sub registrar office
-
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ‘కార్పొరేట్’ లుక్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు మెరుగైన సేవలతోపాటు వారికి అవసరమైన వసతులు కల్పించడమే ధ్యేయంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్య కలాపాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రజలు చెట్ల కింద నిరీక్షించే పరి స్థితిని నివారించేలా ప్రస్తుతమున్న సబ్ రిజిస్ట్రార్ కార్యా లయాలను పునర్వ్యవస్థీకరించడంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులతో అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి మంగళ వారం ఆయన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు.తొలుత పటాన్చెరు, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఫోర్త్‌సిటీలో నిర్మాణంఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల శాశ్వత భవనాల కోసం స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశలవారీగా ఈ నిర్మా ణాలు ఉంటాయని, తొలిదశలో పటాన్చెరు, సంగా రెడ్డి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్‌తోపాటు రంగారెడ్డి జిల్లా కందుకూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీ లో నిర్మి స్తామని చెప్పారు. గండిపేట, శేరిలింగంపల్లి, రంగా రెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను కలిపి గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) కార్యాలయంలో సమీకృత సబ్‌రిజి స్ట్రార్ నమూనా కార్యాలయాన్ని నిర్మిస్తామని వివరించారు. ఈ నెలలో శంకు స్థాపనలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలోని బంజా రాహిల్స్, ఎస్ఆర్నగర్, గోల్కొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలను షేక్‌పేటలో నిర్మించాలని నిర్ణయించామన్నారు.వెయిటింగ్ హాల్, విశాల పార్కింగ్ సదుపాయాలతో..మొదటి దశలో నిర్మించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీ సం 3 ఎకరాల్లో ఉంటాయని, 10–15 వేల చదరపు అడు గుల్లో కార్యాలయాల భవన నిర్మాణాలు చేపడతామని పొంగులేటి చెప్పారు. వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయం, విశాల పార్కింగ్ వసతులుండేలా డిజైన్లు రూపొందించా లని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడుతుందని, పర్యవే క్షణ సులభతరం అవుతుందని.. దస్త్రాల పరిశీలిన వేగవంతం అవుతుందన్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీ తిని నిర్మూలించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడేలా తక్షణమే కార్యాచరణ రూపొందించాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ అలియాస్ వెంకట్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకున్న ఈఘటన వివరాలను వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. జిల్లాలోని దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్.. దంతాలపల్లి మండల కేంద్రంలో 128 గజాల భూమి కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా గజానికి రూ.200 చొప్పున డిమాండ్ చేయగా.. రూ.150 చొప్పున ఇస్తానని బేరం కుదుర్చుకుని వరంగల్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సాయంత్రం మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తికాగానే రూ.19,200 నగదును అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్‌కు ఇవ్వమని సబ్ రిజిస్ట్రార్ చెప్పగా.. హరీష్ ఆ డబ్బులను అందజేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వెంకట్ వద్ద లెక్క చూపని మరో రూ.1.72లక్షలు నగదు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకట్‌ను అదుపులోకి తీసుకుని వరంగల్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, రాజు, సునీల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గ్రామ సచివాలయాలు
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఇప్పటికే ఊరూరా ఏర్పాటు చేసిన గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందిస్తున్న సర్కారు ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగాత్మకంగా జిల్లాలో ఒక సచివాలయం ద్వారా ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆదివారం నుంచి మరో ఏడు సచివాలయాల్లో అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో సుదూర ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే సేవలు పొందవచ్చు. ఆళ్లగడ్డ: ఇది వరకు ఏ రకమైన రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా సుదూర ప్రాంతాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలి. ఇందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చాలి. దీనికితోడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద దళారుల దోపిడీ. వీటన్నింటికీ చెక్ పెట్టి స్థానికంగా ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలు అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ రూపొందించి గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సచివాలయాలు ప్రస్తుతం నంద్యాల జిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలంటే రెండు నుంచి మూడు రోజులు వాటి చుట్టూ తిరగాలి. అయినా, సకాలంలో పని పూర్తవుతుందో లేదో తెలియదు. ఇక నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చెంతనే ఉన్న సచివాలయాల్లో సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. రీ సర్వే పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల పక్రియ కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడతలో కొన్నింటిని ఎంపిక చేశారు. అందులో జిల్లాలో నంద్యాల మండలం బిల్లలాపురం గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి దాదాపు 8 నెలల పాటు విజయవంతంగా సేవలు అందించారు. తాజాగా రెండో విడతలో జిల్లాలో 7 గ్రామ సచివాలయాలను ఎంపిక చేశారు. వీటిలో నూతనంగా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించనున్నారు. ఇలా విడతల వారీగా మరో ఏడాదిలోపు జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. భూ రీసర్వేతో కబ్జాలకు చెక్ ఎప్పుడో బ్రిటీష్ పరిపాలనలో చేసిన సర్వేనే ఇప్పటికీ ఆధారం. దీంతో భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు గందరగోళంగా ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో భూవివాదాలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడుతున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా సర్వేనంబర్లలో సబ్ డివిజన్లకు ప్రభుత్వం స్వస్తి పలుకుతుంది. ఉదాహరణకు 1, 1ఏ, 1బి, 1బి/ఏ లాంటి సబ్‌డివిజన్ సర్వే నంబర్లు ఇక నుంచి ఉండవు. సర్వేనంబర్ 1, 2 ఇలా ఒకే నంబర్‌తో ఉంటాయి. ఇప్పటి వరకు సబ్ డివిజన్లు సృష్టించి అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న భూ రీ సర్వేలో ఊరు, సచివాలయ పరిధి, మండలం కనబరుస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంటుంది. అలాగే ఒకరి భూమిని మరొకరు కబ్జా చేసే పరిస్థితి ఉండదు. అందించే రిజిస్ట్రేషన్ సేవలు ఇవే.. జిల్లాలో ఎంపిక చేసిన సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించే అన్ని రకాల సేవలు అందుతాయి. అక్నాలెడ్జ్మెంట్ అప్డేట్, డేటా ఫీడింగ్, చెక్ స్లిప్, రెగ్యులర్ నంబర్ కేటాయింపు, ఫొటో, వేలి ముద్రలు తీసుకోవడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, స్కానింగ్, విక్రయ దస్తావేజు, సెటిల్ మెంట్ దస్తావేజు, దాన విక్రయం, తనఖా, చెల్లు రసీదు, భాగ పరిష్కారం రిజిస్ట్రేషన్ రద్దు, మ్యానువల్ ఈసీ, ఆన్లైన్ ఈసీ, మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికెట్, వివాహ రిజిస్ట్రేషన్ తదితర సేవలు అందిస్తారు. (క్లిక్ చేయండి: 'నన్నారి'కి నల్లమల బ్రాండ్!) సిద్ధంగా ఉన్నాం సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు నాతో పాటు 13 మంది కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఆరు నెలలుగా శిరివెళ్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శిక్షణ తీసుకున్నాం. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రకాల రిజిస్ట్రేషన్ సేవలను మా సచివాలయం ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – రాజ్‌కుమార్, పీఎస్ గోవిందపల్లె సచివాలయం –2, శిరివెళ్ల మండలం సేవలు మరింత సులభతరం ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల్లో పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నాం. ఇందుకు సబ్ రిజిస్ట్రార్లు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి క్యూలో ఉండి పనులు చేయించుకోవాలంటే కొంచం ఇబ్బంది ఉండేది. ఇప్పుడు వారి గ్రామాల్లోనే సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. – నాయబ్ అబ్దుల్‌సత్తార్, ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు -
అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు.. నిషేధిత భూములనూ వదలని వైనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్ల దందా సాగించారు. నిబంధనలతో నిమిత్తం లేదు. ఫీజు టూ ఫీజ్ చెల్లించి ఆపైన భారీగా ముట్టచెప్పితే చాలు ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ల చేస్తా రు. రెడ్‌మార్క్‌లో ఉన్నా, నిషేధిత భూములైనా, నాన్ లేఅవుట్ అయినా ఇలా ఏ భూమి అయినా కా సులు ఇస్తే ఉమ్మడి పశ్చిమగోదావరిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. జిల్లాలోని 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గడిచిన మూడేళ్లలో 500కుపైగా ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖపై వరుస ఫిర్యాదులు అందుతుండటంతో ప్రభు త్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగంగా విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహించగా ప్రతి సబ్ రిజిస్ట్రా్టర్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవినీతికి చిరునామాగా.. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి చిరు నామాగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉండే భూములకు డాక్యుమెంట్లు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ప్రభుత్వం 22ఏ, రెడ్‌మార్క్, నిషేధిత భూములు, నాన్ లేఅవుట్ సర్వే నంబర్లు అ న్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి ఆ రిజిస్ట్రేషన్లను చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. నిషేధిత భూములు, 22ఏ భూములు కలెక్టర్ అనుమతితో నిషేధిత జాబితా నుంచి తొలిగించిన తరువాత మాత్రమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించాలి. అయితే జిల్లాలో భిన్నంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ఏలూరు, పాలకోడేరు, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, భీమవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా నిర్ధారించారు. మరీ ముఖ్యంగా కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 2019 నుంచి 2022 వరకు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించింది. దీనిలో భాగంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిషేధిత భూముల జాబితాను తీసుకుని ఆ జాబితాలోని నంబర్లతో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. దాదాపు మూడు నెలలకుపైగా విజిలెన్స్ అధికారులు శ్రమించి పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలించారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనేక అక్రమాలు జరిగినట్లు తేలింది. సగటున 30కి పైగా.. ప్రధానంగా నాన్‌లేఅవుట్ భూముల్లో ప్లాట్ల కొనుగోలుపై ప్రభుత్వం నిషేధం విధించింది. నాన్‌లేఅవుట్‌ను ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేసి సంబంధిత రుసుం చెల్లించి డీటీసీపీ నుంచి అనుమతి తీసుకుని అప్రూవ్ లేఅవుట్‌గా మార్చి విక్రయాలు చేయాలి. అయితే దీనికి విరుద్ధంగా నాన్ లేఅవుట్లల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిషేధిత భూములు, నాన్‌లేవుట్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా మొగల్తూరు, నరసాపురం, అత్తిలి, భీమవరం, ఏలూరులో అత్యధికంగా జరిగాయి. ఈ ఐదు కార్యాలయాల్లో సగటున 30కుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్ధారించారు. మొత్తంగా 9 కార్యాలయాల్లో 500లకుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయగా, భీమవరంలోనే ఎక్కువగా జరిగినట్టు సమాచారం. భారీ గోల్మాల్ ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే వట్లూరు గ్రామంలో ఒక ఎన్ఆర్ఐకు చెందిన 8 ఎకరాల భూమి విషయంలో భారీ గోల్మాల్ జరిగినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా ఎకరా నుంచి 5 ఎకరాలలోపు నాన్‌లేఅవుట్లు వేసి పదుల సంఖ్యలో వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించేశారు. దీనిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రత్యక్షంగా గండికొట్టారు. 500లకుపైగా డాక్యుమెంట్లల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు సమాచారం. అలాగే కొందరు సబ్రిజిస్ట్రార్లు, కొన్ని కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లపైనా చర్యలకు సిఫార్సు చేశారు. (క్లిక్: ఏలూరులో ఏసీబీ సోదాలు.. రికార్డుల తనిఖీ) -
అక్కడంతా ఆ నలుగురే
తాడేల రామకృష్ణ. రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేస్తున్నాడు. ఈయన సంబంధిత కార్యాలయ ఉద్యోగి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన లావేరు మండలం బొంతుపేటకు చెందిన ప్రైవేటు వ్యక్తి. కానీ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన హడావుడి చూస్తే అంతా ఇంతా కాదు. ఆర్థిక వ్యవహారాలన్నీ తానే చూసుకుంటున్నాడు. దన్నాన మహేష్. జేఆర్‌పురం గ్రామానికి చెందిన ప్రైవేటు వ్యక్తి. ఈయన కూడా రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే ఉంటారు. అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెడతారు. ఈయనొక మధ్యవర్తి. ఈయన్ను కలిస్తే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఎంచక్కా జరిగిపోతాయన్న ఆరోపణలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఈ ఇద్దరే కాదు మరో ఇద్దరు ఇదే రకంగా పనిచేస్తున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలోకి బయట వ్యక్తులకు అనుమతి లేదు. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రవేశం ఉంది. ప్రైవేటు వ్యక్తులు పెత్తనం ఉండకూడదని సీసీ కెమెరాలతో నిఘా కూడా పెట్టారు. కానీ ఇక్కడవేమి పట్టించుకోలేదు. బయట వ్యక్తుల హవాయే ఎక్కువగా ఉంది. వీరిని సంప్రదిస్తేనే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు వేగవంతంగా జరుగుతాయి. లేదంటే కొర్రీలతో ఇబ్బందులు తప్పవు. ఇదంతా అధికారుల ప్రోత్సాహంతోనే జరుగుతోంది. వారి పేరు చెప్పుకుని ప్రతి డాక్యుమెంట్‌కు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. అధికారులకు ఇవ్వాలని చెబుతూ భూములు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు చేసుకునే వారి వద్ద నుంచి వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా ఉండటంతో కార్యాలయ వేళలు ముగిశాక వసూలు చేసిన సొమ్మును ముట్టజెబుతారు. ఇదంతా బహిరంగ రహస్యమే. అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు.. మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువవడంతో వీరికి ఇష్టం లేని వ్యక్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు చేయడంలో తాత్సారం జరుగుతున్నందున కొందరు బయటికొస్తున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోవడం లేదని తమ డాక్యుమెంట్లకు రకరకాల కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయకుండా పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. తాజాగా ఇదే విషయమై ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. రణస్థలం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నారని, రిజిస్ట్రేషన్‌కు అవసరమయ్యే పత్రాలు సక్రమంగా ఉంటున్నా కొర్రీలు పెడుతున్నారని, అధిక మొత్తంలో సొమ్ము చెల్లిస్తేనే పని చేస్తున్నారని జేఆర్‌పురం గ్రామ పంచాయతీ గరికిపాలెం గ్రామానికి చెందిన జల్లేపల్లి సూర్యప్రకాశరావు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఆ శాఖ డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు? ఎంత వసూలు చేస్తున్నారు? ఎవరి పాత్ర ఎంత? తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. సక్రమంగా ఉన్న వాటికి కొర్రీలు పెట్టి, అడ్డగోలుగా ఉన్నవి ముఖ్యంగా ఫోర్జరీ సంతకాలతో ఉన్న డాక్యుమెంట్లను ముడుపులు తీసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. ఏ డాక్యుమెంట్ విషయంలో ఇలా జరిగిందో.. వాటి వివరాలను కూడా ప్రస్తావించారు. మధ్యవర్తులు, కార్యాలయ బాధ్యులు కొందరు కుమ్మక్కై ఈ దందా చేస్తున్నారని స్పష్టంగా వివరించారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులే నిత్యం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అనుమతించడం లేదు గత పది రోజుల నుంచి బయట వ్యక్తులను అనుమతించడం లేదు. బయటేదో జరిగితే నాకు సంబంధం లేదు. ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. మాట్లాడటానికి కుదరదు. – కె.వేణు, సబ్ రిజిస్ట్రార్, రణస్థలం దృష్టి పెడతా.. నేనొచ్చాక ఫిర్యాదు రాలేదు. అంతకుముందు వచ్చిందో లేదో తెలియదు. పరిశీలిస్తాను. ఏదేమైనప్పటికీ అక్కడేం జరుగుతుందో దృష్టి పెడతాను. అడ్డగోలు కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకుంటాం. – కిల్లి మన్మధరావు, జిల్లా రిజిస్ట్రార్ -
మధురవాడే హాట్ కేక్.. పోటీపడుతున్న అనకాపల్లి..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో నేనే నంబర్ అంటోంది మధురవాడ. రియల్ రంగంలో ఇప్పుడు ఈ ప్రాంతమే కేంద్ర బిందువు. నగరంలో జరుగుతున్న నిర్మాణాలు మాత్రమే కాదు.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా వచ్చిన ఆదాయాన్ని గమనించినా ఇదే విషయం స్పష్టమవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాది 1207.45 కోట్ల ఆదాయం రాగా.. కేవలం మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఏకంగా 243.06 కోట్ల ఆదాయం వచ్చింది. అంతేకాకుండా 10,096 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తర్వాతి స్థానంలో విశాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయం నిలిచింది. ప్రధానంగా చినగదిలి, మద్దిలపాలెం, రుషికొండ, కలెక్టరేట్ వంటి మంచి మార్కెట్ ధర ఉన్న ప్రాంతాలు.. ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో ఉండటంతో గతేడాది రూ. 203.63 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు అనకాపల్లి పరిధిలో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్న డాక్యుమెంట్ల సంఖ్య అధికంగా ఉంది. యలమంచిలి ప్రాంతం కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లల్లో మూడు ప్రాంతాలతో పోటీ పడుతోంది. పోటీపడుతున్న అనకాపల్లి రిజిస్ట్రేషన్ల ఆదాయపరంగా చూస్తే మధురవాడ, విశాఖపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పోటీ పడుతున్నాయి. మధువాడ కార్యాలయం నుంచి రూ.243.06 కోట్ల ఆదాయం రాగా.. విశాఖపట్నం కార్యాలయం నుంచి రూ.203.63 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రధానంగా కలెక్టరేట్‌తో పాటు బీచ్‌రోడ్, రుషికొండ, చినగదిలి ప్రాంతాల్లో మార్కెట్ ధర అధికంగా ఉండటంతో పాటు రుషికొండ వరకు నూతన నిర్మాణాల వల్ల విశాఖపట్నం రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆదాయం బాగా ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య కూడా అన్ని ప్రాంతాల కంటే ఎక్కువే. ఇక మధురవాడ నిర్మాణ రంగానికి కేంద్ర బిందువుగా ఉండటంతో ఈ ప్రాంతం నుంచి బాగా ఆదాయం సమకూరుతోంది. అయితే.. డాక్యుమెంట్ల పరంగా ఈ రెండు ప్రాంతాలతో అనకాపల్లి పోటీపడుతోంది. మధురవాడలో గడిచిన ఏడాదిలో 10,096 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. విశాఖపట్నంలో అంతకంటే ఎక్కువగా 12,946 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటితో పోటీగా అనకాపల్లిలో ఏకంగా 12,228 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగడం విశేషం. అంటే మధురవాడ కంటే ఎక్కువ డాక్యుమెంట్లు ఇక్కడ రిజి్రస్టేషన్ జరిగాయి. మరోవైపు యలమంచిలిలో కూడా ఈ మూడు ప్రాంతాలతో పోటీ పడుతూ 10,523 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు లేవు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అక్కడ కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అరకు, పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఎలా ఉందంటే...! ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రేషన్(విశాఖపట్నం, అనకాపల్లి) కార్యాలయాలు, మొత్తం 19 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు(ఎస్ఆర్వో) ఉన్నాయి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏయే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎంత మేర ఆదాయం(కోట్లలో) వచ్చింది? ఎన్ని డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయనే వివరాలను గమనిస్తే.... 83 శాతం లక్ష్యం సాధించాం 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 1449.56 కోట్ల మేర ఆదాయం అర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. 31 మార్చి 2022 నాటికి 1207.45 కోట్ల మేర ఆదాయం సమకూరింది. నిరీ్ణత లక్ష్యంలో 83.29 శాతం మేర సాధించాం. మధురవాడ, విశాఖపట్నం రిజి్రస్టేషన్ కార్యాలయాల పరిధిలో మాత్రం నిరీ్ణత లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటాం. –ఎ.నాగలక్ష్మి, డీఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
జనవరి 31న సిద్దిపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద కాల్పులు
-
కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని కదిరి సబ్‌రిజిస్టర్ కార్యాలయంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అక్రమాలపై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రే రూ.21.50 లక్షల చలానా డబ్బును ముగ్గురు ఉద్యోగులు జమ చేశారు. దీంతో ఉన్నతాధికారులు నకిలీ చలానాలపై విచారణ చేపట్టారు. రూ.5 వేల చలానాకు రూ.50 వేలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు మార్చారు. సబ్ రిజిస్టర్ నాసీర్, సీనియర్ అసిస్టెంట్ షామిర్ బాషా, జూనియర్ అసిస్టెంట్ హరీష్ ఆరాధ్యలను అధికారులు విచారిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లతో కలిసి కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడింది. -
టీడీపీ నేతల సహకారం.. అగ్రిగోల్డ్ భూములు హాంఫట్!
సాక్షి,కర్నూలు : అగ్రిగోల్డ్ కొనుగోలు చేసిన భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఆ సర్వే నంబర్లకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకూడదు. అయితే జిల్లాలో పలుచోట్ల ఇందుకు విరుద్ధంగా జరిగింది. అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసిన భూములు వేరొకరి పేరున రిజిస్ట్రేషన్‌అయ్యాయి. కొందరికి పాసు పుస్తకాలు కూడా వచ్చాయి. సంస్థ 450 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా..క్షేత్రస్థాయిలో 100 ఎకరాలు కూడా లేదని సీఐడీ అధికారుల విచారణలో బయటపడినట్లు సమాచారం. ఇవీ అక్రమాలు.. కృష్ణగిరిలో సర్వే నంబర్ 65లో ఉన్న 3.25 ఎకరాల భూమిని బోయ లక్ష్మన్న, సర్వే 63లో 5.07 ఎకరాలను కట్టెల రంగారెడ్డి.. అగ్రిగోల్డ్ సంస్థకు విక్రయించారు. అయితే సదరు సర్వే నంబర్లలోని 8.32 ఎకరాల భూమికి కొత్త రాధమోహన్‌కు 2019 జూలైలో అప్పటి తహసీల్దార్ పట్టాదారు పాసుపుస్తకాన్ని మంజూరు చేశారు. ► అగ్రిగోల్డ్‌కు చెందిన 83/బీ, 84/సీ, 93, 82/3, 81/1, సర్వే నంబర్లలోని 30ఎకరాల భూమిని కోడుమూరు సబ్‌రిజిస్టార్ అధికారులు అబ్దుల్ రహిమాన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం సైతం మంజూరు చేశారు. ►రామకృష్ణాపురంలో టీడీపీ నాయకుడు దామోదర్‌నాయుడు 113, 146/1 సర్వే నంబర్లలో 13 .19 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ సంస్థకు అమ్మాడు. సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డులలో లేదు. అయినప్పటికీ 5.95 ఎకరాలు ఉన్నట్లు చూపి సంస్థను మోసం చేశాడు. టీడీపీ నేతల సహకారంతో రికార్డులు తారుమారు చేయించాడు. ► కృష్ణగిరి గ్రామంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 4/ఏ, 5, 41, 42, 43, 45, 48, 49, 54, 57/బీ, 59/సీ, 64, 113, 146/1, 141 తదితర సర్వే నంబర్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. రెవెన్యూ అధికారులు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడంతో 102.69 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్ సంస్థ కొనుగోలు చేసింది. ► కోడూరు నరసింహారావు, కోడూరు నరసయ్య, కోడూరు శశికళలకు కృష్ణగిరి గ్రామంలో 27.24 ఎకరాల భూమి ఉంది. ఈ భూములకు వేరొకరి పేరు మీద రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇచ్చారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆ భూములను కొనుగోలు చేసింది. దీంతో పట్టాదారులైన రైతులు ఆందోళన చెందుతున్నారు. -
నకిలీ చలానాల వ్యవహారంపై అధికారుల చర్యలు.. ముగ్గురు సస్పెండ్
విజయనగరం: నకిలీన చలానాల వ్యవహారంపై అధికారులు చర్యలు ప్రారంభించారు. గజపతినగరం సబ్ రిజిస్ట్రార్‌తో పాటు మరో ఇద్దరు అధికారుల సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మ, సీనియర్ అసిస్టెంట్ రమేశ్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ నరసింగరావును డీఐజీ కల్యాణి సస్పెండ్ చేశారు. చదవండి: ప్రభుత్వ భూముల మ్యుటేషన్.. 11 మంది వీఆర్వోల సస్పెన్షన్ -
చలానా కుంభకోణంలో ఒక్కరే సూత్రధారి?
సాక్షి, తూర్పుగోదావరి: అన్నీ తానయ్యాడు.. అందరినీ నమ్మించాడు.. అవకాశం చూశాడు.. అందినకాడికి దోచుకున్నాడు.. నకిలీ చలానా కుంభకోణానికి పాల్పడ్డాడు.. ఆలమూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చలానాల అవకతవకల కేసులో సూత్రధారి ఒక్కడేనని తెలుస్తోంది. రాష్ట్రంలో చలానా కుంభకోణం బయట పడిన తరువాత జిల్లాలోని 32 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఆలమూరులో చలానా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 20 వరకూ 2,388 రిజిస్టేషన్లు జరగ్గా, వీటిలో 39 బోగస్‌గా నిర్ధారించి రూ.7,31,510 దుర్వినియోగం అయినట్లు తేల్చారు. ఈ లావాదేవీలన్నీ ఓ అనధికార ఉద్యోగికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయి. కుంభకోణానికి అసలు సూత్రధారి అని భావిస్తున్న ప్రైవేటు ఉద్యోగి నుంచే దుర్వినియోగమైన సొమ్మును సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది రికవరీ చేసినా, అతనిపై ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. బోగస్ చలానా కుంభకోణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఓ ఉద్యోగి సహకరించాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విషయం బయట పడిన వెంటనే అతడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినట్లు సమాచారం. చదవండి: ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు అందరిదీ ఆ మాటే.. చలానా కుంభకోణంపై ఎట్టకేలకు ఫిర్యాదు అందడంతో ఆలమూరు పోలీసులు శనివారం విచారణ ప్రారంభించారు. మండపేట రూరల్ సీఐ పి.శివగణేష్, ఎస్సై ఎస్.శివప్రసాద్ కార్యాలయానికి వచ్చి సబ్ రిజిస్టార్ ఎ.సునందశ్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బోగస్ చలానా దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణ చేసేందుకు వచ్చిన సీఐ శివగణేష్‌కు దస్తావేజు లేఖర్లంతా ఆ అనధికార ఉద్యోగి పైనే ఫిర్యాదు చేశారు. బోగస్‌గా తేల్చిన చలానాలన్నీ రెండు బ్యాంకు ఖాతాల ద్వారానే జరిగాయని, వాటిల్లో పొందుపరచిన ఫోన్ నంబర్లు కూడా అతడివేనని చెప్పారు. దుర్వినియోగమైన సొమ్ము కూడా అతడి ఖాతా నుంచే రికవరీ అయ్యిందని తెలిపారు. బోగస్‌గా గుర్తించిన 39 చలానాల్లో అత్యధికంగా డి.దుర్గాప్రసాద్ 30, వై.శ్రీరామచంద్రమూర్తి 6, పి.భగవాన్, టి.జి.కృష్ణకు చెందిన ఒక్కొక్కటి ఉన్నాయి. పినపళ్లకు చెందిన కె.వెంకటరమణకు చెందిన బ్యాంకు డాక్యుమెంటూ బోగస్ చలానాలో ఉంది. కేసును త్వరితగతిన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని సీఐ చెప్పారు. చదవండి: ఏపీ: నకిలీ చలానాల కేసులో రూ. 4 కోట్లు దాటిన రికవరీ అన్నీ అతనై.. కంప్యూటర్ వర్క్‌లో నిష్ణాతుడు కావడంతో అత్తిలి నవీన్‌కుమార్ అనే వ్యక్తిని ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది అనధికారికంగా రోజువారీ వేతనంపై నియమించుకున్నారు. రిజిస్ట్రేషన్లు వేగంగా చేస్తాడనే కారణంగా కొంతమంది దస్తావేజు లేఖర్లు కూడా బ్యాంకుకు వెళ్లే పని లేకుండా నేరుగా అతడికే సొమ్ము చెల్లించి, అతడి బ్యాంకు ఖాతా ద్వారానే చలానాలు తీసుకునేవారు. ఇదే అదనుగా అతడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీఎఫ్ఎంఎస్ విధానంలో పీడీఎఫ్‌లో ఉన్న చలానాను మైక్రోసాఫ్ట్ వర్డ్‌లోకి మార్చి రూ.లక్షల అక్రమాలకు పాల్పడ్డాడని సమాచారం. సబ్ రిజిస్టార్ కార్యాలయ అధికారులకు నమ్మకంగా ఉంటూ ఓ ఉద్యోగి లాగిన్ నుంచే బోగస్ చలానాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యం, కొంతమంది దస్తావేజు లేఖర్ల స్వార్థంతో 39 చలనాల్లో అక్రమాలకు ఇతడు కారణమయ్యాడు. ఆలమూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమాలు జరిగాయిలా.. ► ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 20 వరకూ రిజిస్ట్రేషన్లు: 2,388 ► వీటిలో బోగస్ చలానాలు : 39 ► రికవరీ చేసినది : రూ.7,31,510 -
చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా
తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పదేళ్లుగా పాతుకుపోయిన చిరుద్యోగి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. స్వార్థం కోసం ఎంతకైనా తెగించే దిగజారుడు స్వభావం బట్టబయలవుతోంది. సదరు చిరుద్యోగి తన పబ్బం గడుపుకునేందుకు అధికారులను డబ్బుతో ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విలాసాలను రుచి చూపించి వశం చేసుకోవడం.. చిన్న అవసరాలను తీర్చి ఆకట్టుకోవడం.. వ్యక్తిగత విషయాలను సైతం తనతో పంచుకునేలా నమ్మకం సంపాదించుకోవడం.. వలలో చిక్కని వారిని ముగ్గులోకి దించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ తర్వాత వారిపై అవినీతిపరులనే ముద్ర వేసి మానసిక వేదనకు గురిచేస్తాడు. దొంగ వీడియోలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. చివరికి నయానో.. భయానో తన దారికి తెచ్చుకుని అక్రమార్జనకు మార్గంసుగమం చేసుకుంటాడు. ఇదీ ‘సాక్షి’ పరిశీలనలో వెలుగు చూసిన చిరుద్యోగి ‘చీకటి బాగోతం’ . సాక్షి, తిరుపతి: అక్రమాలనే ఆదాయ వనరుగా మార్చుకున్న తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ చిరుద్యోగి లీలలు అన్నీఇన్నీ కావు. పదేళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన ఆయన ప్రమేయం లేనిదే ఒక్క రిజిస్ట్రేషన్ జరగని పరిస్థితి ఏర్పడింది. చిల్లర కోసం సదరు చిరుద్యోగి వేస్తున్న చీకటి వేషాలపై కార్యాలయం సిబ్బందే కథలు కథలుగా చెబుతున్నారు. ఉన్నతాధికారులపైనే పెత్తనం చెలాయిస్తున్న ఆయన వైఖరిపై విస్తుపోతున్నారు. పథకం ప్రకారం ప్రలోభం తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి చిరుద్యోగే సర్వం సరç్ఛౌరా చేస్తుంటాడు. అందరితోనూ చనువుగా మసలుకుంటుంటాడు. అందరి అవసరాలను తానే తీరుస్తుంటాడు. తద్వారా తన అవినీతికి ఎవరూ అడ్డురాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. బదిలీపై వస్తున్న అధికారులను సైతం ముందుగానే ఫోన్ లో సంప్రదించి తిరుపతిలో అన్నీ తానే అని నమ్మిస్తాడు. వారికి కావాల్సిన పనులన్నీ చేసిపెట్టి తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. ఒకవేళ వచ్చిన అధికారి వలలో చిక్కకుంటే మరింత దారుణంగా వ్యవహారం నడిపిస్తాడు. ఏదో ఒక ఫంక్షన్ పేరు చెప్పి హోటల్‌కు తీసుకెళ్లి ఆహారం, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపేస్తాడు. మత్తులోకి జారుకున్న అధికారిపైకి వేశ్యలను ఉసిగొల్పి నగ్న వీడియోలను చిత్రీకరిస్తాడు. కొద్దిరోజుల తర్వాత ఆ అధికారికి వీడియోలు చూపించి బ్లాక్‌మెయిలు చేస్తాడు. ఇక చేసేది లేక నిజాయితీపరులైన అధికారులు సైతం చిరుద్యోగికి అనుకూలంగా మారిపో తారు. అప్పటి నుంచి ఆ అధికారి ఉన్నన్ని రోజులు యథేచ్ఛగా అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతాడు. డబ్బుకు లొంగే అధికారులైతే చిరుద్యోగి మరింత దారాళంగా వ్యవహరిస్తాడు. నెలకు ఎంత కావాలి అని డీల్ కుదుర్చుకుంటాడు. ( చదవండి: అక్కడ తప్పించుకున్నాడు.. ఇక్కడ దొరికిపోయాడు ) ఒకేసారి ఏడాదికి ఇవ్వాల్సిన సొమ్మును ముట్టజెప్పి మొత్తం కార్యాలయాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటాడు. ఎలాంటి ప్రలోభాలకు లొంగని అధికారులపై లేనిపోని నిందలు మోపి విస్తృతంగా ప్రచారం చేయిస్తాడు. రిజిస్ట్రేషన్‌కు వచ్చిన వారితో యథాలాపంగా మాట్లాడుతున్న అధికారుల వీడియోలను ఫోను లో చిత్రీకరించి అవినీతి మరకను అంటిస్తాడు. చిరు ద్యోగి బారిన పడి పలువురు అధికారులు మానసి క క్షోభకు గురై తిరుపతి నుంచి బదిలీ చేయిం చుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. ఎవరితో కలవ కుండా తమ పని తాము చేసుకుని వెళ్లే అధికారులను సైతం చిరుద్యోగి వదిలిపెట్టడం లేదని పలు వురు సిబ్బంది తెలియజేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఇలాంటి ఓ అధికారి ఒంటరిగా కూర్చుని మద్యం తాగుతున్న వీడియోను రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేసినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని మరికొందరు అధికారులను బెదిరింనట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రచారం సాగుతోంది. -
నకిలీ చలానాల కేసు: ప్రధాన నిందితుడు అరెస్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: మండవల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు స్టాంప్ వెండర్ రామ్ ధీరజ్‌ను అరెస్ట్ చేశారు. కైకలూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వివరాలు వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.1.02 కోట్లు నగదు రీవకరీ చేశామని తెలిపారు. నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బాధితులు ఆందోళన చెందనవసరం లేదని ఎస్పీ అన్నారు. నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీకి చర్యలు చేపట్టామన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేస్తాం: మంత్రి ధర్మాన ప్రకాశం: రిజిస్ట్రేషన్ శాఖలో రూ.10 కోట్ల అవకతవకలు జరిగినట్లు గుర్తించామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే రూ. 7 కోట్లు రికవరీ చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేస్తామని మంత్రి ధర్మాన అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఇవీ చదవండి: 'బుల్లెట్ బండి' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన ఎంపీ మిస్టరీ వీడింది.. మద్యం మత్తులో సొంత మేనల్లుడే.. -
Tirupati: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చిరుద్యోగి భారీ దందా
తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన ఓ చిరుద్యోగి.. ఖరీదైన దుస్తులతో ఆర్భాటంగా కనిపిస్తాడు.. అధికారుల అండదండలతో రూ.కోట్లకు పడగలెత్తాడు.. సొంత సిబ్బంది సాయంతో యథేచ్ఛగా పైరవీలకు పాల్పడుతున్నాడు.. మామూళ్లు ముట్టజెప్పనిదే రిజిస్ట్రేషన్ సాగనివ్వడు.. తన ఆదేశాలను బేఖాతర్ చేస్తే నానా రభస సృష్టిస్తాడు.. ప్రశ్నించిన వారిని కించపరుస్తాడు.. అడ్డొచ్చిన వారిని హడలెత్తిస్తాడు.. కారుణ్య నియామకంతో ఉద్యోగంలో చేరి కార్యాలయాన్నే శాసిస్తున్నాడు.. బదిలీ చేసినా మళ్లీ యథాస్థానానికే పోస్టింగ్ తెచ్చుకున్న ఘనుడు.. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ చిరుద్యోగి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సాక్షి, తిరుపతి(చిత్తూరు): తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వాటాల రగడ చర్చనీయాంశంగా మారింది. కొందరు అధికారులు తమ అవసరాల కోసం పెంచి పోషించిన అవినీతి వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించింది. పదేళ్ల క్రితం కారుణ్య నియామకం కింద కార్యాలయంలో చేరిన ఓ చిరుద్యోగి ధాటికి ప్రస్తుతం ఉన్నతాధికారులే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లోటుపాట్లను క్షుణ్ణంగా తెలిసిన సదరు ఉద్యోగి విధులు.. సిబ్బంది అడిగిన ఫైళ్లు, టీ, కాఫీలు తెచ్చివ్వడం. కానీ ఆయన ఏనాడూ ఆ పనిని చేసిన పాపాన పోలేదు. తాను సొంతంగా వేతనాలు చెల్లించి ముగ్గురు వ్యక్తులను నియమించుకుని, వారితో ఆయా పనులను చేయిస్తున్నాడు. వారి ద్వారా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లావాదేవీలను నడిపిస్తున్నాడు. ఆయన వైఖరిని భరించలేక బదిలీ చేసినా ట్రిబ్యునల్‌కు వెళ్లి మరీ తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికే పోస్టింగ్ తెచ్చుకోవడం గమనార్హం. రిజిస్టేషన్‌కు రూ.2వేలు ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.2వేలను సదరు చిరుద్యోగికి సమర్పించాల్సిందే. ఇలా రోజుకు సుమారు వంద రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలిసింది. తాను నియమించుకున్న వ్యక్తుల ద్వారా ఈ సొమ్మును వసూలు చేయిస్తుంటాడు. మామూళ్ల నగదులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందికి సైతం వాటాలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వాటాల పంపిణీలో వివాదం ఏర్పడడం వల్లే మంగళవారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గొడవ జరిగిందని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఒక చిరుద్యోగి ఇంత భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పారదర్శక లావాదేవీలకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనధికారిక సిబ్బంది కార్యాలయంలో యథేచ్ఛగా సంచరిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రూ.కోట్లకు పడగలెత్తాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతి సమాచారం ఇట్టే తెలుసుకుంటాడు. ఆయన నియమించుకున్న ముగ్గురు అనధికారిక ఉద్యోగులు రోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి.. ఎవరు ఏ పనిచేశారు.. ఎవరికి ఎంత ముట్టింది అనే విషయాలను ఎప్పటికప్పుడు సదరు చిరుద్యోగికి అందిస్తుంటారు. డాక్యుమెంట్ రైటర్స్ పైనా పెత్తనం చేస్తుంటారు. మాట వినకుంటే దౌర్జన్యాలకు సైతం దిగుతుంటారు. ఇందుకోసం ముగ్గురికి రోజూ రూ.6వేల చొప్పున ఇస్తుంటాడు. ఆయన మాత్రం కనీసం రూ.50వేలు జేబులో వేసుకోనిదే ఇంటికి వెళ్లే ప్రసక్తే ఉండదని తెలిసింది. అక్రమ సంపాదనతో రూ.కోట్లు కూడబెట్టినట్లు సమాచారం. తిరుపతి నగర నడిబొడ్డులో మూడు భవనాలు, విలాసవంతమైన మూడు కార్లు, ఖరీదైన ఐదు మోటారుసైకిళ్లు ఆయన సొంతం. ఇవి కాకుండా మరిన్ని విలువైన ఆస్తులు ఉన్నట్లు పలువురు సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఆయన పూటకో వాహనంలో కార్యాలయానికి వస్తుంటాడు. చేతి పది వేళ్లకు ఉంగరాలు వేసుకుని ఖద్దర్ దుస్తులతో ఆర్భాటంగా తిరుగుతుంటాడు. చదవండి: నేపాలీ గ్యాంగ్: దోచేస్తారు.. దేశం దాటేస్తారు! -
నకిలీ చలాన్ల వ్యవహారం: ముగ్గురు అరెస్టు
వైఎస్సార్ కడప: నకిలీ చలానాల కేసులో ముగ్గురు స్టాంప్ రైటర్లను శుక్రవారం స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. కాగా, జింకా రామకృష్ణ, అనములు లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్ లు అరెస్టు అయిన వారిలో ఉన్నారు. వీరందరూ కడప అర్బన్, రూరల్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రూ.కోటి 3 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్
-
నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన నకిలీ చలాన్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్ అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో సీఎం జగన్ ఈ అంశంపై స్పందించారు. అసలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి.. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదు అని సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేశామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ‘‘తప్పులు జరుగుతుంటే ఎందుకు మన దృష్టికి రావడం లేదు.. ఎప్పటి నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయి.. వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో, లేదో ఎందుకు చూడటంలేదు’’ అని సీఎం జగన్ అధికారులను ప్రశ్నించారు. ‘‘క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకోవాలి. అవినీతిపై ఎవరికి కాల్ చేయాలో ప్రతి ఆఫీసులోనూ నంబర్ ఉంచాలి. కాల్ సెంటర్‌కు వచ్చే కాల్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలి. కాల్‌సెంటర్‌మీద అధికారులు ఓనర్షిప్ తీసుకోండి. అవినీతి నిర్మూలనకు సరైన ఎస్ఓపీలను తీసుకురావాలి. సబ్‌రిజిస్ట్రార్ సహా అన్ని ఆఫీసుల్లోనూ చలానాల చెల్లింపు ప్రక్రియ పరిశీలించాలి’’ అని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ మొత్తాన్ని నిశితంగా పరిశీలించామన్న ఆర్థికశాఖ అధికారులు.. అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని తెలిపారు. మీ-సేవల్లో పరిస్థితులపైనా పరిశీలన చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారం.. మరో రూ.40 లక్షలు రికవరీ
-
రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారం.. మరో రూ.40 లక్షలు రికవరీ
అమరావతి: ఏపీలో రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారంలో అధికారులు మరో రూ.40 లక్షలు రికవరీ చేశారు. ఇప్పటివరకు రూ.కోటి 77 లక్షలు అధికారులు రికవరీ చేసినట్లు సమాచారం. అంతే కాకుండా నకిలీ చలానాల కేసులో 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్రిజిస్ట్రార్లు, మధ్యవర్తుల పాత్రపై విచారణ జరుగుతోంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నకిలీ చలానాల వ్యవహారం వెలుగు చూసింది. ఈ కార్యాలయాల్లో రూ.5,40,12,982 విలువైన నకిలీ చలానాలు సృష్టించినట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన ఎనిమిది జిల్లాలో నకిలీ చలానాల వ్యవహారం నడించింది. -
నకిలీ చలాన్ల కలకలం.. తీవ్రంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం
విజయవాడ: ఏపీలో నకిలీ చలాన్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనిపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఏపీలోని 9 జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. ఈ ఘటనపై 10 క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో భాగస్వాములుగా ఉన్న ప్రతి అధికారి, ఉద్యోగిపైనా చర్యలు తీసుకుంటామని కృష్ణదాస్ అన్నారు. తమ తనిఖీల్లోనే ఈ నకిలీ చలాన్ల వ్యవహారం బయటపడిందని, ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. -
ఏసీబీ దాడులు: అదుపులో తణుకు ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్
సాక్షి, తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అదనంగా డబ్బులు వసూలు చేయడంతో పాటు పలు అవకతవకలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబు వద్ద లెక్కలు చూపని నగదు రూ.54,100 స్వాధీనం చేసుకున్నారు. డబ్బుల వసూలుకు ప్రైవేటుగా కొందరు వ్యక్తులను నియమించుకున్నట్టు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేసి సంబంధిత అధికారులకు నివేదిస్తామన్నారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ పెచ్చెట్టి రాంబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. రాత్రంతా తనిఖీలు కొనసాగుతాయని డీఎస్పీ వెల్లడించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, కె.నాగేంద్రప్రసాద్, కె.ఏసుబాబు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లోనే.. మ్యుటేషన్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గతంలో స్థానిక సంస్థలకు (మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు) ఉన్న మ్యుటేషన్ బాధ్యతలను రిజిస్ట్రేషన్ల శాఖకు బదలాయించింది. వారం రోజులుగా రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ మ్యుటేషన్ ప్రక్రియను పైలట్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పాత భవనాల మ్యుటేషన్‌ను మాత్రమే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేస్తుండగా.. ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్‌ను ఇంకా స్థానిక సంస్థల పరిధిలోనే ఉంచారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే మ్యుటేషన్ ప్రక్రియ కోసం జీహెచ్ఎంసీ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సర్వర్లతో రిజిస్ట్రేషన్ల శాఖ సర్వర్‌ను అనుసంధానం చేశారు. అయితే, జీహెచ్ఎంసీ, గ్రామాల్లోని భవనాలకు సంబంధించిన డేటా రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న కార్డ్ డేటాతో సరిపోలుతోందని, ఈ రెండుచోట్ల ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లించిన భవనాల మ్యుటేషన్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తడం లేదని తెలుస్తోంది. కానీ, మున్సిపల్ శాఖ డాటాతో రిజిస్ట్రేషన్ల శాఖ డేటా సరిపోలడం లేదని, దీంతో కొత్త మున్సిపాలిటీల్లోని భవనాల మ్యుటేషన్‌కు ఇబ్బందులు వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల సమాచారం. దీన్ని కూడా అధిగమించేందుకు మున్సిపల్, రిజిస్ట్రేషన్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, ఈ సమస్య కూడా తీరితే సాధ్యాసాధ్యాలను బట్టి ఖాళీ స్థలాలు, కొత్త భవనాల మ్యుటేషన్ బాధ్యతలు కూడా రిజిస్ట్రేషన్ల శాఖకు అప్పగించే అంశాన్ని మ్యుటేషన్ అంటే.. ఆస్తి బదలాయింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా జరిగితే ఆ ఆస్తిని సంక్రమణదారుడి పేరిట నమోదు చేయడమే మ్యుటేషన్ ప్రక్రియ. గతంలో ఏదైనా భూమి లేదా ఆస్తిపై క్రయ, విక్రయ లావాదేవీ జరిగితే ఆ లావాదేవీని సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసేవారు. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా మ్యుటేషన్ కోసం పట్టణాల్లో అయితే మున్సిపాలిటీలు, గ్రామాల్లో అయితే పంచాయతీలకు వెళ్లేవారు. మ్యుటేషన్ కోసం మళ్లీ మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకునేవారు. మీ సేవా కేంద్రం నుంచి దరఖాస్తు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల అధికారులు పాత యజమాని, కొత్త యజమానికి సదరు ఆస్తి లేదా భూమిపై ఉన్న హక్కులు, భూమి/భవనం విస్తీర్ణం ఎంత ఉంది? ఎంత పన్ను చెల్లించాలి? చెల్లించారా లేదా, నిబంధనల ప్రకారం ఉన్నాయా? అనే అంశాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ లావాదేవీలో ఉన్న సంక్రమణదారుడి పేరిట బదిలీ (మ్యుటేషన్) చేసేవారు. అయితే, ఈ మ్యుటేషన్ కోసం ఫీజును మాత్రం రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లించేవారు. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా మ్యుటేషన్ ఫీజు స్థానిక సంస్థలకు వెళ్లేది. మ్యుటేషన్ ఫీజు రిజిస్ట్రేషన్ సమయంలోనే చెల్లిస్తున్నారు కనుక మళ్లీ ప్రత్యేకంగా స్థానిక సంస్థలకు దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే మ్యుటేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్ లావాదేవీ పూర్తయిన తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీఐఎన్)ను నమోదు చేసి, సదరు భవనానికి సంబంధించిన వివరాలు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా.. లేదా.. ఉల్లంఘనలున్నాయా.. అనే అంశాలను పరిశీలించి మ్యుటేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి.పరిశీలిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. -
Telangana: రిజిస్ట్రేషన్లకు ‘అంతుచిక్కని’ సమస్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నింటినీ సమన్వయం చేసే ప్రధాన సర్వర్‌లో సాంకేతిక ఇబ్బంది తలెత్తింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సర్వర్‌లో సరి సంఖ్యలో నమోదై ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శుక్రవారం వరకు సజావుగానే పనిచేసినా, శనివారం సరి, బేసి సంఖ్యలో (రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల క్రమసంఖ్యలోని సరి, బేసి సంఖ్యలు) ఉన్న అన్ని కార్యాలయాలకూ సమస్య వచ్చింది. దీంతో శనివారం అరకొరగానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొదలైన మూడురోజులకే.. లాక్డౌన్ వేళలు సవరించిన తర్వాత మే 31 నుంచే రిజిస్ట్రేషన్ లావాదేవీలు మళ్లీ మొదలయ్యాయి. రెండు, మూడు రోజుల పాటు సజావుగానే జరిగిన తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడింది. తొలుత చిన్నదే అనుకున్నా తర్వాత పెద్దది అయ్యింది. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారి వివరాల కోసం సబ్ రిజిస్ట్రార్ల లాగిన్‌లోని కార్డ్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి తలెత్తడంతో ఏం జరిగిందనే అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. దీంతో గచ్చిబౌలి స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్ నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య వచ్చిందని తేలింది. తొలుత ఐటీ శాఖతో కలిసి ప్రయత్నించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఆ సిబ్బంది చేసిన ప్రయత్నం మేరకు గురు, శుక్రవారాల్లో కొన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. ప్రధాన సర్వర్‌లో సరి సంఖ్యతో ఉన్న కార్యాలయాల్లో ఇబ్బంది లేకుండానే కార్డ్ అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక, బేసి సంఖ్యతో కూడిన కార్యాలయాల సమస్యను కూడా పరిష్కరించేందుకు సిబ్బంది యత్నించడంతో శనివారం సరి సంఖ్యలోని కార్యాలయాల్లో కూడా సర్వర్ డౌన్ అయినట్టు తెలుస్తోంది. సమస్య ఏమిటో తేలకపోవడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం రోజుకు సగటున 3,500కు పైగా లావాదేవీలు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం రోజుకు సగటున 900 వరకు మాత్రమే జరుగుతున్నాయి. శనివారం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా 500కు మించి జరగలేదని తెలుస్తోంది. అయితే ఆదివారం కల్లా సమస్య పరిష్కారమవుతుందని, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. -
ఫస్ట్ డే... 2,155
రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. తొలిరోజు సోమవారం సజావుగా సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 2,155 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా రూ.19.3 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ధరణి ద్వారా కొత్త పద్ధతిలో 10 రోజుల్లో 1,760 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగితే, సోమవారం ఒక్కరోజే పాత పద్ధతిలో దానికి మించి రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. సంగారెడ్డి, రంగారెడ్డి–1, కుత్బుల్లాపూర్ లాంటి కార్యాలయాల్లో ఒక్కోచోట 120కి పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాత పద్ధతిలో ప్రారంభమైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు తొలిరోజు సోమవారం సజావుగా సాగాయి. పాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇటు ప్రజలకు, అటు సిబ్బందికి సుపరిచితం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 2,155 రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా రూ.19.3 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరింది. ధరణి ద్వారా కొత్త పద్ధతిలో 10 రోజుల్లో 1,760 వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగితే, సోమవారం ఒక్కరోజే పాతపద్ధతిలో దానికి మించి రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. హైదరాబాద్ శివార్లలో భారీగా.. పాత పద్ధతిలో మళ్లీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అటు డాక్యుమెంట్ రైటర్లు, ఇటు లావాదేవీల కోసం వచ్చే ప్రజలతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు నిండిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి–1, కుత్బుల్లాపూర్ లాంటి కార్యాలయాల్లో ఒక్కోచోట 120కి పైగా రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఎల్బీ నగర్, గండిపేట, అబ్దుల్లాపూర్‌మెట్ లాంటి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా ప్రజలు వచ్చారు. సోమవారం రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారికి 10 నిమిషాల్లో డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి గంటలోపే రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు స్కాన్ చేసి ఇచ్చేశామని సిబ్బంది పేర్కొన్నారు. చదవండి: (సంక్షేమానికి ఆధార్ అడగొచ్చు) ధరణి ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్లాట్లను, చలాన్లను కూడా కార్డ్ పద్ధతిలోకి మార్చి రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు. సోమవారం ఒక్కరోజే 5,556 ఈ చలాన్లు కట్టగా, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.76.1 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక, ఈ నెలలో మొత్తం 12,359 చలాన్లు రాగా, 135.6 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ చలాన్లు ఆరునెలల పాటు చెల్లుబాటవుతాయి కాబట్టి ఆలోపు ప్రజలు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశముంది. తొలిరోజు రద్దీ ఉంటుందనే అంచనాతో ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా ముగిసింది. ఎల్ఆర్ఎస్....తలనొప్పులు పాత పద్ధతిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ లేని భూములను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారనే అంచనాతో చాలా మంది సోమవారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లారు. అయితే ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని సిబ్బంది తేల్చిచెప్పడంతో నిరాశకు గురయ్యారు. దీనిపై ప్రజలు కొన్నిచోట్ల సబ్రిజిస్ట్రార్లతో వాగ్వాదానికి దిగగా మరికొన్ని చోట్ల రియల్టర్లు, ప్రజలు కలిసి ఆందోళనలకు దిగారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
రిజిస్ట్రేషన్.. ఫ్రస్టేషన్
ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే వాటిల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. క్రయ–విక్రయాల నిమిత్తం ఈ కార్యాలయాలకు నిత్యం ఎంతో మంది వచ్చి వెళ్తారు. వీళ్లకు కావల్సిన సౌకర్యాలను అక్కడి సిబ్బంది సమకూర్చాల్సి ఉంది. కానీ మచిలీపట్నంలో అందుకు విరుద్ధంగా సాగుతోంది. లాక్డౌన్ సాకుతో ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రధాన గేటుకు తాళాలు వేస్తున్నారు. దీంతో వచ్చే వారు లోపలకి వెళ్లేందుకు నానా ఇబ్బందీ పడుతున్నారు. ఇక్కడ అతి జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు, కార్యాలయం లోపల మాత్రం భౌతిక దూరం విషయంలో ఏమాత్రం పట్టించుకోవటం లేదు. కార్యాలయానికి వచ్చే వారు వేచి ఉండేందుకు అందుబాటులో రేకులు షెడ్డు ఉన్నప్పటికీ, ఫ్యాన్లు తిరగకపోవటంతో, ఎండవేడిమి తాళలేక అక్కడి నుంచి వచ్చేసి, ప్రాంగణంలోని చెట్లు క్రింద కూర్చుంటున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం ఇక్కడ నెలకొన్న సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. –సాక్షి ఫొటోగ్రాఫర్, మచిలీపట్నం పనిచేయని ఫ్యాన్లు చెట్ల నీడే దిక్కు! -
అనుమతులా.. మాకెందుకు..?
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘నూతన మున్సిపల్ చట్టం మాకు వర్తించదు.. లే అవుట్, ఎల్ఆర్ఎస్ ఏ అనుమతి లేకున్నా ఫర్వాలేదు. బై నంబర్లతో సర్వే నంబర్లు ఉన్నా చాలు.. ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేస్తాం.’ ఇదీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లే అవుట్ లేని వెంచర్లలో ప్లాట్లకు అధికారికంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యవహారం. సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేయడంతో ఇది బయట పడింది. మున్సిపల్ కమిషనర్ ఫలానా వెంచర్లకు లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతి లేదని లేఖ ఇచ్చినా ఎలా రిజిస్ట్రేషన్ చేశారని సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. పుట్టగొడుగుల్లా వెంచర్లు.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలిశాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. గత ఏడాది సమీప గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట పట్టణానికి సమీపంలో కుడకుడ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, జనగాం రోడ్డు, కోదాడ రోడ్డు, కోదాడలో ఖమ్మం, విజయవాడ రోడ్డు, మునగాల రోడ్డు, హుజూర్నగర్, నేరేడుచర్లలో మిర్యాలగూడ రోడ్డులో, తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో జనగామ, సూర్యాపేట రోడ్డులో వెంచర్లు వెలిశాయి. అయితే మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రియల్టర్లు వెంచర్లు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్ అధికారులు పలుమార్లు అక్రమ వెంచర్లపై కొరడా ఝుళిపించి ఈ వెంచర్లలో ప్లాట్ల హద్దు రాళ్లను జేసీబీలతో తీయించినా మళ్లీ కొన్నాళ్లకే రియల్టర్లు హద్దురాళ్లు పెడుతున్నారు. నూతన మున్సిపల్ చట్టం అస్త్రం ప్రయోగించినా.. అనుమతులు లేకున్నా రియల్టర్లు ప్లాట్లు చేస్తుండడంతో మున్సిపల్ అధికారులు కొత్త మున్సిపల్ చట్టాన్ని అస్త్రంగా చేసుకున్నారు. 2019 జూలైలో తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ప్రకారం లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతి లేని ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయవద్దు. అనుమతి లేని ప్లాట్లలో భవనాలు నిర్మించినా రిజిస్ట్రేషన్ చేయవద్దని ఈ చట్టం స్పష్టం చేస్తుంది. దీని ప్రకారం జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో అక్రమ వెంచర్ల జాబితాను సర్వే నంబర్లతో సహా సబ్ రిజిస్ట్రార్లకు పంపారు. అయినా ఇక్కడ అక్రమ తంతుకు అడ్డుకట్ట పడలేదు. కొత్త మున్సిపల్ చట్టం అమలుకు తిలోదకాలిచ్చి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో యథేచ్ఛగా అక్రమ వెంచర్ల ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. లే అవుట్, ఎల్ఆర్ఎస్ లేకుంటే మా కెందుకు..? ఆదాయమే పరమావధిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొందరు రియల్టర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల చేతులు తడిపి మరీ హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమ వెంచర్లను పరిశీలించిన అనంతరం మున్సిపల్ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి కలెక్టర్ తనిఖీతో బయటపడిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం.. లే అవుట్, ఎల్ఆర్ఎస్ లేకుండా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వెంచర్లలో జేసీబీలతో ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. వీటిని కలెక్టర్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ వెంచర్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేశారా..? అని మున్సిపల్ అధికారులను ఆరా తీసిన కలెక్టర్ వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం లే అవుట్, ఎల్ఆర్ఎస్ అనుమతి లేకుండా 36 వెంచర్లు వెలిశాయని వీటిలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని గత ఏడాడి నవంబర్ నుంచి మున్సిపల్ కమిషనర్ మూడు సార్లు సబ్ రిజిస్ట్రార్‌కు లేఖలు పంపారు. ఆయా వెంచర్ల సర్వే నంబర్లు, ఎంత విస్తీర్ణం అన్నది కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ లేఖ ఇచ్చిన తర్వాత కూడా ఈ సర్వే నంబర్లలో రెండు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఎలా చేశారని కలెక్టర్.. సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. ఒక సర్వే నంబర్‌కు అనుమతి లేదని ఇస్తే.. అదే సర్వే నంబర్‌కు బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు కలెక్టర్ తనిఖీలో బయటపడింది. ఇలా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయనున్నట్లు సమాచారం. నూతన మున్సిపల్ చట్టాన్ని పక్కన పెట్టి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరుపై ఆ శాఖ ఉన్నతాదికారులు కింది స్థాయి అధికారులకు ఇప్పటికే మొట్టికాయలు వేసినట్లు తెలిసింది. లే అవుట్ ఉంటనే రిజిస్ట్రేషన్ చేయాలి 2019 జూలైలో వచ్చిన నూతన మున్సి\ పల్ చట్టానికి అనుగుణంగా లే అవుట్లకు అనుమతి తీసుకోవాలి. మున్సిపాలిటీ నుంచి అనుమతి వచ్చిన లే అవుట్లకు మాత్రమే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయాలి. లే అవుట్ అనుమతి లేకున్నా కనీసం ఎల్ఆర్ఎస్ కచ్చితంగా ఉండాలి. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 36 అనుమతి లేని వెంచర్లు ఉన్నట్లు ప్రస్తుతం గుర్తించాం. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కలెక్టరేట్లో ఒక టీంను ఏర్పాటు చేసి అన్ని మున్సిపాలిటీల్లో అనుమతి లేని వెంచర్లు గుర్తిస్తాం. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్ట ప్రకారం లే అవుట్లకు అనుమతి ఇస్తాం. మున్సిపాలిటీ అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్లు చేయొద్దు. – టి.వినయ్‌కృష్ణారెడ్డి, కలెక్టర్ -
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం తనిఖీ
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలోని సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం కోసం సోంత భవనం ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి, మధ్యవర్తుల దోపిడిలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఆన్లైన్ విధానం అమలు చేస్తామని తెలిపారు. గతంలో మధురవాడ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసి తప్పుడు ఆరోపణలు చేశాయని, అందుకే తాను ఆకస్మిక తనిఖీకి వచ్చానని పిల్లి సుభాష్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఏసీబీ దాడులపై సబ్ రిజిస్టర్ సిబ్బందితో ఆయన చర్చించినట్లు చెప్పారు. కాగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ తారకేష్ పనితీరు బాగుందని, రిజిస్ట్రేషన్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను ఆయన అభినందించారు. రిజిస్ట్రేషన్లపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఈ ప్రాంతం దేశంలోనే రెండో ఆర్ధిక రాజధానిగా ఎదగడానికి అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
దగ్గరుండి పని పూర్తి చేయిస్తారు..!
సాక్షి, ఆదోని: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌లో పబ్లిక్ డేటా ఎంట్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చినా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దళారులకు అడ్డుకట్ట పడటం లేదు. ఈ నెల 10న ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో 11 మంది దళారుల నుంచి రూ. 88,120, సిబ్బంది నుంచి రూ.3,100 అనధికారిక సొమ్మును స్వాధీనం చేసుకోవడం ఇందుకు అద్దం పడుతోంది. జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ఎదుట పదుల సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్లు ప్రత్యేక దుకాణాలు తెరిచారు. వీరిలో చాలా మంది అటు అధికారులు, ఇటు క్రయ విక్రయదారులకు మధ్య దళారులుగా వ్యవహరిస్తూ అక్రమ వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరి ప్రమేయంతోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో పెద్దఎత్తున అవినీతి, అక్రమార్కులు జరుగుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గత ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి పబ్లిక్ డేటా ఎంట్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లోనూ ఈ విధానం అమలవుతోంది. అయితే.. ఈ విధానంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు కావడం లేదు. దాదాపు 70 శాతం రిజిస్ట్రేషన్లు మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎంతో సులువు పబ్లిక్ డేటా ఎంట్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను సులువుగా చేసుకోవడానికి ప్రభుత్వం సరళమైన విధానం ప్రవేశ పెట్టింది. ఇంటి వద్దే సొంతంగా డాక్యుమెంట్లు రాసుకోవడానికి వీలుగా తెలుగు, ఇంగ్లిష్‌లో 16 రకాల నమూనాలను ఆన్లైన్లో ఉంచింది. ఇందులో తమకు సరిపోయే నమూనాలో వివరాలు పొందుపరిచిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో పెట్టి.. రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. ఇలా చేసుకోవడం వల్ల అధికారుల అవినీతికి ఆస్కారం ఉండదు. సమయం కూడా ఆదా అవుతుంది. ఈ కొత్త విధానంపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత రిజిస్ట్రేషన్ అధికారులపై ఉంది. ప్రత్యేక సదస్సుల ద్వారా అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అధికారులు అవగాహన సదస్సులను తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులిపేసుకున్నారు. అక్రమార్జనకు బ్రేక్ పడుతుందని.. కొత్త విధానంపై ప్రజలలో అవగాహన పెరిగితే తమ అక్రమార్జనకు బ్రేక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అందువల్లే ఎక్కడా చిత్తశుద్ధితో సదస్సులు నిర్వహించలేదు. ఈ విధానం గురించి తెలియని చాలామంది క్రయవిక్రయదారులు ఇప్పటికీ దళారులను ఆశ్రయిస్తున్నారు. వారిని దళారుల అవతారమెత్తిన డాక్యుమెంట్ రైటర్లు తమ దుకాణాల్లో కూర్చోబెట్టి కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి సమాచారం ఇస్తున్నారు. మార్కెట్ విలువ తెలుసుకుని, బ్యాంకుకు వెళ్లి ఆ మేరకు ఫీజులు చెల్లించి చలానాలు సిద్ధం చేస్తున్నారు. డాక్యుమెంట్లు సిద్ధం చేసిన తరువాత క్రయవిక్రయదారుల సంతకాలు పెట్టించి.. కార్యాలయంలో దగ్గరుండి రిజిస్ట్రేషన్లను పూర్తి చేయిస్తున్నారు. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయో రాత్రికి లెక్కగట్టి..అక్రమంగా వసూలు చేసిన సొమ్మును అధికారులు, సిబ్బంది చెప్పిన చోట, వాళ్లు నియమించుకున్న వారికి అందజేస్తున్నారు. ప్రతి రిజి్రస్టేషన్ కార్యాలయంలోనూ ఇదే తంతు సాగుతోంది. ప్రతి సేవకూ ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారు. అయితే ఎక్కడా నేరుగా డబ్బు తీసుకోవడం లేదు. దళారుల సాయంతోనే మొత్తం దందా సాగిస్తున్నారు. వీరి తీరు వల్ల అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ ఆశయానికి గండి పడుతోంది. -
మదనపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
మదనపల్లె టౌన్ : మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడిచేశారు. సబ్ రిజిస్ట్రార్ వెంకటేశులురెడ్డి, కింది స్థాయి సిబ్బంది ఏర్పాటు చేసుకున్న బినామీ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి రూ.86,810 స్వాధీనం చేసుకున్నారు.ఎటువంటి రసీదులు లేకుండా డబ్బు కలిగి ఉన్న 15 మందిపై కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ అల్లాబ„Š విలేకరుల సమావేశంలో వెల్లడించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ వెంకటేశులురెడ్డి, సిబ్బంది సుమారు 15 మందికిపైగా అనధికారికంగా వ్యక్తులను నియమించుకున్నారు. వారి ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సమాచారం అందడంతో ఏసీబీ తిరుపతి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు అధికారుల బృందం దాడి చేసింది. ట్రాన్స్‌కో డెప్యూటీ డీఈ మాధవరావు సమక్షంలో రికార్డులు పరిశీలించారు. కార్యాలయ ఆవరణం, గేటు బయట ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, బినామీ ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద అనధికారికంగా ఉన్న నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. ఏసీబీ సీఐలు ప్రసాద్‌రెడ్డి, గిరిధర్, ఎస్ఐ నాగేంద్ర, మరో 10 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
అసలెవరు.. నకిలీలెవరు ?
న్యూశాయంపేటకు చెందిన ఓ వ్యక్తి తన 400 గజాల భూమిని అవసరాల నిమిత్తం విక్రయించేందుకు మరో వ్యక్తితో ఒప్పందం కుదర్చుకుని బయానా తీసుకున్నారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం తన కుటుంబసభ్యులు, కొనుగోలుకు అంగీకరించిన వ్యక్తితో కలిసి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే ప్రతీరోజు నంబర్ల ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నందున రేపు రావాలని ఉద్యోగులు సూచించారు. మరలా హైదరాబాద్ నుంచి కుటుంబం, కొనుగోలు చేసిన వ్యక్తితో కలిసి రాలేనని చెప్పినా అంగీకరించలేదు. ఇదంతా చూస్తున్న ఓ డాక్యుమెంట్ రైటర్ తన కార్యాలయంలోకి తీసుకెళ్లి ‘నేను ఈ రోజే మీ రిజిస్ట్రేషన్ చేయిస్తాను, నాకు రూ.10వేలు ఇవ్వండి’ అని చెప్పాడు. దీంతో ఆ డబ్బు ఇవ్వగా సాయంత్రం 5 గంటలకు వరకు రిజిస్ట్రేషన్ పూర్తి చేయించాడు. హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి పలివేల్పులలోని 300 గజాల భూమిని కొనుగోలు చేసేందుకు నిశ్చయించుకున్నాడు. ఈ మేరకు యజమానికి బయానా ఇచ్చేందుకు సిద్ధమైన ఆయన.. భూమి ఎవరికైనా ఇంతకు ముందే రిజిస్ట్రేషన్ అయిందా, లేక భూయజమాని పేరిటే ఉందా అనే సందేహంతో ఈసీ(ఎన్‌కంబర్స్‌మెంట్ సర్టిఫికెట్) కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. దీనికి ‘మీ సెల్ఫోన్లో టీఎస్ ఫోలియో యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి.. లేదంటే బయట ఉన్న డాక్యుమెంట్ రైటర్లను కలవండి’ అనే సలహా కార్యాలయ సిబ్బంది నుంచి వచ్చింది. దీంతో బయట డాక్యుమెంట్ రైటర్‌ను కలవగా కార్యాలయానికి చెల్లించాల్సిన డబ్బుతో పాటు అదనంగా రూ.500 తీసుకుని క్షణాల్లో ఈసీ అందజేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలోని ఎక్కడి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చూసినా బినామీలు, దళారుల హవానే కనిపిస్తోంది. అధికారులకు ఇదంతా తెలిసినా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండడం క్రయ, విక్రయదారులకు శాపంగా మారింది. సాక్షి, వరంగల్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడుగుపెడితే.. అక్కడ ప్రైవేట్ వ్యక్తులెవరో, శాఖ ఉద్యోగులెవరో ఎంతటి ఘనులైనా కనుక్కోలేరు! కార్యాలయాల్లో హడావుడిగా తిరుగుతూ చకచకా పనులు చేస్తూ రిజిస్ట్రేషన్ పత్రాలపై సబ్‌రిజిష్ట్రాలతో సంతకాలు పెట్టిస్తూ... ‘ఆజ్ నై.. కల్ ఆవో’ అంటూ ప్రజలపై పెత్తనం చేస్తూ.. పని కాగానే ‘పద్ధతి’ని పాటించాలంటూ బహిరంగంగానే అమ్యామ్యాలు డిమాండ్ చేసే వారిని చూడొచ్చు. ఇలాంటి వారిని మనం ప్రైవేట్ వ్యక్తులని ఎవరూ భావించం. విలువైన రికార్డుల గదుల్లోనూ అంతా తామై పనులు చక్కపెట్టే వీరి వ్యవహార తీరు అచ్చం శాఖ ఉద్యోగులను తలపిస్తుంది. అధికారులతో వీరు వ్యవహరించే పద్ధతిని పరిశీలిస్తే కూడా ఇదే అనిపిస్తుంది. కానీ ఎక్కువగా ప్రైవేట్ వ్యక్తులే ఇందులో ఉంటారు. అధికారుల అండదండలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తులు ఆడింది ఆటగా సాగుతోంది. జిల్లా కేంద్రాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని విభాగాల్లో వీరి ఆధిపత్యం కొనసాగుతుండటంతో ‘మూడు డాక్యుమెంట్లు... ఆరు రిజిస్ట్రేషన్లు’ అన్న చందంగా అక్రమాలు సాగుతున్నాయి. డాక్యుమెంట్ రైటర్లే మధ్యవర్తులు అక్రమాలు, అవినీతి జరుగుతుందని ఎవరైనా అంటే... అమ్మేవారు, కొనేవారు ముందకొచ్చి, తమకు, శాఖకు లాభం ఉంటే చాలు చార్మినార్‌నైనా రిజిస్ట్రేషన్ చేస్తామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతుంటారు. అసలే మాయాజాలంతో సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలువురు.. ఉద్యోగుల వైఖరిని ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా భూదందాలకు పాల్పడుతున్నారు. తమ వద్దకు వచ్చిన రిజిస్ట్రేషన్ పత్రం నకిలీదా, సరైనదా అనే విషయం పరిశీలించకుండా, తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించకుండానే కొందరు ఏకపక్షంగా రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పొలం, స్థలం, భవనం ఇలా దేనినైనా రిజిస్ట్రేషన్ చేసే ముందు కొనే వ్యక్తి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ స్థలం అవతలి వ్యక్తిదేనా అన్నది విచారించాలి. కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆలా జరగడం లేదు. ఒక్కో పొలం, స్థలం, భవనం నాలుగైదు సార్లు హక్కుదారులకు తెలియకుండానే చేతులు మారుతున్నా సబ్ రిజిస్ట్రార్లు పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్లు చేస్తూనే ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండటంతో రూ.లక్షలు చేతులు మారుతున్నాయని సమాచారం. డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో 2002లో అప్పటి వరకు ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్లను లైసెన్సు రెన్యూవల్‌ను నిలిపివేసింది. అయినా ఉమ్మడి జిల్లాలోని 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూరా యథేచ్ఛగా డాక్యుమెంట్ రైటర్ల అడ్డాలు ఉండడం.. వీరు చెప్పినట్లే అంతా నడుస్తుండడం గమనార్హం. డాక్యుమెంట్ రైటర్లుగా రిటైర్డ్ సబ్రిజిస్ట్రార్లు పారదర్శకంగా రిజిస్ట్రేషన్లను నిర్వహించేందుకు ప్రభుత్వం గతేడాది పబ్లిక్ డేటా ఎంట్రీని అమల్లోకి తీసుకొచ్చింది. శాశ్వతమైన దస్తావేజులను స్వయంగా తయారు చేసుకునే వెసలుబాటు లభించింది. ఈ విధానంలో స్వయంగా ఇంట్లోనే దస్తావేజు తయారు చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు హాజరైతే సరిపోతుంది. కానీ దస్తావేజుదారులు తమ పని పోగొట్టుకోలేక సబ్ రిజిస్ట్రార్లతో ములాఖత్ అయి రిజిస్ట్రేషన్ నిమిత్తం వచ్చే వారిని తమ వద్దకు పంపించేలా రాయబారాలు నడుపుతున్నారు. దీంతో పబ్లిక్ డేటా ఎంట్రీ పక్కదారి పట్టి భూక్రయ విక్రయదారులు తిరిగి డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. వరంగల్ ఆర్వో కేంద్రంగా కార్యాలయ ఎదుట, చుట్టుపక్కల 40 నుండి 60వరకు డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే, రిటైర్డ్ అయిన సబ్ రిజిస్ట్రార్లు పలువురు డాక్యుమెంట్ రైటర్లుగా అవతారం ఎత్తారంటే ఇందులో ‘లాభం’ ఎంత ఉందో ఇట్టే అవగతమవుతుంది. -
మీ దస్తావేజుకు..మీరే లేఖరి
సాక్షి, అమరావతి: మీరు స్థిరాస్తి కొన్నారా. ఆ వెంటనే దస్తావేజు లేఖరిని సంప్రదించక్కర్లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లక్కర్లేదు. ఇక నుంచిఆస్తి కొనుగోలు దస్తావేజులను మీరే తయారు చేసుకోవచ్చు. భూములు, స్థలాలు, భవనాల వంటి స్థిరాస్తుల కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ల కోసం, డాక్యుమెంట్ల తయారీ నిమిత్తం ఇక దస్తావేజు లేఖరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తెలుగులో అత్యంత సులభంగా మీ దస్తావేజులను మీరే తయారు చేసుకోవడానికి వీలుగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో నమూనా దస్తావేజులను అప్లోడ్ చేసింది. న్యాయ, రెవెన్యూ రంగాల నిపుణులతో చర్చించి సులభ శైలిలో ప్రజాప్రయోజనాల కోసం వీటిని రూపొందించింది. ఈ నమూనా దస్తావేజుల్లో ఖాళీలు నింపుకుంటే న్యాయబద్ధంగా చెల్లుబాటయ్యేలా స్థిరాస్తి విక్రయ రిజిస్ట్రేషన్ దస్తావేజు తయారవుతుంది. అన్ని వివరాలు నింపిన తర్వాత తప్పులేమైనా ఉన్నాయేమో సరిచూసుకుని సరిదిద్దుకునే వెసులుబాటు కూడా ఉంది. అన్నీ సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే సదరు దస్తావేజు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ శాఖకు చేరుతుంది. ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ రోజుకు ముందుగానే స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న రోజు అదే సమయానికి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అమ్మకందారులు, సాక్షులతో వెళ్లి అర గంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ సులభతర విధానం కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది. నెలాఖరు వరకు ఇక్కడ ఎదురయ్యే అనుభవాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు, చేర్పులతో ఈ విధానాన్ని నవంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. చదువుకున్న వారెవరైనా దస్తావేజులనుసొంతంగా తయారు చేసుకునే వెసులుబాటు కొత్త విధానం ద్వారా లభిస్తోంది. దస్తావేజుల తయారీ ఇలా.. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళితే ఎడమ వైపు కింది భాగంలో న్యూ ఇనిషియేటివ్స్ అనే బాక్సులో డాక్యుమెంట్ ప్రిపరేషన్ అని ఉంటుంది. దీనిని క్లిక్ చేసి పాస్వర్డ్, ఐడీ రిజిస్టర్ చేసుకుని డాక్యుమెంట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో కొనుగోలుదారు పేరు, నివాస ప్రాంతం, ఆధార్ నంబరు, అమ్మకందారు పేరు, నివాస ప్రాంతం, అమ్మకందారు ఆధార్ నంబరు లాంటి వివరాలు నింపేందుకు ఖాళీలు వదిలి డాక్యుమెంటు ఉంటుంది. స్థిరాస్తి వివరాలు (సర్వే నంబరు/ఫ్లాట్ నంబరు/ప్లాట్ నంబరు, గ్రామం/ పట్టణం) లాంటి వివరాలను కూడా ఖాళీల్లో నింపితే డాక్యుమెంటు తయారవుతుంది. ఆస్తి వివరాలు నమోదు చేసిన తర్వాత దాని రిజిస్ట్రేషన్‌కు ఎంత మొత్తం చెల్లించాలో కూడా ఆన్లైన్లో ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్రకారం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ రుసుం చెల్లించాలి. ఏరోజు, ఏ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ముందే నిర్ణయించుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోదలిచారో కూడా పేర్కొనాలి. దస్తావేజు అంతా సక్రమంగా పూరించినట్లు నిర్ధారించుకున్న తర్వాత ప్రింటవుట్ తీసుకుని సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆ దస్తావేజు సంబంధిత సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళుతుంది. స్లాట్ బుకింగ్ ప్రకారం సబ్ రిజిస్ట్రారు కార్యాలయానికి వెళితే ఆన్లైన్లోని వివరాలను పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజు కాపీ ఇస్తారు. -
సబ్ రిజస్ట్రార్ కార్యాలయంపై.. ఏసీబీ దాడి
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వచ్చిన అవినితీ ఆరోపణల నేపథ్యంలో ఆకస్మికంగా దాడి చేశామని ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజువారి వేతనానికి పనిచేస్తున్న ఉద్దగిరి శ్రీనివాసరావు అనే వ్యక్తి వద్ద రూ.70 వేలు ఉన్నట్లు డీఎస్పీ గుర్తించారు. రిజస్ట్రార్ కార్యాలయంలోని క్రయ, విక్రయ దస్త్రాలను పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ రాజేశ్వరరావుతో పలు విషయాలపై డీఎస్పీ విచారించారు. తనిఖీలు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. ఈ తనిఖీల్లో అవినీతి నిరోధక శాఖ సీఐలు భాస్కరరావు, హరి, ఇతర సిబ్బంది ఉన్నారు. ఉలిక్కిపడిన సిబ్బంది ఆగస్టు 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ విలువలు పెరుగుతున్నాయని తెలియడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం క్రయ, విక్రయధారుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. ఈ సమయంలో ఏసీబీ అధికారుల ప్రవేశంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందితోపాటు కార్యాలయం సమీపంలోనే క్రయ, విక్రయాల లావాదేవీలపై డాక్యుమెంటేషన్ చేసే మధ్యవర్తులను అదుపులోనికి తీసుకుని కార్యాలయంలో జరిగే కార్యక్రమాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటైన తరువాత ఏసీబీ దాడులు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల అడ్డా్డగా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రైవేటు వ్యక్తుల అడ్డగా మారింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరి చెప్పినదానికే సిబ్బంది కూడా తల ఉపడంతో చేసేది ఏమిలేక క్రయ, విక్రయాలకు కూడా వీరినే సంప్రదించడం పరిపాటిగా మారింది. ఈ తతంగం కొన్నేళ్లుగా జరుగుతున్నా.. రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది అడ్డుకట్ట వేయడంలేదు. ఈ కార్యాలయంలో ప్రతి పని కాసులపైనే నడుస్తుంది. ఆస్తుల క్రయ, విక్రయాల లావాదేవీలు ప్రైవేటు వ్యక్తుల కనుసైగల్లోనే జరుగుతున్నాయి. రిజిస్ట్రేన్‌కు సంబంధించిన వ్యవహారాలన్ని వీరు చూడడంతో ఒక్కో పనికి ఒక రేటు పెట్టారు. ప్రభుత్వ నిబంధనలతో పనిలేకుండా నేరుగా వీరి సమక్షంలోనే లావాదేవీలు జరపడంతో అటు కార్యాలయంలోని దిగువ స్థాయి సిబ్బంది, ఇటు క్రయవిక్రయాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో దస్తావేజులు తదితర వ్యవహారమంతా ప్రైవేటు వ్యక్తులే చూడడం పరిపాటిగా మారింది. ఎవరికైనా దస్తావేజు పత్రాలు అవసరమైతే వారి వద్ద నుంచి భారీ మొత్తాన్ని తీసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి తెలియకుండానే పనులు చక్కబెడుతున్నారు. భూముల ధరలు ప్రైవేటు వ్యక్తులకు బయటకు తెలియపర్చడంతో కొన్నిసార్లు క్రయ, విక్రయాదారుల మధ్య వివాదాలు చోటుచేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ ఝాన్సీ రాణి బదిలీ అయ్యారు. 15 రోజుల క్రితమే రాజేశ్వరరావు రిజిస్ట్రార్‌గా వచ్చారు. -
ఏసీబీ దాడులు.. నగదు స్వాధీనం
సాక్షి, గూడూరు: గూడూరులోని స్టాంప్స్ అండ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక్కసారిగా ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో, సీఐలు కార్యాలయంలోకి ప్రవేశించి తలుపులు మూసేసి తనిఖీలు చేపట్టారు. దీంతో అధికారులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. సుమారు రెండు గంటలకు పైగా సోదాలు చేసిన ఏసీబీ అధికారులు లెక్కల్లో లేని రూ.1,39,150 స్వాధీనం చేసుకున్నారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ భానుమతి వద్ద ఎవరెవరికి ఎంత నగదు చెల్లించాలన్న విషయాలు రాసి ఉన్న ఒక స్లిప్ దొరికిందని, దానిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ వివరాలను వెల్లడించారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో భూములు, ఇళ్లు ఇతర ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాలు చేసే వారి నుంచి భారీఎత్తున లంచాలు తీసుకుంటున్నారని బాధితుల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక దాడులు చేసినట్లు చెప్పారు. ఇంకా కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం సిబ్బందితోపాటు సోమవారం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా అవినీతి జరుగుతుందని బాధితులు ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆయన వెంట సీఐలు రమేష్‌బాబు, శ్రీహరి, సిబ్బంది ఉన్నారు. పొలం విషయమై.. గూడూరు రూరల్ పరిధిలోని ఓ గ్రామంలో పొలానికి సంబంధించిన విషయమై బాధితులు వారంరోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. వారి పని చేసేందుకు పెద్ద మొత్తం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగిందని, ఈక్రమంలోనే దాడులు జరిగాయని తెలుస్తోంది. కాగా అధికారులు ఇంకా రికార్డులు తనిఖీ చేస్తున్నారు. గూడూరు జిల్లా రిజిస్ట్రార్ గంగిరెడ్డిని పిలిపించి విచారించారు. ఇదిలా ఉండగా కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడుల విషయం పట్టణంలో చర్చనీయాంశమైంది. కొందరు బాధితులు ‘తమ వద్ద ఇంత తీసుకున్నారని.. మమ్మల్ని ఇంత డిమాండ్ చేశారని.. నగదు ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీ పెడతారనే భయంతో డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నాం’ అని కొందరు బాహాటంగానే చెప్పుకొచ్చారు. మాట్లాడుతున్న ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో తీరు మారలేదు గూడూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై పలు పర్యాయాలు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అయినా కార్యాలయ సిబ్బందిలో ఎలాంటి మార్పు రాలేదు. చిన్న పని కూడా చేయకుండా, రైటర్ల ద్వారా బేరసారాలు కుదుర్చుకుని భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పెబ్బేరులో మాయలేడి..!
వనపర్తి: రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటి వరకు చూడని కొత్త మోసం వనపర్తి జిల్లా పెబ్బేరులో వెలుగు చూసింది. అధికారుల అలసత్వం కారణంగా.. ఓ మహిళ తన రూ.కోటి విలువ చేసే ఆస్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎంతో విలువైన ఆస్తుల హక్కులను మార్పిడి చేసే సమయంలో రిజిస్ట్రేషన్ చేసే అధికారులు సంబంధిత లింకు డాక్యుమెంట్, పట్టాదారు పాసు పుస్తకాలు, లింకు డాక్యుమెంట్‌లోని ఫొటోలు, ఆధార్ నంబర్లు, సంతకాలను సరిపోల్చుకోవాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసేశారు. ఎట్టకేలకు గుర్తించిన బాధితురాలు ఎస్పీని ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. బాధితురాలి కథనం ప్రకారం.. తహసీల్దార్ కార్యాలయంలోనే.. కొన్ని నెలలుగా తహసీల్దార్ కార్యాలయంలోనే మండలానికి చెందిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తహల్దార్లే సబ్ రిజిస్ట్రార్ విధులు నిర్వహించేలా.. ప్రభుత్వ నిబంధనలను సడలించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అదునుగా చేసుకుని ఓ మాయలేడి, కొందరు వ్యక్తులు పెబ్బేరులో కర్నూలు పట్టణానికి చెందిన షరీఫాబీకి చెందిన సుమారు రూ.కోటి విలువ చేసే 12 ప్లాట్లపై కన్నేశారు. తానే నిజమైన షరీఫాబీని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో ఆరుగురు వ్యక్తులపై 2018 అక్టోబర్ 11వ తేదీన రిజిస్టర్ చేసింది. 2019 మార్చిలో నిజమైన యజమానురాలు ఈసీ తీసేందుకు ప్రయత్నించగా.. ప్లాట్లను షరీఫాబీ ఇతరులకు విక్రయించినట్లు గుర్తించింది. ఒక్కసారిగా అవాక్కైన ఆమె తన భర్త ఎం.మక్బూల్‌పాషా తనకు 2016 డిసెంబర్ 6వ తేదీన 12 ప్లాట్లను గిఫ్ట్ డీడీ చేయించి ఇచ్చారని ఆధారాలతో వనపర్తికి వచ్చి ఎస్పీ అపూర్వరావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదును పంపించడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. స్పందన కరువు.. మాయలేడి చేసిన డాక్యుమెంట్లను పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో డూప్లికేట్ కాపీలను తీసుకుని బాధితురాలు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుకు జత చేశారు. ఏప్రిల్‌లో పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయితే.. ఇప్పటి వరకు డూప్లికేట్ షరీఫాబీ గాను.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిని గాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టలేదు. డాక్యుమెంట్లో ఉన్న అడ్రస్‌ల ఆధారంగా పోలీసులు విచారణ చేపడితే.. అక్కడి ఇళ్లు తాళం వేసి ఉన్నాయని పోలీసులు సమాధానం చెప్పినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో తన కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తాయనుకున్న ప్లాట్లను ఇలా కాజేస్తారని ఊహించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ కలెక్టర్, ఎస్పీ, సబ్ రిజిస్ట్రార్, పెబ్బేరు పోలీసులను వేడుకుంటోంది. అధికారుల నిర్లక్ష్యమే కారణం బాధితురాలు షరీఫాబీ రూ.కోటి విలువైన ఆస్తి కోల్పోవడానికి ప్రధాన కారణం లింకు డాక్యుమెంట్లు, ఈసీ అడ్రస్, ఫొటో సరిచూసుకోకుండా.. కాసుల కోసం ఆశపడి హక్కులను ఇతరుల పేరున మార్చడమేనని చెప్పవచ్చు. భూముల విలువ రూ.లక్షల్లో పలుకుతుండటంతో మాయగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడటం సర్వసాధారణమైంది. చిన్న పొరపాటు వలన పెద్ద నష్టం వాటిల్లింది. ఇందుకు బాధ్యత ఎవరు వహిస్తారు. పోలీసుల వద్దకు వెళ్తే.. కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. అయితే డూప్లికేట్ మహిళ రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దారే.. మళ్లీ కొన్న వారిని.. అమ్మిన వారిని పిలిపించి సదరు ఆస్తిపై హక్కుదారులు మీరు కాదు కాబట్టి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేస్తున్నట్లు మరో డాక్యుమెంట్ తయా రు చేసి రిజిస్టర్ చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ శాఖలో పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
ఎక్కేమెట్టు.. దిగేమెట్టు..రెండూ అక్కడే
సాక్షి, కాకినాడ : స్థానిక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వారి స్థానాలను వదిలేందుకు ఇష్టపడడంలేదు. సుమారు 15 నుంచి 20 ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉండిపోవడంతో చేయి తడపందే ఏ పనీ జరగడంలేదు. వారు సమయపాలన పాటించకపోవడంతో కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు.సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, జిల్లా చిట్‌ఫండ్, జిల్లా ఆడిట్ కార్యాలయాలు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు ‘ఎ’ కేటగిరీలోను, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, చిట్‌ఫండ్, ఆడిట్ కార్యాలయాల ఉద్యోగులు ‘సి’ కేటగిరిలో ఉంటారు. బదిలీల సందర్భంలో ఎ కేటగిరీలో పని చేసే ఉద్యోగులు సి కేటగిరీలోకి (జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, చిట్‌ఫండ్ కార్యాలయం, ఆడిట్ కార్యాలయాలు) బదిలీ అవుతారు. నెల రోజుల అనంతరం ఏలూరు డీఐజీ కార్యాలయంలో పైరవీలు చేయించుకుని ఆఫీస్ ఆర్డర్ పేరుతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని యథాస్థానాలకు చేరిపోతారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని మూడు విభాగాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నవారు సుమారు 15 నుంచి 20 ఏళ్ల పాటు ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇన్నేళ్లపాటు కాకినాడలోని ఈ మూడు విభాగాల్లోనే రంగులరాట్నంలా తిరుగుతున్నారు. ఈ కార్యాలయంలో చాలామంది ఉద్యోగులు సమయ పాలన పాటించిన దాఖలాలు లేవు. డబ్బులు ఇవ్వకుండా ఇక్కడ ఏ పనీ జరగదు. ఇప్పుడు బదిలీల్లో మళ్లీ ఇదే తంతు నడుస్తోంది. ఆఫీస్ ఆర్డర్‌తో బదిలీలు ఇలా... కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నప్పటికీ గత కౌన్సెలింగ్‌లో వాటిని భర్తీ చేయలేదు. బదిలీల ప్రక్రియ పూర్తయిన తరువాత జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, చిట్‌ఫండ్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులతో ఆఫీస్ ఆర్డర్ పేరుతో ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందుకు ఏడాదికి రూ.2 లక్షల చొప్పున ఒక ఉద్యోగి నుంచి ఉన్నతాధికారులు తీసుకుంటారని, ఆఫీసర్ ఆర్డర్ పేరుతో బదిలీ చేస్తారని ఉద్యోగవర్గాలు చెబుతున్నారు. ఈ బదిలీల కౌన్సెలింగ్‌లోనైనా పైరవీలకు తావులేకుండా సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తారో లేదో వేచి చూడాలి. బదిలీల జాబితాల్లో అవకతవకలు ఏళ్ల తరబడి ఉన్న సీనియర్ అసిస్టెంట్లు గ్రూపుగా ఏర్పడి కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోనే విధులు నిర్వహించేలా జాబితా తయారు చేసుకుని, ఇతర ప్రాంతాలకు చెందిన సీనియర్ అసిస్టెంట్లకు అవకాశం కల్పించకుండా చేస్తున్నారు. సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్ల బదిలీల జాబితాల్లో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం కాకినాడలోనే ఎ కేటగిరీలో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ సి కేటగిరీగా ఉన్నట్టు బదిలీల జాబితాలో తయారు చేసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
ప్రకాశం, చీమకుర్తి: చీమకుర్తిలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు ప్రతాప్, రాఘవరావు వారి సిబ్బంది దాడిలో పాల్గొన్నారు. ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఆదేశాలననుసరించే ఈ దాడులను నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనధికారకంగా పనిచేస్తున్న బొడ్డు రామారావు అనే వ్యక్తి వద్ద రూ.1,03,750 నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ టీ.హేమలత , ఇతర అధికారుల సూచనల మేరకే రామారావు డబ్బును వసూలు చేసినట్లు డీఎస్పీ ప్రసాద్ నిర్ధారించారు. దాడి చేసిన అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ చీమకుర్తి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సోమవారం మొత్తం 14 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా వారి నుంచి ఫీజ్ టు ఫీజ్, ఇతర పార్టీల ద్వారానే ఈ డబ్బును వసూలు చేసినట్లు చెప్పారు. గతంలో 2017 మార్చినెల 15న ఇదే కార్యాలయంలో ఈ సబ్‌రిజిస్ట్రార్ హేమలత విధుల్లో ఉండగానే ఏసీబీ దాడులు జరిగాయని, దానికి సంబంధించిన కేసుపై ఇంకా డిపార్టుమెంటల్ ఎంక్వైరీ జరుగుతోందని డీఎస్పీ తెలిపారు. అప్పట్లో 32 వేలు నగదు దొరికిన సంగతి తెలిసిందే. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన దాడి గురించి నివేదికను ప్రభుత్వానికి అందజేయునున్నట్లు ఆయన తెలిపారు. ఉలిక్కిపడిన చీమకుర్తి అధికారులు: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు చేసిన దాడి చీమకుర్తి పట్టణంలోని పలు కార్యాలయాలలోని అధికారుల్లో ఆందోళన కలిగించింది. రెవెన్యూ, మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనే ఒకే దారిలో ఉండటంతో ఏసీబీ అధికారులు ఎవరి కోసం వచ్చారో తెలియక కొంతమంది అధికారులు కుర్చీలలో నుంచి మెల్లగా జారుకున్నారు. అవినీతి అక్రమాలకు నిలయాలుగా ఉన్న చీమకుర్తిలోని పలు కార్యాలయాల్లో ఏసీబీ దాడులు అధికారులను కలవరానికి గురిచేసిందని పలువురు స్థానికులు చర్చించుకుంటున్నారు. -
షిఫ్ట్‌కు బైబై?
సాక్షి, సిటీబ్యూరో: రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం అమలు చేసిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ల షిఫ్ట్ పద్ధతి రద్దయ్యే అవకాశం ఉంది. మళ్లీ సాధారణ వేళల్లో కార్యాలయాలు పనిచేసే విధానం అమల్లోకి రానుంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం అమలు చేసిన సమయంలో రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా నగరంలోని రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఎంపిక చేసి షిఫ్ట్ పద్ధతికి శ్రీకారం చుట్టింది. మొదటి షిఫ్ట్‌లో బోయిన్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2:30గంటల వరకు, రెండో షిఫ్ట్‌లో మారేడ్‌పల్లి కార్యాలయం మధ్యాహ్నం 2:30గంటల నుంచి రాత్రి 9గంటల వరకు పని చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా షిఫ్ట్ విధానం విస్తరించాలని భావించినప్పటికీ అమలుకు నోచుకోలేదు. అంతలోనే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం రద్దు కావడంతో షిఫ్ట్ విధానానికి స్పందన కరువైంది. దస్తావేజుల నమోదు కూడా నామమాత్రంగా మారడంతో షిఫ్ట్ విధానాన్ని రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్‌ల శాఖ కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే షిఫ్ట్ విధానాన్ని రద్దు చేసి, సాధారణ వేళల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని సంబంధిత అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. కలిసొచ్చిన సమయం... షిఫ్ట్ విధానంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరగకపోయినప్పటికీ దస్తావేజుదారులకు మాత్రం కలిసొచ్చింది. రెండు షిఫ్టుల్లో సాధారణ పనివేళల మాదిరిగానే దస్తావేజుల నమోదు కొనసాగుతోంది. ముఖ్యంగా రెండో షిఫ్ట్ ఉద్యోగులకు కొంత ఊరటను ఇచ్చింది. ఉదయం షిఫ్ట్‌లో కేవలం ముహుర్తాల రోజుల్లో తప్పితే సాధారణ రోజుల్లో దస్తావేజుదారులు నమోదుకు పెద్దగా ముందుకురాని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సిబ్బంది తొలి రెండు గంటలు ఖాళీగా ఉంటున్నారు. వాస్తవంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల షిఫ్ట్ పద్ధతితో క్రయవిక్రయదారులకు సమయం కలిసొచ్చింది. వాస్తవంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగమైన స్లాట్ బుకింగ్ అనంతరం డాక్యుమెంటేషన్, బ్యాంక్ చలానా, డీడీలు ఇతరత్రా పనులు పూర్తి చేసుకునేందుకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుంది. ఇవన్నీ పూర్తయ్యాక మాత్రమే అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం 10గంటలకు ఇంటి నుంచి బయలుదేరినా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకొని డాక్యుమెంటేషన్ పూర్తి చేసే సరికి ఆలస్యమవుతోంది. దీంతో రిజిస్ట్రేషన్‌ను మరో రోజుకు వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు రెండు రోజులు సెలవు పెట్టాల్సి వస్తోంది. అయితే ఎనీవేర్ రిజిస్ట్రేషన్లతో షిఫ్ట్ పద్ధతి అమలు కావడంతో దరఖాస్తుదారులకు మరింత కలిసొచ్చింది. ఒకే రోజు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునే వెసులుబాటు ఉండేది. ఉదయం వేళలో పనిచేసే బోయిన్పల్లి కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కొంత తగ్గినా మధ్యాహ్నం వేళలో పనిచేసే మారేడ్‌పల్లిలో రిజిస్ట్రేషన్లు పెరిగాయి. మొత్తమ్మీద ఉద్యోగులు సెలవు పెట్టకుండానే ఉదయం/రాత్రి వేళల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటు ఉంది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేని కారణంగా కొన్ని రోజులుగా షిఫ్ట్ విధానంలో దస్తావేజుల నమోదు తగ్గుముఖం పట్టింది. దీంతో షిఫ్ట్ విధానాన్ని రద్దు చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. -
అవినీతి సబ్‌రిజిస్ట్రార్
సాక్షి, కూసుమంచి: కూసుమంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. అక్కడ మశీదు లేనిదే ఏ పని అవ్వదు. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే వారి నుంచి సిబ్బంది అందినకాడికి పిండుకుంటున్నారు. కార్యాలయంలో ప్రైవేటుగా పనిచేస్తున్న కొందమంది సబ్‌రిజిçస్ట్రార్తో పాటు ఇతర సిబ్బందితో చేతులు కలిపి అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించారు. దీనిలో భాగంగా సోమవారం కార్యాలయంలో రూ.2 వేలు లంచం తీసుకుంటూ సబ్‌రిజిస్ట్రార్ ఉమాదేవి, అటెండర్ జానీ, ప్రైవేటు వ్యక్తి (డాక్యుమెంట్ రైటర్) అనినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కిన సంగతి విధితమే. దీంతో కార్యాలయంలో లంచం లేనిదే పనులు జరిగే పరిస్థితి జరగదన్న సంగతి జగమెరిగింది. స్టాంపుల సొమ్ము మాయంలో.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యాలయంలో 2017 అక్టోబర్‌లో రూ.16 లక్షల రిజిస్ట్రేషన్ స్టాంపుల సొమ్ము మాయంలో షరాఫ్(క్యాషియర్‌గా) పనిచేస్తున్న బద్దె శ్రీనివాసరావుతో పాటు దాంట్లో ప్రయేయం ఉన్న నాటి సబ్‌రిజిస్ట్రార్ యామినిపై కూడా సస్సెన్షన్ వేటు పడింది. రసీదు.. మశీదు.. కూసుమంచి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, రఘునాథపాలెం మండలాలకు చెందిన భూములు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు జరగుతుంటాయి. దీంతో ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్లకు రసీదు చెల్లించినా కార్యాలయ సిబ్బందికి అంతకంటే ఎక్కువ మశీదు రూపంలో లంచం చెల్లించాల్సిందే. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ కార్యాలయ పరిధిలో జోరుగా సాగుతుండగా సిబ్బందికి చేతినిండా డబ్బులే. పలుకుబడి కలిగిన వ్యక్తుల భూముల రిజిస్ట్రేషన్లు అంటే సిబ్బందే అన్నీ తామై చూసుకుంటారు. భారీగానే ముడుపులు స్వీకరిస్తారు. ఇదంతా బహిరంగ రహస్యమే. కిందిస్థాయి సిబ్బంది నుంచి సబ్‌రిజిస్ట్రార్ వరకు అందరికీ వాటాలు అందాల్సిందే. ఇదంతా ప్రైవేటు వ్యక్తుల ద్వారా నడిపించే తతంగం. కాగా ఈ కార్యాలయం ఏడాదికి లక్షలాది రూపాయల ఆదాయాన్ని పొందాల్సి ఉండగా లక్ష్యం నెరవేరలేని పరిస్థితి ఉందంటే సిబ్బంది చేతివాటం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఆగని అవినీతి..!
బాన్సువాడ: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంతోనూ అవినీతికి చెక్ పడడం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అమ్మకందారు, కొనుగోలుదారుకు మధ్య జరిగే ఒప్పం దం, రిజిస్ట్రేషన్ తంతు మొత్తం వీడియో కెమెరాల్లో బంధించి, వాటి సీడీలను కొనుగోలుదారుకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆన్లైన్ ద్వారా ప్రి రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్లు వెబ్సైట్లో పెట్టడం తదితర చర్యలు చేపట్టింది. ఈ మేరకు గతేడాది ఉమ్మడి జిల్లాలోని 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలను బిగించారు. ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తులు మీ సేవ కేంద్రంలో వివరాలు నమోదు చేసి, స్లాట్ బుక్ చేసుకొన్న తర్వాత నిర్ణీత తేదీలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్ళి తమ పేరిట డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆస్తుల వివరాలను, మార్కెట్ విలువను, స్టాంప్ డ్యూటీని, అమ్మకం దస్తావేజులను, స్థిరాస్థి విక్రయం, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లను, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లను ఉంచడంతో ప్రజలకు సౌకర్యంగా మారింది. అయితే కొందరు సబ్ రిజిస్ట్రార్ల నిర్లక్ష్యంతో సీసీ కెమెరాల నిర్వహణ సరిగా జరగడం లేదు. క్రయవిక్రయాల సీడీలను అందించడం లేదు. అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం సదుద్దేశంతోనే చర్యలు చేపట్టింది. అయితే దస్తావేజు లేఖరులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. యథేచ్ఛగా కార్యకలాపాలు అధికారులు, దళారుల మధ్య ఉన్న అవగాహన కారణంగా నిఘా కొరవడుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నా, అవినీతి మాత్రం ఆగడం లేదు. వీరు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో యథేచ్ఛగా తిరుగుతూ దరఖాస్తుదారుడికి, అధికారులకు మధ్య మంతనాలు జరిపి, అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. దస్తావేజు లేఖరులు లేనిదే రిజిస్ట్రేషన్ తతంగం పూర్తి కావడం లేదు. సబ్ రిజిస్ట్రార్లు స్పందిస్తేనే మధ్యవర్తులను నియంత్రించవచ్చు. నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి పట్టణాల్లోన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చి సాయంత్రం 5గంటల వరకు మధ్యవర్తులు అక్కడే తిష్టవేస్తున్నారు. అధికారులు, కొనుగోలుదారులకు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజులను తయారు చేసి ఇవ్వడం వరకే పని చేయాలి. అయితే అధికారుల వద్దకు తమ డాక్యుమెంట్లు తీసుకెళ్తూ యథేచ్ఛగా తమ పని చేస్తున్నారు. తమ ద్వారా వెళితేనే ఫలానా సబ్ రిజిస్ట్రార్ సంతకాలు చేస్తారని, లేకుంటే మీ రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయని తమవైపు తిప్పుకొంటున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాలతో పాటు బాన్సువాడ, బోధన్, బిచ్కుంద, ఎల్లారెడ్డి, ఆర్మూర్ పట్టణాల్లో ప్రస్తుతం ప్లాట్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అయితే కొత్తగా స్థలాలు కొన్న, అమ్మినవారు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలంటే అమ్యామ్యాలు ఇవ్వనిదే పనులు పూర్తి కావడం లేదు. నేరుగా వస్తే రిజిస్ట్రేషన్లు చేస్తాం ఆన్లైన్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభంగా మారింది. ఇల్లు, ప్లాటు, వ్యవసాయ భూమి తదితర విక్రయాలకు సంబంధించిన నమూనా దస్త్రాలు ఆన్లైన్లో ఉన్నాయి. నేరుగా వాటి ద్వారా డాక్యుమెంట్లు తయారు చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అవినీతికి ఎక్కడా తావు లేదు. కొనుగోలుదార్లు కోరితే క్రయవిక్రయాలకు సంబంధించిన సీసీలను అందిస్తాం. –స్వామిదాస్, సబ్ రిజిస్ట్రార్, బాన్సువాడ. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
వైఎస్ఆర్ జిల్లా, పులివెందుల : పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి స్వామి దేవాలయం వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో కార్యాలయంలోని సిబ్బం ది.. ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి రూ.1,24,230లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్, స్టాంపులు, ఈ సీల్‌లతోపాటు ఇతరత్రా పనులపై వచ్చే వ్యక్తుల నుంచి కార్యాలయసిబ్బంది లంచం కింద డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పక్రియను కేవలం చలానా రూపంలోనే చెల్లించేలా చర్యలు చేపట్టిందన్నారు. అయితే ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను అదనపు సిబ్బందిగా నియమించుకుని వారి ద్వారా, డాక్యుమెంట్ల రైటర్స్ ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఈ రోజు చేసిన సోదాలల్లో కార్యాలయ సిబ్బంది, ప్రైవేట్‌వ్యక్తులు, డాక్యుమెంట్ల రైటర్స్ నుంచి రూ.1,24,230ల నగదను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరిని అదుపులోకి తీసుకోలేదన్నారు. విచారణ అనంతరం చర్యలు చేపడుతామన్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నామన్నారు. దాడులలో డీఎస్పీ నాగరాజుతోపాటు ఏసీబీ ఇన్స్పెక్టర్ రామచంద్ర పాల్గొన్నారు. -
అప్పులు తీర్చేందుకు అడ్డదారి!
చేవెళ్ల : అప్పుల ఊబిలో కూరుకుపోయిన రియల్టర్లు అక్రమ సంపాదనకు ఆశపడ్డారు. కొంతమంది వ్యక్తులతో చేతులు కలిపి ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి 5 ఎకరాల 12 గుంటల స్థలాన్ని విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. భూమి పట్టాదారు ఫిర్యాదుతో పోలీసులు కేసును ఛేదించారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ గురువయ్య, ఎస్ఐ శ్రీధర్‌రెడ్డిలు నిందితుల వివరాలు వెల్లడించారు. చేవెళ్ల మండలంలోని పామెన గ్రామానికి చెందిన శీలపురం పుష్పమ్మ అనే మహిళకు తన తండ్రి గ్రామంలోని సర్వే నంబర్ 122లో 5 ఎకరాల 12గుంటల భూమి ఇచ్చాడు. ఈ భూమిని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులకు అమ్మేందుకు అగ్రిమెంట్ చేసి కాగితాలను ఇచ్చింది. అగ్రిమెంట్ చేసుకున్న వారు అమ్మేందుకు మార్కెట్లో పెట్టారు. ఈ భూమి డాక్యుమెంట్లను పరిశీలించిన నల్లబోతుల చిన్న అనే వ్యక్తి పుష్పమ్మ అనే మహిళ స్థానంలో వేరే పేరుతో భూమిని కొనుగోలు చేసినట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమ్మేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో డాక్యుమెంట్లు తయారు చేసిన నిందితులు వారికి సహకరించిన నల్లబోతుల చిన్న, సుంకే వెంకటేశ్వర్లు, రేనటి మున్నా, అనుముల యమున, మీనాక్షి, వడివేలు, హకీం బుచ్చిరాములు అలియాస్ కుమార్, కె. రంజిత్‌కుమార్, రాజేంద్రప్రసాద్, మహ్మద్ ముజాహిద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కబ్జా కుట్ర జరిగిందిలా.. కర్నూల్ జిల్లా మహానంది గ్రామానికి చెందిన నల్లబోతుల చిన్నా 2015 సంవత్సరంలో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. జిల్లాలోని సరూర్‌నగర్ మండలం హస్తీనాపురం గ్రామంలో నివాసం ఉంటూ పటాన్‌చెర్వులో ఓ కంపెనీలో పనిచేశాడు. రియల్ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయని ఆశించి ఉద్యోగం మానేసి విజయవాడ, తిరుపతి పట్టణాల్లో వ్యాపారం ప్రారంభించాడు. ఇందులో భాగంగా తెలిసిన వారి వద్ద అప్పు చేశాడు. ఇతని వద్ద పామురుకు చెందిన సుంకె వెంకటేశ్వర్లు, మున్నా అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. మూడు నెలల కిత్రం చేవెళ్ల ప్రాంతంలో వ్యాపారం చేసేందుకు అసిస్టెంట్ వెంకటేశ్వర్లును పంపించాడు. అతడు ఇక్కడ ఉన్న భూముల ధరలు, ఇతర వివరాలు సేకరించాడు. ఓ భూమికి సంబంధించిన కాగితాలను తీసుకొని చేవెళ్లలోని తాజ్జిరాక్స్ సెంటర్లో జిరాక్స్‌లు తీస్తుండగా అందులో ఉండే పామెన గ్రామానికి చెందిన రమేశ్‌తో భూములు అమ్మేవి ఉన్నాయా అని అడిగాడు. దీంతో రమేశ్ 5.12 ఎకరాల భూమి ఉందని చూపించి ధర రూ. 50 లక్షల వరకు ఉందని చెప్పడంతో వెంకటేశ్వర్లు దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావాలని అడిగి తీసుకున్నాడు. వాటిని పరిశీలించిన చిన్నా, వెంకటేశ్వర్లు, మున్నాలు భూమిని కాజేయాలని, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాలని పథకం పన్నారు. దీనికి సహకరిస్తే అసిస్టెంట్లకు రూ.20లక్షలు ఇస్తానని చిన్నా చెప్పాడు. పెద్ద వయస్సు ఉన్న ఆడమనిషి కావాలని తనకు రియల్ వ్యాపారం ద్వారా పరిచయం ఉన్న తిరుపతి రేణిగుంటకు చెందిన యమునకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. యుమునతో పాటు వడివేలు పెద్ద వయసున్న మహిళా మీనాక్షితో గత నెల 23వ తేదీన తిరుపతి నుంచి మెహిదీపట్నం వచ్చారు. ఈ అక్కడే ఉన్న యునిక్ సర్వీస్ మీసేవా సెంటర్లో వెంట వచ్చిన మహిళను పుష్పమ్మగా ఆధార్‌కార్డు సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్‌తో ఒప్పందం వీటి ఆధారంగా జూలై 30వ తేదీన చేవెళ్లకు వచ్చి సబ్‌రిజిస్టార్ ఆఫీస్ వద్ద ఉన్న కుమార్ అలియాస్ బుచ్చిరాములు అనే టైపిస్టుతో ఏజీఏపీఏ డాక్యు మెంట్ తయారు చేయించారు. రూ. 25 వేలు ఇస్తానని చెప్పడంతో రజింత్కుమార్, జి. రాజేంద్రప్రసాద్‌లను కుమార్ సాక్షులుగా సంతకాలు చేయించాడు. డాక్యుమెంట్ తయారు చేసి సబ్‌రిజిస్ట్రార్ రాజేంద్రకుమార్ వద్దకు వెళ్లగా అతడు ఆ మహిళను పేరు అడిగితే ఆమె తెలుగు రాక తడబడింది. దీంతో ఆయన ఏజీఏపీఏ చేయడానికి ని రాకరించాడు. రంగంలోకి దిగిన చిన్నా సబ్‌రిజిస్ట్రార్‌తో ఒప్పందం చేసుకొని డాక్యుమెంట్స్ తయారు చేయించాడు. పథకం ప్రకారం పట్టుకున్న పోలీసులు మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకే ఎకరం రూ.30 లక్షలకే అమ్ముతానని చిన్నా మహబూబ్‌నగర్‌కు చెందిన ఒబెదుల్లా కొత్వాల్‌కు భూమిని చూపించాడు. అతని వద్ద రూ. 6లక్షల అడ్వాన్స్‌గా తీసుకొని వాటిని అప్పుల వారికి ఇచ్చాడు. అయితే ఈ విషయం అసలు పట్టాదారు పుష్పమ్మకు తెలియడంతో చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫోర్జరీకి సహకరించిన వడివేలు, మీనాక్షిలు డబ్బులు అడుగుతున్నారని యమున ఫోన్ చేయడంతో 24వ తేదీన రా వాలని చెప్పాడు. 24న అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, మున్నా, యుమున, వడివేలు, మీనాక్షిలు చేవెళ్ల రిజిస్టేషన్ ఆఫీస్‌కు వచ్చారు. అప్పటికే సివిల్‌లో ఉన్న పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. విచారణ అనంతరం మొత్తం పది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న సబ్‌రిజిస్ట్రార్ రాజేంద్రకుమార్, భూమి పత్రాలు అందించిన రమేశ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
సీటుకు వాస్తుదోషమట!
సాక్షి, కామారెడ్డి : జిల్లా కేంద్రమైన కామారెడ్డి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇప్పుడు వింత పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు గుండెపోటుతో చనిపోయారు. తరువాత వచ్చిన ఇద్దరు అధికారులు అనారోగ్యంతో పాటు ఇతర సమస్యలకు గురయ్యారు. దీంతో ఇప్పుడు పనిచేస్తున్న అధికారి మల్లికార్జున్‌కు ఆ చాంబర్ అంటేనే వణుకు పట్టుకుంది. ఏ అధికారి అయినా తన చాంబర్లో కూర్చుని పనిచేస్తారు. మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అయితే ఆ చాంబర్లో కూర్చుంటే తనకు ఏ ఆపద ముంచుకు వస్తుందోనన్న భయంతో అందులో కూర్చోవడం లేదు. కొత్తగా ఎవరైనా కార్యాలయానికి వెళ్తే.. చాంబర్ ఖాళీగా కనిపిస్తుంది. దీంతో పెద్ద సారు లేడా అని అక్కడ ఉన్న సిబ్బందిని అడుగుతుంటారు.. వారు ‘సార్ లోపల గదిలో కూర్చున్నారు’ అంటూ చూపిస్తారు. కొసమెరుపు ఏంటంటే ఇటీవల బోధన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి ఆరు నెలల క్రితం వరకు ఇక్కడే పనిచేసి అదే కుర్చీలో కూర్చుని విధులు నిర్వహించారు. అంతా ఓపెన్.. రిజిస్ట్రేషన్ కార్యాలయం అక్రమాలకు ఆలవాలంగా మారింది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంతో పాటు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున సాగుతుంటాయి. దశాబ్ద కాలంగా ఈ ప్రాంతంలో దాదాపు రూ. 2 వందల కోట్ల విలువైన భూముల క్రయవిక్రయాలు జరిగాయి. అనేక వెంచర్లు చేశారు. వేలాది ప్లాట్ల అమ్మకాలు సాగాయి. ప్రతి ఫైలు వెనుక వేలాది రూపాయల లంచాలు రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది జేబుల్లోకి వెళ్తాయి. భూ రికార్డుల ప్రక్షాళన జరిగిన సమయంలో రిజిస్ట్రేషన్లకు అనేక కొర్రీలు పెడుతూ ఒక్కో డాక్యుమెంటుకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల దాకా వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ పనిచేసిన ప్రతి అధికారి, సిబ్బంది రూ. లక్షల్లో సంపాదించారు. ఓ అధికారి అప్పట్లో రూ. కోట్లల్లో డబ్బు కూడగట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రియల్ దందా సాగే కామారెడ్డి ప్రాంతంలో రిజిస్ట్రేషన కార్యాలయ సిబ్బందికి ఆదాయం అడ్డగోలుగా ఉంటుందన్న విషయం బహిరంగ రహస్యం. అనేక అక్రమాలకు రిజిస్ట్రేషన్ కార్యాలయం కేంద్ర బిందువుగా నిలి చింది కూడా. రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది అత్యాశతో చేసిన తప్పుడు రిజిస్ట్రేషన్ల మూలంగా ఎంతో మంది అమాయకులు ఇబ్బందులపాలయ్యారు. ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎన్నో ప్లాట్లకు డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి ఎంతో మందిని ఇబ్బందుల్లోకి నెట్టారు. డబ్బు కోసం ఎలాంటి తప్పుడు పనులైనా చేసే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు, సిబ్బంది వాస్తు పేరుతో చాంబర్లో కూర్చోకపోవడంపై విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఏసీబీ దాడులు జరుగుతాయని, ఎవరైనా తమను ఏసీబీకి పట్టిస్తారన్న భయం కూడా లేకుండా అంతా ఓపెన్‌గా డబ్బులు తీసుకుంటున్న వ్యవహారంపై స్థానికంగా చర్చించుకుంటున్నారు. బోధన్‌లో ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రెడ్డి ఘటనతో అంతటా రిజిస్ట్రేషన్ పాపాల గురించిన చర్చ జరుగుతోంది. -
నా సంగతి తెలియదా.. జాగ్రత్తగా ఉండు
కాశీబుగ్గ : రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తెలుగుదేశం నాయకుడు, పలాస సామాజిక ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలి కృష్ణారావు అధికార జులుం ప్రదర్శించారు. ‘మేమంటే ఎవరనుకుంటున్నావు? మా సంగతి తెలియదా? నీ సంగతేంటో చూస్తాం. జాగ్రత్తగా ఉండు’ అంటూ వీరంగం సృష్టించారు. కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం జరిగిన సంఘన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందిపై ఆయన విరుచుకుపడ్డ తీరు చూసి అంతా అవాక్కయ్యారు. ఎలా పనిచేస్తారో చూస్తా.. ట్రాన్స్ఫర్ చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని జిల్లా అధికారులకు ఇక్కడ తీరును వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పలాస నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో చోటా నాయకులు ఎమ్మెల్యే దన్ను చూసుకుని పేట్రేగిపొతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జడ్చర్లలో రాజీవ్ కనకాల సందడి
జడ్చర్ల : జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సినీనటుడు రాజీవ్ కనకాల బుధవారం కొద్దిసేపు సందడి చేశారు. ఆయన బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామ శివారులో గల తన సొంత భూమికి సంబందించి బ్యాంకు లోన్ నిమిత్తం తనఖా పెట్టేందుకు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక సబ్‌రిజిస్ట్రార్ అశోక్‌తో మాట్లాడి నిబందనల మేరకు సంతకాలు చేసి వెళ్లారు. విషయం తెలుసుకున్న కొందరు ఆయనను చూసేందుకు వచ్చారు. మరికొందరు అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు. -
నకిలీ డీఎస్పీ హల్చల్
ఆస్పరి/ ఆలూరు: తాను విజిలెన్స్ డీఎస్పీ నంటూ ఓ వ్యక్తి సబ్ రిజిస్ట్రార్‌ను బురిడీ కొట్టించి కటకటలా పాలయ్యాడు. మండల కేంద్రమైన ఆస్పరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారితో సోమవారం ఆస్పరి సబ్ రిజిస్టర్ కార్యాలయం కిటకిటలాడుతుంది. మధ్యాహ్నం ఏపీ 21, బీఎన్ 1899 నంబరు గల కారు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదురుగా వచ్చి ఆగింది. కారు డ్రైవర్ కార్యాలయంలోకి నేరుగా వెళ్లి సబ్ రిజిస్టార్ ఆదినారాయణతో విజిలెన్స్ డీఎస్పీ మహబూబ్ బాషా వచ్చారని చెప్పాడు. ఆయన వెంటనే కారుదగ్గరికెళ్లి విజిలెన్స్ డీఎస్పీకి నమస్కారం చేసి కార్యాలయంలోకి తీసుకెళ్లాడు. మీ మీద చాలా కంప్లెంట్స్ ఉన్నాయి.. ప్రభుత్వ భూములను కూడా రిజిస్టర్ చేస్తున్నారంట కదా అని అదినారాయణను దాబాయించారు. డాక్యూమెంట్ రైటర్స్ ఎంత మంది ఉన్నారని ప్రశ్నిస్తూ ఫీజులు ఇష్టాను సారంగా వసూలు చేస్తున్నారని బెదిరించారు. చివరకు వారివురు కారులోకి వెళ్లి మాట్లాడుకునేందుకు వెళ్లారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఎవరో అధికారి వచ్చారని స్థానిక విలేకరులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని డీఎస్పీతో మాట్లాడతామని సబ్‌రిజిస్ట్రార్‌ను కోరగా భోజనం చేసిన తరువాత సార్ ప్రెస్ మీట్ పెడతారని సమాధానం చెప్పారు. అయినా, కొందరు విలేకరులు వారిద్దరు కారులో మంతనాలు జరుపుతున్న ఫొటోలు తీశారు. గమనించిన నకిలీ విజిలెన్స్ డీఎస్పీ విషయం ఎక్కడ బయటపడుతుందోనని తన సెల్ ఫోన్ అడ్డుపెట్టుకుని కొద్దిసేపు ఫోజులు కొట్టారు. తర్వాత సబ్ రిజిస్టర్‌ను ఆయన కారులోనే ఆస్పరి నుంచి ఆలూరు వెళ్లే రోడ్డు వైపు తీసుకెళ్లారు. అక్కడ సబ్రిజిస్టార్ను బెదిరించి రూ. 50 వేలు తీసుకుని ఆలూరు వైపు ఉడాయించాడు. తర్వాత ఆఫీసుకు వచ్చిన ఆదినారాయణ సహచర సబ్ రిజిస్ట్రార్లతో ఫోన్లో మాట్లాడగా మహబూబ్ బాషా పేరుతో విజిలెన్స్ డీఎస్పీ ఎవరూ లేరని తెలియడంతో తెల్లమొహం వేశాడు. మోసం పోయానని తెలుసుకొని వెంటనే సీఐ దస్తగిరిబాబుకు సమాచారమిచ్చాడు. నకిలీ విజిలెన్స్ డీఎస్పీతో కారులో కూర్చున్న సమయంలో విలేకరులు తీసిన కొన్ని ఫోటోలను తీసుకొని సీఐకు వాట్సాప్‌లో పంపారు. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు సబ్‌రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఆలూరు ఎస్ఐ సీవీ నరసింహులు, పోలీసులు ఆలూరు సమీపంలో తిష్టవేశారు. నకిలీ డీఎస్పీ కారు అక్కడికి రాగానే అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ నకిలీ డీఎస్పీ ఎమ్మిగనూరు పట్టణ కేంద్రానికి చెందిన శాంతరాజు కాగా కారు డ్రైవర్ పేరు సోమశేఖరరెడ్డి అని తేలింది. శాంతరాజు బస్విని పునరావాస, జోగిని సంఘం రాష్ట్రం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి çఈ ఏడాది ఫిబ్రవరి 20న సంఘం అధ్యక్షుడిగా నియామక పత్రం సైతం తీసుకున్నారు. రూ. 2 లక్షల డిమాండ్ నిందితుడు శాంతరాజు ఆస్పరి సబ్‌రిజిస్ట్రార్‌ను రూ. 2 లక్షలు డిమాండ్ చేయగా రూ. 50 వేలు ఇచ్చారు. ఆలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కూడా డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని రిజిస్ట్రార్‌ను బెదిరించాడు. తర్వాత అసలు విషయం తెలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులకు చిక్కాడు. ఆస్పరి, ఆలూరు సబ్ రిజిస్ట్రార్లు ఆదినారాయణ, సునందను నిందితుడు శాంతరాజు ఎలా బెదిరించారనే దానిపై విచారణ చేస్తున్నట్లు సీఐ విలేకరులకువెల్లడించారు. -
రిజిస్ట్రేషన్ @ తహసీల్
ఇచ్చోడ(బోథ్) : తహసీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 19 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద మూడు మండలాలను ఎంపిక చేసింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్, మంచిర్యాల జిల్లా నెన్నెల, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానం అమలుకు రంగం సిద్ధమైంది. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్‌ను రైతులకు చేరువ చేయడంలో భాగంగా మండలంలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని తహసీల్దార్లకు అప్పగించింది. స్థానిక తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ వ్యవహారాలను నిర్వహించనున్నారు. జూన్ 2 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలు లేని అన్ని మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయనున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లకు అప్పగించేందుకు రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారం జీవో ఎంఎస్ 94, 95ను ప్రభుత్వం గత ఐదు రోజుల క్రితం విడుదల చేసింది. దీంతో మూడు మండలాల్లో శనివారం నుంచి రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా మంచిర్యాల, లక్సెట్టిపేటలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయలు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం భూముల క్రయవిక్రయాలతోపాటు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు, వివాహ నమోదు, గిఫ్ట్‌డీడ్, భాగస్వామ్య ఒప్పందాలు, ఇçళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్లతోపాటు మరో 20 రకాల సేవలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందిస్తున్నారు. ఈ శాఖ ద్వారా ప్రతీ సంవత్సరం ప్రభుత్వానికి దాదాపుగా రూ.120 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆలస్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల క్రయవిక్రయాలు, ఆస్తుల మార్పిడితోపాటు పలు సేవల్లో ఆలస్యం జరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్లలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎలాంటి ప్రమాణాలు పాటించకపోవడం, పాసుపుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడం, ఒక్కోసారి భూములు విక్రయించిన వారు తిరిగి రెండోసారి విక్రయించడం, ఒకే సర్వే నంబర్‌కు రెండు మూడు సార్లు ఇద్దరు, ముగ్గురుకి విక్రయించడం, సర్వే నంబర్లో ఉన్న విస్తీర్ణం కంటే రిజిస్ట్రేషన్లలో అధికంగా రికార్డు చేయడం, రిజిస్ట్రేషన్లలో భూముల సరిహద్దుల్లో ఎలాంటి ప్రామాణికాన్ని చూడకపోవడం, రైతులు చెప్పిన విధంగా ఆన్లైన్లో నమోదు చేయడంతో గ్రామాల్లో అనేక భూ వివాదాలు రెవెన్యూ ఆధికారులుకు సవాల్‌గా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాకత్మంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో పలు సంఘటనలు వెలుగు చూశాయి. వీటన్నింటినీ అరికట్టేందుకు ప్రభుత్వం తహసీల్ కార్యాలయలో రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేడు ధరణి వెబ్సైట్ ప్రారంభం రైతులకు భూముల వివరాలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం ఈ నెల 19న ధరణి వెబ్సైట్ ప్రారంభానికి సిద్ధం చేసింది. భూ రికార్డుల నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు రైతులకు అందుబాటులో ఉండేవిధంగా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఈ వెబ్సైట్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రికార్డులను రెవెన్యూ శాఖ పొందుపర్చనుంది. తహసీల్ కార్యాలయలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే భూముల, ఆస్తుల క్రయవిక్రయాల వివరాలు వెబ్సైట్లో నమోదు చేసే విధంగా ఈ వెబ్సైట్ రూపుదిద్దుకుందని అధికారులు చెబుతున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న తహసీల్ కార్యాలయాల్లో నూతన భవనాలు నిర్మించకుండానే ఓ గదిలో ఈ సేవలు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అరకొర వసతుల మధ్య రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తుండడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అసలే సిబ్బంది కొరతను ఎదుర్కొంటుండుగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విధానం తహసీల్ కార్యాలయంలో అమలకు నిర్ణయించడంతో రెవెన్యూ సిబ్బందికి సవాల్‌గా మారుతోంది. -
‘సబ్‌రిజిస్ట్రార్’ను తరలించొద్దు
రామన్నపేట నల్గొండ : ఆరు దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న రామన్నపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించవద్దని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రం లో ఆందోళన నిర్వహించారు.సబ్‌రిజిష్ట్రార్ కార్యాలయాన్ని మరోప్రాంతానికి తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న అఖిలపక్ష నాయకులు, డాక్యుమెంట్ రైటర్లు అథిదిగృహం ఆవరణలో సమావేశమై చిట్యాల–భువనగిరి ప్రధాన రహదా రిపై రాస్తారోకోకు దిగారు.సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తరలించవద్దని, అధికారుల నిర్ల్యక్షం న శించాలని పెద్దఎత్తున నినదించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ ప్రారంభంలో రామన్నపేట, మోత్కూరు తాలుకా లోని 15కు మండలాల ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలందించడం జరిగిందని, కార్యాలయంను నమ్ముకొని డాక్యుమెంట్ రైటర్లు, వారి సిబ్బంది, హోట ల్, జనరల్‌స్టోర్ నిర్వాహకుల వంటి 100కు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు.రామన్నపేట, వలిగొండ మండలాల్లోని 50కిపైగా గ్రా మాల రైతులకు, భూక్రయ విక్రయదారులకు ప్ర యోజనకరంగా ఉండేటటువంటి రిజిస్ట్రార్ కార్యాలయాన్ని, 100 కుటుంబాల ఉపాధిని దెబ్బతీసి ఇతర జిల్లాలకు తరలించాలనే అనాలోచిత నిర్ణయాన్ని మానుకోవాలని, రామన్నపేటప్రాంత ప్ర జల మనోభావాలను గౌరవించాలని కోరారు. కా ర్యాలయాన్ని తరలిస్తే ఊరుకోబోమని, ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని, తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో అవసరమైతే పాలనను స్తంభింపజేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత అఖిలపక్షం ఆందోళనకు మద్దతుగా ప్రధాన రహదారిపై గల దుకాణాలను యజమానులు స్వచ్ఛం దంగా మూసివేసి సంఘీభావం ప్రకటించారు. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్‌వెండర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, జూనియర్ అసిస్టెంట్లు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు వనం చంద్రశేఖర్, కన్నెకంటి వెంకటేశ్వరాచారి, జెల్లెల పెంటయ్య, ఊట్కూరి నర్సింహ, నీల యాదయ్య, సిందం లింగయ్య, శివరాత్రి సమ్మయ్య, ఏనూతుల రమేష్, ఆముద సాయి, రాజశేఖర్, ఆమేర్, జమీరుద్దిన్, మిర్యాల మల్లేశం, బల్గూరి అంజయ్య, వెంకటేశ్వరాచారి, రేఖ సత్తయ్య, పల్లపు రవి, ఎండీ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రం పశ్చిమ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో ప్రతి డాక్యుమెంట్ పైనా 0.5 శాతం కమిషన్ వసూలు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. కేవలం ఒక్కరోజులోనే 15 డాక్యుమెంట్లకు గాను కమీషన్ రూపంలో రూ.50వేలు వసూలు చేసినట్లు తేలింది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై డీజీకి నివేదిక సమర్పించి విచారణ చేపడతామని ఏసీబీ డీఎస్పీ షేక్ షకీలా బాను వెల్లడించారు. -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడి
= సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న రూ.32 వేలు స్వాధీనం = కార్యాలయంలో ముగ్గురు బయటి వ్యక్తులున్నట్లు గుర్తింపు = పక్కా పథకం ప్రకారం రాత్రి 7.15 గంటల సమయంలో దాడి చీమకుర్తి రూరల్ : చీమకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో మూకుమ్మడిగా దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ మూర్తి, సీఐలు టీవీవీ ప్రతాప్‌కుమార్, టి.సంజయ్‌కుమార్ కథనం ప్రకారం.. కార్యాలయం సిబ్బంది వద్ద అనధికారిక నగదు రూ.32 వేలను ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 14 రిజిస్ట్రేషన్లు జరగగా రూ.1.46 కోట్ల విలువైన ఆస్తుల ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది. పట్టుబడిన నగదును ప్రభుత్వానికి జమ చేస్తామని, సబ్ రిజిస్ట్రార్ టి.హేమలతపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అధికారులు, సిబ్బందిపై కేవలం క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసే అధికారం మాత్రమే తమకున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యాలయం పని వేళల్లో ఇతరులు ఎవరినీ అనుమతించకూడదని, అయితే కార్యాలయంలో ముగ్గురు బయట వ్యక్తులు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. ముందు నుంచే ప్రణాళిక: చీమకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై తరుచూ ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నందున కొన్ని రోజులుగా నిఘా ఉంచామని డీఎస్పీ తెలిపారు. దానిలో భాగంగా బుధవారం సాయంత్రం కార్యాలయం పని వేళలు పూర్తయ్యే వరకూ బయటే నిఘా వేసి ఉన్నామని తెలిపారు. పనివేళల సమయం పూర్తయినా రాత్రి 7 గంటల వరకు కార్యాలయంలోనే సబ్ రిజిస్ట్రార్ ఉండటం గమనించామని ఆయన పేర్కొన్నారు. ఇది రెండోసారి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి జరగటం ఇది రెండోసారి. 2013వ సంవత్సరం ఇదే నెలలో అప్పటి సబ్ రిజిస్ట్రార్‌పై స్థానికులు కొంతమంది చేసిన ఫిర్యాదు మేరకు దాడి చేసి అప్పట్లో వారి నుంచి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దానికంటే రెండు సంవత్సరాల ముందు చీమకుర్తిలో నివాసం ఉంటున్న ఏసీటీఓ ఇంటిపై కూడా ఏసీబీ దాడి చేసిన సంఘటన మరొకటి ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి జరిగిన సంఘటన వార్త చుట్టుపక్కల రెవెన్యూ, మండల పరిషత్, మున్సిపాలిటీ కార్యాలయాల్లోని సిబ్బంది చెవిన పడటంతో వారంతా అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. లంచం అడిగితే ఫోన్ చేయండి..: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నా.. వారు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం ఉన్నా తమకు ఫోన్ చేయాలని ఏసీబీ డీఎస్పీ మూర్తి మీడియాకు తెలిపారు. ఈ మేరకు ఆయన కొన్ని ఫోన్ నంబర్లు మీడియాకు ఇచ్చారు. ఏసీబీ డీఎస్పీ మూర్తి 944044 6189, సీఐ ప్రతాప్‌కుమార్ 944044 6187, సీఐ సంజయ్‌కుమార్ 83339 25624 -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ
ఉదయగిరి: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం జిల్లా ఆడిట్ రిజిస్ట్రార్ పి.ఉషారాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా కార్యాలయాన్ని సందర్శించి, వార్షిక తనిఖీ చేపట్టానన్నారు. ఏడాది కాలంగా జరిగిన రిజిస్ట్రేసన్ల డాక్యుమెంట్లు, రికార్డులు పరిశీలించినట్లు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గాయన్నారు. ఆమె వెంట సబ్ రిజిస్ట్రార్ శ్రీరామమూర్తి ఉన్నారు. -
సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌పై ఏసీబీ దాడులు
అనంతపురం : అనంతపురం జిల్లా కనేకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌పై అవినీతి నిరోధక శాఖాధికారులు సోమవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో అనధికారికంగా ఉన్న రూ.లక్షా 85 వేల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు డాక్యుమెంట్ రైటర్లతో పాటు సబ్‌రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా స్టాంప్ వెండర్లు, దస్తావేజు లేఖరులు, సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది దాదాపు 15 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి మితిమీరిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలకు దిగారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
డాక్యుమెంట్ రైటర్‌పై హత్యాయత్నం
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఘటన పరుగులు తీసిన జనం లొంగిపోయిన నిందితుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూములు, స్థల క్రయ, విక్రయదారులు, అధికారులు, సిబ్బంది అందరూ చూస్తుండగానే డాక్యుమెంట్ రైటర్‌పై ఓ వ్యక్తి మారణాయుధంతో హత్యాయత్నం చేశాడు.ఈ హఠాత్పరిణామంతో అక్కడున్న వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన మడకశిరలో సంచలనం రేపింది. మడకశిరకు చెందిన అతావుల్లా (52) కొన్నేళ్లుగా డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉన్న ఇతనిపై బసవరాజు అనే వ్యక్తి పదునైన కొడవలితో తలపై దాడి చేశాడు. అక్కడున్న కొంతమంది అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన అతావుల్లాను సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. భూముల డాక్యుమెంట్ తయారు చేసే విషయంలో తనకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతోనే నిందితుడు దాడి చేసినట్లు చెప్పారు. లొంగిపోయిన నిందితుడు హత్యాయత్నం చేసిన తర్వాత నిందితుడు బసవరాజు పోలీస్‌స్టేçÙన్లో లొంగిపోయాడు. తనకు డాక్యుమెంట్ రైటర్ అన్యాయం చేయడంతోనే దాడి చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద గుమిగూడిన జనం డాక్యుమెంట్ రైటర్‌పై హత్యాయత్నం జరిగినట్లు సమాచారం అందుకున్న వందలాది మంది ప్రజలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సంఘటనపై ఆరా తీశారు. ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్ష్మీనరసింహారెడ్డి, గుడిబండ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసమూర్తి తదితర ప్రముఖులు కూడా అతావుల్లాను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి గురించి మెడికల్ ఆఫీసర్ మంజువాణి, డాక్టర్ బాబాబుడేన్ ఎమ్మెల్సీకి వివరించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
– కాలి బూడిదైన కంప్యూటర్లు, ఫర్నిచర్లు హిందూపురం అర్బన్ : హిందూపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో కొన్ని పాత మ్యానువళ్లు, కంప్యూటర్లు, ఫరిచర్లతో పాటు కార్యాలయం వరండాలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.7 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కార్యాలయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని కిటికీల గుండా నీటిని విరజిమ్మి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే వరండాలోని కంప్యూటర్లు, ఫర్నిచర్లు, కూలర్లు, ఫ్యాన్లు, పుస్తకాలు, రికార్డులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ అలీ సిబ్బందితో అక్కడికి చేరుకుని రికార్డులను శుభ్రం చేసి భద్ర పరచడానికి ప్రయత్నించారు. కాగా అప్పటికే నష్టం జరిగిపోయింది. పథకం ప్రకారమేనా..? అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కావాలనే కొందరు కిటికీల గుండా కిరోసిన్ చల్లి నిప్పు పెట్టి జారుకున్నారా? అనే అనుమానాలు పట్టణంలో చర్చనీయాంశమైంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ప్రారంభమైనప్పటి (18వ శతాబ్దం) నుంచి రికార్డులు భద్రపరిచారు. అయితే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాత మ్యానువళ్లు ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా అగ్ని ప్రమాదంలో పాత మ్యానువళ్లు, ప్రజలకు సంబంధించిన రికార్డులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే మంటల్ని అదుపు చేయడంతో కాపాడుకున్నామని స్టాంప్ ఎక్సైజ్ డ్యూటీ ఇన్చార్జ్ డీఐజీ దేవరాజ్ అన్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. -
ఏలూరు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు
-
ప్రభుత్వ ఆఫీసు నుంచి ఎగిరొచ్చిన నోట్ల కట్టలు
మార్కాపురం (ప్రకాశం జిల్లా) : మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం నోట్ల కట్టలు బయటకు ఎగిరిపడ్డాయి. తనిఖీలకు వచ్చిన ఏసీబీ బృందాన్ని చూసి కార్యాలయం లోపల ఉన్న సిబ్బంది నోట్ల కట్టలను కిటికీల్లోనుంచి బయటకు విసిరేశారు. అయితే గమనించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని, దస్తావేజు లేఖరుల కార్యాలయాలను తమ స్వాధీనంలోకి తీసుకుని సోదాలు చేపట్టారు. కిటికీల్లోనుంచి బయటకు వచ్చిన నగదు లక్ష వరకు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు
జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) : జంగారెడ్డి గూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డు రూములో అనధికారికంగా ఉన్న రూ.14వేలు, బి.శ్రీనివాస్ అనే దస్తావేజు లేఖరి వద్ద రూ.1.03 లక్షలు, మరో ఏడుగురు దస్తావేజు లేఖరుల వద్దనున్న రూ.62వేలను స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని సోదాలకు నేతృత్వం వహించిన ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. -
అక్కడ పోస్టింగ్..వద్దు బాబోయ్
ధర్మవరంలో తమ్ముళ్ల దెబ్బకు సబ్ రిజిస్ట్రార్ల హడల్ మామూలు ఇవ్వాలంటూ వేధింపులు.. సెలవుపై వెళ్తున్న అధికారులు అధికారం అడ్డం పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. ఏకంగా అధికారుల వద్దే రౌడీ మామూళ్లు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. కాదూ కూడదంటే..సెలవులో వెళ్లిపోవాలంటూ బెదిరిస్తున్నారు. అంతకూ వినకపోతే సదరు ఆఫీసర్‌ను బదిలీ చేయిస్తున్నారు. దాదాపుగా అనంతపురం జిల్లావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉన్నా, ధర్మవరంలో మాత్రం మితిమీరింది. ధర్మవరం : అనంతపురం జిల్లా ధర్మవరంలో పోస్టింగ్ అంటేనే సబ్రిజిస్ట్రార్లు హడలిపోతున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక ఒకరు.. వారు అడిగినంత మామూళ్లు ఇచ్చుకోలేక మరొకరు..ఇలా ఎవరికి వారు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి నలుగురు సబ్ రిజిస్ట్రార్లు మారిపోయారు. తాజాగా టీడీపీ నాయకులు ఏరికోరి కర్నూలు నుంచి తెచ్చుకున్న వై.బజారీ కూడా వీరు చెప్పే పనులు చేయలేక సెలవుపై వెళ్లిపోయారు. దీంతో మూడు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇన్చార్జ్ పాలనలో నడుస్తోంది. గతంలో కూడా శ్రీనివాసనాయక్ అనే సబ్‌రిజిస్ట్రార్ అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, వేధింపులతో దాదాపు ఆరు నెలల పాటు అవస్థ పడ్డారు. ప్రతినెలా తమకు మామూళ్లు ఇవ్వాలని, లేకపోతే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు ఫిర్యాదు చేస్తామని తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురిచేశారు. ఏ రోజు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారన్న జాబితా కూడా తమకు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. చోటా నాయకులు కూడా ‘అన్న పిలుస్తున్నాడు.. అన్న చెప్పాడు’ అంటూ సదరు సబ్ రిజిస్ట్రార్‌ను తరచూ పార్టీ కార్యాలయం వద్దకు పిలవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్థలాలను రిజిష్టర్ చేయాలని ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. తనమాట వినలేదన్న కోపంతో ఓ నేత సదరు సబ్ రిజిస్ట్రార్‌పై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు సైతం చేశారు. అయినప్పటికీ శ్రీనివాస్‌నాయక్ వారికి లొంగకపోవడంతో ఓ ప్రజాప్రతినిధి వద్దకు పిలిపించి సెలవుపై వెళ్లాలని ఒత్తిడి చేశారు. అయినా ఆయన తన పని తాను చేసుకుపోవడంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పి ఇక్కడి నుంచి బదిలీ చేయించారు. ఆయన వెళ్లిన తర్వాత తాము చెప్పినట్లు వింటాడని కర్నూలు జిల్లా నుంచి వై.బజారీని నెలరోజుల క్రితం ఇక్కడికి తీసుకు వచ్చారు. ఆయన కూడా ‘తమ్ముళ్లు’ అడిగినంత ఇచ్చుకోలేకపోవడంతో సెలవుపై పంపినట్లు తెలుస్తోంది. సోమవారం నుంచి సెలవు పెట్టారు. ప్రతి నెలా ఇంత మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండటంతో ధర్మవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం అంటేనే ఆ శాఖ అధికారులు హడలెత్తుతున్నారు. -
రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట చోరీ
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి జిల్లా) : ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శనివారం మధ్యాహ్నం రూ.4 లక్షల వరకు చోరీ జరిగింది. హైదరాబాద్ హబ్సీగూడ ప్రాంతానికి చెందిన ఆంటోనీ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం ఇన్నోవా వాహనంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వెళ్లారు. రూ.4 లక్షల వరకు నగదు ఉన్న బ్యాగును వాహనం లోపలే ఉంచి కార్యాలయంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఓ ఆగంతకుడు కారు అద్దాలు ధ్వంసం చేసి లోపలున్న నగదు బ్యాగుతో పరారయ్యాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు సీఐ జగదీశ్వర్ దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్
మరింత సరళం కానున్న స్థిరాస్తుల క్రయ విక్రయాలు ఆన్‌లైన్‌తో అక్రమాలకు చెక్ బెంగళూరులో విజయవంతమైన పెలైట్ ప్రాజెక్టు బడ్జెట్ తర్వాత రాష్ట్ర మంతంటా అమలుకు ప్రభుత్వం నిర్ణయం బెంగళూరు: రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సరళం కానుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనుంది. దీంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరిగి మధ్యవర్తులతో జేబులు గుల్ల చేసుకునే బాధ తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఆన్లైన్ ప్రక్రియ బడ్జెట్ తర్వాత రాష్ట్ర మంతటా అమలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం కచ్చితంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సిబ్బంది తక్కువగా ఉన్నారన్న నెపం చూపిస్తూ సదరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన కొంతమంది అధికారులు ఒకటికి పది సార్లు వినియోగదారులు తమ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. అంతేకాకుండా సదరు ఆస్తి మార్కెట్ విలువను తక్కువగా చూపిస్తామని చెబుతూ వినియోగదారుల నుంచి ‘కొంత మొత్తం’ లంచం రూపంలో వసూలూ చేస్తున్నారు. ఈమేరకు క్రయ విక్రయాలకు సంబంధించిన పన్ను తక్కువగా వసూలు కావడంతో ఖజానాకు గండి పడుతోంది. ఇటువంటి అక్రమాలన్నింటికీ చెక్ పెట్టడానికి వీలుగా ఇకపై ఆస్తులను ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించడానికి అవకాశం కల్పించనున్నారు. క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అన్లైన్లో పంపించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి నియమిత సమయంలో సదరు దరఖాస్తుదారుడికి సంబంధిత అధికారి అన్లైన్లోనే సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో దరఖాస్తుదారుడు వెళ్లితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతుంది. ఈ విధానంలో మన కంటే ఎంతమంది ముందుగా వేచి చూస్తున్నారన్న విషయం కూడా ఆన్లైన్లో తెలిసిపోతుంది కాబట్టి కార్యాలయాలు చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ఇక ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను అన్లైన్లో ఉంచడం వల్ల మార్కెట్ విలువను తక్కువ చేసి చూపడం కుదరదు. దీంతో పన్ను వసూలు సక్రమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏ ప్రాంతంలో కొన్న ఆస్తులను ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా ప్రస్తుతం ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సదరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో మాత్రమే జరుగుతోంది. నూతన విధానంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కొన్న ఆస్తులనైనా ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించనుంది. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు. పెలైట్ ప్రతిపాదికన బెంగళూరులో ఇప్పటికే ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కొన్న ఆస్తులనైనా ఇతర సబ్రిజ్రిస్టార్ కార్యాలయంలో అన్లైన్లో విధానంలో రిజిస్ట్రేషన్ చేయించే విధానం విజయవంతంగా అమలవుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర మంతటా ‘ఈ ఆన్లైన్, ఎక్కడి వస్తులనైనా ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్’ విధానాలను అమలు చేయడానికి వీలుగా రాష్ట్ర రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టసభల అనుమతి తీసుకోనుంది. అటుపై ఈ విధానాన్ని రాష్ట్ర మంతటా అమలు చేయనున్నారు. ఈ విషయమై రాష్ట్ర రెవెన్యూశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ‘మహారాష్ట్రలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. బడ్జెట్ తర్వాత ఈ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేయనున్నాం.’ అని తెలిపారు. -
ఎక్కడి నుంచైనా ‘అంతంతే’!
► ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల'కు స్పందన కరువు ► ప్రచారం కల్పించని అధికారులు ► యథేచ్ఛగా సాగుతున్న అక్రమాలు అనంతపురం టౌన్: ‘ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ల' చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు విఫలమయ్యారు. దీనివల్ల ప్రజలు పెద్దగా ముందుకు రావడం లేదు. గతంలో జిల్లా పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉండేది. ఈ విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో 2013 జులై నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా అంటే ఏ జిల్లాలోనైనా రిజిస్ట్రేషన్ చేయించుకునే వెసులుబాటును గత ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రవేశపెట్టింది. తర్వాత కొన్ని సమస్యలు రావడంతో ఈ విధానాన్ని కొన్నాళ్ల పాటు నిలుపుదల చేసింది. గత ఏడాది ఆగస్టు 10 నుంచి మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఎనీవేర్‌తో అక్రమాలకు చెక్ ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు కొంత మంది అనధికార డాక్యుమెంట్ రైటర్లు, సిబ్బంది ఎక్కువ మొత్తం డిమాండ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రజలు వారికి నచ్చిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి వచ్చిన డాక్యుమెంట్‌ను సదరు సబ్ రిజిస్ట్రార్ స్కాన్ చేసి అక్కడికి పంపిస్తారు. అక్కడి సబ్ రిజిస్ట్రార్ ఆ ఆస్తికి సంబంధించి ఆన్లైన్లో పూర్తి వివరాలు సేకరించి అన్నీ సక్రమంగా ఉంటే దాన్ని ఆమోదిస్తున్నట్లు సమాచారమిస్తారు. ఈ సమాచారం 48 గంటల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇవ్వకుంటే సదరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ రిజిస్ట్రేషన్లు నిలిచిపోతాయి. ఒకవేళ తిరస్కరిస్తే ఏ కారణంతో అన్నది తెలియజేయాల్సి ఉంటుంది. తదుపరి జిల్లా రిజిస్ట్రార్‌ను సంబంధిత వ్యక్తులు సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడా నిరాకరిస్తే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విధానంపై అవగాహన లేక ఎక్కువ మంది ప్రజలు స్థానికంగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫీజు టు ఫీజు వసూలు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. అవగాహన కల్పించని అధికారులు జిల్లాలో 2015 ఫిబ్రవరి నుంచి 2016 జనవరి వరకు 1,12,525 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ‘ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు’ అయినవి 2,372 మాత్రమే. వీటిలో కూడా ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టే అధికారులు ప్రజలకు ఏ మేరకు అవగాహన కల్పించారో అర్థమవుతోంది. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడి
నెల్లూరు : నెల్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. సిబ్బంది వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని 12 మంది ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
మదనపల్లి రూరల్ : చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం మధ్యాహ్నం ఆకస్మిక సోదాలకు దిగారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలతో కూడిన బృందం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు. దస్తావేజులు రాసేవారితో లంచాలు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు దాడులకు దిగినట్టు సమాచారం. -
స్థిరాస్తి జాతకం ఈసీ!
ఆస్తిని కొనుగోలు చేసేముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ)ను మరింత త్వరగా పొందే సదుపాయం అందుబాటులోకి రానుంది. వీటిని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోని దిగువ స్థాయి సిబ్బంది సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు కూడా వారి సంతకాలతో జారీ చేసేలా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. సాక్షి, హైదరాబాద్ : ఈసీ.. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్. ఆస్తి కొనేటప్పుడు అక్కరకొచ్చే కీలకమైన పత్రం. మనం కొనాలనుకునే ఆస్తి చరిత్రను తెలియజేసే రాజపత్రం. మరి ఇంత కీలకమైన పత్రంలో తప్పుల్లేకుండా దరఖాస్తు చేసుకోవడమెలాగో చదవండి మరి.. ►ఒక ప్లాటు కొనాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు దాని పూర్తి చరిత్ర గురించి తెలుసుకోవాలి. లేకపోతే మన కష్టార్జితాన్ని బూడిదలో పోసినట్లే. మరి అసలైన ఈసీ కావాలంటే ఆయా స్థలానికి సంబంధించిన వివరాలను తప్పుల్లేకుండా క్షుణ్నంగా, స్పష్టంగా రాయాలి. లేకపోతే తప్పుడు పత్రం వస్తుంది. తెలియక జరిగిన పొరపాటు వల్ల అంతిమ నిర్ణయం తీసుకుంటే అంతే సంగతులు. మన సొమ్మును మనమే నాశనం చేసుకున్నట్లు అవుతుంది. ►ఈసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలన్నీ స్పష్టంగా రాయాలి. మనం కొనాలనుకున్న ఆస్తి ఎక్కడుంది? దాని సర్వే నంబరు? విస్తీర ్ణం రాయాలి. వ్యవసాయ భూమి అయితే ఎన్ని ఎకరాల్లో ఉంది? ప్లాటు అయితే ఎన్ని గజాల్లో ఉందో రాయాలి. ఆ ఆస్తికి నలువైపులా గల హద్దులను పేర్కొనాలి. అంతేకాకుండా నాలుగువైపులా ఉన్న స్థల యజమానుల పేర్లు కూడా రాయాలి. అప్పుడే ఆస్తిపరంగా, వ్యక్తిపరంగా ఈసీ పత్రాన్ని అందుకోవచ్చు. ఇక్కడే తప్పు చేస్తారు: చాలామంది ఈసీ దరఖాస్తులో ఆస్తి వివరాలు, దానికి సంబంధించి న హద్దులు, విస్తీర్ణం సక్రమంగా ఇవ్వరు. ఏదో తోచినట్టుగా రాస్తారు. కంప్యూటర్ ఏం చేస్తుం దంటే.. అందులో నిక్షిప్తమైన సమాచారం ప్రకారమే శోధించి వివరాలిస్తుంది. అం దుకే కొన్నిసార్లు ‘నిల్ ఈసీ’ వస్తుంది. అంటే ఆ ఆస్తి మీద ఎలాంటి లావాదేవీలు జరగలేదని అర్థం. వాస్తవానికి దాని మీద బోలెడు లావాదేవీలు జరిగి ఉండొచ్చు. కాకపోతే వివరాలు తప్పుగా రాయడం వల్ల నిల్ ఈసీ వస్తుంది. దీని ప్రకారం నిర్ణయం తీసుకుంటే మోసపోయినట్లే. ►ఒక సర్వేనంబర్‌లో ఐదె కరాల వ్యవసాయ భూమి ఉందనుకుందాం. వాటిలో ఒక రియల్టర్ వెంచర్ వేశారనుకుందాం. పదుల సంఖ్యలో ప్లాట్లు అమ్ముడవుతాయి. సహజంగానే రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోతుంది. కొన్నాళ్ల తర్వాత ఎవరైనా అందులో ప్లాటు కొనాలనుకుని ఐదెకరాల విస్తీర్ణం, సర్వే నంబరు, గ్రామం, మండలం, హద్దులు రాసి ఈసీకి దరఖాస్తు చేసుకుంటే నిల్ఈసీ వస్తుంది. కాకపోతే అప్పటికే అందులో పలువురు ప్లాటు కొనేసి ఉంటారు. మరి ఈసీలో ఈ వివరాలు ఎందుకు రాలేదంటే.. విస్తీర్ణం ఐదు ఎకరాలని రాశారు కాబట్టి. కంప్యూటర్ కేవలం ఆయా భూమిపై రిజిస్ట్రేషన్లు జరిగాయా అన్నది మాత్రమే చూపిస్తుంది. గంపగుత్తగా ఐదెకరాలు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు. ఆయా సర్వే నెంబరుకు సంబంధించిన పూర్తి వివరాలు కావాలని అడగాలి. అప్పుడే పక్కా వివరాలు వస్తాయి. ►కొందరేం చేస్తారంటే.. 2 వేల గజాల స్థలాన్ని 200 గజాల చొప్పున పది మందికి అమ్ముతారు. అయితే 2 వేల గజాలకు సంబంధించి ఒకేసారి స్థల మార్పిడి జరగలేదు కాబట్టి ఈసీ కోసం దరఖాస్తు చేస్తే నిల్ఈసీ వస్తుంది. ఆ ఆస్తికి సంబంధించి ఆ వ్యక్తి గురించి ఎన్ని లావాదేవీలు జరిగాయని రాస్తేనే సరైన సమాచారం అందుతుంది. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేఈ ఆకస్మిక తనిఖీలు
కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ క్రిష్టమూర్తి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు విధులకు ఆలస్యంగా రావడం గుర్తించిన ఆయన వారిపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. విధులకు ఆలస్యంగా రావద్దంటూ ఆయన ఉద్యోగులను హెచ్చరించారు. బ్రోకర్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి రానివద్దంటూ కేఈ క్రిష్ణమూర్తి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. -
‘మావో’ పోస్టర్ల కలకలం
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో ఆదివారం రాత్రి మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చౌటుప్పల్ గ్రామపంచాయతీ కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, చైతన్య కళాశాల గోడలకు నాలుగు పోస్టర్లు అంటించారు. సోమవారం ఉదయం పోస్టర్లను గమనించిన స్థాని కులు పోలీసులకు సమాచారమందిం చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లు సిబ్బందితో హుటాహుటీనా వెళ్లి, పోస్టర్లను తొల గిం చారు. పోస్టర్లపై అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు గడిస్తున్న రాజకీయ నాయకులకు, ప్రభు త్వ అధికారులకు శిక్ష తప్పదు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఉద్యమించండి. మోదీ, ఒబామా దిష్టిబొమ్మలను దహనం చేయండి. 26న భారత్ బంద్‌ను జయప్రదం చేయం డి. ఎఫ్‌డీఐలతో లాభం పొందే రాజ కీయ నాయకులను, విదేశీ పెట్టుబడిదారులను, చిల్లర వర్తక రంగం లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకించండి అని మావోయిస్టు పార్టీ పేరు రాసి ఉంది. కాగా, చౌటుప్పల్‌లో మండలంలో రెండు నెలల కాలంలో రెండో సారి పోస్టర్లు వెలువడడం ఆందోళన కలిగిస్తోంది. డిసె ంబర్ 4వ తేదీన తాళ్లసింగారం, లింగోజిగూడెం, మందోళ్లగూడెం,పెద్దకొండూరు గ్రామాల్లో పోస్టర్లు వెలువడిన విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అవినీతి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తూ, పోస్టర్లు వెలిశాయి. మండలంలో ఇటీవలి కాలంలో పోస్టర్లు వెలుస్తుండడంతో మావోల కదలికలపై అనుమానం రేకెత్తుతోంది. పైకి పోలీసులు ఆకతాయిల ప నేనని పైకి కొట్టిపారేస్తున్నారు. సానుభూతిపరుల పనే: డీఎస్పీ మోహన్‌రెడ్డి చౌటుప్పల్ మండలంలో వెలిసిన మావోయిస్టు పోస్ట ర్లు సానుభూతిపరుల పనిగా భువనగిరి డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి అభివర్ణించారు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. మావోయిస్టు పో స్టర్లపై పోలీస్ ఇన్స్పెక్టర్ భూపతి గట్టుమల్లుతో మా ట్లాడారు. పోస్టర్లను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పోస్టర్లు వేసిన వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూ దాన్ పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ మండలాలకు చెందిన దాదాపు 150మంది మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని, విచారించామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తహసీల్దార్ల ఎదుట బైండోవర్లు కూడా చేశామన్నారు. పోస్టర్లను చూస్తుంటే గతంలో మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేసిన వారి పనే అయి ఉంటుందని అవగతమవుతుందన్నారు. ఈప్రాం త ంలో మావోయిస్టులు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. -
జయలలిత ఫొటో తొలగింపు
* అధికారులతో వాగ్వాదానికి దిగిన * అన్నాడీఎంకే నేతలు తిరువళ్లూరు: సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను అధికారులు తొలగించడం వివాదస్పదమైంది. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు నగర అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రిజిస్ట్ట్రార్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తిరువళ్లూరులోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఫొటోను అధికారులు వారం క్రింతం తొలగించారు. జయ ఫొటో స్థానంలో ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఫొటోను తగిలించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారం ఆలస్యంగా అన్నాడీఎంకే నేతలకు తెలిసింది. శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కారణం లేకుండా జయ ఫొటోను ఎందుకు తొలగించారని రిజిస్టర్ కార్యాలయ అధికారులను నిలదీశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మహిళా ఉద్యోగులు భ యాందోళన చెందారు. విషయం తెలుసుకున్న పోలీ సులు సంఘటనా స్థలానికి చేరుకుని అన్నాడీఎంకే నేతల తో చర్చించారు. విషయాన్ని పెద్దది చేయవద్దని విజ్ఞ ప్తి చేశారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న జయలలిత ఫొటోను కార్యకర్తలు తిరిగి తగిలించారు. ఈ వ్యవహారం జిల్లా వాప్తంగా సంచలనం కలిగించింది. -
8 మంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది సస్పెన్షన్
ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కక్షిదారుల డాక్యుమెంట్లు మాయం వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ సహా ఎనిమిదిమందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల ఒకటిన కొత్త సబ్ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు స్వీకరించిన విజయ జీవన్‌బాబు, శ్రీనివాసబాబు గత నెలలో రిజిస్ట్రేషన్‌కు వచ్చిన కక్షిదారులకు చెందిన 25 డాక్యుమెంట్లు కనిపించడం లేదని గుర్తించారు. ఇటీవల రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్ఎం.శ్రీనివాసమూర్తికి, టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 17, 18 తేదీల్లో ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ చాముండేశ్వరీదేవి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు మాత్రమే కనిపించకుండా పోయాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా రిజిస్ట్రార్ చాముండేశ్వరితోపాటు జూనియర్ అసిస్టెంట్లు సిహెచ్.శ్రీదేవి, ఎ.రాజేంద్రప్రసాద్, ఎం.కిరణ్మయి, వైవీ ఆనందకుమార్, ఎంవీవీ కృష్ణ, ఆఫీస్ సబార్డినేట్లు కె.ఎస్.మూర్తి, జేకెఎస్ కుమార్‌లను బాధ్యులను చేస్తూ ఏలూరు రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ ఎ.సాయిప్రసాద్‌కు నివేదిక ఇచ్చారు. దీంతో డీఐజీ వారిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కలకలం రేగింది. కాగా తాను ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించాక కొద్దిరోజులకు రెడ్డి అనే ఉద్యోగి ఇన్చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారని, ఈ డాక్యుమెంట్లు ఎలా పోయాయో అంతుపట్టడం లేదని అన్నారు. తనపై కక్షతో ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని వాపోయారు. కాగా గతంలో సబ్ రిజిస్ట్రార్లుగా ఉన్న వారు దాదాపు పదిమంది ప్రైవేటు వ్యక్తులతో కార్యాలయం పనులు చేయించే వారని, వారు బదిలీ అయ్యాక ప్రైవేటు వ్యక్తులను తొలగించారని సమాచారం. డాక్యుమెంట్లు మాయం కావడంలో ప్రై వేట్ వ్యక్తుల ప్రమేయం ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. గతంలోనూ కొన్ని డాక్యుమెంట్లు పోయినా ఇంతవరకు చర్యలు లే వని, ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏమిటని కొందరు అంటున్నారు. -
ప్లాట్ అవుతారు.. జాగ్రత్తా!
సార్.. మా వెంచర్‌కు అన్ని రకాల పర్మిషన్లున్నాయి. మీరు ఒక్కసారి చూడండి.. అంటూ వెంచర్ దగ్గరకు తీసుకెళ్తాడు ఏజెంట్. ఇది కార్నర్ ప్లాట్.. ఈస్ట్ప్లేస్. నిన్ననే ఇద్దరు, ముగ్గురు చూసి వెళ్లారు. మీరు సరే అంటే వెంటనే బుక్ చేస్తా. ఇలా ఆయన చెప్పే మాటలకు మనం వెంటనే ప్లాట్ అయిపోతాము. ఇంతకు ఈ భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించం. పంచాయతీ, మునిసిపల్ నిబంధనల ప్రకారం లే అవుట్లు వేశారా లేదా అని చూడం. వెంటనే ఓకే అనేస్తాం. కొనేస్తాం. తర్వాత నానా ఇబ్బందులుపడతాం. ఎలాంటి భూములు కొనాలి, ఏ స్థలాలకు అమ్మే హక్కు ఉండదనే కనీస పరిజ్ఞానం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. * కొనుగోలులో జాగ్రత్తలు తప్పనిసరి * లేకపోతే భవిష్యత్తులో చిక్కులు తప్పవు కర్నూలు (జిల్లా పరిషత్): రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కురిపిస్తున్న హామీలతో జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఒకప్పుడు నంద్యాల రోడ్డులో సఫా ఇంజనీరింగ్ కళాశాల వరకు మాత్రమే రియల్ ఎస్టేట్ వెళ్లి ఆగిపోయింది. నాయకులు హామీల పుణ్యమా అని ఇప్పుడు విస్తరణ ఓర్వకల్లు మండలం హుసేనాపురం దాటిపోయింది. ఓర్వకల్లు సమీపంలో ఇండస్ట్రియల్ కారిడార్, ఎయిర్పోర్ట్, ఐఐఐటీ అంటూ ప్రజలను నాయకులు ఊరిస్తున్నారు. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. ఆదోని, ఎమ్మిగనూరు మధ్యలో టెక్ట్స్‌టైల్స్ పార్కు వస్తుందని చెప్పడంతో కోడుమూరు రోడ్డులోనూ వెంచర్లు పుట్టుకొచ్చాయి. కర్నూలు కొత్తబస్టాండ్‌కు అతి దగ్గరల్లో ఉందంటూ పెంచికలపాడు, కొత్తూరు వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బడిముబ్బడిగా వ్యవసాయ భూములు కొని వెంచర్లు వేస్తున్నారు. ప్లాటు రూ.1.50లక్షల నుంచి రూ.2.50లక్షలేనని ఊరిస్తున్నారు. ఇండిపెండెంట్ హౌస్ సైతం రూ.12లక్షల నుంచి రూ.20లక్షలలోపు అందిస్తామంటూ ప్రకటనలతో ఊదరగొడుతున్నారు. వాటిని చూసి వెంటనే కొన్ని మోసపోకుండా కొన్ని విషయాలు గమనించి స్థలాలు కొనాలి. ఈ భూములు కొనకూడదు.. అమ్మకూడదు * ప్రభుత్వానికి సంబంధించిన భూములు, వక్ఫ్‌భూములు * భూదాన్ బోర్డు ఆధీనంలో స్థలాలు * వెనుకబడిన వర్గాలకు కేటాయించినవి * ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిపొందిన వారికి ఇచ్చిన ఇళ్లు, పొలాలు * యూఎల్సీ పరిధిలోని భూములు * సైనికులకు, స్వాతంత్య్ర సమరయోదులకు కేటాయించిన భూములు, స్థలాలు * గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన భూములు కొనబోయే భూమి సమాచారం ఎలా తెలుసుకోవాలి * భూమిని ఎక్కడ కొనాలనుకుంటున్నారో ఆ ఏరియా పరిధిలోకి వచ్చే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. * భూమి ఉన్న సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, పట్టా లేక పాస్బుక్ల జిరాక్స్ వివరాలు అందిస్తే వారు మీకో మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ జారీ చేస్తారు. * ఇందులో మీరు కొనాలనుకున్న భూమి విలువ, ఆ భూమి ఏ ప్రభుత్వ శాఖ ఆధీనంలో ఉంది, ఎప్పటి నుంచి ఉంది, భూమిని ఎవరికి కేటాయించారు తదితర వివరాలుంటాయి. * బ్యాంకులోను పొందడానికి సైతం ఈ మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి * రియల్ ఎస్టేట్ వెంచర్ వేసే ముందు ఆయా భూమి వ్యవసాయభూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చారా లేదా అన్న అంశాన్ని పరిశీలించాలి. ఇందుకోసం రెవిన్యూ అధికారులకు నాలా పన్ను 10 శాతం చెల్లించి భూమి మార్పిడి చట్టం ద్వారా మార్చుకోవాల్సి ఉంటుంది. * లే అవుట్లు లేని నివేశన స్థలాలకు పంచాయతీలు/మునిసిపాలిటీలు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరు. కొత్తగా రోడ్ల నిర్మాణం, డ్రెయిన్లు తదితర మౌలిక సదుపాయాలూ కల్పించరు. * లే అవుట్ వేసిన మొత్తం భూమిలో 10 శాతం భూమిని సామాజిక అవసరాల కోసం (కమ్యూనిటి హాళ్లు, పాఠశాల నిర్మాణం, పార్కు) రిజర్వుడ్ సైట్‌గా వదలాల్సి ఉంటుంది. * ఈ స్థలాన్ని రియల్టర్ ఆయా పంచాయతీలు, మునిసిపాలిటీలకు రిజిస్ట్రేషన్ ఫీజు కింద గిఫ్ట్‌గా రాసి ఇవ్వాలి. * మునిసిపల్ నిబందనల ప్రకారం అంతర్గత రోడ్లు అయితే 40 అడుగులు, ప్రధాన రహదారి అయితే 60 అడుగుల వెడల్పు ఉండాలి. తారు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం రియల్టరే చేపట్టాలి. * మంచినీటి ట్యాంకు నిర్మించి ప్రతి ప్లాటుకు కనెక్షన్ ఇవ్వాలి. * త్రీ ఫేస్ కరెంటుతో వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. లే అవుట్ల గురించి పూర్తిగా చెక్ చేసుకోవాలి కార్పొరేషన్ పరిధిలోని ప్రతి లే అవుట్‌కు 40 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. 10 శాతం స్థలాన్ని కార్పొరేషన్‌కు గిఫ్ట్ కింద ఇవ్వాలి. కార్పొరేషనేతర ప్రాంతాల్లో వేసిన లే అవుట్లలో 33 అడుగుల వెడల్పుతో రోడ్డు ఉండాలి. ప్రతి ప్లాటు తప్పనిసరిగా 120 చదరపు మీటర్లు ఉండాలి. 2.5ఎకరాల వరకు కర్నూలులోనే అనుమతినిస్తాం. 2.5 ఎకరాలు దాటి 5 ఎకరాల వరకు అనంతపురంలోని రీజనల్ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లే అవుట్ల గురించి మునిసిపల్ కార్పొరేషన్, గ్రామపంచాయతీల్లో చెక్ చేసుకుని ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండదు. -బి. ప్రసాదరావు, డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ -
భూ మాయ
నకిలీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు అండదండలు అందిస్తున్న రిజిస్ట్రేషన్ సిబ్బంది రియల్టర్ల అడ్డాగా రిజిస్ట్రార్ కార్యాలయాలు బాధితుల ఫిర్యాదులు సబ్రిజిస్ట్రార్లపై కేసులు పేరం నాగిరెడ్డి ఓ సాధారణ ఉద్యోగి. అమరావతి రోడ్డులో 550 గజాల స్థలాన్ని పదేళ్ల కిందట కొనుగోలు చేశారు. వారం కిందట కుమార్తె పెళ్లికి కట్నకానుకల కింద ఆ స్థలాన్ని అల్లుడికి ఇచ్చారు. పెళ్లి తంతు పూర్తయ్యాక స్థలం రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నిజం తెలిసి అవాక్కయ్యారు. రెండేళ్ల కిందటే ఆ స్థలం నాగిరెడ్డి సంతకంతో అమ్మినట్లు వుంది. రిజిస్ట్రేషన్ రికార్డుల్లో నాగిరెడ్డి పేరిట మరొకరి ఫొటో ఉంది. చిన్నం రాములమ్మ భర్త వెంకటేశ్వర్లు అయిదేళ్ల కిందట మృతి చెందాడు. ఆయన పేరిట నల్లపాడులో నాలుగెకరాలపొలం ఉంది. ఆయన సమాధి కూడా అక్కడే నిర్మించారు. ఆయన మనువడ్ని అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి జీపీ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. రాములమ్మ అమెరికాలో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లేక్రమంలో పొలాన్ని అమ్మాలని ప్రయత్నించగా..రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీ వేరేవారి పేరిట వచ్చింది. సాక్షి,గుంటూరు జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. గుంటూరు, నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు అధికంగా జరుగుతున్నాయి. గుంటూరు అర్బన్ పరిధిలో ఎనిమిది, నరసరావుపేట జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.రాష్ర్ట విభజన నేపథ్యంలో ఇటీవల భూముల కొనుగోలు, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పల్నాడు, గుంటూరు కేంద్రంగా అనేకమంది రియల్టర్లు అక్రమ దందా కొనసాగిస్తున్నారు. లంచాల ముసుగులో స్వయంగా అధికారుల అండదండలు రియల్టర్లకు అందుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడడానికి ప్రధాన కారణమిదేనని చెప్పవచ్చు. ఇటీవల పోలీసు, రెవెన్యూ గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా బాధితులు డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ జీపీ డాక్యుమెంట్ల మోసాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే గుంటూరు అర్బన్‌లోని పట్టాభిపురంపోలీసుస్టేషన్లో మూడు కేసులు, నగరంపాలెం స్టేషన్లో ఒక కేసు నమోదయ్యాయి. పలు కేసుల్లో మోసాలకు పాల్పడిన నిందితుల్ని కూడా అరెస్టు చేశారు. గుంటూరు, నల్లపాడు సబ్ రిజిస్ట్రార్లతోపాటు డాక్యుమెంట్ రైటర్లపై సైతం కేసులు నమోదవడం గమనార్హం! యథేచ్ఛగా అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ, రెవెన్యూ, అసైన్డ్, ఫోరంబోకు భూములకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు గుంటూరు కేంద్రంగా భారీస్థాయిలో జరుగుతున్నాయి. జిల్లాలో నాలుగేళ్లకిందట పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి అండదండలతో వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన ముగ్గురు అధికారులు అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల బాగోతాన్ని నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. యనమదల, చౌడవరం, ఈదులపాలెం, నల్లపాడు, ప్రత్తిపాడు, యడ్లపాడు, గోరంట్ల, అమరావతి రోడ్డులలో అసైన్డ్, ప్రభుత్వ స్థలాలు భారీఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాల్ని గుంటూరు, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు రాజకీయ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులకు కట్టబెట్టినట్లు సమాచారం. ఈక్రమంలో శ్యామలానగర్‌లో రెండు స్థలాలకు సంబంధించి దొంగ రిజిస్ట్రేషన్లు జరిగాయని.. సదరు వ్యవహారంలో సంబంధిత నల్లపాడు సబ్ రిజిస్ట్రార్‌పై కూడా కేసు నమోదు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇటీవల పట్టాభిపురం పోలీసులు మరో స్థల వివాదానికి సంబంధించి ఇదే నల్లపాడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, డాక్యుమెంట్ రైటర్లను నిందితులుగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మార్కెట్ విలువపై చెల్లించాల్సిన 0.5 శాతం ఫీజును అడ్డంపెట్టుకుని ఒకటి నుంచి మూడు రెట్లు ఫీజులను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆది నుంచి ఉన్న ‘ఫీజు టు ఫీజు’ విధానానికి ‘సంతృప్తికర ఫీజు’ పేరుతో స్టాంపు వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లు కొత్తభాష్యం చెబుతున్నారు. ఏసీబీ, విజిలెన్స్ అధికారుల ఆరా.. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమ తంతుపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలో కొందరు స్థానికేతరులైన స్టాంప్‌వెండర్లు ఇక్కడకు వచ్చి చెలాయిస్తున్న అక్రమ తంతుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమ తంతుపై ఆధారాల సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగానైనా కార్యాలయాలపై దాడులు జరిగితే, పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని బాధితులు ఎదురుచూస్తున్నారు. -
సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇక ఈసీలు, సీసీలు
సాక్షి, హైదరాబాద్: ఇకపై సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(ఈసీ)లు, సర్టిఫైడ్ కాపీలు(సీసీ-దస్తావేజు నకళ్లు) ఇవ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం ఆదేశించారు. ప్రస్తుతం ఈసీలు, సీసీలు కేవలం మీసేవా కేంద్రాల్లోనే ఇస్తున్నారు. అయితే మీసేవా కేంద్రాల్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులతోపాటు, 1990కి ముందు రిజిస్ట్రేషన్ అయిన భూములకు సంబంధించిన నకళ్ల జారీలో కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. దీంతో ఆయా దరఖాస్తుదారులు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళుతున్నారు. అయితే దరఖాస్తుదారులు వస్తున్నా సబ్రిజిస్ట్రార్లు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సబ్రిజిస్ట్రార్ల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయభాస్కర్, స్థితప్రజ్ఞలు మంగళవారం మంత్రి తోట నరసింహంను కలిసి.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసీలు, సీసీలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
‘రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లోనూ ఈసీలివ్వాలి’
సాక్షి, హైదరాబాద్: మీసేవ కేంద్రాలలో మాదిరిగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, దస్తావేజు నకళ్లు (సీసీలు) ఇచ్చేందుకు వెసులుబాటు కల్పించాలని సబ్‌రిజిస్ట్రార్స్ అసోసియేషన్, రిజిస్ట్రేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండు చేశారు. ఈమేరకు మంగళవారం అసోసియేషన్ల ప్రతి నిధులు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. మీసేవ కేంద్రాలతో సమాంతరంగా సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు స్వీకరించి సీసీలు, ఈసీలు ఇచ్చే వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ సబ్‌రిజిస్ట్రార్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ భాస్కర్‌రావు, స్థితప్రజ్ఞ, తెలంగాణ సబ్‌రిజిస్ట్రార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు నేతృత్వంలో రిజిస్ట్రేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ల ప్రతినిధులు కూడా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి సమస్యలను వివరించారు. అనంతరం వారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ విజయకుమార్‌ను కూడా కలిసి ఇవే అంశాలను వివరించారు.