ప్లాట్ అవుతారు.. జాగ్రత్తా! | In the precautions necessary for the purchase of lands | Sakshi
Sakshi News home page

ప్లాట్ అవుతారు.. జాగ్రత్తా!

Published Fri, Oct 10 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

ప్లాట్ అవుతారు.. జాగ్రత్తా!

ప్లాట్ అవుతారు.. జాగ్రత్తా!

సార్.. మా వెంచర్‌కు అన్ని రకాల పర్మిషన్లున్నాయి. మీరు ఒక్కసారి చూడండి.. అంటూ వెంచర్ దగ్గరకు తీసుకెళ్తాడు ఏజెంట్. ఇది కార్నర్ ప్లాట్.. ఈస్ట్‌ప్లేస్. నిన్ననే ఇద్దరు, ముగ్గురు చూసి వెళ్లారు. మీరు సరే అంటే వెంటనే బుక్ చేస్తా. ఇలా ఆయన చెప్పే మాటలకు మనం వెంటనే ప్లాట్ అయిపోతాము. ఇంతకు ఈ భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించం. పంచాయతీ, మునిసిపల్ నిబంధనల ప్రకారం లే అవుట్లు వేశారా లేదా అని చూడం. వెంటనే ఓకే అనేస్తాం. కొనేస్తాం. తర్వాత నానా ఇబ్బందులుపడతాం. ఎలాంటి భూములు కొనాలి, ఏ స్థలాలకు అమ్మే హక్కు ఉండదనే కనీస పరిజ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

* కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి
* లేకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు

కర్నూలు (జిల్లా పరిషత్): రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కురిపిస్తున్న హామీలతో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఒకప్పుడు నంద్యాల రోడ్డులో సఫా ఇంజనీరింగ్ కళాశాల వరకు మాత్రమే రియల్ ఎస్టేట్ వెళ్లి ఆగిపోయింది. నాయకులు హామీల పుణ్యమా అని ఇప్పుడు విస్తరణ ఓర్వకల్లు మండలం హుసేనాపురం దాటిపోయింది. ఓర్వకల్లు సమీపంలో ఇండస్ట్రియల్ కారిడార్, ఎయిర్‌పోర్ట్, ఐఐఐటీ అంటూ ప్రజలను నాయకులు ఊరిస్తున్నారు. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది.

ఆదోని, ఎమ్మిగనూరు మధ్యలో టెక్ట్స్‌టైల్స్ పార్కు వస్తుందని చెప్పడంతో కోడుమూరు రోడ్డులోనూ వెంచర్లు పుట్టుకొచ్చాయి. కర్నూలు కొత్తబస్టాండ్‌కు అతి దగ్గరల్లో ఉందంటూ పెంచికలపాడు, కొత్తూరు వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా వ్యవసాయ భూములు కొని వెంచర్లు వేస్తున్నారు. ప్లాటు రూ.1.50లక్షల నుంచి రూ.2.50లక్షలేనని ఊరిస్తున్నారు. ఇండిపెండెంట్ హౌస్ సైతం రూ.12లక్షల నుంచి రూ.20లక్షలలోపు అందిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. వాటిని చూసి వెంటనే కొన్ని మోసపోకుండా కొన్ని విషయాలు గమనించి స్థలాలు కొనాలి.
 
ఈ భూములు కొనకూడదు.. అమ్మకూడదు
* ప్రభుత్వానికి సంబంధించిన భూములు, వక్ఫ్‌భూములు
* భూదాన్ బోర్డు ఆధీనంలో స్థలాలు
* వెనుకబడిన వర్గాలకు కేటాయించినవి
* ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిపొందిన వారికి ఇచ్చిన ఇళ్లు, పొలాలు
* యూఎల్‌సీ పరిధిలోని భూములు
* సైనికులకు, స్వాతంత్య్ర సమరయోదులకు కేటాయించిన భూములు, స్థలాలు
* గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన భూములు
 
కొనబోయే భూమి సమాచారం ఎలా తెలుసుకోవాలి
* భూమిని ఎక్కడ కొనాలనుకుంటున్నారో ఆ ఏరియా పరిధిలోకి వచ్చే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి.
* భూమి ఉన్న సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, పట్టా లేక పాస్‌బుక్‌ల జిరాక్స్ వివరాలు అందిస్తే వారు మీకో మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
* ఇందులో మీరు కొనాలనుకున్న భూమి విలువ, ఆ భూమి ఏ ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉంది, ఎప్పటి నుంచి ఉంది, భూమిని ఎవరికి కేటాయించారు తదితర వివరాలుంటాయి.
* బ్యాంకులోను పొందడానికి సైతం ఈ మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.
 
ఈ జాగ్రత్తలు తప్పనిసరి

* రియల్ ఎస్టేట్ వెంచర్ వేసే ముందు ఆయా భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలి. ఇందుకోసం రెవిన్యూ అధికారులకు నాలా పన్ను 10 శాతం చెల్లించి భూమి మార్పిడి చట్టం ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది.
* లే అవుట్లు లేని నివేశన స్థలాలకు పంచాయతీలు/మునిసిపాలిటీలు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరు. కొత్తగా రోడ్ల నిర్మాణం, డ్రెయిన్లు తదితర మౌలిక సదుపాయాలూ కల్పించరు.
* లే అవుట్ వేసిన మొత్తం భూమిలో 10 శాతం భూమిని సామాజిక అవసరాల కోసం (కమ్యూనిటి హాళ్లు, పాఠశాల నిర్మాణం, పార్కు) రిజర్వుడ్ సైట్‌గా వదలాల్సి ఉంటుంది.
* ఈ స్థలాన్ని రియల్టర్ ఆయా పంచాయతీలు, మునిసిపాలిటీలకు రిజిస్ట్రేషన్ ఫీజు కింద గిఫ్ట్‌గా రాసి ఇవ్వాలి.
* మునిసిపల్ నిబందనల ప్రకారం అంతర్గత రోడ్లు అయితే 40 అడుగులు, ప్రధాన రహదారి అయితే 60 అడుగుల వెడల్పు ఉండాలి. తారు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం రియల్టరే చేపట్టాలి.
* మంచినీటి ట్యాంకు నిర్మించి ప్రతి ప్లాటుకు కనెక్షన్ ఇవ్వాలి.
* త్రీ ఫేస్ కరెంటుతో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి.
 
లే అవుట్ల గురించి పూర్తిగా చెక్ చేసుకోవాలి
కార్పొరేషన్ పరిధిలోని ప్రతి లే అవుట్‌కు 40 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. 10 శాతం స్థలాన్ని కార్పొరేషన్‌కు గిఫ్ట్ కింద ఇవ్వాలి. కార్పొరేషనేతర ప్రాంతాల్లో వేసిన లే అవుట్లలో 33 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. ప్రతి ప్లాటు తప్పనిసరిగా 120 చదరపు మీటర్లు ఉండాలి. 2.5ఎకరాల వరకు కర్నూలులోనే అనుమతినిస్తాం. 2.5 ఎకరాలు దాటి 5 ఎకరాల వరకు అనంతపురంలోని రీజనల్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లే అవుట్ల గురించి మునిసిపల్ కార్పొరేషన్, గ్రామపంచాయతీల్లో చెక్ చేసుకుని ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండదు.
 -బి. ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement