిన స్థానికులను మారణాయుధాలతో బీటెక్ రవి బెదిరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. స్థానికంగా బీటెక్ రవి ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఈ క్రమంలో వ్యాపారులు హడలిపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత కథనం: బీటెక్ రవి నేతృత్వంలో మారణాయుధాలతో.. -
కోకాపేట్ తరహాలో.. మరో భారీ వెంచర్‌కు హెచ్ఎండీఏ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: మరో భారీ వెంచర్‌కు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో, ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి దగ్గరలో రాజేంద్రనగర్ బుద్వేల్ వద్ద సుమారు 200 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. మధ్యతగతి, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ రెండు రోజుల క్రితం టెండర్లను సైతం ఆహ్వానించింది. 200 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలతో పాటు విల్లాల కోసం 2 నుంచి 3 ఎకరాల ప్లాట్లు, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని 500 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల ప్లాట్ల చొప్పున ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు కార్యాచరణ సిద్థం చేశారు. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ వరకు నగరానికి దక్షిణం వైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న దృష్ట్యా ఈ లేఅవుట్‌కు భారీ డిమాండ్ ఉండే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లేఅవుట్ ఔటర్ రింగురోడ్డుకు దగ్గర్లో ఉండడం, రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించనున్న ఎయిర్‌పోర్టు మెట్రో మార్గానికి చేరువలో ఉండడంతో బుద్వేల్ లేఅవుట్ హాట్‌కేక్‌లా అమ్ముడవుతుందని అధికారులు భావిస్తున్నారు. కోకాపేట్ తరహాలో.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఎక్కడ లే అవుట్లను అభివృద్ధి చేసినా కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. హెచ్ఎండీఏ స్థలాల్లో ఎలాంటి వివాదాలు లేకపోవడం, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి ఇవ్వడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటీవల మేడ్చల్, ఘట్కేసర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో చేపట్టిన హెచ్ఎండీఏ స్థలాల విక్రయాలకు కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. బాచుపల్లిలో చదరపు గజం అత్యధికంగా రూ.68 వేల వరకు డిమాండ్ రావడం గమనార్హం. గతంలో ఉప్పల్‌లోనూ బిల్డర్లు, రియల్టర్లు, వ్యాపారవర్గాలు, మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. నగర శివారు ప్రాంతాల్లో, ఔటర్ రింగ్ రోడ్‌కు అందుబాటులో అభివృద్ధి చేస్తున్న వెంచర్ల పట్ల నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సుమారు 500 ఎకరాల్లో కోకాపేట్లో అభివృద్ధి చేస్తోన్న నియో పోలీస్ లేఅవుట్ కు సైతం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. నియో పోలీస్ లే అవుట్ అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. కోకోపేట తరువాత బుద్వేల్‌లో చేపట్టనున్న ప్రాజెక్టు అతిపెద్ద లేఅవుట్ అవుతుందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 200 ఎకరాల్లో దీన్ని చేపట్టి విస్తరిస్తారు. అక్కడ ప్రభుత్వభూమి అందుబాటులో ఉండడం వల్ల 350 ఎకరాల వరకు కూడా విస్తరించేందుకు అవకాశం ఉంది. కాగా.. జంట జలాశయాలకు సమీపంలో ఉన్న బుద్వేల్ లే అవుట్‌కు అన్నీ అనుకూలమైన అంశాలే ఉన్నాయి. చదవండి: సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే.. శ్రీచైతన్యకు షాక్! -
మహబూబ్‌నగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు .. వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్!
సాక్షి, హైదరాబాద్: వెంచర్లు చేసేందుకు ఉపయోగపడే అసైన్డ్ భూములను సేకరించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు వేసినట్టే వేసి వెనక్కు తగ్గింది. గతంలో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల పక్కన, రియల్ బూమ్ ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. ఈ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్, భూత్పూర్, బాలానగర్ మండలాల్లో ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములను సర్వే చేయాలని, అసైనీలతో మాట్లాడి ఎకరానికి 400 గజాలను వారికి ఇచ్చేవిధంగా ఒప్పించాలని ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గత వారం రోజులుగా ఆయా మండలాల అధికారులు ఈ సర్వేలో నిమగ్నమయ్యారు. జాతీయ రహదారుల వెంట ఉన్న భూములను గుర్తించి అసైనీలతో మాట్లాడి ఆయా భూముల్లో ప్రభుత్వ బోర్డులు పెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు అంగీకరించగా, మరికొన్ని చోట్ల రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎకరం భూమి తీసుకుని అందులో 10 శాతం ఇస్తామంటే ఎలా కుదురుతుందని, కనీసం 50:50, 60:40 లాంటి ప్రతిపాదనలతో వస్తే ఆలోచిస్తామని తేల్చిచెప్పారు. జడ్చర్ల లాంటి ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు కూడా దిగాయి. దీంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మళ్లీ మౌఖికంగానే ఆదేశాలు జారీ కావడం గమనార్హం. చదవండి: సీఎస్ సోమేశ్‌ను ఏపీకి కేటాయించండి: కేంద్రం మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ.. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములున్నాయి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములూ పెద్దఎత్తున ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ భూముల వల్ల అసైనీలకూ ఉపయోగం లేనందున వాటిని స్వాధీనం చేసుకోవాలని భావించింది. స్వాధీనం చేసుకున్న భూములను ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడిన అధికారులు ఈ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు చేయాలని, హెచ్ఎండీఏకి అప్పగించి భూములను అభివృద్ధి చేసి విక్రయించాలని, అసైన్డ్ భూములను ఇచ్చినందుకు అసైనీలకు కొంత వాటా ఇవ్వాలని నిర్ణయించారు. అందులోభాగంగానే ఎకరానికి 400 గజాల ప్రతిపాదనతో పాలమూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. అయితే, ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి విరమించుకున్నప్పటికీ ప్రభుత్వం మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. పేదల అసైన్డ్ భూములను లాక్కోవద్దు: తమ్మినేని సాక్షి,హైదరాబాద్: పేదలకిచ్చిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రభుత్వం చట్టాలను అమలు చేయకపోగా వాటిని ఉల్లంఘించడం అన్యాయమని గురువారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అసైన్డ్ భూములను లాక్కోవడం సరికాదన్నారు. చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు పట్టణాలకు దగ్గరగా అసైన్డ్ భూముల విలువ కొన్ని చోట్ల రూ.కోటి పైగా పలుకుతోందని అలాంటి భూముల నుంచి పేద అసైన్డ్‌దారులను బయటకు గెంటివేసి ప్రభుత్వం జెండాలు పాతి శాంతి–భద్రతల సమస్యను సృష్టించడం దారుణమన్నారు. ప్రభుత్వం తన తప్పుడు విధానాన్ని విరమించుకుని అసైన్డ్ భూములున్న పేదవారికి రక్షణ కల్పించాలని కోరారు. -
వెంచర్ నిర్వాహకులపై టీడీపీ నేతల దాడి
సాక్షి, కంతేరు(తాడికొండ): ప్రైవేటు వెంచర్ నిర్వాహకులపై టీడీపీ నాయకులు దాడి చేసిన ఘటన తాడికొండ మండలం కంతేరు శివారు కండ్రిక చెరువు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రైవేటు వెంచర్‌కు నల్లమట్టిని తరలించేందుకు కండ్రిక చెరువులో ప్రొక్లెయిన్, ఆరు ట్రాక్టర్లు చేరుకొని శనివారం రాత్రి తవ్వకాలు ప్రారంభించాయి. విషయం తెలుసుకున్న కంతేరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త తోకల నాగభూషణంతో పాటు అతని అనుచరులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. వాహనాలను అడ్డగించి ఆరు ట్రాక్టర్లతో పాటు డ్రైవర్లు, వెంచర్ సూపర్వైజర్ను పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లి నిర్భందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులే మట్టిని తరలించారని చెప్పాలంటూ ఫోన్లలో వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తూ వికృతంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంపై 100 నంబరుకు ఫోన్ వెళ్లడంతో స్పందించిన పోలీసులు వెంటనే కంతేరు గ్రామానికి చేరుకొని నిర్బంధంలో ఉన్న వ్యక్తులను విడిపించి ఠాణాకు తీసుకొచ్చారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఆరు ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ అక్రమంగా నిర్బంధించి ట్రాక్టరు డ్రైవర్లు, వెంచర్ సూపర్ వైజర్‌ను కొట్టిన ఘటనలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సర్పంచ్ భర్త తోకల నాగభూషణం, కర్రి పాల్‌బాబు, తిరుమలరావు, బండారు కోటేశ్వరరావు, జెట్టి తిరుమలరావు మరి కొంతమందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సీహెచ్ రాజశేఖర్ తెలిపారు. వైఎస్సార్ సీపీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు తాడికొండ: కంతేరు గ్రామంలో జరిగిన మైనింగ్ వ్యవహారంలో ట్రాక్టరు డ్రైవర్లు, ప్రైవేటు వెంచర్ సూపర్ వైజర్‌ను టీడీపీ నాయకులు నిర్బంధించి వైఎస్సార్ సీపీ నాయకులే మట్టి తవ్వకాలు చేశారని చెప్పాలంటూ ఒత్తిడి తీసుకొచ్చిన వీడియోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ఘటనపై వైఎస్సార్ సీపీ తాడికొండ మండల అధ్యక్షుడు తియ్యగూర బ్రహ్మారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఎస్ఐ సీహెచ్.రాజశేఖర్‌కు చూపించారు. తనకు, పార్టీకి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేసిన కంతేరు గ్రామ టీడీపీ నాయకులు జెట్టి తిరుమలరావు, బండారు కోటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
అక్రమ వెంచర్‌పై కొరడా
సాక్షి, కొడంగల్: పట్టణంలోని లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో అనుమతి లేకుండా వెలిసిన వెంచర్‌పై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపించారు. ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. కొడంగల్ మున్సిపాలిటీగా మారిన తర్వా త పట్టణంలోని పలు చోట్ల అక్రమ వెంచర్లు వెలిశాయి.ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇర్షాద్, కార్య నిర్వాహక అధికారి పద్మ, మున్సిపల్ సిబ్బంది మంగళవారం వీటిని పరిశీలించారు. లాహోటీ కాలనీ నుంచి కొండారెడ్డిపల్లికి వెళ్లే దారిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి శిఖం భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖం భూమిలో ప్లాట్లు చేసి విక్రయించాడు. పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు వీటిని కొనుగోలు చేశారు. కొండారెడ్డిపల్లికి వెళ్లే దారి కావడంతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇంటికి సమీపంలో ఉండటంతో కొడంగల్ వ్యాపారులు ప్లాట్లను కొనుగోలు చేశారు. దీంతో విపరీతంగా డిమాండ్ పెరిగింది. కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. ఈ ప్లాట్లకు మున్సిపల్ అనుమతి లేదు. టౌన్ అండ్ కంట్రీ పర్మిషన్ లేదు. లే అవుట్ లేదు. శిఖం భూమిని కొనుగోలు చేసి రెవెన్యూ అధికారుల నుంచి నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్) పర్మిషన్ తీసుకున్నారు. దీనిపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది వెంచర్ వద్దకు వెళ్లి పరిశీలించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోని హద్దు రాళ్లను తొలగించారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకూడదని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. అన్ని అనుమతులు తీసు కొని లే అవుట్ చేసిన తర్వాతనే అనుమతులు ఇ స్తామని టీపీఓ ఇర్షాద్, ఈఓ పద్మ తెలిపారు. పట్టణంలో అక్రమంగా వెలిసిన వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. -
వెంచర్లో పేలుళ్లు..ముగ్గురిపై కేసు నమోదు
శంషాబాద్: రాళ్లగూడ సమీపంలోని ఔటర్ సర్వీసు రహదారిలోని ఓ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ (పేలుళ్లు) చేపడుతుండడంతో బుధవారం మధ్యా హ్నం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. పేలుళ్లకు పాల్పడుతున్న వెంకటేశ్వరావు(38), జంగయ్య (39)లను అరెస్ట్ చేసి వారి నుంచి 25 డిటోనేటర్లు, 16 జిలెటిన్ స్టిక్స్, కంప్రెషర్, విద్యుత్‌వైర్లు, కంప్రెషర్ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వెంచర్ యజమానిపై కూడా కేసు నమోదు చేశారు. నిందితులను ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నందిగామలో అభిరామన్ వెంచర్
సాక్షి, హైదరాబాద్ : స్థిరాస్తి రంగంలో దశాబ్దన్నరకు పైగా అనుభవమున్న అభిరామన్ డెవలపర్స్ హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిలో మరో బడా ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనుంది. అపురూపాస్ డ్యూక్స్ అర్బన్ విలేజ్ పేరిట నందిగామలో 59 ఎకరాలను అభివృద్ధి చేయనుంది. హెచ్ఎండీఏ అనుమతి పొందిన ఈ వెంచర్‌ను ఆదివారం ప్రారంభించనున్నట్లు కంపెనీ ఎండీ టి. మహేందర్ తెలిపారు. ఇందులో 200 గజాల నుంచి 1,067 గజాల వరకు ప్లాట్లుంటాయి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫ్లవర్ గార్డెన్, జాగింగ్ ట్రాక్, మల్టీపర్పస్ కోర్ట్, ల్యాడ్స్కేపింగ్, బాస్కెట్‌బాల్ కోర్ట్స్, క్లబ్ హౌస్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. 40–80 ఫీట్ల రోడ్లు, కట్టుదిట్టమైన భద్రత, భూగర్భ విద్యుత్, మురుగు నీటి వ్యవస్థ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. జాన్సన్ అండ్ జాన్సన్, ప్రొక్టర్ అండ్ గ్యాంబల్ (పీఅండ్‌జీ) వంటి బహుళ జాతి కంపెనీలకు కూతవేటు దూరంలో ఉంది ఈ ప్రాజెక్ట్. ఇక్కడి నుంచి 2 నిమిషాల్లో కొత్తూరుకు, 10 నిమిషాల ప్రయాణ వ్యవధిలో షాద్‌నగర్ ఎంఎంటీఎస్‌కు, 15 నిమిషాల్లో ఓఆర్ఆర్కు చేరుకోవచ్చు. 24 కి.మీ. దూరంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. -
ఎన్ఓసీ కావాలా..? రూ.2 కోట్లు ఇవ్వాలి!
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి సర్పంచ్ భర్త బల్ల చంద్రశేఖర్ ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. తనకు అడిగినంతా డబ్బు ఇవ్వకపోతే ఎన్ఓసీ రాదని, ఇక్కడ ప్లాట్లు విక్రయించలేవని బెదిరింపులకు దిగాడు. డబ్బులు ఇవ్వకపోతే ప్లాట్ల విక్రయాన్ని అడ్డుకుంటానని హెచ్చరించాడు. తనను అధికార పార్టీ సర్పంచ్ భర్త డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని ఇన్క్రెడిబుల్ ఇండియా, టుమారో వరల్డ్ వెంచర్ యజమాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన భువనగిరి రూరల్ పోలీస్‌లు చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేశారు. రాయగిరి శివారులో రెండేళ్ల క్రితం 300 ఎకరాల్లో ఇన్క్రెడిబుల్ ఇండియా, టుమారో వరల్డ్ పేరుతో వెంచర్ చేసి ఓపెన్ ప్లాట్లు విక్రయిస్తున్నారు. రాయగిరి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 758, 759, 761, 763, 765, 766, 767, 768, 769, 770, 771, 772, 773,774, 775, 776, 795, 796, 797, 799, 800, 801లో ఈ వెంచర్ అభివృద్ధి చేశారు. వెంచర్‌కు హెచ్ఎండీఏలో అనుమతులు పొందడానికి గ్రామపంచాయతీ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ) అవసరం ఉంది. ఇందుకోసం వెంచర్ యజమాని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే.. ఎన్ఓసీ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలంటూ సర్పంచ్ భర్త.. వెంచర్ యజమాని విజయ్‌కుమార్‌తో బేరం పెట్టాడు. 3 మూడు ఆప్షన్లను ఇచ్చాడు. వెంచర్‌కు అనుమతి ఇవ్వాలంటే తనకు రూ.ఒక కోటి, గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.ఒక కోటితోపాటు 11 మంది వార్డు సభ్యులకు వెంచర్లో 11 ఓపెన్‌ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టాడు. అయితే తాను అంత ఇచ్చుకోలేనని తగ్గించాలని విజయ్ కోరాడు. ఈనెల 19న చంద్రశేఖర్‌తోపాటు, మరికొందరు వార్డు సభ్యులు వెంచర్ వద్దకు వెళ్లి అక్రమంగా వెంచర్ చేస్తున్నావని గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో గొడవ దృశ్యాలు నమోదయ్యాయి. వెంచర్ యాజమాని విజయ్‌కుమార్‌తో చంద్రశేఖర్ నడిపిన బేరసారాలు ఫోన్లో రికార్డు చేశారు. వీటన్నింటికి సంబంధించిన ఆధారాలతో విజయ్‌కుమార్ ఈనెల 22న కలెక్టర్‌తోపాటు, డీసీపీ, ఇతర అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై సర్పంచ్ భర్త చంద్రశేఖర్‌ను వివరణ కోసం ప్రయత్నించగా ఆయన సెల్‌ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. చంద్రశేఖర్‌పై కేసు నమోదు వెంచర్‌కు అనుమతి కోసం డబ్బులు డిమాండ్ చేసిన భువనగిరి మండలం రాయగిరి సర్పంచ్ భర్త బల్ల చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు భువనగిరి రూరల్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వెంచర్ అనుమతికి ఇవ్వాల్సిన ఎన్ఓసీ కోసం గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకోగా అనుమతి ఇవ్వకుండా డబ్బులు అడిగాడని వెంచర్ యజమాని విజయకుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆదివారం వెంచర్ వద్దకు వెళ్లి చంద్రశేఖర్, మరికొంత మంది వెంచర్ కార్యాలయంలోని కుర్చీలను పగులగొట్టి దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
ఒకే ఏరియా.. ఆరు వెంచర్లు!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఏ డెవలపరైనా వెంచర్‌ను ప్రారంభించే ముందు ఆయా ప్రాంతంలో అమ్మకాలెలా ఉంటాయి? భవిష్యత్తు అభివృద్ధి ఉంటుం దా? కొనుగోలుదారుల పెట్టుబడికి లాభం చేకూరుతుందా? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఉన్నా సరే ఒకే ఏరియాలో ఒకట్రెండు వెంచర్లను ప్రారంభించేందుకే సంశయించే ఈరోజుల్లో ఒకేసారి ఆరు వెంచర్లు.. అది కూడా ఏకకాలంలో ప్రారంభించింది సుఖీభవ ప్రాపర్టీస్ ప్రై.లి. ‘‘సరిగ్గా ఏడాది క్రితం రాంపల్లిలోని తారక్ ఎన్‌క్లేవ్‌లో గజం రూ. 6,750 చొప్పున విక్రయించాం. ఇప్పుడక్కడ గజం రూ.10 వేలకు పైనే పలుకుతుంది. ఇది చాలదూ మా వెంచర్లు కొనుగోలుదారులకు లాభాన్ని చేకూర్చేవే అనేందుకంటున్నారు సుఖీభవ ప్రాపర్టీస్ ప్రై.లి. సీఎండీ గురురాజ్. ♦ రాంపల్లిలో 15 ఎకరాల్లో సిలికాన్ మెడల్స్ అభివృద్ధి చేస్తున్నాం. గజం రూ.8 వేలు. 133-500 గజాల మధ్య ప్లాట్లుంటాయి. మొత్తం 275 ప్లాట్లు. అభివృద్ధి పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. కొనుగోలుదారులు కోరితే ఆయా స్థలంలో ఇంటి నిర్మాణం కూడా చేసిస్తాం. చ.అ. రూ.1,300. ♦ అనంతారంలో 14 ఎకరాల్లో హైవే కౌంటి వెంచర్‌ను చేస్తున్నాం. గజం రూ.4,500. వంద శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. 180-400 గజాల మధ్య మొత్తం 210 ప్లాట్లొస్తాయి. ఈ వెంచర్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. ♦ భువనగిరి టౌన్లో 14 ఎకరాల్లో రాక్పోర్ట్ కాలనీని అభివృద్ధి చేస్తున్నాం. గజం రూ.4,999. మొత్తం 250 ప్లాట్లుంటాయి. 75 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ♦ కీసరలో 200 ఎకరాల్లో మామిడి ఆర్చిడ్స్ ఫాంల్యాడ్ వెంచర్‌ను చేస్తున్నాం. 5, 10, 15 గుంటల చొప్పున విక్రయిస్తాం. 5 గుంటలకు రూ.10.27 లక్షలు. ఫామ్‌లో 50 శాతం మామిడి చెట్లు, మిగతా స్థలంలో సీజన్ ఫ్రూట్స్ పండిస్తాం. మూడేళ్ల వరకు మొక్కల పెంపకం కంపెనీదే. ఈ వెంచర్లో రిసార్ట్ కూడా ఉంటుంది. లైఫ్ టైం మెంబర్షిప్ ఉచితం. ♦ రాయగిరి దగ్గర కూనురులో వనమాలి టౌన్‌షిప్‌ను చేస్తున్నాం. మొత్తం 150 ఎకరాలు. తొలి దశలో 60 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. గజం రూ.3,150. హైవే ఫేసింగ్ కమర్షియల్ అయితే గజం రూ.4,050. మొత్తం 1,100 ప్లాట్లు. 133-500 గజాల మధ్య ప్లాట్ సైజులుంటాయి. వెంచర్లో 80 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. స్విమ్మింగ్‌పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇండోర్.ఔట్‌డోర్ గేమ్స్, జాగింగ్, మెడిటేషన్ వంటి వసతులుంటాయి. -
ఇక హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల తయారీ
ఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ విమాన రంగ సంస్థ బోయింగ్, భారతీయ సంస్థ టాటాతో కలిసి జాయింట్ వెంచర్‌ను ప్రారంభించబోతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ, విమానయాన రంగంలో వాడే AH-64 రకానికి చెందిన అపాచి హెలికాఫ్టర్లను తయారు చేయనున్నారు. అది కూడా హైదరాబాద్‌లో తయారు చేస్తారట. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. విమానయాన రంగంలో భవిష్యత్తులో టాటాతో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేపట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బోయింగ్ ప్రకటించింది. ఎయిర్ క్రాఫ్ట్‌ల విభాగంలో కొత్త తరహాకు చెందిన అపాచీతో పాటు చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాఫ్టర్లను బోయింగ్ నుంచి కొనుగోలు చేయాలని భారత్ ఇటీవల నిర్ణయించింది. టాటాతో హెలికాఫ్టర్ ల తయారీ ఒప్పందం ద్వారా ఇండియాకు పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుందని బోయింగ్ ఇండియా చైర్మన్ ప్రత్యూష్ కుమార్ అన్నారు. టాటాతో చేపడుతున్న ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఈ ఒప్పందం పెద్ద వార్త అని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా అపాచీ హెలికాఫ్టర్లు హైదరాబాద్‌లో తయారుకానున్నాయని ఆయన వెల్లడించారు. Another big news for Telangana. Boeing & Tata Advanced System JV to manufacture Apache helicopters soon from Hyderabad #HappeningHyderabad — K Taraka Rama Rao (@KTRTRS) November 9, 2015 -
ప్లాట్ అవుతారు.. జాగ్రత్తా!
సార్.. మా వెంచర్‌కు అన్ని రకాల పర్మిషన్లున్నాయి. మీరు ఒక్కసారి చూడండి.. అంటూ వెంచర్ దగ్గరకు తీసుకెళ్తాడు ఏజెంట్. ఇది కార్నర్ ప్లాట్.. ఈస్ట్ప్లేస్. నిన్ననే ఇద్దరు, ముగ్గురు చూసి వెళ్లారు. మీరు సరే అంటే వెంటనే బుక్ చేస్తా. ఇలా ఆయన చెప్పే మాటలకు మనం వెంటనే ప్లాట్ అయిపోతాము. ఇంతకు ఈ భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించం. పంచాయతీ, మునిసిపల్ నిబంధనల ప్రకారం లే అవుట్లు వేశారా లేదా అని చూడం. వెంటనే ఓకే అనేస్తాం. కొనేస్తాం. తర్వాత నానా ఇబ్బందులుపడతాం. ఎలాంటి భూములు కొనాలి, ఏ స్థలాలకు అమ్మే హక్కు ఉండదనే కనీస పరిజ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. * కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి * లేకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు కర్నూలు (జిల్లా పరిషత్): రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కురిపిస్తున్న హామీలతో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఒకప్పుడు నంద్యాల రోడ్డులో సఫా ఇంజనీరింగ్ కళాశాల వరకు మాత్రమే రియల్ ఎస్టేట్ వెళ్లి ఆగిపోయింది. నాయకులు హామీల పుణ్యమా అని ఇప్పుడు విస్తరణ ఓర్వకల్లు మండలం హుసేనాపురం దాటిపోయింది. ఓర్వకల్లు సమీపంలో ఇండస్ట్రియల్ కారిడార్, ఎయిర్పోర్ట్, ఐఐఐటీ అంటూ ప్రజలను నాయకులు ఊరిస్తున్నారు. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఆదోని, ఎమ్మిగనూరు మధ్యలో టెక్ట్స్‌టైల్స్ పార్కు వస్తుందని చెప్పడంతో కోడుమూరు రోడ్డులోనూ వెంచర్లు పుట్టుకొచ్చాయి. కర్నూలు కొత్తబస్టాండ్‌కు అతి దగ్గరల్లో ఉందంటూ పెంచికలపాడు, కొత్తూరు వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా వ్యవసాయ భూములు కొని వెంచర్లు వేస్తున్నారు. ప్లాటు రూ.1.50లక్షల నుంచి రూ.2.50లక్షలేనని ఊరిస్తున్నారు. ఇండిపెండెంట్ హౌస్ సైతం రూ.12లక్షల నుంచి రూ.20లక్షలలోపు అందిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. వాటిని చూసి వెంటనే కొన్ని మోసపోకుండా కొన్ని విషయాలు గమనించి స్థలాలు కొనాలి. ఈ భూములు కొనకూడదు.. అమ్మకూడదు * ప్రభుత్వానికి సంబంధించిన భూములు, వక్ఫ్‌భూములు * భూదాన్ బోర్డు ఆధీనంలో స్థలాలు * వెనుకబడిన వర్గాలకు కేటాయించినవి * ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిపొందిన వారికి ఇచ్చిన ఇళ్లు, పొలాలు * యూఎల్సీ పరిధిలోని భూములు * సైనికులకు, స్వాతంత్య్ర సమరయోదులకు కేటాయించిన భూములు, స్థలాలు * గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన భూములు కొనబోయే భూమి సమాచారం ఎలా తెలుసుకోవాలి * భూమిని ఎక్కడ కొనాలనుకుంటున్నారో ఆ ఏరియా పరిధిలోకి వచ్చే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. * భూమి ఉన్న సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, పట్టా లేక పాస్బుక్ల జిరాక్స్ వివరాలు అందిస్తే వారు మీకో మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీ చేస్తారు. * ఇందులో మీరు కొనాలనుకున్న భూమి విలువ, ఆ భూమి ఏ ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉంది, ఎప్పటి నుంచి ఉంది, భూమిని ఎవరికి కేటాయించారు తదితర వివరాలుంటాయి. * బ్యాంకులోను పొందడానికి సైతం ఈ మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి * రియల్ ఎస్టేట్ వెంచర్ వేసే ముందు ఆయా భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలి. ఇందుకోసం రెవిన్యూ అధికారులకు నాలా పన్ను 10 శాతం చెల్లించి భూమి మార్పిడి చట్టం ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది. * లే అవుట్లు లేని నివేశన స్థలాలకు పంచాయతీలు/మునిసిపాలిటీలు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరు. కొత్తగా రోడ్ల నిర్మాణం, డ్రెయిన్లు తదితర మౌలిక సదుపాయాలూ కల్పించరు. * లే అవుట్ వేసిన మొత్తం భూమిలో 10 శాతం భూమిని సామాజిక అవసరాల కోసం (కమ్యూనిటి హాళ్లు, పాఠశాల నిర్మాణం, పార్కు) రిజర్వుడ్ సైట్‌గా వదలాల్సి ఉంటుంది. * ఈ స్థలాన్ని రియల్టర్ ఆయా పంచాయతీలు, మునిసిపాలిటీలకు రిజిస్ట్రేషన్ ఫీజు కింద గిఫ్ట్‌గా రాసి ఇవ్వాలి. * మునిసిపల్ నిబందనల ప్రకారం అంతర్గత రోడ్లు అయితే 40 అడుగులు, ప్రధాన రహదారి అయితే 60 అడుగుల వెడల్పు ఉండాలి. తారు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం రియల్టరే చేపట్టాలి. * మంచినీటి ట్యాంకు నిర్మించి ప్రతి ప్లాటుకు కనెక్షన్ ఇవ్వాలి. * త్రీ ఫేస్ కరెంటుతో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. లే అవుట్ల గురించి పూర్తిగా చెక్ చేసుకోవాలి కార్పొరేషన్ పరిధిలోని ప్రతి లే అవుట్‌కు 40 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. 10 శాతం స్థలాన్ని కార్పొరేషన్‌కు గిఫ్ట్ కింద ఇవ్వాలి. కార్పొరేషనేతర ప్రాంతాల్లో వేసిన లే అవుట్లలో 33 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. ప్రతి ప్లాటు తప్పనిసరిగా 120 చదరపు మీటర్లు ఉండాలి. 2.5ఎకరాల వరకు కర్నూలులోనే అనుమతినిస్తాం. 2.5 ఎకరాలు దాటి 5 ఎకరాల వరకు అనంతపురంలోని రీజనల్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లే అవుట్ల గురించి మునిసిపల్ కార్పొరేషన్, గ్రామపంచాయతీల్లో చెక్ చేసుకుని ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండదు. -బి. ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ -
బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి జెన్‌మనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకింగ్‌సహా పలు ఆర్థిక సేవల రంగంలో ఉన్న జెన్‌మనీ తాజాగా బీమా బ్రోకింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం జెన్‌మనీ ఇన్సూరెన్స్ సర్వీసెస్ పేరుతో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసినట్లు జెన్‌మనీ మేనేజింగ్ డెరైక్టర్ ప్రతాప్ కంతేటి తెలిపారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో బీమా బ్రోకింగ్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీవిత, సాధారణ బీమా రంగంలో ఉన్న అన్ని కంపెనీలకు చెందిన పాలసీలు విక్రయించే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. అధిక కమీషన్ల కోసం ఆశపడకుండా ఖాతాదారులకు అవసరమైన పాలసీలను మాత్రమే అందిస్తామని, ముఖ్యంగా టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాలపై అధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. బీమా రంగంలో విస్తరణకు ఇంకా చాలా అవకాశాలున్నాయని, వచ్చే మూడేళ్ళలో మొత్తం ఆదాయంలో 50 శాతం బీమా బ్రోకింగ్ నుంచే వచ్చే విధంగా చేయాలన్నదే తమ లక్ష్యమని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి తెలిపారు. గత ఆరు నెలల నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీలు పెరిగాయని, అలాగే రాష్ట్ర విభజన పూర్తి కావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా విచారణలు మొదలైనట్లు తెలిపారు. -
‘ల్యాండ్ పూలింగ్’పై డెవలపర్స్ తర్జనభర్జన
సాక్షి, సిటీబ్యూరో : హెచ్ఎండీఏ తాజాగా తలపెట్టిన భూ అభివృద్ధి పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం) వల్ల తమకెంత ప్రయోజనం? అన్నదే ప్రస్తుతం భూ యజమానుల మదిని తొలుస్తున్న ప్రశ్న. ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ ఉన్న భూముల్లో తామే స్వయంగా వెంచర్ అభివృద్ధి చేసుకోవచ్చు గదా..! ఎంతో విలువైన ఈ భూములను హెచ్ఎండీఏకు అప్పగించాల్సిన అవసరమేంటి? అని పలువురు డెవలపర్స్ దీర్ఘాలోచనలో పడ్డారు. చట్టపరంగా అన్ని అనుమతులు తీసుకొంటే అయ్యే ఖర్చు, హెచ్ఎండీఏకు భూములివ్వడం వల్ల వచ్చే లాభం... తదితరాలపై బేరీజు వేసుకొంటున్నారు. అయితే.. ఈ స్కీంపై రెండుసార్లు సమావేశాలు నిర్వహించిన అధికారులు.. అభివృద్ధి చేసిన వెంచర్లో భూ యజమానులకు ఎంత భూమి ఇస్తారన్నది స్పష్టం చేయకపోవడం డెవలపర్స్‌ను ఆలోచనలో పడేసింది. ప్రాంతాన్ని బట్టి అది నిర్ణయిస్తామని చెప్పడం అనుమానాలు రేకెత్తిస్తోంది. హెచ్ఎండీఏ ఆ ప్రాజెక్టును పూర్తిగా తమకు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఏ ప్రాంతంలో వెంచర్ వేస్తే తమకు ప్రయోజనం ఉంటుందన్న దానిపై డెవలపర్స్ తర్జనభర్జన పడుతున్నారు. ఒకవేళ హెచ్ఎండీఏ అందుకు అంగీకరించకపోతే దానికి సమీపంలోనే తాము అభివృద్ధి చేసే వెంచర్లను ఈ స్కీం కింద కన్వర్టు చేసుకొనేలా ప్రతిపాదన పెట్టాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ఔటర్ చుట్టూ ఉన్న భూములన్నీ తమ ఆధీనంలో ఉన్నందున ఈ స్కీం వల్ల తమకు లాభం లేకపోతే అడుగు పెట్టరాదని కొందరు డెవలపర్స్ భావిస్తున్నారు. రైతులు, డెవలపర్స్‌లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన హెచ్ఎండీఏ ఆదిలోనే అస్పష్ట విధానాలు ప్రకటించి అయోమయాన్ని మరింత పెంచడంతో ల్యాండ్ పూలింగ్ స్కీంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రలో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల ఈ స్కీం ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది వేయి డాలర్ల ప్రశ్న. ఒకేచోట 200 ఎకరాల్లో అభివృద్ధి చేసే వెంచర్‌లోని ప్లాట్లను 6 నెలల్లో అమ్ముకోలేకపోతే తీవ్రంగా నష్టం చవిచూసే ప్రమాదం ఉందన్న వాదనలూ విన్పిస్తున్నాయి. సమగ్రత ఏదీ? మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేయడం ద్వారా నగరం నలువైపులా సమగ్రాభివృద్ధిని సాధించాలన్న హెచ్ఎండీఏ ఆలోచనకు తానే అవరోధాలు కల్పిస్తోంది. ల్యాండ్ పూలింగ్ స్కీం వల్ల ఎక్కడ భూమి లభిస్తే అక్కడ కాలనీలు వెలుస్తాయి. అంటే ప్లాన్ ప్రకారం కాకుండా అడ్డదిడ్డంగా అక్కడక్కడా విసిరేసినట్లు అభివృద్ధి జరుగుతుంది. ఇది మాస్టర్‌ప్లాన్ విధానానికే విరుద్ధం. ఈ స్కీం వల్ల కేవలం ఔటర్ చుట్టూ ఉన్న ప్రాంతాలే తప్ప రేడియల్ రోడ్స్, రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశం లేకుండా పోతుంది. పరిహారం ఎలా..? చిన్న, సన్నకారు రైతులు భూములు ఇవ్వకపోతే... చట్టాన్ని అమలు చేసి వారి నుంచి భూములు సేకరిస్తామని హెచ్ఎండీఏ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనున్న భూ సేకరణ చట్టం ప్రకారం మున్సిపాల్టీలకు వెలుపల ఉన్న ప్రాంతాల్లోని భూములకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువకు 4 రెట్లు అధికంగా పరిహారం చెల్లించాలి. ఇప్పటికే ఔటర్ చుట్టూ ఉన్న భూములకు మంచి ధరలున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతుల నుంచి సేకరించే భూములకు అయ్యే వ్యయాన్ని ఎవరు భరించాలన్నది స్పష్టత లేదు. ఆర్థికంగా చితికిపోయిన హెచ్ఎండీఏ కొత్త వెంచర్ బాధ్యతను డెవలపర్స్‌కు అప్పగిస్తే రైతులకు చెల్లించే పరిహారం విషయంలో సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. నిజానికి భూ సేకరణ చట్టం వల్ల భూములివ్వని వారికే లాభం చేకూరనుంది. చట్టంలోని నిబంధనలు గ్రహించినవారు వెంచర్ మధ్యలోని భూములివ్వకుండా మెలికపెట్టే ప్రమాదం ఉంది. అడ్డంకులన్నీ అధిగమించి వెంచర్ అభివృద్ధికి పూనుకొన్నా... చివర్లో తమకు ఆసక్తిలేదని భూ యజమానుల్లో 1/3వంతు మంది అభ్యంతరపెడితే ఈ ప్రాజెక్టుకు నూకలు చెల్లినట్టే. ఇన్ని అవరోధాలున్న ల్యాండ్ పూలింగ్ స్కీంపై హెచ్ఎండీఏ పైపై మెరుగులతో ప్రకటనలు గుప్పించడం విడ్డూరంగా ఉందని పలువురు డెవలపర్స్ వ్యాఖ్యానిస్తున్నారు.